పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేస్తున్న డీపీఓ విక్టర్
సాక్షి, ఏలూరు (మెట్రో) : పల్లెల్లోనూ ఓట్ల పండగకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కీలకమైన ఓటర్ల తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ సోమవారం విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు 909 పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రచురించారు. వాస్తవానికి ఈనెల 10న ప్రచురించాల్సి ఉండగా తుది గడువును 20 వరకూ పెంచుతూ ఆదేశాలు రావడంతో సోమవారం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
మహిళలే మహరాణులు
సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అధికం. అలాగే పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళలే మహరాణులుగా ఉన్నారు. మహిళా ఓటర్లే అధికంగా గ్రామాల్లోనూ ఉండటంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. పల్లెల్లో పురుషులు 12,61,658 మంది ఓటు హక్కు కలిగి ఉంటే.. మహిళలు 12,89,087 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
కొత్తగా విలీన మండలాలు
విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రజలు ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్న వీరు ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. కుక్కునూరు మండలంలో 15 పంచాయతీలు ఉండగా, 28,178 మంది ఓటర్లు, వేలేరుపాడు మండలంలో 9 పంచాయతీలు ఉండగా, 16,550 మంది ఓటర్లు ఉన్నారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. అత్యధికంగా ఏలూరు మండలంలోని 22 పంచాయతీలలో 1,03,617 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా వేలేరుపాడు మండలంలోని 9 పంచాయతీల్లో 16,550 మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల ఖర్చు ఇలా..
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు రూ.14 కోట్ల 20 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసి పంచాయతీ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు.
తేలని రిజర్వేషన్లు
ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలు సేకరించి, ప్రచురించిన జిల్లా పంచాయతీ అధికారులకు రిజర్వేషన్ల ప్రక్రియ మరో ప్రహసనంగా మారనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
ప్రతి పంచాయతీలో మూడు చోట్ల జాబితా
ప్రతి పంచాయతీలో పంచాయతీ కార్యాలయంతోపాటు, గ్రంథాలయం, పోస్టాఫీసులో ఓటర్లు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ప్రజలు ఈ జాబితాను పరిశీలించి ఓటు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవాలని డీపీఓ విక్టర్ కోరారు. ఓటు హక్కు లేనివారు ఫారం 6 ద్వారా, అలాగే మార్పులు, చేర్పులు, బదిలీలు చేసుకోదలచిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment