సాక్షి, హైదరాబాద్: పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ, దానికి తోడు సాంకేతిక సమస్యలు విద్యాశాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బదిలీ కేటాయింపుల్లో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బదిలీ అయిన టీచర్ల జాబితా ఖరారు కావడం లేదు. గత మూడు రోజులుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీ పోస్టింగులపై కసరత్తు జరుగుతున్నప్పటికీ కొలిక్కిరావడం కష్టంగా మారింది. వాస్తవానికి శుక్రవారంనాడే స్కూల్ అసిస్టెంట్ల బదిలీల జాబితా వెలువడాల్సి ఉంది. కానీ పలు జిల్లాల్లో కేటాయింపుల్లో తప్పులు దొర్లాయి.
ఒకే చోట ఇద్దరేసి టీచర్లకు కేటాయించడం, మున్సిపాలిటీ మొత్తాన్ని ఒకే గ్రామంగా పరిగణించడం లాంటి కారణాలతో జాబితా తలకిందులైంది. స్పౌజ్ జియోట్యాగింగ్‌లోనూ గందరగోళం నెలకొనడంతో వాటిని సరిదిద్దేందుకు విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జాబితా విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మొత్తానికి ఆదివారం రాత్రి పొద్దుపోయాక స్కూల్ అసిస్టెంట్ల బదిలీ జాబితాను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ వాటిని జిల్లా విద్యాశాఖ అధికారులకు అందించింది. వీటిని జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని తెలిపింది. దీంతో వాటిని ఆయా జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పెట్టేందుకు డీఈవోలు చర్యలు చేపట్టారు.
ఎస్జీటీల జాబితా రేపే
సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలపై ఉత్కంఠ వీడలేదు. స్కూల్ అసిస్టెంట్ల తుది జాబితా తర్వాతే వాటిని విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎస్జీటీల బదిలీల జాబితాను సోమవారం కల్లా తేల్చేసి రాత్రిలోగా జాబితా ఖరారు చేయాలని నిర్ణయించారు. బదిలీల ప్రక్రియలో జాప్యంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకత, సమయపాలన అని పేర్కొని మాన్యువల్ పద్ధతిలోనే బదిలీలు చేస్తున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, నర్సింహారెడ్డి మండిపడ్డారు. ఎస్జీటీల తుది జాబితాను తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్ డిమాండ్ చేశారు.
టీచర్ల బదిలీలపై ఉత్కంఠ!
Published Mon, Jul 9 2018 1:03 AM | Last Updated on Mon, Jul 9 2018 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment