విషం కక్కొద్దు!
► ఆసుపత్రి వ్యర్థాలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కన్నెర్ర
► జీవరాశులకు ముప్పు ఉందని..
► నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు ఉత్తర్వులు
► సాంకేతిక సమస్యలు ఉన్నాయంటున్న వైద్యాధికారులు
► నాలుగు నెలల గడువుపై పెదవి విరుపు
నరసరావుపేట టౌన్ : నీరు జీవకోటికి ప్రాణాధారం.. అలాంటి నీటిలో రసాయనాలు, వ్యర్థ పదార్థాలు కలిస్తే మాత్రం గరళం.. మరి ఆ విషాన్నే జీవరాశులు తాగితే సంభవించేది అనర్థమే.. ముఖ్యంగా వైద్యశాలల్లో ఇటువంటి వ్యర్థనీరు ఎక్కువగా విడుదలవుతుంది. అది కాలువలు, డ్రైనేజీ ద్వారా ఒక చోట మడుగులా ఏర్పడుతుంది.. లేదా ఖాళీగా ఉన్న పంట పొలాల్లోకి ప్రవిహ స్తుంది. దీని ద్వారా మూగజీవులు తీవ్ర అనారోగ్యం పాలవడమే గాక పంట పొలాలు సారం కోల్పోతాయని ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తన పరిశోధనలో వెల్లడించింది. అంతేకాదు.. నాలుగు నెలల్లోపు వంద పడకల ఆసుపత్రుల్లో నీటిని శుభ్రపరిచే ప్లాంటులు ఏర్పాటు చేయాలని ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు హానికరమైనవని కన్నెర్ర చేసింది. సకాలంలో పని పూర్తి చేయకపోతే వైద్యశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వబోమని హెచ్చరించటంతో వైద్యశాల వర్గాల్లో కలవరం మొదలైంది.
ప్రణాళిక స్పష్టంగా లేదనే వాదనలు..
రాష్ట్రంలో వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులు 31 ఉండగా వీటిలో జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి, బాపట్లలో ఉన్నాయి. ఆయా వైద్యశాలలకు ఈ నెల 5ననీటి శుద్ధి ప్లాంట నిర్మాణంపై ఉత్తర్వులు అందాయి. ఒకవేళ ప్లాంటు నిర్మాణంలో జాప్యం తలెత్తితే వైద్యశాల నిర్వహణను నిలిపివేసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. ఆదేశాలందినప్పటి నుంచి 15 రోజుల వ్యవధిలో రూ.50 వేల బ్యాంక్ గ్యారెంటీతో పనులు ప్రారంభించాలని సూచించింది. అయితే.. ఉత్వర్వుల్లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో ఆయా వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. ప్లాంట్ నిర్మాణావసర నిధులు, స్థల పరిశీలన తదితర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనీ, ఇవన్నీ పూర్తి కావాలంటే ఇచ్చిన గడువు సరిపోదని ైవె ద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు గడువు పెంచాలని కోరుతున్నారు.
జలం.. వ్యర్థం.. విషం
వైద్యశాలలో శస్త్ర చికిత్సలతో పాటు ఇతర అవసరాలకు వైద్య సిబ్బంది అనేక పరికరాలు వినియోగిస్తారు. వాటిని శుభ్రం చేసేందుకు రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. అలా శుభ్రం చేసిన నీరు మురుగు కాలువలోకి వెళ్లి మురుగు నీటితో కలిసి విషపూరితంగా మారుతోంది. డ్రైనేజీ ద్వారా ఊరి బయట కాలువల్లో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమవడమే కాక, జీవరాశులు చనిపోతున్నట్లు కాలుష్యనియంత్రణ బోర్డు తేల్చి నాలుగు నెలల్లో వ్యర్థ నీటిని శుభ్రపరిచే ప్లాంటులు ఏర్పాటు చేయాలనిఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు మాత్రం వైద్యాధికారులు మరింత గడువు కావాలని కోరు తున్నారు.
ప్లాంట్ నిర్మాణానికి చర్యలు..
ఏరియా వైద్యశాలలో వ్యర్థ నీటిని శుభ్రం చేసే ప్లాంటును నాలుగు నెలల్లో నిర్మించాలని ఆదేశాలు అందాయి. నిర్మాణానికి సాంకేతిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తాం. త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ఇప్పటికే వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్తదృష్టికి తీసుకువెళ్లాం. - డాక్టర్ టి.ఎం.ఎస్.ప్రసాద్, ఏరియా వైద్యశాలసూపరింటెండెంట్