- యాప్రాన్‌పై ఐదు గంటల పాటు నిలిచిన వైనం
- సాయంత్రం 4కు హైదరాబాద్‌కు పయనం
స్పైస్‌జెట్ కు సాంకేతిక సమస్య
Published Sat, Aug 27 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
మధురపూడి :
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి శనివారం ఉదయం 11 గంటలకు చేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఈ సర్వీసు యాప్రాన్‌పై ఐదు గంటల పాటు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో విమానం నిలిచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. సాంకేతిక సమస్యను చక్కదిద్దాక సాయంత్రం 4 గంటలకు ఈ సర్వీసు హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. యాప్రాన్‌పై విమానం ఎక్కువ సేపు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. సంస్థ ఉద్యోగులు ఈ సమాచారాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రయాణికులు సంస్థ ఉద్యోగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులకు, సంస్థ ఉద్యోగుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ఎట్టకేలకు విమానం సిద్ధం కావడంతో ప్రయాణికులు శాంతించారు.
ఉరుకులు.. పరుగులు
విమానం ఐదు గంటల సేపు నిలిచిపోవడంతో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఉదయం 11 గంటలకు చేరిన సర్వీసు, తిరిగి 11.30కు బయలుదేరుతుందనుకున్న సమయంలో మొరాయించింది. ఈ క్రమంలో సమాచారం ఇచ్చే వారు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు.
Advertisement
Advertisement