సాక్షి, విజయవాడ: కేవలం 18 నెలల కాలంలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సీఎంగా గుర్తింపు తెచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంశల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా సీఎం జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు.. ఆయన ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారని, అధికారులను బెదిరించేలా వ్యవహరిస్తున్న ఆయన తీరు ఏమాత్రం సబబు కాదని మంత్రి బొత్స మండిపడ్డారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలన్నవి తాము వచ్చాక మొదలు పెట్టినవి కావని, 2001 లోనే ఏకగ్రీవాలు ప్రారంభం అయ్యాయని వివరించారు. ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించుకున్నారన్న ఎస్‌ఈసీ భాష ఏమాత్రం బాగోలేదని ఆయన విమర్శించారు.
గ్రామాల ప్రగతికి ఏకగ్రీవాలు తోడ్పడతాయి..
పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల విషయంలో అతని ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండి పడ్డారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న అధికారలపై కక్షపూరితంగా వ్యవహరించడం అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులకు తగదని హితవు పలికారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ఏ అధికారికి అన్యాయం జరగదని ఆయన భరోసాను ఇచ్చారు. ఏకగ్రీవాల విషయంలో.. గతంలో ప్రోత్సాహకాలు బాగున్నాయని వ్యాఖ్యానించిన నిమ్మగడ్డ, ఇప్పుడు వేరే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్ది వ్యాఖ్యానించారు.
ఏకగ్రీవాలు జరిగితే గ్రామాల్లో ఎలాంటి గొడవలు ఉండవని, అందుకే మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో మంచి పాలనా వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవాలకు సంబందించి గతేడాది మార్చిలోనే అదేశాలిచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఏకగ్రీవాలు ఎంతో తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే తమ ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment