- ఇక రోజూ కరెంట్ కట్..
- చేతులెత్తేసిన మంత్రి డీకే శివకుమార్
- వారం క్రితం కోతలు ఉండబోవని స్పష్టీకరణ
- నేడు సాంకేతిక సమస్యల సాకుతో కోతలు
- సోమవారం నుంచే అమల్లోకి = రెండు నెలల పాటు ఇంతే
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉన్నందున ఈ వేసవిలో కరెంటు కోతలు ఉండబోవని వారం కిందట సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ చేసిన ప్రకటన ఉత్తుత్తిగా తేలిపోయింది. విద్యుదుత్పాదన తగ్గడంతో పాటు రెండు యూనిట్లలో ఉత్పాదన స్తంభించినందున కోతలు విధించక తప్పడం లేదని సోమవారం ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు కోతలు ఉంటాయని తెలిపారు.
సోమవారం నుంచే కోతలుంటాయన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రోజుకు 8,522 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదన్నారు. అయితే రాయచూరు, ఉడిపి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని రెండు యూనిట్లు పని చేయడంలేదన్నారు. చక్కెర తయారీ కర్మాగారాల నుంచి అందాల్సిన 650 మెగావాట్ల విద్యుత్ కొన్ని న్యాయ పరమైన సమస్యల వల్ల అందడం లేదన్నారు. దీని వల్ల రాష్ట్రంలో రోజుకు 7,572 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభిస్తోందన్నారు.
రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నందు వల్లే బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కోతలు అమలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రెండు నెలల పాటు కోతలు అమలవుతాయన్నారు. కోత వేళలను ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు (ఎస్కాంలు) నిర్ణయిస్తాయన్నారు. గత ప్రభుత్వం 15,944 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, దీనికి అవసరమైన భూమి, నీటితో పాటు పలు రాయితీలు కల్పించిందని వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకూ 4,400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. కొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు పొంది విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాల్లో కొన్నింటిని రద్దు చేశామని, మిగిలిన వాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ లాభాపేక్షతో విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.