= రాజధాని బెంగళూరులో గంటపాటు విద్యుత్ కోత
= గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటలు
= రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్యలు
= నిలిచిపోయిన విద్యుదుత్పాదన
= రాబోయే వేసవిని తలుచుకుని బెంబేలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వేసవికి చాలా నెలలున్నప్పటికీ రాష్ర్టంలో అప్పుడే అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడినందున సెప్టెంబరు అంతానికే ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. కనుక వచ్చే మే వ రకు విద్యుత్ కొరత ఉండబోదని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు నగరంలో గంట, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల మేరకు కోత విధిస్తున్నారు. రాయచూరు థర్మల్ విద్యుత్కేంద్రంలో రెండు యూనిట్లలో సాంకేతిక సమస్యలు, నిర్వహణ లోపం వల్ల విద్యుదుత్పాదన నిలిచిపోయింది. రబీ సీజన్‌లో విద్యుత్ డిమాండ్ పెరగడం, సాంకేతిక సమస్యల వల్ల ఉత్పాదన తగ్గిపోవడంతో రాష్ట్రం ఇప్పటికే 22 శాతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే, వేసవిని తలచుకుని విద్యుత్ శాఖ అధికారులు హైరానా పడిపోతున్నారు.
విద్యుదుత్పాదనపై శ్రద్ధ ఏదీ?
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాత్కాలిక పరిష్కారాలపై శ్రద్ధ చూపడమే తప్ప శాశ్వత నివారణా చర్యలు చేపట్టడం లేదు. బీజేపీ తన హయాంలో విద్యుత్ రంగానికి రూ.14,751 కోట్ల ఖర్చు చేసినా, కొత్తగా ఒక యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్‌ఘడ్‌లో విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసినా, తదుపరి ఆ దిశగా అడుగు పడలేదు.
రాష్ట్రంలో వివిధ వనరుల ద్వారా విద్యుదుత్పాదనకు అవకాశాలున్నా ప్రభుత్వం ఛత్తీస్‌ఘడ్‌పై దృష్టి సారించడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని 34 జలాశయాలు కర్ణాటక విద్యుత్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయి. వాటిల్లో 24 జలాశయాల్లో ఆరు వేల మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. ప్రభుత్వం కొంత శ్రద్ధ చూపితే మరో పది జలాశయాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సగటున 9 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఇందులో ఆరు శాతాన్ని విద్యుత్ కొనుగోలు ద్వారా సరఫరా చేయగా, మిగిలిన మూడు శాతం కొరతగానే మిగిలిపోతోంది. ఎనిమిదేళ్లలో 20 శాతం డిమాండ్ పెరగగా, అందుకు అనుగుణంగా ఉత్పాదన జరగడం లేదు.
కోత..వాత..
Published Wed, Dec 25 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement