TS Adilabad Assembly Constituency: TS Election 2023: పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు! 13 శాఖలను గుర్తించిన ఈసీ..
Sakshi News home page

TS Election 2023: పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు.. 13 శాఖలను గుర్తించిన ఈసీ..

Published Sun, Oct 22 2023 12:12 AM | Last Updated on Sun, Oct 22 2023 8:22 AM

- - Sakshi

పోస్టల్‌ బ్యాలెట్‌

సాక్షి, ఆదిలాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్ట్‌లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఆరోజు జర్నలిస్ట్‌లు ఎన్నికల వార్తల సేకరణ విధుల్లో ఉండాలి. అంతే కాకుండా ఎన్నికల కమిషన్‌ నుంచి పాసులు పొందాలి. జర్నలిస్ట్‌లతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

గెజిట్‌ జారీ..
చాలా మంది అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 60(సీ) కింద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశాయి.

ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం..
ఇప్పటి వరకు కొంత మందికి మాత్రమే బ్యాలెట్‌ ఓటు వేసే అవకాశం ఉండేది. వారిలో ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్వీసు ఓటర్లు (సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనుంది. అలాగే జర్నలిస్టులు, ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్‌ సదుపాయం కల్పిస్తోంది.

ప్రత్యేక నోడల్‌ అధికారి..
జర్నలిస్టులు, అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్‌ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. బ్యాలెట్‌ ఓటు వేయదలిచిన వారు దానిని నింపి స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించాలి. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. అప్పటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కోరుతూ ‘ఫారం–12డీ’ దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. నవంబర్‌ 7నాటికి దరఖాస్తులు రిటర్నింగ్‌ అధికారికి చేరితే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు.

ఎవరెవరికి బ్యాలెట్‌ ఓటు వేసే అవకాశం..
కేంద్ర ఎన్నికల కమిషన్‌ పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది. ఎయిర్‌పోర్టు ఆథారిటి ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ రైల్వే, ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో, దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో, విద్యుత్‌శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోలింగ్‌ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్‌ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్‌ ఓటు వేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement