technical problems
-
‘వందేభారత్’ నత్తనడక..
హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ విజయవాడకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చి వందేభారత్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, ఆ రోజు రైలు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. తక్కువ టికెట్ ధర ఉన్న రైళ్ల కంటే ఆలస్యంగా అది విజయవాడకు చేరింది. వందేభారత్ సర్విసు మొదలైన 16 నెలల కాలంలో ఈ తరహా సమస్యలు తక్కువే, కానీ, ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. వెంటవెంటనే ఏర్పడుతుండటం ఇటు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుండగా, రైల్వే అధికారులను కలవరపెడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ఆధునికతకు అద్దంపడుతూ దూసుకొచ్చిన ‘వందేభారత్’కూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. రైళ్లలో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, క్రమంగా ఆ సమస్య పెరుగుతోంది. దూర ప్రాంతాల మధ్య తిరిగే సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు మూడు జతల రేకు(ఓ రైలు సెట్) ఉంటుంది.ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు తీసుకునే హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకుంటే.. హైదరాబాద్‌లో ఉదయం ఒక రైలు బయలు దేరగా, దాని ఒక జత రైలు అదే రోజు ఢిల్లీలో బయలుదేరుతుంది. మరో జత రైలు దారిలో ఉంటుంది. తక్కువ దూరం తిరిగే వాటికి రెండు జతలుంటాయి. » హైదరాబాద్–విశాఖపట్నంలాంటి సాధారణ దూరం తిరిగే (సగం రోజు ప్రయాణ సమయం) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకుంటే.. ఒక రైలు హైదరాబాద్‌లో బయలుదేరుతుంటే, అదే సమయానికి దాని జత రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. » హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరే తిరుపతి వందేభారత్ రైలు, అదే రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకొని, కాసేపటికే అక్కడ బయలుదేరి రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దేశంలోని అన్ని వందేభారత్ రైళ్లది ఇదే తీరు. ఇక్కడే ఇప్పుడు సమస్య ఏర్పడుతోంది. ఒక చోట రైలు బయలుదేరేప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడి ఆలస్యంగా బయలుదేరితే, గమ్యస్థానం చేరి, తిరిగి అక్కడ బయలుదేరేందుకు జాప్యం తప్పటం లేదు. » ఈనెల 16న విశాఖపట్నంలో హైదరాబాద్ వచ్చే వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడలో మరో రెండు గంటలు ఆలస్యమైంది. వెరసి ఐదు గంటలు ఆలస్యంగా హైదరాబాద్ చేరుకుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుప్రయాణం ఉండాల్సి ఉండగా, ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఆ రైలు బయలుదేరాల్సి వచ్చింది. ఒక కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రైలు ఆగిపోవాల్సిందే.. ఇక వందేభారత్ డిజైన్ కూడా ఈ జాప్యానికి మరో కారణమవుతోంది. ఇది సంప్రదాయ ఎక్స్‌ప్రెస్ రెళ్లకు భిన్నంగా ఉంటుంది. డెమూ, మెమూ తరహాలో రెండు ఇంజిన్లు రైలులో అంతర్భాగంగా ఉంటాయి. మూడునాలుగు కోచ్‌లు కలిపి ఒక సెట్‌గా ఉంటుంది. దీనికి పవర్‌కార్ జత కలిసి ఉంటుంది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇదే డిజైన్‌తో ఉంటాయి. ఓ కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే, ఆ కోచ్ ఉండే సెట్ మొత్తాన్ని తొలగించి దాని స్థానంలో మరో సెట్ చేర్చి రైలును పంపేస్తారు. తర్వాత.. సాంకేతిక సమస్య తలెత్తిన కోచ్‌ను డిపోనకు తీసుకెళ్లి మరమ్మతు చేస్తారు. ఇందుకోసం స్పేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్విసుకు 12 కోచ్‌లతో కూడిన రెండు రేక్‌లు స్పేర్ విధుల్లో ఉన్నాయి. కానీ వందేభారత్‌కు స్పేర్ చోక్ సెట్లు లేవు. ఓ కోచ్‌లో సమస్య తలెత్తితే దానికి మరమ్మతు చేసేవరకు మొత్తం రైలును నిలిపివేయాల్సిందే. వారంరోజుల క్రితం విశాఖపట్నం నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావటానికి ఇదే కారణమైంది. -
Australia to New Zealand: గాల్లో కుదిపేసిన విమానం
సిడ్నీ: ఆ్రస్టేలియా నుంచి చిలీకి వెళ్తున్న ఒక విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమాన ప్రయాణికులు కుదుపులకు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. విమానంలో తలెత్తిన ఒక సాంకేతికత సమస్య దీనికి అసలు కారణం. దాదాపు 50 మంది ప్రయాణికుల రక్తం కళ్లజూసిన ఈ ఎల్ఏ800 లాటన్ విమానం.. ఘటనకు ముందు సిడ్నీ నుంచి చిలీ దేశంలోని శాండిగో నగరానికి సోమవారం బయల్దేరింది. మార్గమధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆక్లాండ్‌లో దిగాలి. ఆ లోపే ఆకాశంలో కుదుపులకు లోనైందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు అక్లాండ్ ఎయిర్పోర్ట్ వద్ద 10 అత్యయిక వాహనాలను సిద్ధంగా ఉంచారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. అందరికీ మోస్తరు దెబ్బలే తగిలాయి. ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. -
Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!
వోయేజర్–1. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఎనలేని స్ఫూర్తి. నింగికేసి ఉత్సాహంగా చూసేలా కొన్ని తరాలను పురి గొలి్పన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర. అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యపు సాకార రూపం. గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికెగసిగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక వోయేజర్–1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. 1977 సెపె్టంబరు 5న అమెరికా ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత నవంబరు నుంచి భూమికి సరైన సమాచారమివ్వడం లేదు. నాసాకు పిచ్చి పిచ్చి సందేశాలు పంపుతోంది. ఎలా చూసినా వోయేజర్–1 చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని అనిపిస్తోంది. అద్భుతమేదైనా జరిగితే తప్ప అది మనకిక హస్త లా విస్తా (వీడ్కోలు) చెప్పినట్టే! వోయేజర్–1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లే»ొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్–1ను నిర్మించి ప్రయోగించినప్పటి నాసా సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ఈ సమస్య నుంచి వ్యోమనౌక బయటపడితే అద్భుతమేనని 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సుజానే డాడ్ అన్నారు. సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! హీలియోస్ఫియర్. సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. దీని అంచును హీలియోపాజ్ అంటారు. వోయేజర్–1 2012లోనే ఈ హీలియోపాజ్నును దాటేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డుకెక్కింది. 2018లో వోయేజర్–2 కూడా ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్–1 అధ్యయనం చేస్తోంది. భూమి నుంచి దానికి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, దాన్నుంచి డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. జంట విజయాలు... వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్–1, 2 భాగస్వాములు. వోయేజర్–2ను వోయేజర్–1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్–2 ప్రస్తుతం పనిచేస్తున్నా దాన్నీ సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్–10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగాం గురు, శని గ్రహాల అన్వేషణకు వోయేజర్ జంట నౌకలను పంపారు. వీటితో గురు గ్రహంపై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగు చూశాయి. వోయేజర్–1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగి్నపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగి్నపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్–1 కెమెరా బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో ‘మానవాళి తనకుతాను గీసుకున్న స్వీయ చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్–2 పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలంటారు. వాయుమయ గురు, శని, యురేనస్, నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్–2 1989లో రికార్డు సృష్టించింది. – జమ్ముల శ్రీకాంత్ -
యూకో కస్టమర్ల ఖాతాల్లోకి రూ. 820 కోట్లు
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులోని పలువురు కస్టమర్ల ఖాతాల్లోకి ఏకంగా రూ. 820 కోట్లు పొరపాటున జమయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంకు రికవరీ ప్రక్రియ ప్రారంభించింది. ఆయా ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్ చేసి రూ. 649 కోట్లు (సుమారు 79 శాతం) మొత్తాన్ని రాబట్టినట్లు గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది. మిగతా రూ. 171 కోట్లు కూడా రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నామని, తగు చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేసినట్లు వివరించింది. ఈ సాంకేతిక సమస్య మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక హ్యాకింగ్ ప్రయత్నమేదైనా జరిగిందా అనే అంశంపై బ్యాంకు స్పష్టతనివ్వలేదు. నవంబర్ 10–13 మధ్య ఇమ్మీడియెట్ పేమెంట్ సరీ్వస్ (ఐఎంపీఎస్)లో సాంకేతిక లోపం కారణంగా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు చేపట్టిన కొన్ని లావాదేవీల్లో తమ బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లోకి నగదు క్రెడిట్ అయినట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఆయా బ్యాంకుల నుంచి తమకు నిధులు అందకుండానే ఈ లావాదేవీలు చోటు చేసుకున్నాయని గుర్తించినట్లు పేర్కొంది. దీంతో తగు చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. -
మొరాయించిన మెట్రో రైలు.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు మొరాయించింది. సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీ స్టేషన్లో సుమారు ఇరవై నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చదవండి: వేడుకల పేరుతో శివారులో అసాంఘిక కార్యకలాపాలు.. అడ్డాలుగా ఫాంహౌస్‌లు -
మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మార్గమధ్యలో పలు ప్రాంతాల్లో మొరాయించింది. బుధవారం ఉదయం బయలు దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బ్రేక్ బోల్డు స్టార్ రిలీజింగ్ పైపు విరగగా అక్కడ 20 నిమిషాల పాటు ఆపి తాత్కాలిక మరమ్మతు చేసి, కాజీపేట పంపించారు. కాజీపేటలో మెకానిక్ సిబ్బంది కూడా 10 నిమిషాల పాటు శ్రమించి మరమ్మతు పూర్తి చేశారు. ఇక రామగుండం వెళ్లే సరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో కాజీపేట నుంచి మెకానిక్ సిబ్బంది కొత్త బోల్డు స్టార్ పైప్ తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందితో కలసి గంట పాటు శ్రమించి బోల్డు స్టార్‌ను తొలగించి కొత్తది అమర్చారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
పాలిటెక్నిక్‌లో 21,481 మంది విద్యార్థులు డిటెయిన్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల్లో 32% మంది డిటెయిన్ అయ్యారు. వారికి 75%హాజరు లేకపోవడంతో ఆ విద్యార్థులంతా సెమిస్టర్ పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ విద్యార్థులు 68 వేల మంది ఉంటే అందులో 21,481 మంది విద్యార్థులు డిటెయిన్ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) పేర్కొంది. ఇందుకు బయోమెట్రిక్ హాజరు విధానంలో సాంకేతిక సమస్యలే కారణమని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండగా, ఆ వాదనను ఎస్బీటీఈటీ కొట్టి పారేసింది. అదే నిజమైతే ప్రైవేటు కాలేజీల్లోని 40% మంది విద్యార్థులు డిటెయిన్ అయితే, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు 14% మంది మాత్రమే ఎందుకు డిటెయిన్ అవుతారని అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షలకు అనర్హులైన వీరికి ప్రత్యామ్నాయంగా మళ్లీ ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి పరీక్షలు జరిపేలా ఉన్న తాధికారురలు కసరత్తు చేస్తున్నారు. పదే పదే చెబుతున్నా.. ఏటా ప్రభుత్వ కాలేజీల్లో 85% విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుండగా, ప్రైవేటు కాలేజీల్లో 45% మంది విద్యా ర్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. దీంతో మొత్తంగా ఉత్తీర్ణత శాతం 65 శాతానికి మించట్లేదు. దీంతో సాంకేతిక విద్యా శాఖ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి జిల్లాకో టెక్నికల్ టీం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు తక్కువ హాజరు ఉందన్న విషయాన్ని నెలవారీగా కూడా వెల్లడిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లూ సాంకేతిక సమస్యల గురించి చెప్పకుండా డిటెయిన్ అయ్యాక సమస్యలు ఉన్నాయంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్కసారికే అవకాశం డిటెయిన్ అయిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, బోర్డు కార్యదర్శి వెంకటేశ్వర్లు సమావేశమై చర్చించారు. ఈ పరిస్థితుల్లో అంత మంది విద్యార్థులు డిటెయిన్ అయితే నష్టపోతారని, మొదటిసారి కాబట్టి ఒకసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వారికి వచ్చే నెల 15 తర్వాత నుంచి ప్రత్యేకంగా మే నెలాఖరు వరకు నెలన్నర పాటు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. -
బాలానగర్ స్టేషన్లో నిలిచిన మెట్రోరైల్
-
టీచర్ల బదిలీలపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ, దానికి తోడు సాంకేతిక సమస్యలు విద్యాశాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బదిలీ కేటాయింపుల్లో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బదిలీ అయిన టీచర్ల జాబితా ఖరారు కావడం లేదు. గత మూడు రోజులుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీ పోస్టింగులపై కసరత్తు జరుగుతున్నప్పటికీ కొలిక్కిరావడం కష్టంగా మారింది. వాస్తవానికి శుక్రవారంనాడే స్కూల్ అసిస్టెంట్ల బదిలీల జాబితా వెలువడాల్సి ఉంది. కానీ పలు జిల్లాల్లో కేటాయింపుల్లో తప్పులు దొర్లాయి. ఒకే చోట ఇద్దరేసి టీచర్లకు కేటాయించడం, మున్సిపాలిటీ మొత్తాన్ని ఒకే గ్రామంగా పరిగణించడం లాంటి కారణాలతో జాబితా తలకిందులైంది. స్పౌజ్ జియోట్యాగింగ్‌లోనూ గందరగోళం నెలకొనడంతో వాటిని సరిదిద్దేందుకు విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జాబితా విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మొత్తానికి ఆదివారం రాత్రి పొద్దుపోయాక స్కూల్ అసిస్టెంట్ల బదిలీ జాబితాను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ వాటిని జిల్లా విద్యాశాఖ అధికారులకు అందించింది. వీటిని జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ప్రదర్శించాలని తెలిపింది. దీంతో వాటిని ఆయా జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో పెట్టేందుకు డీఈవోలు చర్యలు చేపట్టారు. ఎస్జీటీల జాబితా రేపే సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలపై ఉత్కంఠ వీడలేదు. స్కూల్ అసిస్టెంట్ల తుది జాబితా తర్వాతే వాటిని విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎస్జీటీల బదిలీల జాబితాను సోమవారం కల్లా తేల్చేసి రాత్రిలోగా జాబితా ఖరారు చేయాలని నిర్ణయించారు. బదిలీల ప్రక్రియలో జాప్యంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకత, సమయపాలన అని పేర్కొని మాన్యువల్ పద్ధతిలోనే బదిలీలు చేస్తున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, నర్సింహారెడ్డి మండిపడ్డారు. ఎస్జీటీల తుది జాబితాను తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్ డిమాండ్ చేశారు. -
బదిలీ బాధలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : తొలిసారిగా ‘వెబ్ కౌన్సెలింగ్’ విధానంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు సాంకేతిక సమస్యలు అవరోధంగా నిలుస్తున్నాయి. పూర్వపు మెదక్ జిల్లాలో 8,269 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు తాము బదిలీ అయ్యే చోటు కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు శనివారం ఒక్క రోజే గడువు ఇచ్చారు. 262 మంది పీజీహెచ్ఎంలు, 152 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు శని వారం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పాఠశాల యూ డైస్ పాత కోడ్లు ఇవ్వడంతో తడబాటుకు గురయ్యారు. మరోవైపు ఒకే పేరు ఉన్న గ్రామాల్లో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోవడంలోనూ ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకు చిట్కుల్ పేరిట పటాన్చెరు, కొల్చారం మండలాల్లో పాఠశాలలు ఉండగా, అప్షన్లో మండలం పేరు లేక ప్రధానోపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. స్పౌజ్ కేటగిరీకి సం బంధించి 50 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లోని ఖాళీలను చూపాల్సి ఉం డగా, 15 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను మాత్రమే వెబ్ ఆప్షన్లో చూపిం చారు. వెబ్ ఆప్షన్ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెబ్ఆప్షన్ల నమోదు గడువును శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ‘వెబ్ కౌన్సెలింగ్’పై నేడు నిరసన ఉపాధ్యాయ బదిలీల కోసం విద్యా శాఖ ప్రవేశ పెట్టిన వెబ్ కౌన్సెలింగ్ విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. వెబ్ కౌన్సెలింగ్ విధానంపై ముందస్తు ఆవగాహన కల్పించక పోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిం చాయి. కేవలం వందల సంఖ్యలో ఉన్న ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల నమోదులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నాయి. ఆదివారం నుంచి వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు బా ధ్యత వహిస్తారని ఐక్య వేదిక ప్రశ్నిం చింది. వెబ్ కౌన్సెలింగ్ స్థానంలో పాత పద్ధతిలో బదిలీలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఆదివారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు 12 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఐక్య వేదిక నాయ కులు ప్రకటించారు. స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనపై ఎస్టీయూ, టీపీఆర్టీయూ, టీఆర్టీఎఫ్, టీపీటీఎఫ్, టీటీఎఫ్, ఎస్జీటీఎఫ్, టీఎస్‌టీఎఫ్, టీఎస్ జీహెచ్ఎం, పీఆర్టీయూ నేతలు సంతకాలు చేశారు. -
సారూ.. చెట్టులెక్కగలవా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఏదో అద్దంలో చూస్తూ మురిసిపోతున్నట్లుగా ఉంది కదూ. ఈయన మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సంజీవరాయుడు అనే ఉపాధ్యాయుడు. బయోమెట్రిక్ హాజరు వేసేందుకు తరగతి గదిలోనుంచి బయటికి వచ్చి ఇలా అగచాట్లు పడుతున్నాడు. సాక్షి, ఆళ్లగడ్డ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం వీరిని మానసిక ఆందోళనలకు గురిచేస్తోంది. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే వెళ్లే సమయంలో అందులో వేలి ముద్రలు నమోదు చేయాలి. అప్పుడే వారికి హాజరు నమోదవుతుంది. ఏ మాత్రం ఆలస్యమైనా, లేదా వేలి ముద్రలు నమోదు కాకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరి వారు రెడ్‌జోన్ పరిధిలోకి చేరి చర్యలకు గురవుతారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగుపర్చడానికే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినా..అమలులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్ అందక రోడ్లమధ్యలో, మిద్దెలపై, చెట్లపై ఎక్కుతూ అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. అందని సిగ్నల్స్.. జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 2,404, ఏపీ మోడల్ స్కూల్స్ 35, కస్తూర్బా విద్యాలయాలు 53, మున్సిపల్ స్కూళ్లు 141, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 78 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3.84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 14,398 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు కచ్చితంగా సమయపాలన పాటించేలా 2015–16 విద్యాసంవత్సరం చివర్లోనే విద్యాశాఖ బయోమెట్రిక్ పరికరాలను పాఠశాలలకు అందజేసింది. గతేడాది నుంచి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సిగ్నల్స్ సమస్యలు అధికంగా ఉన్నాయి. పట్టించుకునేవారేరీ? ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, ఓబుళంపల్లి, ఆర్.కృష్ణాపురం, అహోబిలం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉయ్యాలవాడ మండలంలోని హరివరం, తుడుములదిన్నె, రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురం, కోటకొండ గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జి సిగ్నల్ మాత్రమే వస్తోంది. 3జి, 4జి సిగ్నల్స్ వచ్చినప్పుడే యంత్రాలు బాగా పనిచేస్తాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు అందించిన యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రతి రోజూ ఇబ్బందులే. పల్లె ప్రాంతం కావడంతో సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదు. ఒక్కోసారి 11గంటల సమయంలో పనిచేస్తాయి. పాఠశాల పనివేళల్లో పనిచేయడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –రమణయ్య, పేరాయిపల్లె, హెచ్ఎం మానసిక ఒత్తిడికి గురవుతున్నాం బయోమెట్రిక్ విధానం బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఈ విధానంలో ఎల్లో, గ్రీన్, రెడ్ జోన్లను కేటాయించారు. పాఠశాల సమయం దాటి 20 నిమిషాలు ఆలస్యమైనా రెడ్‌జోన్‌లో పడితే సెలవు కింద తీసుకుంటుంది. 10 నిమిషాలు ఆలస్యం అయితే గ్రీన్ జోన్‌కింద పడి ఇలా ఐదు రోజులు జరిగితే ఉపాధ్యాయులకు మెమోలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాకే ఈ విధానం ప్రవేశపెట్టింటే బాగుండేది. –రామనందకిశోర్, ఉపాధ్యాయుడు -
ఈ ‘వజ్ర’o మాకొద్దు!
- వజ్ర బస్సులపై డిపోల గగ్గోలు - నిర్వహించలేమంటూ ఆర్టీసీకి వేడుకోలు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆదరణ లేక ఇప్పటివరకు విఫలయత్నంగానే మిగిలిన వజ్ర మినీ ఏసీ బస్సులకు కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఆ బస్సులను తాము నిర్వహించలే మని, గ్రామీణ ప్రాంత డిపోలకు కేటాయించాలని వాటిని నిర్వహిస్తున్న 3 డిపోల అధికారులు చేతులెత్తేశారు. గత 3–4 నెలల్లో కొన్ని డిపోల్లో లాభాలు నమోదవడం.. మిగతా డిపోల పనితీరుపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్న తరుణంలో ఈ బస్సులు తమకు గుదిబండలుగా మారాయని వాపోతున్నారు. వజ్ర బస్సుల నష్టాలతో రేటింగ్స్‌లో వెనుకబడితే డిపోల పనితీరుకు మచ్చలా మిగులుతుందంటూ ఇటీవల విషయాన్ని యాజమాన్యానికి విన్నవించారు. 40 శాతం దాటని ఆక్యుపెన్సీ.. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు రాజధానిలోని కాలనీల మీదుగా నడిచేలా వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ.. తొలుత వరంగల్, నిజామాబాద్‌లకు 60 బస్సులు మొదలెట్టింది. మియాపూర్, కుషాయిగూడ, మెహిదీపట్నం డిపోలకు బస్సులను కేటాయించారు. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం, మధ్యలో ఎక్కేవారికి టికెట్ ఇవ్వకపోవటం, ధర ఎక్కువగా ఉండటం.. వంటి కారణాలతో తొలి రోజు నుంచే ప్రయాణికులకు బస్సులు చేరువ కాలేకపోయాయి. ఈ లోపాలపై పత్రికల్లో కథనాలు రావటంతో మార్పులు చేసినా ప్రయాణికులు ఆదరించడం లేదు. వాటి ఆక్యుపెన్సీ రేషియో 40 శాతానికి కూడా చేరువ కాలేకపోయింది. కిలోమీటరుకు రూ.తొమ్మిదే.. హైదరాబాద్‌లో ప్రతి కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) సగటున రూ.30 నుంచి రూ.32 మేర ఉంది. కానీ వజ్ర బస్సుల్లో రూ.9 వరకే పరిమితమైంది. డిపో ఆదాయంపై ఇది భారీ ప్రభావం చూపుతోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కొన్ని డిపోలు లాభాల బాటపట్టడంతో వరుస సమీక్షలతో డిపోల పనితీరును యాజమాన్యం పర్యవేక్షిస్తోంది. నష్టాలను అధిగమించటమే గీటురాయిగా పనితీరు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వజ్ర బస్సుల నష్టాలతో ర్యాంకిం గ్లో వెనుకబడిపోతున్నామని డిపోల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిటీ డిపోలు లాభాల్లో లేవని, గ్రామీణ డిపోలు లాభాల్లో ఉన్నందున నిజామాబాద్, వరంగల్ డిపోలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల వల్ల ఏడాదికి రూ.5 కోట్లు నష్టమొస్తొందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. బస్సులను తమకు కేటాయించాలని వరంగల్ రీజియన్ అధికారులు గతంలో కోరినా, నగరంలోని కాలనీల మీదుగా నడపాలని సీఎం ఆదేశించటంతో సిటీకి కేటాయించారు. గరుడ కన్నా ఎక్కువే.. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు రాజధాని బస్సు టికెట్ ధర రూ.280, గరుడ ధర రూ.350 ఉండగా.. వజ్ర బస్సు ధర రూ.380గా ఉంది. బస్సుల టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో ప్రజలు ‘వజ్ర’ వైపు మొగ్గు చూపటం లేదు. మరోవైపు బస్సులు నిర్వహించలేమంటూ డిపోలు గగ్గోలు పెడుతున్నాయి. -
వదలని సాంకేతిక సమస్యలు
ఎట్టకేలకు ఎస్జీటీల కౌన్సెలింగ్ ప్రారంభం నత్తనడకగా ప్రక్రియ గడువులోపే ముగించే పనిలో అధికారులు ఉపాధ్యాయులకు తప్పని ఇబ్బందులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరినా సాంకేతిక లోపాలు కొనసాగుతుండడంతో ఉపాధ్యాయుల్లో తీవక్ర అసహనం వ్యక్తమౌతోంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ నెల 22న హడావుడిగా ప్రారంభించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదినుంచీ సాంకేతిక లోపాలతో నత్తనడకగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌లు ఉదయం 10 గంటలలోపు ఏనాడూ ప్రారంభం కాలేదు. వాయిదాలు పడుతూ వస్తున్న స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,200 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తులు చేసుకోగా వీరిలో సుమారు 1,546 మంది ఒకే కేంద్రంలో ఎనిమిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు ఉన్నారు. వీరుగాక 1,510 మంది గిరిజనేతర ప్రాంతానికి, మరో 36 మంది ఏజెన్సీ ఏరియాకు బదిలీలు కావాల్సిన వారూ ఉన్నారు. మూడు గంటల ఆలస్యం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ఉన్నతాధికారులు వెబ్సైట్ లింకేజిని తెరవకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. 250 మందికి కౌన్సెలింగ్ నిర్వహించేటప్పటికి మరో సారి వెబ్సైట్ లింక్ కట్టయింది. దీంతో అరగంట పాటు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. డీఈఓ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు 400 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం 5 గంటల సమయానికి 335 మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయింది. గడువులోపు కౌన్సెలింగ్ పూర్తికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రణాళిక లేదు గెడ్డం సుధీర్, వైఎసార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక లేకపోవడమే కౌన్సెలింగ్ ఆలస్యమౌతోంది. ఎప్పటికప్పుడు జీఓలు మార్చుతూ సవరణ ఉత్తర్వులిస్తూ ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రారంభించిన తరువాత సాంకేతిక లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించింది. భవిష్యత్‌లో ఇటువంటివి జరుగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో జాప్యం బీఏ సాల్మన్ రాజు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బదిలీల కౌన్సెలింగ్‌లో ఎడిట్ ఆప్షన్ విద్యాశాఖ జిల్లా అధికారులకు ఇవ్వక పోవడంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల్లోనే కౌన్సిలింగ్ నిర్వహించి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. -
వేసవికి ముందే ‘కోతలు’
• సిరిసిల్లలో అప్రకటిత విద్యుత్ కోతలు • వస్త్రోత్పత్తి కి విఘాతం • తరచూ అంతరాయాలతో ఇబ్బందులు సిరిసిల్ల : కార్మిక క్షేత్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వేసవికి ముందే కరెంట్ కోతలు షురూ కావడంతో వస్రో్తత్పత్తి ఖిల్లా సిరిసిల్లలో నేతన్నలు ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో మరమగ్గాలపై వస్త్రం ఉత్పత్తి అవుతుండగా.. విద్యుత్‌కోతలు లేకుండా గతంలో సరఫరా చేశారు. ఇప్పుడు మాత్రం కరెంట్ కోతల వేళలు ప్రకటించకుండానే ఎప్పుడు పడితే అప్పుడే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గత మూడు రోజులుగా సిరిసిల్లలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. కోతలతో వస్రో్తత్పత్తికి విఘాతం.. సిరిసిల్ల పట్టణంలోనే మరమగ్గాలపై పాలిస్టర్, కాటన్ వస్రా్తలు ఉత్పత్తి అవుతాయి. కరెంట్ లేకుండా గుడ్డ ఉత్పత్తి సాధ్యం కాదు. దీంతో సిరిసిల్ల పట్టణానికి చాలా కాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉండగా.. నిత్యం 34లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పాతిక వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మధ్యతరగతి పేదలున్న సిరిసిల్ల కరెంట్ కోతలు ఉండొద్దని గతంలో నిర్ణయించి కొనసాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నేతన్నలు పని కోల్పోతున్నారు. సాంచాల మధ్య ఉంటూ గంటల తరబడి కరెంట్‌లేక ఉపాధి కరువు అవుతుంది. విద్యుత్ కోతలతో వస్రో్తత్పత్తికి విఘాతం కలుగుతుంది. చిరువ్యాపారుల ఇబ్బందులు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో కరెంట్ కోతలతో చిరువ్యాపారులు సైతం అవస్థలు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారు. వెల్డింగ్ షాపు, మోటార్ రీవైండింగ్, ఫోటో స్టూడియోలు, టేలరింగ్ షాపుల్లో పని లేక దిక్కులు చూశారు. వేసవికి ముందే కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిరిసిల్లలో విద్యుత్ కోతలను నివారించాలని నేత కార్మికులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. సాంకేతిక సమస్యలతో కోతలు సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాం. పట్టణానికి విద్యుత్‌ను అందించే సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు రావడంతో సరఫరాలో అవాంతరాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా విద్యుత్ కోతలు లేవు. తాత్కాలిక సాంకేతిక సమస్యలతోనే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. – దోర్నాల లక్ష్మారెడ్డి, ‘సెస్’ చైర్మన్ -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
కర్నూలు(రాజ్‌విహార్): వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్ అన్నారు. శనివారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోస్తాంధ్ర పాంతంలో వర్షాలు కరుస్తుండడంతో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు, వినియోగదారుల సేవల్లో లోపం లేకుండా చూడాలని, సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ భార్గవ రాముడు, డీఈ మహమ్మద్ సాధిక్, ఏడీఈ శేషాద్రి పాల్గొన్నారు. -
స్పైస్‌జెట్ కు సాంకేతిక సమస్య
యాప్రాన్పై ఐదు గంటల పాటు నిలిచిన వైనం సాయంత్రం 4కు హైదరాబాద్‌కు పయనం మధురపూడి : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి శనివారం ఉదయం 11 గంటలకు చేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఈ సర్వీసు యాప్రాన్పై ఐదు గంటల పాటు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో విమానం నిలిచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. సాంకేతిక సమస్యను చక్కదిద్దాక సాయంత్రం 4 గంటలకు ఈ సర్వీసు హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. యాప్రాన్పై విమానం ఎక్కువ సేపు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. సంస్థ ఉద్యోగులు ఈ సమాచారాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రయాణికులు సంస్థ ఉద్యోగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులకు, సంస్థ ఉద్యోగుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ఎట్టకేలకు విమానం సిద్ధం కావడంతో ప్రయాణికులు శాంతించారు. ఉరుకులు.. పరుగులు విమానం ఐదు గంటల సేపు నిలిచిపోవడంతో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఉదయం 11 గంటలకు చేరిన సర్వీసు, తిరిగి 11.30కు బయలుదేరుతుందనుకున్న సమయంలో మొరాయించింది. ఈ క్రమంలో సమాచారం ఇచ్చే వారు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. -
‘సర్వే’ సమస్యల మయం
నత్తనడకన సాగుతున్న సమాచార సేకరణ సాంకేతిక సమస్యలతో సతమతమం ప్రజలనుంచి సహకారం అంతంతమాత్రం ఏం చెప్తే ఏం సమస్య వస్తుందోనన్న భయం ఇబ్బంది పడుతున్న అధికారులు, ఎన్యూమరేటర్లు విజయనగరం గంటస్ఠంభం : ప్రజాసాధికార సర్వే ముందుకు సాగడంలేదు. సాంకేతిక సమస్యలు వీడటం లేదు. ఒకవైపు సర్వర్ డౌన్‌కావడం... మరోవైపు సిగ్నల్ అందకపోవడంతో అడుగు ముందుకు పడటంలేదు. దీనికి తోడు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రకరకాల కారణాలతో వివిధ పథకాలకు దూరమైన తామంతా మళ్లీ ఈ సర్వేపేరుతో ఇంకేం నష్టపోతామోనన్న ఆందోళన నెలకొంటోంది. ఒక్కో ఇంటివద్దా సమాచారం సేకరించేందుకు గంటలతరబడి సమయం వథా అవుతుండటంతో రోజుకు నాలుగైదుకు మించి నమోదు చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు సిబ్బంది పల్లెల్లో తిరుగుతుండటంతో కార్యాలయాల్లో పని పేరుకుపోతోంది. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వేవల్ల ప్రయోజనం లేకపోగా ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందిగా తయారైంది. సర్వేపై జనం అడుగడుగునా అసంతప్తి వ్యక్తం చేస్తుండటం... మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ పనిచేయకపోవడంతో రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రజలు నుంచి కుటుంబ వివరాలతోపాటు పూర్తి సమాచారం సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇంటిఫోటోతోపాటు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఫొటో, వారి స్థిర, చరాస్తులు, విద్య, సంక్షేమ పథకాల వర్తింపు తదితర అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి 80పాయింట్లతో కూడిన సమాచారాన్ని ఆన్లైన్ చేయాల్సి ఉంది. వివరాల సేకరణకు ఎన్యూమరేటర్లు, పర్యవేక్షణకు సూపరువైజర్లను ప్రభుత్వం నియమించింది. మందకొడిగా సమాచార సేకరణ జిల్లాలో 5,87,49 కుటుంబాల వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు 2215మంది ఎన్యూమరేటర్లను నియమించారు. సర్వే మొత్తం ఆన్లైన్లో చేయాల్సి ఉండగా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న 1781 కస్టర్లులో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. మిగతా ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉండగా ఇంకా ఆపక్రియ ప్రారంభం కాలేదు. సర్వే జరుగుతున్న క్లస్టర్లలో వివరాల సేకరణ సరిగ్గా జరగడం లేదు. ఇందుకు జనాలు సహకరించడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం పొలాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరి ఉభాలతోపాటు ఇతర పంటలకు సంబంధించి రైతులు, కూలీలు పొలాల్లో గడపాల్సి వస్తోంది. సర్వేకోసం ఇళ్లలోనే ఉండాలని అధికారులు ముందస్తుగానే చెబుతుండతంతో పనులు మానుకుని వారంతా ఏ క్షణాన అధికారులు వస్తారోనని ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. పనులు కోల్పోతున్నవారంతా ఎన్యూమరేటర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు పురపాలకసంఘాలు, 34మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సమాచారం అంతా సేకరించినా వాటిని నమోదు చేయడానికి సర్వర్లు సహకరించకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదు. గడువు పొడిగించినా... తొలివిడత సర్వే జూలై ఎనిమిదినుంచి 15వరకూ జరగాల్సి ఉంది. అయితే అనుకోని అవాంతరాలతో ముందుకు సాగకపోవడంతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 40వేల కుటుంబాల సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. ఒకటోతేదీనుంచి ఐదో తేదీవరకూ పెన్షన్ల పంపిణీ ఉన్నందున ఆ రోజుల్లో సర్వేకు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆరోతేదీనుంచి నిరంతరాయంగా కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనాల్లో గుబులు సర్వేపై జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు స్థిర, చరాస్తులు వివరాలు అడుతున్నారు. ఈ కారణంగా ఏం చెబితే ఏమవుతుందోనన్న ఆందోళన ఉంది. ముఖ్యంగా పింఛనర్లు, రేషన్‌కార్డుదారులు, గహాల కోసం దరఖాస్తు చేసుకునే వారు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూసే వారు సరైన వివరాలు వెల్లడించడం లేదు. రేషన్‌కార్డు, గ్యాస్‌బుక్ వంటివి చూపిస్తున్నా... స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు మాత్రం చూపడం లేదు. లబ్ధిదారుల్లో ఈ గందరగోళానికి ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడమే కారణం. ఇక సర్వే చేపడుతున్నవారి సమస్యలు మరోలా ఉంటున్నాయి. రెండు మూడు ఇళ్లకే ట్యాప్ చార్జింగ్ పూర్తయిపోతుండటంతో సర్వే ముందుకెళ్లడంలేదు. నెట్ బిల్లులు కూడా వేగంగా అయిపోతుండడం, అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా చేయకపోవడం వల్ల ఎన్యూమరేటర్లు చేతి చమురు వదిలించుకుంటున్నారు. -
నత్తనడకన ప్రజా సాధికార సర్వే
రోజుకో వెర్షన్ మార్పు కాకినాడ సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేను సాంకేతిక సమస్యలు వీడడం లేదు. దాంతో అది నత్తనడకన సాగుతోంది. మరో వంక తొలివిడత సర్వే ముగింపు గడువు ఈనెల 30వ తేదీ ముంచుకొస్తోంది. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన ఈసర్వేకు సాంకేతిక సమస్యలు నేటికీ ఎదురవుతూనే ఉన్నాయి. సర్వర్ ఇబ్బందులతో ట్యాబ్‌లు మొరాయించడం, సర్వర్ కనెక్టవిటీ పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఒక్కో కుటుంబం వద్ద గంటకు పైగా సమయం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ నాటికి తొలివిడత ప్రాంతాల్లో సర్వే ఏమేరకు పూర్తవుతుందో తెలియదు. మరోపక్క ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకువస్తోంది. తొలుత 2.1 వెర్షన్ రూపొందించింది. తరువాత ఆన్లైన్ ఫార్మెట్లో మార్పులు చేసి 2.2 వెర్షన్ సాఫ్ట్‌వేర్‌ను సర్వే ప్రారంభంలో తీసుకువచ్చింది. తరువాత ఏడుసార్లు మార్పులు చేసి తాజాగా 2.4.2 వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా రోజుకో వెర్షన్ మారుస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేటర్లు వివరాల సేకరణలో తలెత్తుతున్న ఇబ్బందులతో తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్ల పరిధిలోని 38 రూరల్ మండలాలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి రెండు కార్పొరేషన్లు, 7 మున్సిపాల్టీలు, 3 నగర పంచాయతీల్లోని 2795 బ్లాకులలో సుమారు 11 లక్షల కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉంది. కాగా శనివారం వరకు కేవలం 15,607 కుటుంబాల వివరాలను మాత్రమే సేకరించారు. 38 రూరల్ మండలాల్లో 13,629 కుటుంబాల వివరాలు సేకరించారు. అత్యల్పంగా కోటనందూరు మండలంలో 36 కుటుంబాల వివరాలు సేకరించారు. తుని మండలంలో 67, రావులపాలెంలో 91కుటుంబాల వివరాలు తీసుకోగా మిగిలిన మండలాల్లో వందల సంఖ్యలోనే కుటుంబాల వివరాలు సేకరించారు. అర్బన్ ప్రాంతాలల్లో అయితే సర్వే అసలు ముందుకు వెళ్లలేదు. మొత్తం 2,345 కుటుంబాల వివరాలు సేకరించగా అత్యల్పంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో కేవలం 13 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, తుని మున్సిపాల్టీల్లో మూడంకెల సంఖ్యకు చేరుకోగా పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీలలో రెండంకెల సంఖ్యలో కుటుంబాల వివరాలను సేకరించారు. -
అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఎస్పీఎస్ సర్వే
తుని (తునిరూరల్) : సాంకేతిక సమస్యలతో ప్రజా సాధికార సర్వే (ఎస్పీఎస్) సక్రమంగా జరగడం లేదని అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఈ సర్వే నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం తుని పట్టణం దివాణం వీధిలో నిర్వహిస్తున్న ఎస్‌పీఎస్‌ను పరిశీలించారు. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధిగమించేందుకు సాంకేతికతను జోడిస్తున్నట్టు తెలి పారు. ఆధార్, రేషన్, బ్యాంక్, ఓటర్, డ్రైవింగ్ లెసైన్స్ కార్డులు వంటి 14 సర్వీసులకు చెందిన 84 అంశాలను నమోదు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఐరిష్ సేకరణతో సమస్య తలెత్తుతోందన్నారు. జిల్లాలో 42లక్షల మంది వివరాలను ఈ సర్వేలో సేకరించాల్సి ఉండగా ఇంతవరకూ 31వేల మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగలిగామన్నారు. ఆయనవెంట తహసీల్దార్ బి.సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్వీరమణ తదితరులు ఉన్నారు. ఆగస్టు 15 లోగా ప్రజాసాధికార సర్వే పూర్తి గొల్లప్రోలు: జిల్లాలో ప్రజాసాధికార సర్వే ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాల్లో ప్రజాసాధికారసర్వేను పరిశీలించారు. సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఎన్యూమరేటర్లను ఆడిగి తెలుసుకున్నారు. మొదటి విడతగా 40మండలాలు, 12మున్సిపాల్టీల్లో 2,707 బృందాలు ఈ సర్వే చేస్తున్నాయన్నారు. మొదటి దశ సర్వే జూలై 30లోగా పూర్తి చేయాలని, నెట్‌వర్క్‌లేని ఏజెన్సీ తదితర 24మండలాల్లో సర్వేను ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై. జయ, ఎంపీడీఓ పి. విజయథామస్, డిప్యూటీ తహసీల్దార్ రామరాజు, గొల్లప్రోలు కమిషనర్ వేగి సత్యనారాయణదితరులు ఉన్నారు. -
విషం కక్కొద్దు!
► ఆసుపత్రి వ్యర్థాలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కన్నెర్ర ► జీవరాశులకు ముప్పు ఉందని.. ► నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు ఉత్తర్వులు ► సాంకేతిక సమస్యలు ఉన్నాయంటున్న వైద్యాధికారులు ► నాలుగు నెలల గడువుపై పెదవి విరుపు నరసరావుపేట టౌన్ : నీరు జీవకోటికి ప్రాణాధారం.. అలాంటి నీటిలో రసాయనాలు, వ్యర్థ పదార్థాలు కలిస్తే మాత్రం గరళం.. మరి ఆ విషాన్నే జీవరాశులు తాగితే సంభవించేది అనర్థమే.. ముఖ్యంగా వైద్యశాలల్లో ఇటువంటి వ్యర్థనీరు ఎక్కువగా విడుదలవుతుంది. అది కాలువలు, డ్రైనేజీ ద్వారా ఒక చోట మడుగులా ఏర్పడుతుంది.. లేదా ఖాళీగా ఉన్న పంట పొలాల్లోకి ప్రవిహ స్తుంది. దీని ద్వారా మూగజీవులు తీవ్ర అనారోగ్యం పాలవడమే గాక పంట పొలాలు సారం కోల్పోతాయని ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తన పరిశోధనలో వెల్లడించింది. అంతేకాదు.. నాలుగు నెలల్లోపు వంద పడకల ఆసుపత్రుల్లో నీటిని శుభ్రపరిచే ప్లాంటులు ఏర్పాటు చేయాలని ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు హానికరమైనవని కన్నెర్ర చేసింది. సకాలంలో పని పూర్తి చేయకపోతే వైద్యశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వబోమని హెచ్చరించటంతో వైద్యశాల వర్గాల్లో కలవరం మొదలైంది. ప్రణాళిక స్పష్టంగా లేదనే వాదనలు.. రాష్ట్రంలో వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులు 31 ఉండగా వీటిలో జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి, బాపట్లలో ఉన్నాయి. ఆయా వైద్యశాలలకు ఈ నెల 5ననీటి శుద్ధి ప్లాంట నిర్మాణంపై ఉత్తర్వులు అందాయి. ఒకవేళ ప్లాంటు నిర్మాణంలో జాప్యం తలెత్తితే వైద్యశాల నిర్వహణను నిలిపివేసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. ఆదేశాలందినప్పటి నుంచి 15 రోజుల వ్యవధిలో రూ.50 వేల బ్యాంక్ గ్యారెంటీతో పనులు ప్రారంభించాలని సూచించింది. అయితే.. ఉత్వర్వుల్లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో ఆయా వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. ప్లాంట్ నిర్మాణావసర నిధులు, స్థల పరిశీలన తదితర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనీ, ఇవన్నీ పూర్తి కావాలంటే ఇచ్చిన గడువు సరిపోదని ైవె ద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు గడువు పెంచాలని కోరుతున్నారు. జలం.. వ్యర్థం.. విషం వైద్యశాలలో శస్త్ర చికిత్సలతో పాటు ఇతర అవసరాలకు వైద్య సిబ్బంది అనేక పరికరాలు వినియోగిస్తారు. వాటిని శుభ్రం చేసేందుకు రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. అలా శుభ్రం చేసిన నీరు మురుగు కాలువలోకి వెళ్లి మురుగు నీటితో కలిసి విషపూరితంగా మారుతోంది. డ్రైనేజీ ద్వారా ఊరి బయట కాలువల్లో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమవడమే కాక, జీవరాశులు చనిపోతున్నట్లు కాలుష్యనియంత్రణ బోర్డు తేల్చి నాలుగు నెలల్లో వ్యర్థ నీటిని శుభ్రపరిచే ప్లాంటులు ఏర్పాటు చేయాలనిఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు మాత్రం వైద్యాధికారులు మరింత గడువు కావాలని కోరు తున్నారు. ప్లాంట్ నిర్మాణానికి చర్యలు.. ఏరియా వైద్యశాలలో వ్యర్థ నీటిని శుభ్రం చేసే ప్లాంటును నాలుగు నెలల్లో నిర్మించాలని ఆదేశాలు అందాయి. నిర్మాణానికి సాంకేతిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తాం. త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ఇప్పటికే వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్తదృష్టికి తీసుకువెళ్లాం. - డాక్టర్ టి.ఎం.ఎస్.ప్రసాద్, ఏరియా వైద్యశాలసూపరింటెండెంట్ -
ఈ పాస్ మొరాయింపు
సర్వర్ పనిచేయక బియ్యం పంపిణీలో జాప్యం ఇక్కట్లకు గురవుతున్న రేషన్ లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా ఇదే తీరు తాడితోట (రాజమహేంద్రవరం) : ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ప్రవేశపెట్టిన పీఓఎస్ (ఫాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లు మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందోనని డీలర్లు, లబ్ధిదారులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూపులు తప్పడంలేదు. ప్రతినెలా రేషన్‌కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పాస్ విధానంలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని ఈనెల నుంచి ఏపీ ఆన్లైన్ నెట్వర్క నుంచి జాతీయ విజ్ఞాన కేంద్రానికి (ఎన్.ఐ.సి.)కి మార్పు చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,660కి పైగా రేషన్‌షాపులలో పీఓఎస్ మెషీన్లు పనిచేయడంలేదు. లబ్ధిదారుడు వేలిముద్ర స్వీకరించిన అనంతరం నో స్టాక్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్ సరుకులు ఇవ్వలేకపోతున్నారు. 5వ తేదీ వచ్చినప్పటికి జిల్లావ్యాప్తంగా 75 శాతం కూడా రేషన్ పంపిణీ జరగలేదని డీలర్లు అంటున్నారు. సరుకుల కోసం నిరీక్షణ రాజమహేంద్రవరం, కాకినాడ, గొల్లప్రోలు, పెద్దాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాలలో మెషీన్లు పని చేయడంలేదు. కొన్నిచోట్ల సర్వర్ బాగా పనిచేసినప్పటికీ చాలాచోట్ల గంటకు ఒక కార్డు చొప్పున అవుతోంది. మరికొన్నిచోట్ల నోస్టాక్ అంటూ చూపిస్తుండడంతో డీలర్లు అవాక్కవుతున్నారు. దీంతో రేషన్‌బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నాలుగురోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో కూలిపనులు సైతం మానుకుని రేషన్‌కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవరం వరకూ రేషన్ ఇచ్చేది లేదని కొందరు డీలర్లు చెబుతున్నారు. రేషన్ కోసం కూలిపనులు మానుకొని వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. దీనిపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
నిలిచిపోయిన పల్నాడు రైలు.. ప్యాసింజర్స్ అవస్థలు
గుంటూరు: సాంకేతిక లోపం తలెత్తడంతో పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పల్నాడు నిలిచిపోవడంతో ఆ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా రైలు కదలకపోవడంతో గమ్యస్థానాలకు ఆలస్యం అవుతుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. -
ఒంటిమిట్ట వద్ద నిలిచిన నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ముంబై-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ముంబై నుంచి నాగర్‌కోయిల్ వెళుతున్న రైలు సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం 1 గంటకు నిలిచిపోగా, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే డ్రైవర్‌ను కారణాలు అడిగినప్పటికీ వెల్లడించలేదని సమాచారం. రైల్వే అధికారులకు విషయాన్ని తెలియజేశారు. -
ముసురుకుంటున్న చీకట్లు
నిత్యం 2వేల మెగావాట్ల విద్యుత్ కొరత వర్షాభావం వల్ల జలాశయాల్లో ఉత్పత్తి కాని విద్యుత్ వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు చాపకింద నీరులా లోడ్‌షెడ్డింగ్ వ్యవసాయానికి ఇకపై నాలుగు గంటల విద్యుత్ బెంగళూరు : కర్ణాటకను కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో లేక పోవడంతో రాష్ట్ర ఇంధనశాఖ లోడ్‌షెడ్డింగ్‌కు తెరతీసింది. దీంతో వ్యవసాయంతోపాటు గ్రామీణ, పట్టణ గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ సరఫరాలో కోత ఏర్పడింది. ఈ విషయంలో రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డి.కె.శివకుమార్ మూడు రోజుల ముందు ‘లోడ్‌షెడ్డింగ్’ ఉండబోదంటూ చేసిన వ్యాఖ్యలు నీటి మూటలుగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంధనశాఖ గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో ప్రతి నిత్యం తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. కాగా, 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఉడిపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీసీఎల్)లో గత నెల రోజులుగా తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ఇందులోని రెండు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీంతో పూర్తి సామర్థ్యంతో పోలిస్తే 60 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలైన లింగనమక్కి, మాణి, సూప జలాశయాల్లో గత ఏడాది ఈ సమయానికి 6,656 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి పరిమాణం ఉండగా, ప్రస్తుతం ఈ మూడు జలాశయాల్లో కలిపి 4,044 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు కేంద్రం నుంచి అందాల్సిన మొత్తం విద్యుత్ పరిమాణంలో దాదాపు 500 మెగావాట్ల తక్కువగా సరఫరా అవుతోంది. ఇలా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ధర్మల్, జల, సోలార్ తదితర విద్యుత్‌తో పాటు రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న విద్యుత్ ఏడువేల మెగావాట్లను మించడం లేదని ఇంధనశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లోడ్‌షెడ్డింగ్‌కు ఆదేశాలు... ఇలా అటు సాంకేతిక ఇబ్బందులు, కేంద్రం నుంచి అందే విద్యుత్‌లోనూ కోతతోపాటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లోడ్‌షెడ్డింగ్‌కు వెళ్లాలని ఇంధనశాఖ నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని బెస్కాంతోసహా మిగిలిన అన్ని విద్యుత్‌సరఫరా సంస్థలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో పట్టణప్రాంతంలో అధికారికంగా 4 గంటలు, గ్రామీణ ప్రాంతంలో 6 గంటల విద్యుత్ కోతను విధిస్తున్నారు. ఇక వ్యవసాయానికి త్రీఫేజ్లో ప్రస్తుతం ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుండగా లోడ్‌షెడ్డింగ్ వల్ల ఇక పై నాలుగు గంటలే విద్యుత్ సరఫరా ఉంటుంది. ఇదిలా ఉండగా అధికారిక లోడ్‌షెడ్డింగ్‌తో పోలిస్తే అదనంగా ప్రతి క్యాటగిరిలో రెండు నుంచి మూడు గంటలు ఎక్కువ విద్యుత్ కోత ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. -
పింఛన్ తిప్పలు
- నిధులు విడుదలై వారం.. - లబ్ధిదారులకు అందని డబ్బులు - అర్బన్‌లో బ్యాంకులు, రూరల్‌లో పోస్టాఫీస్‌ల ద్వారా పంపిణీ - పోస్టాఫీస్‌లలో సాంకేతిక సమస్యలు - పింఛన్‌దారుల అయోమయం హన్మకొండ అర్బన్ : జిల్లాలో గాడిన పడుతున్న ఆసరా పింఛన్ల పంపిణీ వ్యవస్థను ప్రభుత్వ కొత్త ప్రయోగం లబ్ధిదారులను అయోమయూనికి గురి చేస్తోంది. ఇప్పటివరకు పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు.. నగరంలో మున్సిపల్ సిబ్బంది పింఛన్ డబ్బులు అందజేసేవారు. ఈ సమయంలో పింఛన్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో భాగంగా అర్బన్ ప్రాంతంలో 22,061 పింఛన్ దారులకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమచేశారు. ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో చేరింది లేనిది ంకా స్పష్టం కాలేదు. ఎందుకంటే తమ డబ్బులు బ్యాంకుల్లో పడతాయని సమాచారం చాలా మంది పింఛనర్లకు తెలియదు. దీంతో ఎప్పటిలాగే అధికారులే వచ్చి పంపిణీ చేస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సాంకేతిక సమస్యలు ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లావాదేవీలు జరపకుండా చాలా కాలం ఉన్న ఖాతాల్లో డబ్బులు వేసినా ప్రస్తుతం పనిచేయదు. ఇక బ్యాంకు ఖాతా నంబర్లు వేల సంఖ్యలో ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపకార వేతనాల పంపిణీ విషయంలో ఎదురైన అనుభవాలు ఇదే విషయం చెపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో.. ఈ నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు పోస్టాఫీసు ద్వారా అత్యధికంగా 2,14,525 మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మిగతా 1,74,395 మాత్రం నేరుగా ఉద్యోగులే పంపిణీచేస్తున్నారు. అయితే పోస్టాఫీసుల ద్వారా పంపిణీ విషయంలో గ్రామాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పోస్టల్ సిబ్బంది పింఛన్‌దారుల వేలి ముద్రలు ఆధారంగా పింఛన్ పంపిణీ చేయాలి. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా మిషన్ ఇస్తారు. అయితే మిషన్ సాంకేతిక లోపం తలెత్తితే ఇబ్బందులు తప్పవు. వేలి ముద్రలు ఏమాత్రం తేడాగా ఉన్నా ఇబ్బందే. పోస్టాఫీసుల్లో పంపిణీ విషయంలో ఏపీ ఆన్లైన్ వారు సర్వీసు ప్రొవైడర్‌గా ఉంటారు. ప్రతి మండలానికి ఒక కో-ఆర్డీ నేటర్ను ఏర్పాటు చేయాల్సింది. వీరు సమన్వయంతో వెంటనే సమస్యను పరిష్కరించాలి. మంచం పట్టిన వారికి.. గ్రామంలో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ విషయంలో వేలిముద్రలు తప్పనిసరి కాబట్టి ఒక వేళ పింఛన్‌దారు పూర్తి గా నడవలేని స్థితిలో ఉన్నా.. వేలిముద్రలు రాని స్థితి ఉన్నా.. సంబంధిత వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పింఛన్‌దారుల కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి వేలిముద్రలు తీసుకుని పింఛన్ ప్రతి నెలా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చే విధంగా వేసులు బాటు కల్పించారు. కొన్నిచోట్ల ఇబ్బందులు పోస్టాఫీస్ సిబ్బంది కొన్నిచోట్ల పింఛన్‌దారులను ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం నుంచి పింఛనర్లు లైన్కట్టినా సాయంత్రం ఎప్పుడో పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉదయం, సాయంత్రం, రేపు అంటే తిప్పుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈసారి ముందే... ప్రతి నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే పింఛన్ డబ్బులు ఈ సారి మాత్రం అధికారులు ముందే విడుదల చేశారు. 13 నుంచి పంపిణీ చేపట్టే విదంగా ఆదేశాలిచ్చి నిధులు విడుదల చేశారు. -
సాంకేతిక సమస్యలతో నిలిచిన స్పెస్ జెట్
కృష్ణా(గన్నవరం): హైదరాబాద్ వెళ్లాల్సిన సైజెట్ విమానం సాంకేతిక కారణాలతో రెండు గంటల పాటు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో పలువురు మంత్రులతోపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పెస్ జెట్‌కు చెందిన విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ఇక్కడికి వచ్చి 2.40కి హైదరాబాద్ బయలుదేరుతుంది. కాగా శనివారం విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. సుమారు రెండు గంటలపాటు మరమ్మతులు చేసిన తర్వాత విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. హైదరాబాద్ వెళ్లాల్సిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ప్రభుత్వ ప్రచార సలహాదారు పరకాల ప్రభాకర్‌తోపాటు పలువురు వీఐపీలు లాంజ్‌రూమ్‌లో నిరీక్షించారు. 4.30 గంటలకు విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. -
మొండికేసిన అండమాన్ నౌక
సాక్షి, విశాఖపట్నం: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖ నుంచి అండమాన్ వెళ్లే నౌక సాంకేతిక సమస్యలతో శుక్రవారం మొండికేసింది. ఇంజన్లో సమస్య తలెత్తడంతో ఉదయం 11.30 గంటలకు వెళ్లాల్సిన నౌక సాయంత్రం 6గంటలకు బయలుదేరింది. దీంతో 2వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విశాఖ పోర్టు నుంచి అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్ వరకూ ప్రతి నెలా నౌకను షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నడుపుతున్నారు. 1100 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణానికి రూ.2,500 నుంచి రూ.9వేల వరకూ కేటగిరిల వారీగా టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. యాభై ఆరు గంటల పాటు ప్రయాణించాల్సి ఉండటంతో ప్రయాణీకులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు. చెన్నై, కోల్కత్తా పోర్టుల తర్వాత అండమాన్‌కు విశాఖ నుంచే నౌకాయానం అందుబాటులో ఉంది. చెన్నై, కోల్కత్తా నుంచి కంటే విశాఖ నుంచి వెళితే నాలుగు గంటలు ముందుగానే పోర్ట్‌బ్లెయిర్ చేరుకోవచ్చు. అయితే అండమాన్ నౌక ఆలస్యమవ్వడం కొత్తకాదు. గతంలోనూ అనేక సార్లు ఇదే విధంగా ఇబ్బందులు పెట్టింది. ఒక్కొసారి రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. -
ఉక్కపోత.. విద్యుత్‌కోత..
నగరంలో విద్యుత్ సాంకేతిక సమస్యలు పెరిగిపోతున్న ఎండ వేడిమి అల్లాడిపోతున్న నగరవాసులు విజయవాడ : అసలే ఎండలు.. ఆపై విద్యుత్ కోతలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కొద్దిరోజులుగా నగరంలో ఆకసిక్మంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఎండ వేడిమికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు కాలిపోవడం వల్లే ఈ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు నరకయాతన అనుభవించారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు సింగ్‌నగర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి సరఫరా లేక ఎండ వేడిమి, దోమల బెడదతో జనం విలవిల్లాడిపోయారు. అలాగే, గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న లైలా భవనం సమీపంలోని ఇండోర్ స్టేడియంలో సాంకేతిక సమస్య ఎదురైంది. 33 కేవీ అండర్ గ్రౌండ్లైను వైర్లు కాలిపోయాయి. దీంతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐదారు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి సూర్యారావుపేట, బందర్‌రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. అనంతరం విద్యుత్ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రెండు ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించారు. -
సర్వర్ బిజీ
అంతటా వెబ్సైట్లు ఓపెన్ చేయడమే కారణం అనుకున్న సమయంలో పూర్తి కాలేకపోతున్న ఆన్లైన్ నమోదు పింఛన్ పంపిణీలో మరింత జాప్యం సర్వర్ బిజీ మోర్తాడ్ : పింఛన్లకు సంబంధించిన ఇంటింటి సర్వే పూర్తి కాగా, ఆన్లైన్ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అన్ని పనులను పక్కకు పెట్టి ఎంపికైన లబ్ధిదా రుల వివరాలను ఆపరేటర్లు రెవెన్యూ కార్యాలయాలలోని కంప్యూటర్ల ద్వారాఆన్‌లైన్ చేస్తున్నారు. అన్ని కార్యాలయాలలోనూ ఒకేసారి వెబ్సైట్లను ఓపెన్ చేయడం తో సర్వర్ బిజీ అయ్యింది. దీంతో వివరాల నమోదుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ మంది లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేయాల్సి రావడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం సీలింగ్‌ను ఎత్తివేయడంతో ఇంకా కొంత మంది లబ్ధిదారు లను ఎంపిక చేయాల్సి ఉంది. సర్వర్ బిజీగా మారడంతో పింఛన్ల పంపిణీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి సం బంధించిన ఇతర వెబ్సైట్లను నిలుపుదల చేసి పింఛన్లకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చినా సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. -
సార్.. ఇవీ సమస్యలు..
పెన్షనర్ల డేటా ఎంట్రీలోని సాంకేతిక సమస్యలపై సిబ్బంది మొర సాక్షి, హైదరాబాద్: ‘సార్.. ఒక మండలంలోని పెన్షనరు పేరును కంప్యూటర్లో ఎంటర్ చేస్తే.. ఆ పేరు వేరే మండలానికి వెళ్తోంది. వృద్ధాప్య పింఛను వివరాలు నమోదు చేస్తే.. వికలాంగుల పింఛనుగా చూపిస్తోంది. సదరం సర్టిఫికేట్ ఆధారంగా ఎంటర్ చేసిన వైకల్య శాతం డేటాలో కని పించడం లేదు’ అంటూ పింఛన్ పంపిణీ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై సిబ్బంది ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నారు. డేటా అప్లోడ్పై వివిధ జిల్లాల అధికారులతో గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్) సీఈవో మురళి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రెండ్రోజుల్లో టీసీఎస్, ఎన్ఐసీ నిపుణులను మండల కేంద్రాలకు పంపనున్నటు పేర్కొన్నారు. వయస్సు అంశం మినహా మిగిలిన వాటిల్లో మార్పులు, చేర్పులపై ఎంపీడీవోలకు వెసులుబాటు ఇస్తామన్నారు. -
ఆర్టీపీఎస్లో సాంకేతిక సమస్యలు
రెండు యూనిట్లలో విద్యుదుత్పాదన నిలిపివేత మరో యూనిట్లో చాలా రోజులుగా నిలిచిపోయిన ఉత్పత్తి రాయచూరు : ఆర్టీపీఎస్లో సాంకేతిక సమస్యలు తలెత్తి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన స్తంభించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోల్సీడింగ్ గేర్ బాక్సులో సమస్య తలెత్తి బొగ్గు సక్రమంగా సరఫరా కాక 1, 2 యూనిట్లు డ్రిప్ అయ్యాయి. అదేవిధంగా 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3, 4,5,6,7 యూనిట్లలో కూడా ఉత్పాదన బాగా తగ్గి సగటున 80 నుంచి 90 మెగావాట్ల ఉత్పాదన జరుగుతోంది. 8వ యూనిట్లో ఈఎస్పీ అమర్చే ప్రక్రియ పూర్తయినా బీహెచ్ఈఎల్ అధికారులు పరీక్ష చేసే ప్రక్రియ పూర్తికాక ఆ యూనిట్లో చాలా రోజులుగా ఉత్పదన ప్రారంభించలేదు. అయితే తుదిపరీక్ష నేడో రేపొ తరువాయి ఇక్క ఉత్పాదన ప్రారంభం కానుంది. 210 మెగావాట్ల మొత్తం 7 యూనిట్లు అలాగే 250 మెగావాట్ల 8వ యూనిట్‌తో కలిపి 1720 ఉత్పాదన చేసే సామర్థ్యముంది. 3,4,5,6,7 యూనిట్లలో 450 నుంచి 500 మెగాట్లు మాత్రమే ఉత్పాదన జరుగుతుండటంతో రాష్ర్తంలో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 2వ యూనిట్‌ను ఈ ఏడాది వార్షిక మరమ్మత్తులు చేయలేదు. ఇది కూడా డ్రిప్ అయినందువల్ల వార్షిక మరమ్మత్తులు చేపట్టే అవకాశముంది. మొత్తానికి తరచుగా ఏవెవో కారణాలతో ఉత్పాదన ఆగడం వల్ల అటు అధికారులకు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరో వైపు ఆర్టీపీఎస్‌ను బొగ్గు సమస్య కూడా వేధిసోతంది. ప్రతి రోజు సగటున ఏడెనిమిది రేకుల బొగ్గు సరఫరా కావాల్సి ఉండగా బుధవారం కేవలం 5 రేకులు, గురువారం కేవలం ఒక రాక్ మాత్రమే సరఫరా అయ్యింది. ప్రస్తుతం 8, 9 వేల మెట్రిక్ టన్నుల బొగ్గులు మాత్రం నిలువ ఉన్నాయి. నిర్దిష్టప్రమాణంలో బొగ్గులు సరఫఱా కాకపోతే ఉత్పాదనపై తీవ్ర ప్రభావం పడనుంది. -
లేటంతా గేట్‌బెల్ట్‌తోనే...
యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టు(ఏఎల్పీ) ఇంకా బాలారిష్టాల్లోనే ఉంది. సింగరేణి సంస్థకు ప్రతిష్టా త్మకంగా నిలిచిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంటోంది. భూగర్భ గనిలో ఉన్న బొగ్గు నిల్వలు తీయడానికి ఆర్జీ-3 పరిధి లోని ఓసీపీ-2 ప్రాజెక్టు క్వారీలోని 150మీటర్ల లోతున పంచ్ఎంట్రీలు ఏర్పాటు చేసి 2008 ఫిబ్రవరిలో గని పనులు ప్రారంభించారు. మొదటగా రూ.660 కోట్లతో ఈభారీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు ప్రారంభం ఆలస్యం కావడం, నిర్వహణ, యంత్రాల ఖర్చు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రాజెక్టు వ్యయం రూ. 1200 కోట్లకు చేరుకుంది. ఎన్నో అవాంతరాల మధ్య విదేశాల నుండి యంత్రాలను దిగుమతి చేసుకున్న యాజమాన్యం గనిపై జీడీకే-10ఏ గనిపై ప్రయోగాత్మ కంగా పరిశీలించిన అనంతరం రెండు నెలల కిందట లాంగ్వాల్ యంత్రం, దానికి సంబందించిన అనుబంద యంత్రాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గనిలోని విజయ వంతంగా పంపించారు. పనులు జరుగుతున్న తీరును గమనించిన సీఅండ్ఎండీ సుతీర్ధభట్టాచార్య ఆగస్టు 15 నాటికి అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే యంత్రాల బిగింపు పక్రియ ఆలస్యం కావడానికి తోడు సాంకేతిక సమస్యలు ఉత్ప న్నం కావడంతో ట్రయల్న్ ్రఆలస్యమవుతూ వస్తోంది. లాంగ్వాల్ షేరర్ యంత్రం ప్రారంభం మొదలు బెల్ట్‌లు అన్నీ కంప్యూటర్‌తో అనుసంధానించి కంప్యూటర్ పోగ్రామింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. గేట్బెల్ట్లో సాంకేతిక సమస్యలు.. లాంగ్వాల్ యంత్రానికి సంబంధించిన యంత్రాలన్నీ సరిగానే పనిచేస్తున్నప్పటికి గేట్ బెల్ట్‌లో సంకేతి లోపం ఏర్పడింది. గేట్బెల్ట్లో నెలకొన్న సమస్యను సవరించేం దుకు జర్మనీనుండి ప్రత్యేక నిపుణులను రప్పించి నప్ప టికి బెల్ట్ పనితీరులో మార్పు కన్పించడం లేదు. కంప్యూటర్ పోగ్రామింగ్‌లో తేడా మూలంగా బెల్ట్ స్పీడ్‌గా నడవడం లేదని అధికారులు గుర్తించారు. దీన్ని మరమ్మ తులు నిర్వహించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా బెల్ట్‌లు, యంత్రాలు సరిగానే పని చేస్తున్నా గేట్బెల్ట్ మొరాయిస్తుడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. గతంలో తీసుకువచ్చిన ఇంజినీర్లు కొంత మేర పనులు పూర్తిచేసిన ప్పటికీ గేట్బెల్ట్ అనుకు న్నంత స్పీడ్‌గా పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో ఇంగ్లండ్ నుంచి ఎక్స్‌పర్ట్‌ను రప్పిస్తున్నారు. సోమవారం ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావి స్తున్నారు. కంప్యూటర్ పోగ్రామింగ్లోని ప్రత్యేక సాఫ్ట్వే ర్ను లోడింగ్ చేస్తే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అను కుంటున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే బుధ, గు రువారాల్లో ట్రయల్న్ ్రచేపట్టి బొగ్గును స్టాక్ పైల్ వద్దకు కన్వేయర్ బెల్ట్‌ద్వారా తరలించాలని యోచిస్తున్నారు. -
‘ఉపాధి’ సరే... వేతనమేది?
-ఉపాధి కూలీలకు తప్పని పాట్లు - అందని వేతనాలు - రూ.2.5 కోట్ల బకాయిలు నెల్లూరు(బారకాసు) : జిల్లాలో ఉపాధి హామీ బకాయిలు పేరుకుపోయాయి. కూలీలకు పని కల్పించడమే తమ బాధ్యత అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవని కారణంగా ఉపాధి కూలీలకు చేతినిండా పని దొరికింది. సీజన్ ప్రారంభంలో రోజుకు 25 వేల పనిదినాలు కల్పించగా, క్రమేణా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో సరాసరి రోజుకు 50 వేల నుంచి 60 వేల పనిదినాలు కల్పించారు. అడపాదడపా చినుకులు పడుతుండటంతో పనిదినాలు సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రోజుకు 30 వేల నుంచి 35 వేల పనిదినాలు కల్పిస్తున్నారు. తలనొప్పిగా మారిన స్మార్ట్ కార్డు జిల్లాలో 961 గ్రామాల పరిధిలోని కూలీలకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారానే వేతనాల చెల్లింపులు జరుపుతున్నారు. స్మార్ట్‌కార్డు ఉండి బయోమెట్రిక్ ద్వారానే వేతన చెల్లింపులు చేపడుతున్నారు. జిల్లాలో దాదాపు 23 వేల మందికి పైగా స్మార్ట్‌కార్డులు లేని వారున్నారు. వేతనాల చెల్లింపు స్మార్ట్‌కార్డులు అందక కొంత ఆలస్యమవుతుంటే.. సిబ్బంది కొరతను సాకుగా చూపి మరికొంత జాప్యం చేస్తున్నారు. చెల్లింపులో జాప్యం లేదని అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 20 శాతం మంది కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆయా కూలీలకు స్మార్ట్ కార్డులు లేకపోవడమే. వీటి జారీకి చర్యలు చేపట్టాల్సిన సంబంధిత శాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలానికి సుమారు 300 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో స్మార్ట్ కార్డు అందక ఇబ్బందులు పడుతున్న కూలీలున్నారు. విడుదల కాని బకాయిలు జిల్లాలో నెల రోజుల్లో జరిగిన పనిదినాలకు సంబంధించి సుమారు రూ.2.5 కోట్ల మేర వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సాకుగా చూపి వేతన బకాయిల విడుదలలో తీవ్ర జాప్యమైంది. గత రెండు నెలల్లో రూ.19 కోట్ల విలువైన పనులు జరిగితే, గత నెల నిలిచిన వేతనాలకు సంబంధించి మొత్తం రూ.6.5కోట్లు కాగా, రూ.4 కోట్లు ఇటీవల విడుదలయ్యాయి. మిగి లిన బకాయిలు రూ.2.5 కోట్లు ఇంకా విడుదల కాలేదు. విడుదలైన బకాయిలను ఇప్పటికి 25 వేల మంది కూలీలకు అందచేయగా, 12 వేల మందికి అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మిగతా బకాయిలు కోసం 11 వేల మంది కూలీలు ఎదురు చూస్తున్నారు. -
ఇదే మి సేవ..?
* ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం * వారాలు గడిచినా రాని సర్టిఫికెట్లు * వేలాది సర్టిఫికెట్లు పెండింగ్ * నానా అగచాట్లు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు * సర్వర్లు డౌన్, సాంకేతిక సమస్యలతో సతమతం * రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమూ కారణమే * క్షేత్రస్థాయి తనిఖీకే వారాలు పడుతున్న వైనం * సర్టిఫికెట్ల జారీ వెనుక అవినీతి ఆరోపణలు? సాక్షి ప్రతినిధి, ఖమ్మంజిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌కు డిగ్రీలో చేరేందుకు కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలి. వాటిని కళాశాలలో సమర్పిస్తేనే అడ్మిషన్ దొరుకుతుంది. సర్టిఫికెట్ల కోసం పదిరోజుల క్రితం స్థానిక ‘మీసేవ’ కేంద్రంలో అతను దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతవరకు అతనికి సర్టిఫికెట్ రాలేదు. మీసేవా కేంద్రం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం అని రాసిన ధ్రువీకరణపత్రాలు ఇంకా రాలేదని కొన్ని రోజులు.. సాంకేతిక సమస్యలున్నాయని.. సర్వర్లు డౌన్ అయ్యాయని మరికొన్ని రోజులు..ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్ప అతనికి సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఒక్క సంతోష్‌దే కాదు జిల్లాలోని దాదాపు మెజార్టీ మీసేవ, ఈసేవ కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల నుంచి రైతుల దాకా అందరూ వారాల తరబడి తిరగాల్సి వస్తోంది. చేతులు తడిపితే మాత్రం సర్టిఫికెట్ ఇట్టే జారీ అయిపోతుండటం గమనార్హం. జిల్లాలో మీ సేవ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. సాంకేతిక సమస్యలకు తోడు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. మీసేవ కేంద్రాల చుట్టూ తిరగలేక వారి చెప్పులు అరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి తహశీల్దార్ల వరకు సర్టిఫికెట్ల జారీ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డబ్బు ముట్టిన దాన్ని బట్టి సర్టిఫికెట్ల జారీ అవుతున్నాయని, ఒక్కో సర్టిఫికెట్‌కు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలు వాస్తవానికి ఏపీ ఆన్లైన్, ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో సర్టిఫికెట్ల జారీ రోజురోజుకూ సులభతరం కావాల్సింది పోయి క్లిష్టమతున్నాయి. ముఖ్యంగా సర్వర్ ప్రాబ్లమ్ అటు కేంద్రాల నిర్వాహకులు, ఇటు దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నెట్ క నెక్ట్ కావడం లేదని, సర్వర్లు పనిచేయడం లేదని దరఖాస్తుదారులను నిర్వాహకులు వెనక్కు పంపుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చోట్ల తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు లేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. మరోవైపు దరఖాస్తుపై విచారణ స్థాయిలో కూడా జాప్యం జరుగుతోంది. ఈ విచారణ పేరుతో వీఆర్వోలు వారాల తరబడి జాప్యం చేస్తున్నారు. ఇదేమంటే మాకు ఇదొక్కటే పనికాదు కదా అని బదులిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్టిఫికెట్ల జారీలో అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయం స్థాయిలో మామూళ్లు ఇచ్చిన కేంద్రాల సర్టిఫికెట్లు మాత్రమే క్లియర్ అవుతున్నాయని, పెద్దగా ముడుపులు ఇవ్వని కేంద్రాల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని కూడా కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ మామూళ్లకు మధ్యవర్తులుగా క్షేత్రస్థాయిలో దరఖాస్తులను విచారించే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారని సమాచారం. మరోవైపు సర్టిఫికెట్ల వారీగా కొన్ని చోట్ల వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం రూ.3వేలు, ఆదాయం కోసం రూ.వెయ్యి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి.. భద్రాచలంలో మీసేవా, ఈ సేవా ఆన్లైన్లలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక పదిరోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై మీసేవా నిర్వాహకులను ప్రశ్నిస్తే పదిరోజులుగా ప్రింటింగ్ స్టేషనరీ ప్రభుత్వం నుంచి అందటం లేదని చెపుతున్నారు. భద్రాచలం మీసేవలో తహశీల్దార్ సంతకం అయి కూడా వందల సంఖ్యలో కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు జారీ కావడం లేదు. కూనవరంలో 122, వెంకటాపురంలో 60 వరకు ఇలానే పెండింగ్‌లో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో ఆరు ఈసేవా కేంద్రాలు ఉన్నాయి. జూన్ 29వ తేది నుంచి జూలై 04వ తేదీ వరకు 2000 సర్టిఫికెట్ల( కుల,ఆదాయ, నివాస, ఈబీసీ, ఓబీసీ) కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో 760 ధ్రువీకరణ పత్రాలు తహశీల్దార్ మంజూరు చేయగా, 250 పత్రాలు ఈసేవా నుంచి లబ్ధిదారులకు విడుదల చేశారు. ఇంకా 410 సర్టిఫికెట్లు ఈసేవా నుంచి లబ్ధిదారులకు అందాల్సి ఉంది. నాలుగు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వ ముద్రతో కూడిన పత్రాలు అందుబాటులో లేవు. గార్ల మండలంలో 424 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తహశీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. తహశీల్దార్‌కు రిజిస్టర్ కీ ఇచ్చి రెండేళ్లు అయింది. రిజిస్టర్ కీ కాల పరిమితి ఈనెల 3తో ముగిసింది. తహశీల్దార్ రిజిస్టర్ కీ లేనందున విద్యార్థుల సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఈ, మీసేవా కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నాయి. స్టేషనరీ పేపర్లు సమయానికి రాకపోవడం, సర్వర్లు మొరాయించడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందటం లేదు. ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండా, తల్లంపాడులో 30 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ అని తిప్పుతున్నారు: పొట్టపింజర బాలస్వామి, నేలకొండపల్లి మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో సర్వర్ ప్రాబ్లమ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కేంద్రాలలో పని అయిపోయిందని తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడా అదే పరిస్థితి... రోజుల తరబడి తిప్పుతున్నారు. కాలేజీ, వసతి గృహాలలో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందటం లేదు. -
ఇవేం సేవలు..!
సాక్షి, ముంబై: ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మెట్రో సేవలకు నగరవాసుల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నా అప్పుడప్పుడూ నిరాశ పరుస్తూనే ఉన్నాయి. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గత నెలలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రోరైలు ప్రారంభించిన తరువాత మొదటి ట్రిప్పులోనే సాంకేతిక సమస్య తలెత్తి దాదాపు అర గంటసేపు రైలు ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక స్టేషన్లో సమస్యలు ఎదురుకావడం పరిపాటిగా మారింది. ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడంతో సుమారు 25 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో వారం తరువాత ఓ బోగీ డోర్లు తెర్చుకోకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రో ల్ రూమ్‌కు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో 20 నిమిషాల పాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా బుధవారం మరోల్ స్టేషన్లో రైలు ఆగినా రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. దీంతో అక్కడ దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడ్డారు. అప్పటికే రైలు ముందుకు కదలడంతో తరువాత వచ్చే సాకినాకా స్టేషన్లో దిగిపోయారు. ఇక బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెట్రో రైలు బోగీల్లోకి నీరు వచ్చిచేరింది. ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో లోపలున్న ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. మెట్రోరైలు ప్రారంభించిన తరువాత అతి తక్కువ సమయంలోనే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శని, ఆది వారాల్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో మెట్రోకు భారీ ఆదాయమే వస్తోంది. మొత్తం 16 మెట్రో రైళ్లుండగా ప్రతీరోజూ దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. మూడోవంతు జనానికి సేవలందించే సమయంలోనే ఇన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటే పూర్తిస్థాయిలో జనం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
మళ్లీ సంక్షోభం
- పెరిగిన విద్యుత్ వినియోగం రెండు కేంద్రాల్లో - సాంకేతిక సమస్యలు విచ్చలవిడిగా కోతలు - అయోమయంలో సర్కారు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ప్రాజెక్టులు షాక్ ఇచ్చాయి. రెండు విద్యుత్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య, భానుడి దెబ్బకు పెరిగిన విద్యుత్ వినియోగం వెరసి మళ్లీ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా చాప కింద నీరులా అనధికారిక కోతల వాతను మోగించేపనిలో విద్యుత్ బోర్డు నిమగ్నమైంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్నేళ్లుగా అమల్లో ఉన్న విద్యుత్ కోతలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. కొత్త ప్రాజెక్టుల ద్వారా గత ఏడాది చివర్లో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా మారడంతో కోతల వేళలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం జయలలిత ముందుకు సాగారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆశాజనకంగా మారడం, కూడంకులం అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి మెరుగుపడటం వెరసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా సీఎం కంకణం కట్టుకున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాడకంపై ఉన్న అన్నిరకాల ఆంక్షల్ని ఎత్తివేశారు. నగరాల్లోనే కాదు కుగ్రామాల్లో సైతం నిరంతర విద్యుత్ సరఫరాతో ముందుకు సాగుతున్నారు. తొలి వారం నిరంతర సరఫరా ఆచరణ యోగ్యంగా ఉన్నా క్రమంగా సాంకేతిక సమస్యల్ని ఎత్తిచూపుతూ అప్పుడప్పుడూ సరఫరా నిలుపుదల చేస్తూవచ్చారు. పవర్ షాక్ వేసవి ముగియడంతో విద్యుత్ వాడకం తగ్గుముఖం పడుతుందని, ఉత్పత్తికి తగ్గట్టుగా వినియోగం ఉంటుందన్న ఆశాభావంతో నిరంతర సరఫరా నినాదాన్ని సీఎం జయలలిత తెరపైకి తెచ్చి తప్పులో కాలేశారు. అగ్ని నక్షత్రం ముగిసినా ఎండలు తగ్గడంలేదు. వర్షాలు సంమృద్ధిగా పడాల్సిన పరిస్థితుల్లో భానుడుప్రజల్ని ఇంకా పిప్పి చేస్తున్నాడు. ఈ ప్రభావంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగింది. కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్టయింది. రాష్ట్రంలో ఈ నెల ఆరంభంలో విద్యుత్ వినియోగం రోజుకు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మెగావాట్లకు పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో నిరంతర విద్యుత్ సరఫరాను అమల్లోకి తెచ్చారు. అయితే క్రమంగా భానుడి దెబ్బకు వినియోగం పెరుగుతూ వచ్చింది. గురువారానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 13 వేల ఆరు వందల మెగావాట్లకు చేరింది. వేసవిని తలపించే విధంగా ఎండలు మండుతుండడంతో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. ఈ ప్రభావం విద్యుత్ గండానికి దారి తీసింది. ఉత్తర చెన్నైలోని మూడు యూనిట్ల ద్వారా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూ వచ్చింది. ఇక్కడ అదనంగా ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. ఈ పనుల కారణంగా వారం రోజులుగా ఆ మూడు యూనిట్లలతో తాత్కాళికంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఆ యూనిట్లలో ఉత్పత్తి ప్రక్రియ ఆరంభించే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరువందల మెగావాట్లు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వళ్లూరు సమీపంలో తలా ఐదు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున మూడు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఓ యూనిట్లో బ్రాయిలర్ ట్యూబ్‌లు పేలడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ రెండు కేంద్రాల్లో తలెత్తిన సమస్యలతో 1100 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. అలాగే తూత్తుకుడిలో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి తగ్గుతుండడం, బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక లైన్ల పనులు ముగిసినా, కేంద్రం నుంచి అనుమతి దక్కక పోవడం వెరసి నిరంతర విద్యుత్ సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. కోతల వాత తాత్కాళికంగా తలెత్తిన సమస్యలతో చాప కింద నీరులా కొతల్ని అమలుచేసే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు పడ్డాయి. నిరంతర విద్యుత్‌సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా, ప్రభుత్వానికి మచ్చ రాని రీతిలో గంట, రెండు గంటల వ్యవధిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చొప్పున కొతల్ని విధించే పనిలోపడ్డారు. చెన్నైను మినహాయించి తక్కిన జిల్లాల్లో ఈ కొతల వాత వాయించే పనిలో అధికారులు ఉన్నారు. అప్పుడప్పుడూ పదిహేను, ఇరవై నిమిషాలు కొత విధించడంతో రోజుకు ఎలాగైనా రెండు నుంచి మూడు గంటల వరకు అనధికారిక కోతలు అమల్లోకి రావడం గమనార్హం. పరిశ్రమలకు, వాణిజ్య కేంద్రాలకు అన్ని రకాల ఆంక్షలు ఎత్తి వేయడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎండ దెబ్బతోనే ఈ వినియోగం పెరిగిందని, అదే సమయంలో సాంకేతిక సమస్యలు ఉత్పత్తికి ఆటకంగా మారాయని ఆ అధికారి వివరించారు. వళ్లూరు, ఉత్తర చెన్నైలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు రెండు మూడు రోజుల్లో సరి చేస్తామన్నారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలన్న కాంక్ష ప్రభుత్వానికి ఉన్నా, ఎప్పుడు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తుతుందో, ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతాయో చెప్పలేమంటూ ఆ అధికారి పేర్కొనడం బట్టి చూస్తే నిరంతర విద్యుత్ సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించండి
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కే.రాంగోపాల్ ఆదేశించారు. బుధవారం ఉదయం చిత్తూరులోని మహతి కళాక్షేత్రంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, వారి అనుమానాలను తీర్చు తూ కౌంటింగ్‌ను నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధు లు కేటాయిస్తామని, ఈ-మెయిల్ ఐడీలకు, సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే వారు సంబంధిత ఆర్డీవోల నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్ కాపీ ఉన్న వారు శుక్రవారం ఉదయమే వారికి కేటాయించిన కేంద్రానికి చేరుకోవాలని, గుర్తింపు కార్డులు పొంది సం బంధిత అసెంబ్లీ సెంటర్లకు వెళ్లి విధు లు నిర్వర్తించాలని ఆదేశించారు. సిబ్బం ది త్వరితగతిన కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు చిత్తూరులో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కౌంటింగ్ విధులకు ముందురోజే హాజరయ్యే సిబ్బంది గురువారం రాత్రి ఉండేందుకు టీటీడీ కల్యాణ మండపం, చక్కెర ఫ్యాక్టరీ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా లో ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు వచ్చినందున ముందుగా వాటిని లెక్కించి, అర్ధగంట తర్వాత ఈవీఎంలను తెరవాలని సూచించారు. పార్లమెం ట్‌కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఏజేసీ వెంకట సుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, సంబంధిత నియోజకవర్గాల ఆర్వోలు తది తరులు పాల్గొన్నారు -
అన్నీ కోతలే
ఇక రోజూ కరెంట్ కట్.. చేతులెత్తేసిన మంత్రి డీకే శివకుమార్ వారం క్రితం కోతలు ఉండబోవని స్పష్టీకరణ నేడు సాంకేతిక సమస్యల సాకుతో కోతలు సోమవారం నుంచే అమల్లోకి = రెండు నెలల పాటు ఇంతే సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉన్నందున ఈ వేసవిలో కరెంటు కోతలు ఉండబోవని వారం కిందట సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ చేసిన ప్రకటన ఉత్తుత్తిగా తేలిపోయింది. విద్యుదుత్పాదన తగ్గడంతో పాటు రెండు యూనిట్లలో ఉత్పాదన స్తంభించినందున కోతలు విధించక తప్పడం లేదని సోమవారం ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు కోతలు ఉంటాయని తెలిపారు. సోమవారం నుంచే కోతలుంటాయన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రోజుకు 8,522 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదన్నారు. అయితే రాయచూరు, ఉడిపి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని రెండు యూనిట్లు పని చేయడంలేదన్నారు. చక్కెర తయారీ కర్మాగారాల నుంచి అందాల్సిన 650 మెగావాట్ల విద్యుత్ కొన్ని న్యాయ పరమైన సమస్యల వల్ల అందడం లేదన్నారు. దీని వల్ల రాష్ట్రంలో రోజుకు 7,572 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభిస్తోందన్నారు. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నందు వల్లే బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కోతలు అమలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రెండు నెలల పాటు కోతలు అమలవుతాయన్నారు. కోత వేళలను ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు (ఎస్కాంలు) నిర్ణయిస్తాయన్నారు. గత ప్రభుత్వం 15,944 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, దీనికి అవసరమైన భూమి, నీటితో పాటు పలు రాయితీలు కల్పించిందని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ 4,400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. కొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు పొంది విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాల్లో కొన్నింటిని రద్దు చేశామని, మిగిలిన వాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ లాభాపేక్షతో విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఒక్క ఓటు వేస్తే...మూడు సార్లు ప్రెస్
-
ఒక్కసారి ఓటు వేస్తే మూడు సార్లు వేసినట్లే...
ఒక్కసారి ఈవీఎంలో ఓటు వేస్తే మూడు సార్లు ఓటు వేసినట్లు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. అదే విషయాన్ని పోలింగ్ బూత్ సిబ్బందికి వెల్లడించారు. దాంతో వారు ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల అలా జరిగిందని వారు వెల్లడించారు. దాంతో పోలింగ్ నిలిపివేసి....సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ఈవీఎంలు తక్షణమే ఏర్పాటు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ తాలుకా ఐజ మండలం బూమ్పురంలో బుధవారం చోటు చేసుకుంది. -
ముప్పావుగంట నిలిచిపోయిన మెట్రో
న్యూఢిల్లీ: జహంగీర్‌పురి-హుడా సిటీ సెంటర్ లైన్‌పై ప్రయాణిస్తోన్న ఓ మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలత్తడంతో శుక్రవారం ఉదయం ఎనమిదిన్నర గంటలకు యెల్లో లైన్‌పై మెట్రో సేవ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మెట్రోరైలు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో నిలి చిపోయిన రైలును కేవలం 20 నిమిషాల్లోనే ట్రాక్‌పై నుంచి తొలగించారు. అయినప్పటికీ ఒక రైలులో తలెత్తిన సమస్య మొత్తం యెల్లో లైన్‌పై ప్రభావం చూపింది. రద్దీ సమయంలో సమస్య తలెత్తడంతో ఈ మార్గంలోని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు బారులు తీరారు. ఉదయం తొమ్మిది గంటలకు రద్దీ వేళలో మెట్రో రైలు సేవ నిలిచిపోవడంతో గుర్గావ్లో ఆఫీసులకు, ఇతర పనులపై బయలు దేరినవారు అసహనానికి గురయ్యారు. సమస్యను గుర్తించిన వెంట నే 15-20 నిమిషాలలో మెట్రో రైలును ట్రాక్‌పై నుంచి తొలగించినట్లు మెట్రో అధికారులు తెలి పారు. సమస్యను పరిష్కరించేంతవరకు యెల్లోలైన్పై ఉన్న మెట్రో రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ఆదేశించడంతో ఉదయం రద్దీ వేళల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో న్యూఢిల్లీ స్టేషన్‌తోపాటు రాజీవ్ చౌక్, చావ్డీ బజార్, చాందినీ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ తదితర స్టేషన్లలో కూడా ప్రయాణికులు బారులు తీరారు. ఈ సమస్య ప్రభావం ప్రధాన ఇంటర్చేంజ్ స్టేషన్ అయిన రాజీవ్ చౌక్‌పై కూడా కనిపించింది. రాజీవ్ గేట్ స్టేషన్ ప్రవేశద్వారం వరకు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సమస్యను అరగంటలోనే పరి ష్కరించినప్పటికీ పలు స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడిచాయి. నగరంలోని మెట్రో నెట్ వర్క్‌లో బ్లూలైన్, యెల్లోలైన్లలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుంది. -
కోత..వాత..
= రాజధాని బెంగళూరులో గంటపాటు విద్యుత్ కోత = గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటలు = రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్యలు = నిలిచిపోయిన విద్యుదుత్పాదన = రాబోయే వేసవిని తలుచుకుని బెంబేలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వేసవికి చాలా నెలలున్నప్పటికీ రాష్ర్టంలో అప్పుడే అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడినందున సెప్టెంబరు అంతానికే ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. కనుక వచ్చే మే వ రకు విద్యుత్ కొరత ఉండబోదని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు నగరంలో గంట, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల మేరకు కోత విధిస్తున్నారు. రాయచూరు థర్మల్ విద్యుత్కేంద్రంలో రెండు యూనిట్లలో సాంకేతిక సమస్యలు, నిర్వహణ లోపం వల్ల విద్యుదుత్పాదన నిలిచిపోయింది. రబీ సీజన్లో విద్యుత్ డిమాండ్ పెరగడం, సాంకేతిక సమస్యల వల్ల ఉత్పాదన తగ్గిపోవడంతో రాష్ట్రం ఇప్పటికే 22 శాతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే, వేసవిని తలచుకుని విద్యుత్ శాఖ అధికారులు హైరానా పడిపోతున్నారు. విద్యుదుత్పాదనపై శ్రద్ధ ఏదీ? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాత్కాలిక పరిష్కారాలపై శ్రద్ధ చూపడమే తప్ప శాశ్వత నివారణా చర్యలు చేపట్టడం లేదు. బీజేపీ తన హయాంలో విద్యుత్ రంగానికి రూ.14,751 కోట్ల ఖర్చు చేసినా, కొత్తగా ఒక యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్‌ఘడ్‌లో విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసినా, తదుపరి ఆ దిశగా అడుగు పడలేదు. రాష్ట్రంలో వివిధ వనరుల ద్వారా విద్యుదుత్పాదనకు అవకాశాలున్నా ప్రభుత్వం ఛత్తీస్ఘడ్పై దృష్టి సారించడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని 34 జలాశయాలు కర్ణాటక విద్యుత్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయి. వాటిల్లో 24 జలాశయాల్లో ఆరు వేల మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. ప్రభుత్వం కొంత శ్రద్ధ చూపితే మరో పది జలాశయాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సగటున 9 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆరు శాతాన్ని విద్యుత్ కొనుగోలు ద్వారా సరఫరా చేయగా, మిగిలిన మూడు శాతం కొరతగానే మిగిలిపోతోంది. ఎనిమిదేళ్లలో 20 శాతం డిమాండ్ పెరగగా, అందుకు అనుగుణంగా ఉత్పాదన జరగడం లేదు. -
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలోపం
చెన్నై నుంచి బుధవారం ఉదయం న్యూఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని విమాన పైలెట్లు చెన్నై ఎయర్‌పోర్ట్ అధికారులకు వివరించారు. దాంతో వారు హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించారు. చెన్నై- న్యూఢిల్లీ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దించేందుకు అధికారులు అంగీకరించారు. దాంతో ఆ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దింపేశారు. విమానంలో 80 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. వారిని మరో విమానంలో న్యూఢిల్లీ పంపేందుకు విమానాశ్రయ అధికారులు చర్యలు చేపట్టారు. -
‘ఆధార్’ నమోదు చేస్తున్నా మొబైల్స్‌కు రాని పాస్వర్డ్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కష్టాలు తప్పడం లేదు. ఓవైపు ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలు, మరోవైపు సాంకేతిక కారణాలు కలగలిసి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ‘ఆధార్’కు సంబంధించిన విశిష్ట గుర్తింపు సంఖ్యను నమోదు చేస్తేనే ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తామని ఉన్నతాధికారులు విధించిన నిబంధన కారణంగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోగా, ఇప్పుడు ఆ సంఖ్య ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈపాస్ వెబ్సైట్లో ఆధార్‌తో పాటు విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నంబర్‌ను నమోదు చేస్తే, ఆ మొబైల్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను కూడా నమోదు చేసిన తర్వాతే దరఖాస్తు ఓపెన్ అయ్యేలా ఉన్నతాధికారులు సాంకేతిక ఏర్పాట్లు చేశారు. కానీ గత వారం రోజులుగా తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విద్యార్థుల మొబైల్స్‌కు పాస్వర్డ్ రావడం లేదు. దీంతో వేలాదిమంది విద్యార్థులు దిక్కుతోచనిస్థితిలో పడిపోతున్నారు. సాంకేతికలోపాన్ని సవరించడంలో సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ ఉన్నతాధికారులను సంప్రదించగా, పాస్వర్డ్ సమస్య ఉన్నమాట వాస్తవమేనని, తాము ఎప్పటికప్పుడు సీడాక్ అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. విద్యార్థులు పాస్వర్డ్ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని మీసేవ, ఈసేవా, ఏపీ ఆన్లైన్ కేంద్రాలకు వెళితే పాస్వర్డ్ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అయితే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు చాలా సమయం పడుతోందని విద్యార్థులంటున్నారు. ఒక్కోసారి వరసగా మూడురోజులు వెళ్లి మీసేవ కేంద్రంలో కూర్చున్నా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండడం లేదని, కొన్నిచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.70 వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పాస్వర్డ్ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘తేడా’ ఫీజు తక్షణం విడుదల చేయండి గత ఏడాది సవరించిన ఫీజుల ప్రకారం రూ.35 వేల కన్నా ఎక్కువ ఫీజు నిర్ధారించిన కళాశాలల్లో చేరిన కొందరు విద్యార్థులకు మొత్తం ఫీజు కడతామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ తేడా ఫీజు మొత్తంలో రూపాయి కూడా చెల్లించలేదు. ఏ కళాశాలలో ఫీజు ఎంత ఉన్నా ఎస్సీ, ఎస్టీలకు, ప్రభుత్వ కళాశాలల్లో చదివి 10 వేలలోపు ర్యాంకు తెచ్చుకున్న వారికి మొత్తం ఫీజు కడతామని గత ఏడాది ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రకారం పై అర్హతలున్న వ్యక్తి సీబీఐటీ కళాశాలలో చేరితే ఫీజు మొత్తంగా నిర్ధారించిన రూ.1.13 లక్షల ఫీజును ప్రభుత్వం చెల్లించాలి. అలాగే మిగిలిన కళాశాలల్లో కూడా ఆయా కళాశాలల నిర్ధారిత ఫీజును చెల్లించాలి. కానీ ప్రభుత్వం గతంలో మాదిరిగానే కేవలం రూ.35 వేలను మాత్రమే చెల్లించింది. దీంతో సంబంధిత విద్యార్థుల ఫీజుపై యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇంకొన్ని రోజులు మాత్రమే వేచిచూస్తామని, అప్పటికీ ప్రభుత్వం ఫీజు మొత్తం కట్టకపోతే విద్యార్థుల నుంచి వసూలు చేస్తామని ఓ కళాశాల పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.