కొత్తగా ఏర్పడిన తెలుగోనిపల్లి గ్రామపంచాయతీ
గద్వాల రూరల్ : జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత దృష్ట్యా ఈసారి పంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఓటర్ల జాబితా పాతవి, కొత్తవి కలిపి వార్డుల వారీగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలు, 4,86,930మంది ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానాలతో కలిపి వార్డుల సంఖ్య 2,645కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి 25న అసెంబ్లీల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన తుది జాబితాను అనుసరించి ఫొటోలతో ఓటర్ల జాబితాను రూపొందించాలని సూచించారు.
ఒక్కో జాబితాను 25 సెట్లుగా సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ నోటీస్ బోర్డుపై ఒకటి, గ్రామంలో ఉండే ప్రధాన కూడళ్లలో మూడు జాబితాలను పెట్టాల్సి ఉంటుంది. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఒకటి, జిల్లా పంచాయతీ కార్యాలయంలో రెండు, రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకుగాను 11 కాపీలు, అందుబాటులో మరో ఏడు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు అయ్యే బడ్జెట్ అంచనాలను తమకు పంపించాలని ఎన్నికల కమిషనర్ కోరారు.
ఈపాటికే నోటిఫికేషన్ జారీ
ఈపాటికే ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే జూలై నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ప్రతి 500జనాభా కలిగి ఉండి అనుబంధ పంచాయతీకి కిలో మీటరున్నర ఉన్న గ్రామాలతోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలు, వార్డులను ఏర్పాటు చేయడంతోపాటు రిజర్వేషన్ల రొటేషన్‌లో పలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐదేళ్ల రొటేషన్‌ను పదేళ్లకు పెంచింది. ఆయా గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల వారీగా ఉన్న ఓటర్ల ఆధారంగా కొత్త రొటేషన్ ఖరారు చేయనున్నారు.
ఇందులో మొదట అత్యధికంగా ఓటర్లు ఉన్న వారిని చేర్చనున్నారు. ఈనెల 30న గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. రాజకీయ పార్టీలతో మే 1న జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, 3న మండలస్థాయిలో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10న పరిష్కరించి, 17వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు.
బ్యాలెట్ పద్ధతిలోనే..
గ్రామపంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉండటంతో ఈసారి కూడా ఈవీఎంలతో సాధ్యం కాదు. దీంతో మే లేదా జూన్‌లో బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా రెండు వేల పోలింగ్ బూత్‌లను సిద్ధం చేయనున్నారు. గద్వాల రెవెన్యూ డివిజన్ పరిధిలో అవసరాన్ని బట్టి ఏయే పంచాయతీల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందో చిన్న, మధ్యతరహా బ్యాలెట్ బాక్సులు అవసరమో గుర్తించి నివేదికలు తయారుచేసేందుకు సమాయత్తయ్యారు.
ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తయినందున గడువులోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment