‘సర్వే’ సమస్యల మయం
‘సర్వే’ సమస్యల మయం
Published Mon, Jul 25 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
నత్తనడకన సాగుతున్న సమాచార సేకరణ
సాంకేతిక సమస్యలతో సతమతమం
ప్రజలనుంచి సహకారం అంతంతమాత్రం
ఏం చెప్తే ఏం సమస్య వస్తుందోనన్న భయం
ఇబ్బంది పడుతున్న అధికారులు, ఎన్యూమరేటర్లు
విజయనగరం గంటస్ఠంభం : ప్రజాసాధికార సర్వే ముందుకు సాగడంలేదు. సాంకేతిక సమస్యలు వీడటం లేదు. ఒకవైపు సర్వర్ డౌన్‌కావడం... మరోవైపు సిగ్నల్ అందకపోవడంతో అడుగు ముందుకు పడటంలేదు. దీనికి తోడు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రకరకాల కారణాలతో వివిధ పథకాలకు దూరమైన తామంతా మళ్లీ ఈ సర్వేపేరుతో ఇంకేం నష్టపోతామోనన్న ఆందోళన నెలకొంటోంది. ఒక్కో ఇంటివద్దా సమాచారం సేకరించేందుకు గంటలతరబడి సమయం వథా అవుతుండటంతో రోజుకు నాలుగైదుకు మించి నమోదు చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు సిబ్బంది పల్లెల్లో తిరుగుతుండటంతో కార్యాలయాల్లో పని పేరుకుపోతోంది.
ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది
ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వేవల్ల ప్రయోజనం లేకపోగా ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందిగా తయారైంది. సర్వేపై జనం అడుగడుగునా అసంతప్తి వ్యక్తం చేస్తుండటం... మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రజలు నుంచి కుటుంబ వివరాలతోపాటు పూర్తి సమాచారం సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇంటిఫోటోతోపాటు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఫొటో, వారి స్థిర, చరాస్తులు, విద్య, సంక్షేమ పథకాల వర్తింపు తదితర అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి 80పాయింట్లతో కూడిన సమాచారాన్ని ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. వివరాల సేకరణకు ఎన్యూమరేటర్లు, పర్యవేక్షణకు సూపరువైజర్లను ప్రభుత్వం నియమించింది.
మందకొడిగా సమాచార సేకరణ
జిల్లాలో 5,87,49 కుటుంబాల వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు 2215మంది ఎన్యూమరేటర్లను నియమించారు. సర్వే మొత్తం ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉండగా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న 1781 కస్టర్లులో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. మిగతా ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉండగా ఇంకా ఆపక్రియ ప్రారంభం కాలేదు. సర్వే జరుగుతున్న క్లస్టర్లలో వివరాల సేకరణ సరిగ్గా జరగడం లేదు. ఇందుకు జనాలు సహకరించడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం పొలాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరి ఉభాలతోపాటు ఇతర పంటలకు సంబంధించి రైతులు, కూలీలు పొలాల్లో గడపాల్సి వస్తోంది. సర్వేకోసం ఇళ్లలోనే ఉండాలని అధికారులు ముందస్తుగానే చెబుతుండతంతో పనులు మానుకుని వారంతా ఏ క్షణాన అధికారులు వస్తారోనని ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. పనులు కోల్పోతున్నవారంతా ఎన్యూమరేటర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు పురపాలకసంఘాలు, 34మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సమాచారం అంతా సేకరించినా వాటిని నమోదు చేయడానికి సర్వర్లు సహకరించకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదు.
గడువు పొడిగించినా...
తొలివిడత సర్వే జూలై ఎనిమిదినుంచి 15వరకూ జరగాల్సి ఉంది. అయితే అనుకోని అవాంతరాలతో ముందుకు సాగకపోవడంతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 40వేల కుటుంబాల సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. ఒకటోతేదీనుంచి ఐదో తేదీవరకూ పెన్షన్ల పంపిణీ ఉన్నందున ఆ రోజుల్లో సర్వేకు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆరోతేదీనుంచి నిరంతరాయంగా కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జనాల్లో గుబులు
సర్వేపై జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు స్థిర, చరాస్తులు వివరాలు అడుతున్నారు. ఈ కారణంగా ఏం చెబితే ఏమవుతుందోనన్న ఆందోళన ఉంది. ముఖ్యంగా పింఛనర్లు, రేషన్‌కార్డుదారులు, గహాల కోసం దరఖాస్తు చేసుకునే వారు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూసే వారు సరైన వివరాలు వెల్లడించడం లేదు. రేషన్‌కార్డు, గ్యాస్‌బుక్ వంటివి చూపిస్తున్నా... స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు మాత్రం చూపడం లేదు. లబ్ధిదారుల్లో ఈ గందరగోళానికి ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడమే కారణం. ఇక సర్వే చేపడుతున్నవారి సమస్యలు మరోలా ఉంటున్నాయి. రెండు మూడు ఇళ్లకే ట్యాప్ చార్జింగ్ పూర్తయిపోతుండటంతో సర్వే ముందుకెళ్లడంలేదు. నెట్ బిల్లులు కూడా వేగంగా అయిపోతుండడం, అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా చేయకపోవడం వల్ల ఎన్యూమరేటర్లు చేతి చమురు వదిలించుకుంటున్నారు.
Advertisement
Advertisement