balet
-
TS Election 2023: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు.. 13 శాఖలను గుర్తించిన ఈసీ..
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్ట్‌లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఆరోజు జర్నలిస్ట్‌లు ఎన్నికల వార్తల సేకరణ విధుల్లో ఉండాలి. అంతే కాకుండా ఎన్నికల కమిషన్ నుంచి పాసులు పొందాలి. జర్నలిస్ట్‌లతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. గెజిట్ జారీ.. చాలా మంది అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 60(సీ) కింద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం.. ఇప్పటి వరకు కొంత మందికి మాత్రమే బ్యాలెట్ ఓటు వేసే అవకాశం ఉండేది. వారిలో ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్వీసు ఓటర్లు (సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనుంది. అలాగే జర్నలిస్టులు, ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్ సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక నోడల్ అధికారి.. జర్నలిస్టులు, అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. బ్యాలెట్ ఓటు వేయదలిచిన వారు దానిని నింపి స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించాలి. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అప్పటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ‘ఫారం–12డీ’ దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నవంబర్ 7నాటికి దరఖాస్తులు రిటర్నింగ్ అధికారికి చేరితే వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఎవరెవరికి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం.. కేంద్ర ఎన్నికల కమిషన్ పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది. ఎయిర్‌పోర్టు ఆథారిటి ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్‌శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్ ఓటు వేయవచ్చు. -
బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం
చుంచుపల్లి: జిల్లాలో పరిషత్ పోరు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా అభ్యర్థులు బూత్‌ల వారీగా నమోదైన ఓట్ల ఆధారంగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయని బేరీజు వేసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా గెలుపు ధీమాలోనే ఉన్నారు. ఫలితాలు రావడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 209 ఎంపీటీసీలకు, 21 జెడ్పీటీసీలకు ఓటింగ్ జరగాల్సి ఉండగా, 21 జెడ్పీటీసీ, 206 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 3 ఎంపీటీసీ స్థానాలు.. కోయగూడెం, అశ్వాపురం, ఎల్చిరెడ్డిపల్లి ఏకగ్రీవమయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు 7 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల యూనిట్‌గా జెడీటీసీ ఓట్లను, గ్రామ యూనిట్‌గా ఎంపీటీసీ ఓట్లను అధికారులు లెక్కిస్తారు. ముందుగా ఎంపీటీసీ ఓట్లను లెక్కించిన తర్వాతనే జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. జిల్లావ్యాప్తంగా 841 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాల్లో, 121 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో, మొత్తం 962 మంది అభ్యర్థులు పరిషత్ ఎన్నికల బరిలో ఉన్నారు. ముందు ఎంపీటీసీ.. తర్వాతే జెడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు మూడు దశల్లో చేపడతారు. మొదటి దశలో బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారు. ఇది ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా జరుగుతుంది. ఆ తర్వాత వాటిని బండిల్ చేస్తారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడివిడిగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు ఉండేలా కట్టలు కడతారు. మొదట ఎంపీటీసీ ఓట్లను తరువాత జెడ్పిటీసీ ఓట్లను లెక్కిస్తారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థికి ఇద్దరు చొప్పున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు అధికారులు చూస్తారు. చెల్లుబాటు అయితే వాటిని ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఒక వేళ అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం వాటిని రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలున్న బ్యాలెట్ల పేపర్ల విషయంలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం ఉంటుంది. ఒక్కొక్క రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి అధికారులు రెండు రౌండ్లు ఏర్పాటు చేయనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత గ్రామాల వారీగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎంపీటీసీ స్థానానికి ఒక టేబులు ఏర్పాటు చేస్తారు. దీని పరిధిలో బ్యాలెట్ పెట్టెలన్నింటినీ ఒకేసారి సీలు తీస్తారు. లెక్కింపునకు ఆరంభంలో పీవో డైరీలో ఉన్న లెక్కకు సమానంగా ఉన్నాయో లేవో సరి చూస్తారు. ఒక్కొక్క ఎంపీటీసీ స్థానం లెక్కింపులో ఒక సూపర్‌వైజర్‌తోపాటు ఇద్దరు ఎన్నికల అధికారులు లెక్కింపులో పాల్గొంటారు. జిల్లాలో మొత్తం 206 ఎంపీటీసీ స్థానాల లెక్కింపులో 618 మంది సిబ్బంది లెక్కింపు విధుల్లో పాల్గొంటారు. వీరికి 10 శాతం అదనంగా సిబ్బంది అందుబాటులో ఉంటుంది. జిల్లాలో 7 లెక్కింపు కేంద్రాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7 లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా మండలాల పరిధిలోగల ప్రధాన పట్టణాలలో బ్యాలెట్ బాక్సులను అధికారులు భద్రపరిచారు. తొలివిడత ఎన్నికలు జరిగిన 7 మండలాలు అశ్వాపురం, చర్ల, బూర్గంపాడు, దుమ్ముగూడెం సంబంధించిన ఓట్ల లెక్కింపు భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు జరిగిన అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొత్తగూడెం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. ఇక పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కిం పు సమితి సింగారం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు సంబంధించి న ఓట్ల లెక్కింపు అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. ఇక చివరి విడతలో ఎన్నిక లు జరిగిన ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇల్లెందులోని టీఎస్టీడబ్ల్యూఆర్ కళాశాలలో నిర్వహిస్తారు. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాలలో నిర్వహిస్తారు. అధికారులు ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే గురువారం జేసీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం ఎన్నికల సిబ్బందితో జరిగింది. లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో ఈ నెల 27వ తేదీన చేపట్టనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు విషయంలో 7 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. సిబ్బందికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ తరగతులు నిర్వహించాం. మరో రెండు రోజుల్లో మరోదఫా శిక్షణనిచ్చి అవగాహన కల్పిస్తాం. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల నియమావళి అమలుపరుస్తాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తాం. –కర్నాటి వెంకటేశ్వర్లు, జేసీ -
పోస్టల్ బ్యాలెట్లో గుర్తులుండవ్..
సాక్షి, కాజీపేట: సాధారణంగా సర్పంచి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల కమిషన్ సూచించిన ఏదో ఒక గుర్తు కేటాయిస్తారు. కానీ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం గుర్తులు ఉండవు. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. గతంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగినప్పుడు మామూలు ఓటర్లకిచ్చే బ్యాలెట్ పత్రాన్నే ఉద్యోగులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈవీఎం యంత్రాలు రావడంతో వారికి యంత్రంలో ఓటేసే పరిస్థితి లేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటుచేశారు. ఎన్నికల విధులకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల శిక్షణ ముగిసేలోపు వారంతా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12 ద్వారా వారు తమ పూర్తి వివరాలు రాసి దరఖాస్తు చేసుకుంటారు. కౌంటింగ్‌లో మొదటగా పోస్టల్ బ్యాలెట్లనే అధికారులు లెక్కగడతారు. ఏ అభ్యర్థికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని లెక్కచూసిన తర్వాతే ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు. రెండో ఈవీఎం ఎప్పుడు వినియోగిస్తారంటే... కాజీపేట: పెరిగిన సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని కొద్ది కాలంగా ప్రతి ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక ఈవీఎంలో 64 మంది అభ్యర్థుల పేర్లను రికార్డు చేయవచ్చు. అంతకు మించి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటే రెండో ఈవీఎంను వినియోగిస్తారు. ఒక ఈవీఎంలో 3,740 ఓట్లు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది. -
రెండు విడతల్లో..పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు
గద్వాల రూరల్ : జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత దృష్ట్యా ఈసారి పంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఓటర్ల జాబితా పాతవి, కొత్తవి కలిపి వార్డుల వారీగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలు, 4,86,930మంది ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానాలతో కలిపి వార్డుల సంఖ్య 2,645కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి 25న అసెంబ్లీల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన తుది జాబితాను అనుసరించి ఫొటోలతో ఓటర్ల జాబితాను రూపొందించాలని సూచించారు. ఒక్కో జాబితాను 25 సెట్లుగా సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ నోటీస్ బోర్డుపై ఒకటి, గ్రామంలో ఉండే ప్రధాన కూడళ్లలో మూడు జాబితాలను పెట్టాల్సి ఉంటుంది. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఒకటి, జిల్లా పంచాయతీ కార్యాలయంలో రెండు, రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకుగాను 11 కాపీలు, అందుబాటులో మరో ఏడు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు అయ్యే బడ్జెట్ అంచనాలను తమకు పంపించాలని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈపాటికే నోటిఫికేషన్ జారీ ఈపాటికే ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే జూలై నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ప్రతి 500జనాభా కలిగి ఉండి అనుబంధ పంచాయతీకి కిలో మీటరున్నర ఉన్న గ్రామాలతోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలు, వార్డులను ఏర్పాటు చేయడంతోపాటు రిజర్వేషన్ల రొటేషన్‌లో పలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐదేళ్ల రొటేషన్‌ను పదేళ్లకు పెంచింది. ఆయా గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల వారీగా ఉన్న ఓటర్ల ఆధారంగా కొత్త రొటేషన్ ఖరారు చేయనున్నారు. ఇందులో మొదట అత్యధికంగా ఓటర్లు ఉన్న వారిని చేర్చనున్నారు. ఈనెల 30న గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. రాజకీయ పార్టీలతో మే 1న జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, 3న మండలస్థాయిలో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10న పరిష్కరించి, 17వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే.. గ్రామపంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉండటంతో ఈసారి కూడా ఈవీఎంలతో సాధ్యం కాదు. దీంతో మే లేదా జూన్‌లో బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా రెండు వేల పోలింగ్ బూత్‌లను సిద్ధం చేయనున్నారు. గద్వాల రెవెన్యూ డివిజన్ పరిధిలో అవసరాన్ని బట్టి ఏయే పంచాయతీల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందో చిన్న, మధ్యతరహా బ్యాలెట్ బాక్సులు అవసరమో గుర్తించి నివేదికలు తయారుచేసేందుకు సమాయత్తయ్యారు. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తయినందున గడువులోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగుల వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. -
ఒకే బ్యాలెట్
ఎమ్మెల్సీ ఓటింగ్ విధానంపై ఈసీ స్పష్టత ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు విజేతలుగా మొదటి ఇద్దరు అభ్యర్థులు శాసన మండలి సమరం రసవత్తరంగా మారనుంది. రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ వినియోగిస్తారనే సమాచారంతో మండలి రాజకీయం ఉత్కంఠను తలపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండడంతో ఓటింగ్ విధానంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుమానాలకు ఫుల్స్టాప్ పెడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) స్పష్టతనిచ్చింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏకకాలంలో రెండు స్థానాలకు జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుందని, ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు రెండు సీట్లకు వేర్వేరుగా ఓటింగ్ ఉంటుందనే ప్రచారానికి తెరపడింది. పరిణామం రాజకీయ పార్టీల్లో కొత్త చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల్లో సాంకేతికంగా కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నా.. ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో బలాబ లాలు మారిపోయాయి. జంప్‌జిలానీలతో మారిన సంఖ్యాబలంపై అంచనాకు రావడం అధికార, విపక్ష పార్టీలకు చిక్కు ప్రశ్నగా తయారైంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు చేరడంతో అధికార పార్టీకి కలిసివచ్చింది. కాంగ్రెస్, టీడీపీకంటే ఎక్కు వ సభ్యులను కలిగిన ఆ పార్టీ గెలుపుపై ధీమాతో ఉంది. అయితే, ఈ రెండు పార్టీలు జతకడితే మాత్రం గులాబీ ఎదురొడ్డాల్సి ఉంటుంది. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీకి కూడా 59 మంది ఎంపీటీసీ సభ్యులు,10 మంది కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మూడు అవగాహన కుదుర్చుకుంటే టీఆర్ఎస్కు విజయానికి చమటోడాల్సిందే! రెండు పార్టీలకు క్రాస్ ఓట్ల భయం.. తాజాగా ఈసీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యత ఓట్లలో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. రెండో అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. తొలి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరును పరిశీలిస్తోంది. రెండో స్థానాన్ని టీడీపీ-బీజేపీ కూటమికి వదిలేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాధాన్య క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే.. సామాజికంగా వెనుకబడిన అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపనుంది. మరోవైపు క్రాసింగ్ ఓటింగ్‌తో పార్టీల ఓట్లకు గండి పడే అవకాశం లేకపోలేదు. క్రాస్‌ఓటింగ్ బెడద లేకుంటే మాత్రం రెండు స్థానాలు ఒకే పార్టీ ఖాతాలో పడడం తథ్యం. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ గనుక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోటీలోకి దించితే పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు. పార్టీలకతీతంగా ఆమె పట్ల ఒకింత సానుభూతి, బలమైన నేతగా పేరున్నందున స్థానిక సంస్థల ప్రతినిధులు సబిత వైపు మొగ్గు చూపే వీలుందని ప్రచారం జరుగుతోంది.