సాక్షి, విజయనగరం: కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ చౌదరి శునకానందం పొందుతున్నారని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్ చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే చంద్రబాబు శ్రేయస్సే ప్రధానంగా పని చేస్తున్న ఆయన.. గతంలో ఎన్నికలు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారో తెలీడం లేదన్నారు. నిమ్మగడ్డ చర్యలు చంద్రబాబు ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. ఏదిఏమైనా తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమేనని, తుది ఫలితాలు కచ్చితంగా తమకే అనుకూలంగా వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తన సొంత మంటూ ఒక్క పథకం పేరైనా చెప్పుకోలేని 40 ఏళ్ల అనుభవజ్ఞులైన చంద్రబాబుకి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్ చౌదరి చంద్రబాబుపై చర్యలు తీసుకునే సాహసం చేయగలరా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో శత శాతం ఫలితాలతో ప్రజలు నిమ్మగడ్డకు బుద్ధి చెబుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని 959 పంచాయతీల్లో శత శాతం ఫలితాలకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు, చంద్రబాబుకు గుణపాఠం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు రామతీర్ధానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జై శ్రీరాం అన్నంత మాత్రాన ప్రజలు ఆయన్ను నమ్మరన్నారు. రామతీర్థం ఘటన చాలా దురదృష్టకరమని, రామతీర్థంను మరో భద్రాద్రిగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment