నిత్యం 2వేల మెగావాట్ల విద్యుత్ కొరత
వర్షాభావం వల్ల జలాశయాల్లో ఉత్పత్తి కాని విద్యుత్
వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు
చాపకింద నీరులా లోడ్‌షెడ్డింగ్
వ్యవసాయానికి ఇకపై నాలుగు గంటల విద్యుత్
బెంగళూరు : కర్ణాటకను కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో లేక పోవడంతో రాష్ట్ర ఇంధనశాఖ లోడ్‌షెడ్డింగ్‌కు తెరతీసింది. దీంతో వ్యవసాయంతోపాటు గ్రామీణ, పట్టణ గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ సరఫరాలో కోత ఏర్పడింది. ఈ విషయంలో రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డి.కె.శివకుమార్ మూడు రోజుల ముందు ‘లోడ్‌షెడ్డింగ్’ ఉండబోదంటూ చేసిన వ్యాఖ్యలు నీటి మూటలుగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంధనశాఖ గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో ప్రతి నిత్యం తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. కాగా, 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఉడిపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీసీఎల్)లో గత నెల రోజులుగా తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ఇందులోని రెండు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.
దీంతో పూర్తి సామర్థ్యంతో పోలిస్తే 60 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలైన లింగనమక్కి, మాణి, సూప జలాశయాల్లో గత ఏడాది ఈ సమయానికి 6,656 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి పరిమాణం ఉండగా, ప్రస్తుతం ఈ మూడు జలాశయాల్లో కలిపి 4,044 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు కేంద్రం నుంచి అందాల్సిన మొత్తం విద్యుత్ పరిమాణంలో దాదాపు 500 మెగావాట్ల తక్కువగా సరఫరా అవుతోంది. ఇలా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ధర్మల్, జల, సోలార్ తదితర విద్యుత్‌తో పాటు రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న విద్యుత్ ఏడువేల మెగావాట్లను మించడం లేదని ఇంధనశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
లోడ్‌షెడ్డింగ్‌కు ఆదేశాలు...
ఇలా అటు సాంకేతిక ఇబ్బందులు, కేంద్రం నుంచి అందే విద్యుత్‌లోనూ కోతతోపాటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లోడ్‌షెడ్డింగ్‌కు వెళ్లాలని ఇంధనశాఖ నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని బెస్కాంతోసహా మిగిలిన అన్ని విద్యుత్‌సరఫరా సంస్థలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో పట్టణప్రాంతంలో అధికారికంగా 4 గంటలు, గ్రామీణ ప్రాంతంలో 6 గంటల విద్యుత్ కోతను విధిస్తున్నారు. ఇక వ్యవసాయానికి త్రీఫేజ్‌లో ప్రస్తుతం ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుండగా లోడ్‌షెడ్డింగ్ వల్ల ఇక పై నాలుగు గంటలే విద్యుత్ సరఫరా ఉంటుంది. ఇదిలా ఉండగా అధికారిక లోడ్‌షెడ్డింగ్‌తో పోలిస్తే అదనంగా ప్రతి క్యాటగిరిలో రెండు నుంచి మూడు గంటలు ఎక్కువ విద్యుత్ కోత ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులే పేర్కొంటున్నారు.
ముసురుకుంటున్న చీకట్లు
Published Thu, Aug 20 2015 1:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement