economy slowdown
-
ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు. -
ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం
బెంగళూరు: తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా బెంగళూరు నగరం ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. ‘నగర ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గి, చిన్న, మధ్య తరహా సంస్థల రవాణా అవసరాలు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు కాలుష్య సమస్య కూడా తోడవుతోంది’అని ఆ అధ్యయనం తెలిపింది.చాలా ఏళ్లుగా బెంగళూరు నగరం తీవ్ర ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతోంది. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు సరిగ్గానే ఉన్నప్పటికీ నష్టాలను చవిచూస్తోందని ట్రాఫిక్ నిపుణుడొకరు చేపట్టిన ఈ అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ జామ్ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఐటీ రంగమేనని తేల్చింది. ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్ సమస్యలతోనే గడుపుతున్నారని కూడా వివరించింది. ట్రాఫిక్ సంబంధ కారణంగా ఒక్క ఐటీ రంగమే సుమారు రూ.7 వేల కోట్ల మేర ఏటా నష్టపోతోందని తెలిపింది. పౌరులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపా యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ చార్జీలు వసూలు చేయడం(కంజెషన్ ప్రైసింగ్), కార్‌పూలింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమెరాలు, సెన్సార్ వ్యవస్థలను నెలకొల్పి, ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించి నిబంధనలను అమలు చేయడం, మెట్రోలు, ప్రభుత్వ బస్సు సర్వీసులు నడిపేందుకు భూగర్భమార్గాల ఏర్పాటు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం, పౌర సంస్థలు, పౌరులు కలిసి కట్టుగా పనిచేసి రహదారులపై భారం తగ్గించొచ్చని తెలిపింది. -
ఐటీ ఉద్యోగులకు చేదువార్త: వేరియబుల్ పే కట్స్, హైరింగ్‌పై నిపుణుల వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్మెంట్ సెషన్లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్‌లో అంత యాక్టివ్‌గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్‌బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్‌కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్‌కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్కైట్స్ (APAC) హెచ్ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్‌లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. -
ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!
బీజింగ్: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా తర్వాత ప్రపంచ రెండవ అతిపెద్ద ఎకానమీ 2022లో కేవలం 3 శాతం పురోగతి సాధించింది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, వార్షిక జీడీపీ విలువ 121.02 ట్రిలియన్ యువాన్ (17.94 ట్రిలియన్ డాలర్లు). 2021 విలువతో (114.37 ట్రిలియన్ యువాన్లు) పోల్చితే ఈ గణాంకాలు కేవలం 3 శాతం అధికం. కనీసం 5.5 శాతం వృద్ధి నమోదవుతుందన్న అంచనాలకన్నా... గణాంకాలు తగ్గినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 1974లో చైనా జీడీపీ వృద్ధి రేటు 2.3 శాతం. అటు తర్వాత ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అమెరికా డాలర్లతో పోల్చితే జీడీపీ విలువ 2021లో 18 ట్రిలియన్ డాలర్లుకాగా, తాజాగా 17.94 ట్రిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. డాలర్లో చైనా కరెన్సీ ఆర్ఎంబీ బలహీనపడ్డమే దీనికి కారణం. ఎన్బీఎస్ డేటా ప్రకారం, చైనా జాబ్ మార్కెట్ 2022లో స్థిరంగా ఉంది. పట్టణ వార్షిక ఉపాధి కల్పనా లక్ష్యం 11 మిలియన్లుకాగా, 12.06 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2021లో చైనా ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతం. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
కొడిగడుతున్న డాలర్ దీపం
ఈ రోజున అమెరికా ప్రపంచంలోనే అత్యంత పెద్ద రుణగ్రస్త దేశం. ఆ దేశం మొత్తం అప్పు 31.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది ఆ దేశపు జీడీపీలో 126 శాతం. అమెరికా రుణభారంలో అతిపెద్ద వాటా జపాన్‌ది. తర్వాతి స్థానాలలో చైనా, బ్రిటన్ ఉన్నాయి. 1980 ముందు నుంచీ అమెరికా రుణభారం ప్రతి 8 సంవత్సరాలకు రెట్టింపు అవుతూ వస్తోంది. అమెరికా ఆర్థిక బలహీనతకు మరో ప్రధాన కారణం, విప రీతంగా డాలర్లను ముద్రిస్తూ ఉండటం. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2010 నాటికంటే 60 శాతం ఎదిగింది. కానీ ఫెడరల్ రిజర్వ్ ఇదే కాలంలో ముద్రించిన కరెన్సీలో 300 శాతం పెరుగుదల ఉంది. అంటే ఆర్థిక కార్యకలాపాల ద్వారా జరిగిన వృద్ధికంటే, కాగితం కరెన్సీ పెరుగుదల వల్ల వచ్చిన ‘వాపు’ ఎక్కువ! 2000 సంవత్సరం నాటికి ప్రపంచ ఎగుమతులలో అమెరికా వాటా 12.1 శాతం. నాడు చైనాకి సంబంధించి ఇది 3.9 శాతం. 2020 నాటికి పరిస్థితి తల్లకిందులైపోయింది. అంతర్జాతీయ ఎగుమతులలో చైనా వాటా 14.7 శాతంగానూ, అమెరికా వాటా 8.1 శాతంగానూ ఉంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్నమాట! 1980ల నుంచే మొదలైన అమెరికా ఆర్థికవ్యవస్థ పతనం నేడు పరాకాష్టకు చేరింది. ఇటువంటి బలహీనమైన దేశీయ ఆర్థిక పునాదులపై నిలబడే అమెరికా నేటి వరకూ అగ్రరాజ్యంగా చలామణి అయ్యింది. దీనం తటికీ కారణం ఆ దేశ కరెన్సీ అయిన డాలర్. 1944లో అంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న దశలోనే ప్రపంచదేశాలు తమ మధ్య లావాదేవీలకుగానూ రిజర్వ్ కరెన్సీ లేదా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ను ఆమోదించాయి. ఆ విధంగా బ్రిటన్ తాలూకు అగ్రదేశ స్థానాన్ని అమెరికా ఆక్రమించుకుంది. మూడు దశాబ్దాలకు పైబడి అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదిగా ఉండడం వలన కూడా డాలర్‌కు ఆ ప్రాభవం దక్కింది. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌కు పునాదిగా బంగారాన్ని పొదివిన 1944 లోని బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం నుంచి వైదొలిగాడు. అయితే, చమురు ఉత్పత్తి దేశాలతో ఉన్న సాన్నిహిత్యంతో డాలర్ కరెన్సీకే చమురు అమ్ముతామని ఆ దేశాలతో అంగీకరింపజేయడం ద్వారా ప్రపంచ దేశాలకు డాలర్ అవసరాన్ని అట్టిపెట్టగలిగాడు. 1980ల అనంతరం అమెరికా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర బలహీన తలు ప్రవేశించాయి. వీటిలో ప్రధానమైనది ఆ దేశంలోని పరిశ్రమలు ఔట్సోర్సింగ్ రూపంలో విదేశాలకు తరలివెళ్ళిపోవటం. ఈ క్రమం లోనే ప్రపంచదేశాల పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన చైనా ప్రపంచా నికి సరుకు ఉత్పత్తి ఫ్యాక్టరీగా రూపొందింది. మెక్సికో, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి అనేక చౌకశ్రమశక్తి ఉన్న దేశాలకు కూడా అమెరికా ఫ్యాక్టరీలు తరలిపోయాయి. ఫలితంగా ఆ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. సేవారంగం కూడా ఇంటర్నెట్ టెక్నాలజీ రంగ ప్రవేశం అనంతరం... ఔట్సోర్సింగ్ ప్రాజెక్టుల రూపంలో భారత్ వంటి ఆంగ్లం మాట్లాడగల నిపుణులు ఉన్న దేశాలకు తరలింది. మూలిగే నక్కపై తాటికాయలా సాంకేతిక ఎదుగుదల క్రమంలో మరమనుషుల రంగ ప్రవేశం వంటివి జరిగాయి. 1980ల నాటికే నాటి ముతకరకం రోబోటు ముగ్గురు కార్మికుల ఉపాధిని కొల్ల గొట్టేస్థాయిలో ఉంది. నేడు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎదుగుదల స్థాయిని చెప్పనవసరం లేదు. స్థూలంగా, ఉత్పత్తిరంగాలపై ఆధార పడి జీవించే అవకాశం ఇటు కార్మికులకూ, అటు ఉద్యోగులకూ కూడా లేకుండాపోయింది. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థికవ్యవస్థ కేవలం తన కాగితం కరెన్సీ అయిన డాలర్‌పై లేదా స్పెక్యులేటివ్ రంగాలైన షేర్మార్కెట్లు, రియల్ ఎస్టేట్‌పై ఆధారపడటం పెరిగింది. దాంతోనే ముందుగా చెప్పినట్లు డాలర్ల ముద్రణ అపరిమితంగా పెరిగింది. ఈ పరిస్థితి రాత్రికిరాత్రే అమెరికాను అగ్రరాజ్యం పాత్ర నుంచి పడ దోసేయలేకపోయింది. దీనికి కారణం అమెరికా ప్రజానీకం విని మయం అత్యధికస్థాయిలో ఉండటమే. మరోరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అనేకానేక దేశాలు అమెరికాకు సరుకులూ, సేవలను ఎగుమతి చేయడం ద్వారా తమ దేశాలలో ఉపాధి కల్పనను, ఆర్థిక ఎదుగుదలను పొందాయి. దీని వలన అటు ప్రధాన దిగుమతి దారుగా ఉన్న అమెరికాకు ఎగుమతులు చేసి మనుగడ సాగించే చట్రంలో ఇతర దేశాలు సుదీర్ఘకాలం ఉండిపోయాయి. కాగా, వాస్తవ ఉత్పత్తి లేని, డాలర్ల ముద్రణ మీద ఆధారపడిన అమెరికా ఆర్థికం ఇక ఎంతమాత్రమూ యధాతథంగా కొనసాగలేని పరిస్థితులు పుంజుకున్నాయి. మాయల ఫకీరు ప్రాణం చెట్టుతొర్రలో ఉన్నట్లుగా అమెరికా బలం దాని డాలర్లో ఉంది. దశాబ్దాలపాటు, తన డాలర్‌ను సవాల్ చేసిన దేశాలనూ, నేతలనూ అమెరికా నయానో భయానో కట్టడి చేసింది. ఈ క్రమంలోనివే... ఇరాక్‌పై యుద్ధం, లిబియాలో గడాఫీని తిరుగుబాటుతో అంతమొందించడం, ఇరాన్‌తో ఘర్షణ పడుతుండటం! రానురానూ అప్పులు పెరిగిపోతుండటం, యుద్ధాల కోసం మరింతగా ఖర్చుపెట్టలేని స్థితి ఏర్పడటం, అఫ్గాని స్తాన్, ఇరాక్లలో సైనిక పరాభవం వంటివన్నీ అమెరికా బలహీన తలను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టాయి. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాలు హడావిడిగా వైదొలిగిన తీరు, దాని మిత్ర దేశాలకు ఇక అమెరికా అండపై ఎంతమాత్రమూ ఆధారపడలేమనే పాఠాన్ని నేర్పాయి. ఇది ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో మరింతగా బోధపడింది. ఈ యుద్ధ క్రమంలో రష్యాను అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు అవసరమైన సమాచార వ్యవస్థ అయిన ‘స్విఫ్ట్’ నుంచి బహిష్కరించటం ద్వారా ప్రపంచ దేశాలకు అమెరికా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. కానీ అమెరికా డాలర్‌పై ఆధారపడితే ఏదో ఒక రోజు ఇటువంటి ఆర్థిక దిగ్బంధనమే మనకూ జరగొచ్చన్న పాఠాన్ని ప్రపంచదేశాలు నేర్చాయి. గత కొన్ని మాసాలుగా అమెరికా ఫెడరల్ బ్యాంకు తన వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా డాలర్ కరెన్సీలో మదుపులు చేయడం, అంతర్జాతీయ మదుపుదారులకు లాభసాటిగా మార సాగింది. దాంతో వారు వివిధ దేశాల షేర్మార్కెట్లలో పెట్టిన పెట్టు బడులను ఉపసంహరించుకొని అమెరికా మార్కెట్లకు తరలిపోతు న్నారు. ఫలితంగా ఆయా దేశాల కరెన్సీల విలువలు పడిపోవటం, షేర్‌మార్కెట్ సూచీలు దిగజారిపోవడం జరుగుతోంది. అంటే అమె రికా డాలర్ చేతిలో తమ జుట్టును పెడితే అది తమకు ప్రమాదకర మని అన్ని దేశాలు నిర్ధారణకు వస్తున్నాయి. ఫలితంగానే గతంలో అమెరికాకు భారీ ఎత్తున అప్పులు ఇచ్చిన దేశాలన్నీ నేడు ఆ డాలర్ అప్పులను వదిలించుకుంటున్నాయి. అమెరికాకు అతిపెద్ద రుణదాత (ఇది అమెరికాకు ఎగుమతులను చేయడంతో పేరుకుపోయిన మొత్తం) అయిన జపాన్ ఇప్పటికే తన ఈ రుణంలోని 12 శాతాన్ని అమ్మేసుకుంది. ఇదే బాటలో నిన్నటి అనుంగు మిత్రదేశాలు సౌదీ అరేబియా 35 శాతం, ఇజ్రాయెల్ 20 శాతం అప్పులను అమ్మేసు కున్నాయి. సుమారు 71 దేశాలు డాలర్ కరెన్సీని, దాని రూపంలో అమెరికా చేసిన అప్పును వదిలించేసుకుంటున్నాయి. గతితర్కం (చలన సూత్రాలు) తాలూకు సూత్రీకరణ ప్రకారం ‘ఒక పరిణామం లేదా వస్తువు దాని ఆరంభ స్థానం నుంచి ముందుకు వెళ్తున్నకొద్దీ దాని తాలూకు వేగం పెరుగుతుంది’. ఇది అన్ని విష యాల్లోనూ జరిగేదే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధినే చూస్తే– గత వంద సంవత్సరాల ప్రగతి కంటే తర్వాతి 20, 30 సంవత్సరాలలో జరిగిన పురోగమనం ఎక్కువ. తరువాతి ఐదు సంవత్సరాలలో మరింత వేగంగా ఈ పురోగతి జరిగింది. ఇదే సూత్రం సామాజిక, ఆర్థిక విషయాలకు కూడా వర్తించే వాస్తవం. కాబట్టి డాలర్ దిగ జారుడు వేగం మరింతగా పెరగటం ఖాయం. ఆర్థికపరంగా ఇదివరకే డొల్ల అయిన అమెరికా... డాలర్ ముద్రణపై కూడా ఆధారపడలేక కుదేలైపోగలదు. ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా స్థానం ముగిసి పోగలదు! డి.పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 -
ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం ముప్పు..మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు భారీ షాక్!
ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు అంతర్జాతీయ టెక్ సంస్థలకు భారీ షాకిచ్చాయి. ప్రపంచం మాంద్యంలోకి జారుతున్న వేళ..వడ్డీ రేట్ల పెంపుతో అదుపు చేసేందుకు అమెరికా చేసిన ప్రయత్నాల కారణంగా ఆ రెండు సంస్థల పనితీరు మందగించింది. దీంతో రానున్న రోజుల్లో టెక్ దిగ్గజాలు ఉద్యోగుల నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవల విడుదల చేసిన కూ3 ఫలితాల్లో గూగుల్, యూట్యూబ్ సేల్స్ మూడు నెలల కాలానికి సెప్టెంబర్ వరకు 6శాతం మాత్రమే పెరిగాయి. సంస్థలు అడ్వటైజింగ్ మీద చేసే 69 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించాయని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ తెలిపారు. వెరసి గూగుల్ దశాబ్ద కాలంలో కోవిడ్ ప్రారంభం నుంచి ఈ ఏడాది క్యూ3 (జులై, ఆగస్ట్, సెప్టెంబర్ )లో నిరాశజనకమైన ఫలితాల్ని సాధించింది. తమ సంస్థకు చెందిన కంప్యూటర్లు, ఇతర టెక్నాలజీ ప్రొడక్ట్‌లకు డిమాండ్ తగ్గిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీంతో సంస్థ అమ్మకాలు 50 బిలియన్ డాలర్లను నమోదు చేయగా..ఈ ఐదేళ్లలో సంస్థ వృద్ధిరేటు భారీగా పడిపోయింది. నియామకాల్ని తగ్గిస్తాం వార్షిక ఫలితాల విడుదల అనంతరం గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే క్యూ4 లో ఉద్యోగుల నియామకాలు సగానికి కంటే తక్కువగా ఉంటాయని తెలిపారు. -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ రాజీనామా
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్ 43 రోజుల క్రితమే యూకే హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. యూకే ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బ్రవెర్మన్ బుధవారం ఉదయం లిజ్ ట్రస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ట్రస్ విధానాలతో బ్రవెర్మన్ విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామా పరిణామంతో ట్రస్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. -
బ్రిటన్ ఆర్థికమంత్రి క్వాసిపై వేటు
లండన్ : బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ప్రధానికి క్వాసీ సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్ మినీ బడ్జెట్‌ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్ ట్రస్ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. -
Nobel Prize- 2022: ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: తీవ్ర ఆర్థికమాంద్యంలో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీని ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. ఆయనతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసిన మరో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్లకు సోమవారం ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ‘బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూసుకోవడం మనకు ఏ విధంగా అత్యంత ముఖ్యమైన అంశం’ అనే దానిపై ఈ ముగ్గురి శోధన కొనసాగిందని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థికవ్యవస్థలను సంస్కరించాలనే పునాదులను ఈ ముగ్గురు 1980 దశకంలోనే వేశారని ఆర్థిక శాస్త్రాల నోబెల్ కమిటీ అధినేత జాన్ హస్లర్ చెప్పారు. ‘ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేసేవి ముఖ్యంగా రెండే. అవి ఆర్థిక సంక్షోభం, ఆర్థికమాంద్యం. వీటి నివారణ, సమర్థవంతంగా ఎదుర్కోవడం అనే వాటిలో వీరి పరిశోధనలు ఎంతగానో సాయపడనున్నాయి’ అని హస్లర్ అన్నారు. 68 ఏళ్ల బెర్నాంకీ ప్రస్తుతం ఒక బ్రోకింగ్ ఇన్స్టిట్యూట్ కోసం పనిచేస్తున్నారు. ఈయన 1930లో అమెరికా చవిచూసిన మహామాంద్యం మూలాలపై పరిశోధన చేశారు. ఆనాడు ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా బ్యాంక్‌ల నుంచి మొత్తం నగదును ఉపసంహరించుకుంటుంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలడం, తదనంతరం ఊహించనిస్థాయికి ఆర్థికవ్యవస్థ కుప్పకూలడం లాంటి వాటిపైనా బెర్నాంకీ పరిశోధన చేశారు. అంతకుముందు షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 68 ఏళ్ల డగ్లస్ డైమండ్, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 67 ఏళ్ల ఫిలిప్ డైబ్విగ్లు బ్యాంక్ డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటే సంక్షుభిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఎలా నిలబడగలదో అనే అంశాలపై పరిశోధన కొనసాగించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సాయపడేలా 1983లోనే డైమండ్, ఫిలిప్ సంయుక్తంగా ‘ బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్, లిక్విడిటీ’ రచన చేశారు. బెర్నాంకీ 2007–08 కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోపెట్టేందుకు స్వల్పకాలిక వడ్డీరేట్లను సున్నాకు తెచ్చారు. ఈయన నేతృత్వంలో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికమాంద్యం నుంచి త్వరగా గట్టెక్కింది. 2020 తొలినాళ్లలో కోవిడ్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2020నాటి ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ఇవే నిర్ణయాలను అమలుచేసి వ్యవస్థను మళ్లీ దారిలోపెట్టడం గమనార్హం. 1930నాటి మహామాంద్యం చాలా సంవత్సరాలు తీవ్రస్థాయిలో కొనసాగడానికి గల కారణాలను 1983నాటి పరిశోధనా పత్రంలో బెర్నాంకీ విశదీకరించారు. డిపాజిటర్లు డబ్బంతా బ్యాంక్‌ల నుంచి ఉపసంహరించుకోవడంతో ఆర్థికవ్యవస్థకు కీలకమైన కొత్త రుణాలను మంజూరుచేయలేక బ్యాంక్‌లు కుప్పకూలాయని బెర్నాంకీ కనుగొన్నారు. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా అర్థంచేసుకునేందుకు సాయపడుతున్నాయని నోబెల్ కమిటీ అధినేత హస్లర్ అభిప్రాయపడ్డారు. -
భారత్ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్ అంచనా తగ్గింపు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ అంచనావేసింది. ఈ మేరకు జూన్‌లో వేసిన తొలి 7.8 శాతం వృద్ధి అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు లేదా 0.80 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోతపెట్టింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు తమ తాజా అంచనాలకు కారణంగా చూపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి అంచనా 7.4 శాతాన్ని తాజాగా 6.7 శాతానికి కుదిస్తున్నట్లు కూడా ఫిచ్ తాజా గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ పేర్కొంది. కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 2.4 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ పేర్కొంది. తొలి అంచనాలకన్నా ఇది అరశాతం (0.5 శాతం) తక్కువ. -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం
న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్ ధన్ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్ తరహాలో వ్యాక్సినేషన్ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్ జార్’ను (లేదా మంత్రి) నియమించాలని సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ► భారత్ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది. ► ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి. ► వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపులు డిమా ండ్ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి. ► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి. ► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్ వ్యాక్సినేషన్ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ► కోవిడ్–19 మూడవ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి. ► బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. -
మార్కెట్‌కు ‘ఆర్బీఐ’ ఉత్సాహం
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్ మార్కెట్‌ను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లో మూడురోజుల వరుస అమ్మకాలకు బుధవారం బ్రేక్ పడింది. ఒక్క రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 424 పాయింట్లు పెరిగి 48,678 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 14,618 వద్ద నిలిచింది. కరోనా వ్యాప్తి వేళ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా వైద్య రంగ బలోపేతానికి రూ.50 వేల కోట్ల ఫండ్‌ను ప్రకటించారు. భారీ ఎత్తున నిధుల కేటాయింపు ప్రకటనతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 489 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ., చిత్రంగా విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలు జరిపారు. ఎఫ్ఐఐలు రూ.1,111 కోట్ల కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.241 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత ఏర్పడకుండా మే 20 నుంచి రూ.35వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు ప్రక్రియను చేపడతామని ఆర్బీఐ ప్రకటన ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ఇచ్చింది. దేశీయ ఇండెక్స్‌కు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్సీఐ) రీ–బ్యాలెన్సింగ్(సవరణ)తో కొన్ని ఎంపిక చేసుకున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఏప్రిల్ సేవల రంగ గణాంకాలు నెల ప్రాతిపదికన నిరుత్సాహపరిచినప్పటికీ.., క్వార్టర్ టు క్వార్టర్ ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది.’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ షేర్లకు ఆర్బీఐ బూస్టింగ్... కరోనా రెండో దశను సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు బ్యాంకింగ్ రంగానికి అవసరమైన తోడ్పాటును అందిస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభపడ్డాయి. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మొండిబకాయిల అంశంలో వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకులకు అనుమతులిస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు. ఆర్థికపరమైన ఈ విధాన చర్యలతో బ్యాంకింగ్ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగానికి చెందిన కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండున్నర శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు 2–1% ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ, ప్రైవేట్ రంగ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. -
కరోనా సెకండ్ వేవ్ : బ్యాంకులకు చిక్కులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు రెండో విడత భారీగా పెరిగిపోతుండడం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రభావం చూపిస్తుందని.. బ్యాంకులకు సమస్యలు తెచ్చి పెడుతుందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2021లో భారత బ్యాంకింగ్ రంగానికి మోస్తరు ప్రతికూల వాతావరణం ఉంటుందని పేర్కొంది. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతూ పోతే.. నియంత్రణ కోసం చేపట్టే మరిన్ని చర్యలు వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై మరింత ప్రభావం పడేలా దారితీస్తుందని.. అప్పుడు సమస్యలు తీవ్రమవుతాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న మరింత సర్దుబాటు ద్రవ్య విధానం స్వల్ప కాలంలో వృద్ధిపై ఒత్తిళ్లను అధిగమించేలా చేయవచ్చు. అయితే, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండడం అన్నది టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం, సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటుంది’’అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. 2021-22 సంవత్సరంలో భారత జీడీపీ 12.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఫిచ్ లోగడ అంచనా వేసిన విషయం గమనార్హం. అయితే పెరుగుతున్న కరోనా కేసులతో ఈ అంచనాలకు రిస్క్ ఉందని సంస్థ పేర్కొంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి మందగించొచ్చని పేర్కొంది. బ్యాంకుల వ్యాపారంపై ప్రభావం.. ‘‘80 శాతం నూతన ఇన్ఫెక్షన్ కేసులు ఆరు ప్రముఖ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. బ్యాంకుల రుణాల్లో ఈ రాష్ట్రాల ఉమ్మడి వాటా 45 శాతం. ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలపై ఇంకా ప్రభావం పడితే ఇప్పటికే బలహీనంగా ఉన్న వ్యాపార వాతావరణాన్ని ఇంకా దెబ్బతీస్తుంది’’అని ఫిచ్ తెలిపింది. రెండో విడత కరోనా కేసుల ఉధృతి వినియోగదారుల, కార్పొరేట్ల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దీంతో బ్యాంకుల నూతన వ్యాపారాన్ని నెమ్మదించేలా చేయవచ్చని పేర్కొంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) వ్యాపార రుణాలు, రిటైల్ రుణాలకు ఎక్కువ రిస్క్ ఉంటుందని అంచనా వేసింది. రిటైల్ రుణాలు తమ అంచనాల కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ పెరుగుతున్న కేసుల ప్రభావం వీటిపై పడొచ్చని పేర్కొంది. (గేమింగ్‌కు మహిళల ఫ్యాషన్ హంగులు) -
2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి: కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల 2030 నాటికి అదనంగా మరో 20.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి పడిపోతారని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో మహిళల సంఖ్య 10.2 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోతుందని ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) నివేదికలో తెలిపింది. కోవిడ్ వివిధ దేశాలపై చూపిస్తున్న ప్రభావం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దెబ్బ తీస్తున్న విధానం వంటివి వచ్చే దశాబ్ద కాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆ అ«ధ్యయనం అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో 4.4 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు వెళతారని గతంలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజాగా యూఎన్డీపీ అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషణ చేసి అదనంగా 20.7 కోట్ల మంది పేదరికంలోకి వెళతారని, కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మరో పదేళ్లు ఉంటుందని యూఎన్డీపీ అధ్యయనం అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత రంగాల్లో పెట్టుబడుల్ని పెంచితే 14.6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురావచ్చునని తెలిపింది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాగుంది..
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ తగ్గించింది. 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని తన తాజా నివేదికలో సంస్థ అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ రేటు మైనస్ 14.8 శాతం. కఠిన లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక రికవరీ అనుకున్నదానికన్నా బాగుందని అమెరికా కేంద్రం పనిచేస్తున్న ఈ సంస్థ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, పరిస్థితులు మరింత ఆశాజనకంగా మారతాయని అభిప్రాయపడింది. కాగా 2021–22లో భారత్ భారీగా 13 శాతం వృద్ధి సాధిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. చదవండి: షాపింగ్ బటన్ జోడించిన వాట్సాప్ 2020–21లో అతి తక్కువ బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా వివరించింది. అయితే ఆర్థిక వ్యవస్థలో ఇంకా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక పేర్కొంది. కోవిడ్–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికాన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ ఇప్పటికే అంచనావేసింది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఇయర్లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కూడా ఇటీవలే తన నివేదికలో పేర్కొంది. 2020లో క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6% అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ రెపో... 0.35 శాతం తగ్గే అవకాశం కాగా 2021 నాటికి వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య స్థిరీకరణ పొందే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేయడం గమనార్హం. సరఫరాల సమస్యలు తగ్గడం, తగిన వర్షపాతం, బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం ఇందుకు కారణాలని తెలిపింది. డాలర్ మారకంలో రూపాయి బలపడ్డం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి ఒక కారణంగా ఉంటుందని పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) వచ్చే ఏడాది 0.35 శాతం తగ్గించే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. కాగా, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కరోనా వ్యాక్సిన్ వంటి అంశాల ప్రాతిపదికన అవసరమైతే భవిష్యత్‌తో భారత్ ఈక్విటీలను వోవర్వెయిల్ కేటగిరీలోకి మార్చుతామని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. -
మాంద్యంలో దేశ జీడీపీ: ఆర్బీఐ
న్యూఢిల్లీ: సాంకేతికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా పేర్కొంది. నౌక్యాస్ట్ పేరుతో ఆర్బీఐ తొలిసారి విడుదల చేసిన నివేదిక.. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై- సెప్టెంబర్)లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథం పట్టడంతో మాంద్యంలోకి జారినట్లేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర అధ్యక్షతన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. తొలి త్రైమాసికం(ఏప్రిల్- జూన్)లోనూ జీడీపీ మరింత అధికంగా 24 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. వరుసగా రెండు త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ క్షీణతను నమోదు చేస్తే.. సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ జీడీపీ రెసిషన్‌లోకి ప్రవేశించిందని నౌక్యాస్ట్ తెలియజేసింది. దేశ చరిత్రలో జీడీజీ మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారికావడం గమనార్హం! 27న గణాంకాలు ఈ నెల 27న ప్రభుత్వం అధికారిక గణాంకాలు ప్రకటించనుంది. కాగా.. అమ్మకాలు తగ్గినప్పటికీ కంపెనీలు వ్యయాలలో కోత విధించడం, తద్వారా నిర్వహణ లాభాలను పెంచుకోవడం వంటి అంశాలను ఆర్బీఐ ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. వాహన అమ్మకాలు, బ్యాంకింగ్ లిక్విడిటీ తదితరాలను సైతం మదింపు చేశారు. అక్టోబర్‌లో ఆర్థిక రివకరీని ఇవి సంకేతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే.. మూడో త్రైమాసికం(అక్టోబర్- డిసెంబర్)లో ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధికి దన్నుగా సరళ పరపతి విధానాలను కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత నెలలో పేర్కొన్నారు. అయితే ధరల ఒత్తిడి, ద్రవ్యోల్బణ అంచనాలు వంటివి పాలసీ నిర్ణయాలకు ఆటంకాలను సృష్టిస్తున్నట్లు ఆర్బీఐ ఆర్థికవేత్తలు తెలియజేశారు. సెకండ్ వేవ్‌లో భాగంగా ఇటీవల పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగించే అవకాశమున్నట్లు వివరించారు. అటు కార్పొరేషన్లు, ఇటు కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఇది ఫైనాన్షియల్ రిస్కులను పెంచే వీలున్నదని తెలియజేశారు. ఫలితంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు వివరించారు. -
భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులను భారీగా ప్రోత్సహిస్తోంది. దీంతో గత ఐదేళ్లలో ఈ డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని ఆర్బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2015 – 2020 మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు 55.1 శాతం చక్రీయ వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. 2016 మార్చి నాటికి 593.61 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు సంఖ్య మార్చి 2020 చివరి నాటికి 3,434.56 కోట్లకు చేరినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. విలువ పరంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు 15.2 శాతం వృద్ధిని సాధించి రూ.920.38 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 కోట్లకు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికగా పరిశీలిస్తే... డిజిటల్ చెల్లింపుల సంఖ్య 2015–16లో 593.61 కోట్లుగా ఉంది. 2016–17 నాటికి 969.12 కోట్లకు చేరింది. చెల్లింపుల విలువ రూ.1,120.99 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2017–18లో డిజిటల్ చెల్లింపుల వ్యాల్యూమ్ వృద్ధి 1,459.01 కోట్లుగా ఉండగా, విలువ రూ.1,369.86 లక్షల కోట్లుగా నమోదైంది. 2018 –19లో చెల్లింపుల సంఖ్య 2,343.40 కోట్లుగా నమోదైంది. చెల్లింపు విలువ రూ.1,638.52 లక్షల కోట్లుగా ఉంది. 2019–20లో లావాదేవీలు పెరిగాయ్... విలువ తగ్గింది ... ఇక 2019–20లో డిజిటల్ చెల్లింపులు వాల్యూమ్స్ 3,434.56 కోట్లుగా నమోదయ్యాయి. అయితే చెల్లింపు విలువ మాత్రం రూ.1,623.05 లక్షల కోట్ల కు పరిమితమైంది. ఆర్థిక వ్యవస్థ క్షీణత, భారీగా ఉద్యోగాలను కోల్పోవడం తదితర అంశాలు ప్రజల వినియోగ సామర్థ్యాన్ని తగ్గించా యి. ఈ ఏడాదిలో ప్రజలు సొమ్ము భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అనుకున్న స్థాయిలో చెల్లింపుల విలువ నమోదుకాలేదని విశ్లేషకులంటున్నారు. విలువ కొంత తగ్గొచ్చు కరోనా అంటువ్యాధి, లాక్డౌన్ పరిమితులు డిజిటల్ చెల్లింపులు అనేక రెట్లు పెరిగాయి. అయితే కోవిడ్–19 అంటువ్యాధితో ప్రతి ఒక్కరూ అర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో చెల్లింపుల విలువ మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దశాబ్దం నుంచి క్రమంగా పెరుగుతూ... పదేళ్ల క్రితం నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈసీఎస్ పేమెంట్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ తర్వాత కేంద్రం నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులకు మరింత ప్రాధాన్యత పెరిగింది. యూపీఐ ఆధారిత, యాప్ ఆధారిత చెల్లింపులు.... డిజిటల్ చెల్లింపుల సరిహద్దులను చెరివేశాయి. వీటికి తోడు అనేక సంస్థలు.., బ్యాంకింగ్యేతర కంపెనీలు డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రవేశించడంతో కస్టమర్లు కూడా నగదు చెల్లింపుల నుంచి డిజిటల్ చెల్లింపులకు మారడం జరిగింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి చెల్లింపు వ్యవస్థలలో పదేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆవిష్కరణలు ఇప్పటికీ సురక్షితంగా పనిచేస్తున్నాయి. ఆర్బీఐ కృషి అమోఘం డిజిటల్ చెల్లింపుల పరిమాణం, విలువ పెరిగేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. ఈ చెల్లింపుల వ్యవస్థకు పర్యవేక్షక పాత్ర పోషిస్తూ, నియంత్రణాధికారి బాధ్యత వహిస్తూ డిజిటల్ చెల్లింపుల వృద్ధికి కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ‘‘సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి, ప్రోత్సాహం’’ అనే తన విధాన లక్ష్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తోంది. కస్టమర్ల భద్రతే లక్ష్యం.. కస్టమర్ల భద్రత, సౌలభ్యత లక్ష్యంగా డిజిటల్ చెల్లింపుల బాటలో ఆర్బీఐ పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. డిజిటల్ పేమెంట్ల పట్ల విశ్వాసం పెంచేందుకు అనేక చర్యలను తీసుకుంది. అందులో భాగంగా గతేడాది(2019) జనవరి నుంచి ఈవీఎం చిప్, పిన్ ఆధారిత క్రెడిట్/డెబిట్ కార్డులను మాత్రమే చెల్లింపులకు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. టోకనైజేషన్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం దేశం దాటి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంది. -
కోవిడ్-19 షాక్ నుంచి ఇప్పట్లో కోలుకోలేం!
ముంబై : కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రాలు కఠిన లాక్డౌన్లను తిరిగి విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు మరింత సమయం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసింది. కోవిడ్-19కు మెరుగైన చికిత్స అందుబాటులోకి రాగానే ఉద్దీపన చర్యలను ఉపసంహరించడం కీలకమని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులతో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు జులై, ఆగస్ట్‌లో తిరిగి కఠిన లాక్డౌన్లు అమలు చేయడంతో నెమ్మదించాయని పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో త్రైమాసికంలోనూ కొనసాగనుందని తెలిపింది. వినిమయ రంగానికి తీవ్ర విఘాతం నెలకొందని, కరోనా మహమ్మారికి ముందున్న స్ధాయికి చేరేందుకు కొంత సమయం పడుతుందని ఆర్బీఐ నివేదిక వ్యాఖ్యానించింది. మహమ్మారితో పోరాడేందుకు ప్రభుత్వ వ్యయం వెచ్చిస్తున్నారని, డిమాండ్ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర పుంజుకోలేదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధన వ్యయం వెచ్చించే పరిస్థితి లేదని తెలిపింది. పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది. చదవండి : ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం! -
క్యూ2లో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ క్షీణత
వాషింగ్టన్: కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా మైనస్ 32.9 శాతం క్షీణించింది. 1947 తర్వాత అగ్రరాజ్య స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. 1958లో 10 శాతం క్షీణత నమోదయ్యింది. జనవరి–మార్చి మధ్య కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ మైనస్ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణత నమోదయినందున దీనిని అధికారికంగా మాంద్యంగానే పరిగణించాల్సి ఉంటుంది. 11 సంవత్సరాల వృద్ధి తర్వాత అమెరికా ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేదు. వ్యాపారాలు దెబ్బతినడం, ఉపాధి కోల్పోవడం వంటి సవాళ్లు దేశంలో కొనసాగుతున్నాయి. జీడీపీ భారీ పతనం, అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికల వాయిదా సంకేతాల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ భారీ నష్టాల్లోకి జారిపోయింది. -
అమ్మకాల షాక్- మార్కెట్ల పతనం
కోవిడ్-19 దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం క్షీణతను చవిచూడే వీలున్నట్లు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాకిచ్చాయి. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు సమయం గడిచేకొద్దీ అమ్మకాలకు ఎగబడ్డారు. వెరసి సెన్సెక్స్ 709 పాయింట్లు పతనమై 33,538 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 214 పాయింట్లు కోల్పోయి 9,902 వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ 34,000 పాయింట్లు, ఇటు నిఫ్టీ 10,000 పాయింట్ల మైలురాళ్ల దిగువన స్థిరపడ్డాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరవచ్చని ఫెడ్ అంచనా వేసింది. అయితే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే వడ్డీ రేట్లను నామమాత్ర(0-0.25 శాతం) స్థాయికి తగ్గించడంతో యథాతథ రేట్లను అమలు చేసేందుకు నిర్ణయించింది. కాగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,219- 33,480 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ 10,112- 9,885 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 2 శాతం స్థాయిలో ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ సుమారు 3-1.5 శాతం మధ్య క్షీణించాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు తెలియజేశారు. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్, జీ, ఎస్బీఐ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, మారుతీ, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, వేదాంతా 9-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఇండస్ఇండ్ 4.4 శాతం జంప్‌చేయగా.. హీరోమోటో, నెస్లే, పవర్‌గ్రిడ్ 0.7 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్‌లో ఐడియా 13 శాతం కుప్పకూలగా.. సెంచురీ టెక్స్, ఉజ్జీవన్, ఐబీ హౌసింగ్, కంకార్ 6.5-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా..పీవీఆర్, ఎంజీఎల్, ఎల్ఐసీ హౌసింగ్, ఐజీఎల్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్, మైండ్‌ట్రీ, ఆర్ఈసీ 5-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1529 నష్టపోగా.. 1023 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 919 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 501 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 733 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
భారత ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళన
వాషింగ్టన్ : భారత ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్దిని నమోదు చేస్తుందని ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వృద్ధి రేటు మైనస్ 3.2 శాతానికి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం (నిన్న) నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ కట్టడికి వివిధ దశల్లో విధించిన లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం కోలుకోలేని దెబ్బతీసిందని పేర్కొంది. అయితే 2021లో వృద్ధిరేటు తిరిగి పుంజుకుంటుదని పేర్కొంది. ఆర్థికవ్యవస్థపై వాస్తవ ప్రభావం 9 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసింది. మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యల మూలంగా వినియోగం భారీగా క్షీణించిందనీ, సేవల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. అలాగే ఈ అనిశ్చితి ప్రైవేట్ పెట్టుబడులను అడ్డుకుంటుందని వ్యాఖ్యానించింది. భారత వృద్ధిరేటు ప్రభావం ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు కొంత వరకు ఊరట నిస్తాయని, ద్రవ్య విధానాల కొనసాగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. మూడీస్, ఫిచ్, ఎస్ అండ్ పీ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ 4 నుంచి 5 శాతం ప్రతికూల వృద్ధి అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. చదవండి : పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ -
ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక సూచన చేశారు. ఆర్బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన తమ కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. తమ డ్యూటీ చేసుకోమని మొహమాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని కోరాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు చిదంబరం శనివారం సూచించారు. డిమాండ్ పడిపోతోందనీ, 2020-21లో వృద్ధి ప్రతికూలతవైపు మళ్లుతోందని చెబుతున్న శక్తికాంత దాస్ ఎక్కువ ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. (పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం) మరోవైపు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై కేంద్రంపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మండిపడ్డారు. జీడీపీ క్షీణిస్తోందని స్వయంగా ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నా, జీడీపీలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వం ప్రగల్భాలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్ఎస్ఎస్ సిగ్గుడాలని వ్యాఖ్యానించారు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతుందని ప్రభుత్వం ప్రతినిధి, లేదా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన కీలక వ్యక్తులు ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా కరోనా వైరస్, లాక్డౌన్ ఆందోళనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది నెగిటివ్ జోన్లోకి జారిపోతోంది. దీంతో శుక్రవారం నాటి పాలసీ రివ్యూలో రెపో రేటును 4.0 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. Governor @DasShaktikanta says demand has collapsed, growth in 2020-21 headed toward negative territory. Why is he then infusing more liquidity? He should bluntly tell the government ‘Do your duty, take fiscal measures’. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2020 -
8.8లక్షల కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల దాకా ప్రతికూల ప్రభావం పడనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో వెలువరించిన అంచనాలకు కొనసాగింపుగా ఏడీబీ తాజా నివేదికను రూపొందించింది. ఏప్రిల్ 3న నాటి ఆసియా అభివృద్ధి అంచనాల (ఏడీవో) నివేదికలో ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌పరమైన నష్టాలు సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని పేర్కొంది. తాజాగా.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఎకానమీ సుమారు 5.8 – 8.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నష్టపోనుంది. ఇది గ్లోబల్ జీడీపీలో 6.4–9.7 శాతానికి సమానం. అటు దక్షిణాసియా జీడీపీ కూడా 3.9–6.0 శాతం మేర క్షీణించవచ్చు. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం ఇందుకు కారణం‘ అని వివరించింది. ఈ అధ్యయనంలో విధానపరమైన చర్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీబీ తెలిపింది. గ్లోబల్ జీడీపీ 2–4 శాతం తగ్గొచ్చంటూ ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాల కన్నా ఏడీబీ అంచనాలు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్షీణత 6.3 శాతం స్థాయిలో ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. చైనాకు 1.6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు .. ఆంక్షలను స్వల్పకాలికంగా మూడు నెలల పాటు కొనసాగించిన పక్షంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ నష్టాలు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేర, ఆరు నెలల పాటు అమలు చేస్తే 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనూ ఉంటాయని ఏడీబీ పేర్కొంది. మొత్తం గ్లోబల్ ఉత్పత్తి క్షీణతలో ఈ ప్రాంత వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చైనా నష్టాలు సుమారు 1.1–1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఏడీబీ అంచనా. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ కట్టడిపై వేగంగా స్పందించాయని, ద్రవ్యపరమైన చర్యలతో ఆదాయ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేశాయని ఏడీబీ తెలిపింది. ఈ చర్యలను ఇలాగే కొనసాగించిన పక్షంలో కరోనాపరమైన ప్రతికూల ప్రభావాలు 30–40 శాతం దాకా తగ్గొచ్చని వివరించింది. జీతాల్లో కోతలు.. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలో వేతన ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదాయాలు 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల దాకా తగ్గొచ్చని పేర్కొంది. ఆసియాలో వేతన ఆదాయాలు 359–550 బిలియన్ డాలర్ల స్థాయిలో క్షీణించవచ్చని వివరించింది. ఏడీబీ నివేదిక -
ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి
సాక్షి, ముంబై : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు సానుకూల ఫలితాలనిచ్చినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు పూర్తి నిలిచిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిందని పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అభిప్రాయపడ్డారు. ఇపుడు ఆర్ధిక పతనంనుంచి కాపాడేందుకు త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. వైరస్ కట్టడితోపాటు ప్రస్తుతం ఆర్థిక శ్రేయస్సుపై కూడా దృష్టి పెట్టడం అత్యవసరమని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ఎకానమీ నిద్రావస్థలోకి జారిపోకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూడాలన్నారు. దేశంలో ఆర్థికమాంద్యం కూడా ప్రమాదమేనని జిందాల్ పేర్కొన్నారు. అలాగే అతి తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని సామర్థ్యానికి సాధించేందుకు కొత్త పని మార్గాలను కనుగొనాలని ఆయన అన్నారు. (నోకియా దూకుడు : భారీ డీల్) కాగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం మార్చి 25 నుండి 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. అనంతరం దీనిని మే 3వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రతి రంగంలోని వ్యాపారాలను ప్రభావితం చేసింది. అయితే ఏప్రిల్ 20నుండి అనేక పరిశ్రమలకు,సంస్థలకు సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అవసరమైన వస్తువులు, సేవలను మినహాయించి 40 రోజుల లాక్డౌన్ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
చైనాని హెచ్చరించిన ట్రంప్
-
ఫుడ్ బ్యాంక్స్ వద్ద జనం క్యూ
వాషింగ్టన్/బీజింగ్: అమెరికాలో కోవిడ్–19 ధాటికి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో మూడు పూటలా గడవని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల ఎదుట అమెరికన్లు క్యూలు కడుతున్నారు. న్యూ ఓర్లాన్సీ నుంచి డెట్రాయిట్ వరకు ఇదే పరిస్థితి. ఇలా ఫుడ్ బ్యాంకుల దగ్గరకి వెళ్లడం చాలా మందికి ఇదే మొదటిసారి. పెన్సిల్వేనియాలో ఒక ఫుడ్ సెంటర్ దగ్గర ఏకంగా వెయ్యి కార్లు క్యూలో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓహియోలో రాత్రికి రాత్రి ఫుడ్ సెంటర్లలో 30 శాతం డిమాండ్ పెరిగిపోయింది. తమ వంతు రావడానికి గంటలు గంటలు సమయం పడుతోంది. చైనాని హెచ్చరించిన ట్రంప్ కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి అంశంలో చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణం చైనాయేనని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ‘‘వైరస్ వ్యాప్తి గురించి చైనా తెలిసి కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించిందని వెల్లడైతే తేలిగ్గా తీసుకోం. 1917 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం చూడలేదు. పరిణామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి’’అని హెచ్చరించారు. ఈ సంక్షోభ సమయంలో చైనా కోవిడ్‌పై పారదర్శకంగా లేకపోవడం, మొదట్లో అమెరికా అందించిన సాయాన్ని స్వీకరించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైరస్ భయోత్పాతం సృష్టిస్తుందని వాళ్లకి ముందే తెలుసునని అందుకే అమెరికా సాయం చేస్తానన్నా అంగీకరించలేదని ట్రంప్ గుర్తు చేశారు. ఇక మరణాల సంఖ్య విషయంలో కూడా చైనా నిజాలు దాస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా కంటే కూడా చైనాలోనే మృతుల సంఖ్య ఎక్కువ ఉండి ఉంటుందని అన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ముందున్న జో బిడెన్‌కు చైనా మద్దతు ఉందని ట్రంప్ ఆరోపించారు. బిడెన్ విజయం సాధిస్తే అమెరికాను చైనా ఆక్రమించుకుంటుందని జోస్యం చెప్పారు. బిడెన్ వాణిజ్య విధానాల వల్ల ప్రజలకి ఒరిగేదేమీ ఉండదన్నారు. ► స్పెయిన్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ఆదివారం 410 మంది మరణించారు. నెల రోజులుగా నమోదైన మృతుల్లో ఇదే అత్యంత తక్కువ. కరోనా వైరస్ రావడానికి ముందు ప్రపంచయాత్రకి బయల్దేరిన కోస్తా డెలిజియోసా అనే నౌక స్పెయిన్‌లోని బార్సిలోనాకు చేరుకోనుంది. 1831 మంది ప్రయాణికులతో ఉన్న ఈ నౌక 15 వారాలు ప్రపంచ యాత్ర చేసింది. అందులో ప్రయాణికులెవరికీ వైరస్ సోకలేదని నౌకని నడిపిన కంపెనీ అధికారులు ఉన్నారు. ► రష్యాలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 24 గంటల్లో 6,060 కేసులు నమోదయ్యాయి. ► బ్రిటన్‌లో కరోనాతో ఇప్పటివరకు 15 వేల మందికి పైగా మృతి చెందారు. వైరస్ ల్యాబ్ నుంచి రాలేదు: వూహాన్ ల్యాబ్ చీఫ్ చైనాలోని వూహాన్లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్ డైరెక్టర్ యాన్ జిమింగ్ ఆదివారం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందంటూ మాటలు విసిరి ప్రజల్ని తప్పుదోవ పట్టించదం దురదృష్టకరమని యాన్ అన్నారు. మరోవైపు వూహాన్లో వైరస్ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. -
సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో 2020లో కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. గతంలో పడి లేచిన కెరటాల్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కరోనా వైరస్ ఆధారిత మార్కెట్ పతనం.. ఇన్వెస్టర్లలో తమ పెట్టుబడులకు దీర్ఘకాల భద్రత ఏంటన్న ఆందోళనకు దారితీసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు నిపుణులు, బ్రోకరేజీలు, ఫండ్స్ హౌస్‌లకు తమ ఆందోళనలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి, మార్కెట్ల పతనంలో అవకాశాలు, తదితర విషయాలపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరిశోధక బృందం తరచుగా ఇన్వెస్టర్ల నుంచి తమకు ఎదురైన ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాలు, సూచనలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం అనంతరం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఏ విధంగా వ్యవహరించాలన్నది వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ టీమ్ విడుదల చేసిన ప్రశ్నలు, జవాబుల జాబితా ఇది... కొనుగోళ్లకు ఇది సరైన తరుణమేనా..? నిర్దేశిత పరిమాణం కంటే ఈక్విటీల్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే.. ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫం డ్స్ లేదా నేరుగా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకునే వారు 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలిన శాతం పెట్టుబడులను ఈక్విటీలకు (ఫండ్స్ లేదా స్టాక్స్) కేటాయించుకోవచ్చు. ఒకవేళ రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారు 100కు బదులు 70 నుంచి తమ వయసును తీసివేసి, మిగిలిన శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన పెట్టుబడులను స్థిరాదాయ పథకాలైన ఎఫ్డీలు, బాండ్ ఫండ్స్ లేదా చిన్న మొత్తాల పొదు పు పథకాలు, బంగారానికి కేటాయించుకోవచ్చు. ఫండ్స్ పెట్టుబడుల విలువ పడిపోతే? ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు వాటి ఇటీవలి గరిష్టాల నుంచి రెండు నెలల వ్యవధిలోనే 40 శాతం పడిపోయాయి. ఫండ్స్ లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు అందరూ ఈ నష్టాలను చూస్తున్నారు. గడిచిన 34 ఏళ్లలో (ఆరు భారీ బేర్ మార్కెట్లు (40% అంతకంటే ఎక్కువ నష్టపోవడం) ఎదురయ్యాయి. కానీ, ప్రతీ పతనం తర్వాతి రెండు మూడేళ్ల కాలంలో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లో కరెక్షన్ ముగి సిందని చెప్పలేం. వచ్చే కొన్నేళ్ల కాలానికి డబ్బు అవసరం లేని వారు తమ ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ సమయానుకూలంగా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు. సిప్‌ను కొనసాగించాలా..? ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ కారణంగా ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులు నష్టాలు చూపిస్తున్నాయని సిప్‌ను ఆపేద్దామని అనిపించొచ్చు. కానీ, అలా చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి మార్కెట్ల దిద్దుబాట్లు ఫండ్స్ యూనిట్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. తక్కువ ధరల కారణంగా అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశం ఇటువంటి సందర్భాల్లోనే లభిస్తుంది. కనుక వీలైనంత వరకు సిప్‌ను ఇప్పుడు కొనసాగించాలి. వీలుంటే సిప్ మొత్తాన్ని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, పనితీరు సజావుగా లేని పథకాల్లో సిప్ ఆపేసి, మంచి పథకాల్లో సిప్ కొనసాగించడం, పెంచుకోవడం చేయాలి. ఎఫ్ అండ్ ఓ లతో రక్షణ ఎలా? రిస్క్ నిర్వహణకు డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) చాలా ముఖ్యమైన సాధనం. హెడ్జింగ్ రూపంలో నష్టాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. నిఫ్టీ పుట్ ఆప్షన్ల కొనుగోలు ద్వారా మీ పోర్ట్‌ఫోలియోకు సులభంగా హెడ్జ్ చేసుకోవచ్చు. అయితే, హెడ్జింగ్ అన్నది బీమా కవరేజీ వంటిది. ఒకవేళ మార్కెట్లు పడిపోకుండా పెరిగితే పుట్ ఆప్షన్ల కోసం చెల్లించిన ప్రీమియం నష్టపోవాల్సి వస్తుంది. కానీ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాభపడింది కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అన్ని వేళలా హెడ్జింగ్ కాకుండా.. మార్కెట్లు పెద్ద కరెక్షన్లు లేకుండా దీర్ఘకాలం పాటు గణనీయంగా పెరిగిన సందర్భాల్లో హెడ్జ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో బేర్ మార్కెట్లు ఎంత కాలం పాటు కొనసాగాయి? 1992, 2000, 2008 సందర్భాల్లో బేర్ మార్కెట్లను చవిచూశాం. 1992 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ తన పూర్వపు గరిష్టాలను అధిగమించేందుకు రెండున్నరరేళ్ల సమయం తీసుకుంది. 2000–2001 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ గరిష్టాలకు చేరుకునేందుకు నాలుగేళ్లు పట్టింది. 2008 తర్వాత పూర్వపు గరిష్టాలను దాటేందుకు సెన్సెక్స్‌కు ఆరేళ్లు పట్టింది. బంగారంలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? అంతర్జాతీయ సంక్షోభ సమయంలో బంగారం అన్నది విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం. ఈక్విటీలకు బంగారం వ్యతిరేక దిశలో ఉంటుంది. కనుక ఈక్విటీ మార్కెట్ల పతనం సమయంలో బంగారం సురక్షిత సాధనం. ప్రస్తుత సమయాల్లో బంగారంలో పెట్టుబడులను కొనసాగించుకోవడమే సూచనీయం. ఈక్విటీ మార్కెట్లు కనిష్టాలకు చేరినట్టు ధ్రువీకరణ అయిన తర్వాత బంగారంలో కొంత లాభాలను స్వీకరించొచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తే...? మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుత సమయం అనుకూలమైనది. మంచి నాణ్యమైన ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా పెట్టుబడులు ప్రారంభించుకోవాలి. తగినంత అనుభవం, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత నాణ్యమైన కంపెనీల షేర్లలో నేరుగానూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌తో ప్రయోజనం పొందే రంగాలు? ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, టెలికం, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ రంగ కంపెనీలు, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు లౌక్‌డౌన్ సమయంలో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇవి సంక్షోభాన్ని మెరుగ్గా అధిగమించగలవు. ఒక్కసారి లౌక్‌డౌన్ ముగిస్తే ఆకర్షణీయంగా ఉన్న ఇతర రంగాల వైపు మళ్లొచ్చు. నష్టాలను బుక్ చేసుకోవచ్చా..? భవిష్యత్తు పరిస్థితుల గురించి అవగాహన లేకుండా చెప్పుడు మాటల ద్వారా, విన్న వార్తల ద్వారా ఏవైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ సమయంలో ఆ కంపెనీల ఫండమెంటల్స్, ఇటీవలి పరిణామాలు, సూచీలతో పోలిస్తే స్టాక్ ధర పరంగా జరిగిన నస్టాన్ని సమీక్షించుకోవడం చేయాలి. ఈ అంశాల్లో బలహీనంగా కనిపిస్తే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించే వాటిల్లో, నిపుణుల సూచనల మేరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. -
వీడని వైరస్ భయాలు
ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండడం, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా భారత బ్యాంకింగ్ రంగం పట్ల మూడీస్ తన దృక్పథాన్ని నెగెటివ్‌కు తగ్గించడం పెద్ద ప్రభావాన్నే చూపించింది. బ్యాంకు స్టాక్స్‌లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ప్రభావంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి (2.06%) 8,084 వద్ద క్లోజయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి (2.39%) 27,591 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోతుండడం, ఫలితంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో విడత 76 స్థాయికి జారిపోవడం.. ఇన్వెస్టర్లను కొనుగోళ్ల విషయమై వేచిచూసే ధోరణి అనుసరించేలా చేసినట్టు ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 2,225 పాయింట్లు (7.46%), నిఫ్టీ 576 పాయింట్లు (6.65%) చొప్పున నష్టపోయాయి. ఈ వారంలో చివరి రెండు రోజుల్లో నష్టాల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4,82,033 కోట్ల మేర తరిగిపోయి రూ.1,08,66,723 కోట్లకు పడింది. అమ్మకాలకు దారితీసిన అంశాలు ► కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోవచ్చన్న అంచనాతో ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి ప్రతికూలానికి మారుస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ► కరోనా పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఆందోళన నెలకొంది. ► కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై 4.1 ట్రిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ► డాలరుతో రూపాయి విలువ శుక్రవారం 53 పైసలు నష్టపోయి 76.13 వద్ద క్లోజయింది. బ్యాంకు స్టాక్స్ బేర్... మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత బ్యాంకింగ్ రంగ రేటింగ్‌ను నెగెటివ్‌కు మార్చడం, అందులోనూ కొన్ని బ్యాంకుల రేటింగ్లను తగ్గించడం ఆయా స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. అత్యధికంగా ఆర్బీఎల్ బ్యాంకు 15.5 శాతం, బంధన్ బ్యాంకు 13 శాతం చొప్పున నష్టపోయాయి. సూచీల్లోని బ్యాంకు స్టాక్స్ అయిన.. యాక్సిస్ బ్యాంకు 9 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 8.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 8 శాతం, ఎస్బీఐ 6 శాతం చొప్పున పడిపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు 2 శాతం చొప్పున నష్టపోయాయి. కరెన్సీ మార్కెట్ల పనివేళలు తగ్గింపు ముంబై: లౌక్‌డౌన్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ డెట్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను వచ్చే మంగళవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి కుదిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ మార్కెట్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ నెల 7 నుంచి ఉదయం 10 గంటలకు మార్కెట్లు ప్రారంభం అయి, మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తాయి. -
మార్కెట్ లాక్డౌన్!
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్ సెషన్లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి విలువ ఏకంగా 76.30నీ చూసింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ కొత్త కనిష్టాలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం. బంగారం 80 డాలర్లు జంప్ మరోవైపు కోవిడ్ భయాలతో బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 11.15కు 84 డాలర్ల లాభంతో 1,568 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు న్యూఢిల్లీ: కోవిడ్–19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా రూ.31,585 కోట్లకు బిడ్లను ఆర్బీఐ పొందింది. 5.16 శాతం కటాఫ్ రేటుకు అన్ని బిడ్లనూ ఆమోదించింది. మరో రూ.50,000 కోట్లకు రెండవ విడత వేలాన్ని మంగళవారం నిర్వహించనుంది. అవసరమైతే తదుపరి కూడా ఇదే విధమైన చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను పునఃకొనుగోలు (రీపర్చేజ్) ఒప్పందంపై బ్యాంకులు ఆర్బీఐ వద్ద తనఖాగా ఉంచి ఆ బాండ్ల విలువ మేరకు నిధులను పొందుతాయి. ఈ నిధులపై ఆర్బీఐ కేవలం రెపో రేటు (ప్రస్తుతం 5.15 శాతం) ప్రకారం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. కోవిడ్ నివారణకు యాక్సిస్, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్.. కోవిడ్–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల పౌరులుగా సామాజిక దూరం పాటించాలని కోరారు. కస్టమర్లు సాధ్యమైనంత వరకు బ్యాంక్‌లకు రావొద్దని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుకే ఈ నెల 31 వరకు సేవింగ్, కరెంట్ ఖాతాలు, ప్రిపెయిడ్ కార్డ్స్ కస్టమర్లకు చార్జీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాక్సిస్‌కు 4,415 శాఖలు, 12,173 ఏటీఎంలు, 2.6 కోట్ల మంది కస్టమర్లున్నారు. వేదాంత కూడా...: దినసరి కార్మికుల కోసం మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రూ.100 కోట్ల ఫండ్ కేటాయించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో జీతాలు కుదించబోమని, తాత్కాలిక కార్మికులను సైతం తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ వన్ టైం ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. కరోనాపె యుద్ధంలో భాగంగా ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని వేదాంత రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అవసరమైతే మరింత ఫండ్ కేటాయిస్తామని చెప్పారు. కార్మికులకు రిలయన్స్ అండ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్మికులకు అండగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోనా పాజిటివ్ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్, గార్మెంట్స్ వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది. -
వాహనాల తయారీకి వైరస్ బ్రేక్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) గురుగ్రామ్, మానెసర్‌లోని (హరియాణా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్తక్లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్‌డౌన్ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్ గకు నకానిషి తెలిపారు. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్‌పూర్ ప్లాంట్‌లో ఇప్పటికే ఆపివేశామని, చకన్ (పుణే), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సైతం తమ ప్లాంట్‌లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా సంస్థ గుజరాత్‌లోని హలోల్ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లోనూ..: హీరో మోటోకార్ప్ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్‌లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫండ్... మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్డౌన్ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమని చెప్పారు. ‘మా మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున రిసార్ట్‌లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధం‘ అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ప్లాంట్లలో వాటి తయారీపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్‌కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చన్నారు. -
కరోనా పరిణామాలే కీలకం..!
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా) వైరస్ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది. వైరస్ వ్యాప్తి వేగం తగ్గకపోతే ఎకానమీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కరోనా వైరస్ పరిణామాలు మాత్రమే ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగానే ఈ వారంలో సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ విశ్లేషకులు చందన్ తపారియా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని విశ్లేషించారు. వైరస్ ఇబ్బందుల దృష్ట్యా వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇవ్వడం వంటి ఆశాజనక వార్తలు రిలీఫ్ ర్యాలీకి ఆస్కారం ఇచ్చినప్పటికీ.. వైరస్ వ్యాప్తి అంశమే అత్యంత కీలకంకానుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. మార్చి సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (26న) మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. ఈ సిరీస్‌లో సూచీలు 35 శాతం నష్టపోయాయి. వోలటాలిటీ 72 శాతానికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్ రోలోవర్స్ కొనసాగుతున్నాయని, నిఫ్టీ 7,800–8,000 పాయింట్ల స్థాయికి పడిపోతే ట్రేడర్లు పొజిషన్లను క్లోజ్ చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ అనలిస్ట్ అమిత్ గుప్తా విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరిగితే సూచీలు కుప్పకూలి పోతాయని చెప్పడంలో సందేహం లేదని ట్రేడింగ్‌బెల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్ మీనా వ్యాఖ్యానించారు. మరణాలు ఆగితేనే మార్కెట్ నిలబడుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. షార్ట్ సెల్లింగ్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిమితులను విధించిన నేపథ్యంలో ఎఫ్ అండ్ ఓలోని 10–12 శాతం షేర్లపై ఈ ప్రభావం ఉందనుందని సామ్కో సెక్యూరిటీస్ అనలిస్ట్ జిమీత్ మోడీ అన్నారు. ఎక్సే్ఛంజీలు పనిచేస్తాయ్.. దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని సెబీ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై షట్డౌన్లో ఉన్నప్పటికీ.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మాత్రం పనిచేస్తాయని స్పష్టంచేసింది. బోంబే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని అన్ని విభాగాలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని బీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్‌కుమార్ చౌహాన్ ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ కూడా ఇదే ప్రకటన చేసింది. స్టాక్ బ్రోకర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా భారత్‌లో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటికే ఏడుకు చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్ బ్రోకర్లకు ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యం కల్పించినట్లు దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఈనెల 30 వరకు ఈ ఫెసిలిటీని ఇస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా బ్రోకర్ల వద్ద నుంచి వారి టెర్మినల్ లొకేషన్ల అడ్రస్‌లను సేకరిస్తున్నట్లు వివరించాయి. ఈ నెలలో రూ. లక్ష కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో రూ. 1,08,697 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–20 మధ్యలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 56,248 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 52,449 కోట్లను వెనక్కు తీసుకున్నారు. కరోనా వైరస్ కారణం గా దేశీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. -
బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిదేళ్ల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్ నుంచీ డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్లోకి పంప్ చేయడం ప్రారంభించారు. దీనితో ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 103 స్థాయి దాటేసింది (52 వారాల కనిష్టం 95.61). పసిడి 20వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 1,501 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,460 డాలర్ల స్థాయినీ చూసింది. పసిడి 52 వారాల కనిష్టం 1,266 డాలర్లు. బులిష్ ధోరణే...: భారీగా పెరిగిన పసిడి నుంచి ప్రస్తుతం లాభాల ఉపసంహరణే జరుగుతోంది తప్ప, మెటల్ బేరిష్ ధోరణిలోకి వెళ్లలేదన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ అలా అయినా మహాఅయితే మరో 150 డాలర్లు పతనం కావచ్చని, 1,360, 1,300 డాలర్లు పసిడికి పటిష్ట మద్దతని వాదనలు ఉన్నాయి. పసిడి కొనుగోళ్లకు ఇది సువర్ణ అవకాశమని యూబీఎస్ గ్రూప్‌లో కమోడిటీ, విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వానీ గార్డెన్ పేర్కొంటున్నారు. పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో తిరిగి పసిడి భారీగా పెరగడం ఖాయమన్నది ఆయన విశ్లేషణ. కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై కరెన్సీ యుద్ధం ప్రారంభమయిన పక్షంలో పసిడే ఇన్వెస్టర్లకు ఏకైక పెట్టుబడి సాధనమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
కరోనా.. టెర్రర్!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం కారణంగా ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో శుక్రవారం మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం 74 స్థాయికి చేరువ కావడం, ముడి చమురు ధరలు 2.5 శాతం మేర క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 1,459 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్ చివరకు 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 1,014 పాయింట్లు కోల్పోయి 27,801 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 2.3 శాతం, నిఫ్టీ 2.4 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.5 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్టానికి, బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయాయి. చివర్లో తగ్గిన నష్టాలు.... గురువారం అమెరికా మార్కెట్, శుక్రవారం ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,460 పాయింట్లు, నిఫ్టీ 442 పాయింట్ల మేర క్షీణించాయి. చివర్లో నష్టాలు కొంత తగ్గాయి. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న చర్యల నేపథ్యంలో బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో విమానయాన, లోహ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్ మార్కెట్లు 3–4 శాతం రేంజ్లో క్షీణించగా, అమెరికా సూచీలు 2–3 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్‌లో వాటాను ఎస్బీఐ కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 6 శాతం నష్టంతో రూ.270 వద్దకు చేరింది. ► చైనాలో రిటైల్ అమ్మకాలు 85 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ షేర్ 9% నష్టంతో రూ.114 వద్ద ముగిసింది. ► దాదాపు 600కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, పీఎన్బీ, ఇండిగో, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మొత్తం ఐదు షేర్లు సెన్సెక్స్‌ను 510 పాయింట్ల మేర పడగొట్టాయి. సెన్సెక్స్ నష్టాల్లో హెచ్డీఎఫ్సీ వాటా 140 పాయింట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 125 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 113 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 68 పాయింట్లు, ఎస్బీఐ వాటా 64 పాయింట్లుగా ఉన్నాయి. ► దాదాపు 400 మేర షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కార్పొరేషన్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.3.30 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.29 లక్షల కోట్లు తగ్గి రూ.144.3 లక్షల కోట్లకు పడిపోయింది. -
కోవిడ్-19: కాలుష్యం తగ్గుదల
చైనాను అతలాకుతులం చేస్తున్న కోవిడ్-19 వల్ల కాలుష్యం తగ్గింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో చైనాలో తాత్కాలికంగా పరిశ్రమలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వూహాన్ నగరంలో కాలుష్య కారక నైట్రోజన్ డయాక్సైడ్ మునుపెన్నడూ లేని రీతిలో తగ్గినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చైనాలో నైట్రోజన్ డయాక్సైడ్ కారకాలు 10 నుంచి 30శాతం తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు విస్తరించిన కోవిడ్-19 వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తం అవుతోంది. చదవండి: కరోనా వైరస్ ఎలా సోకుతుందంటే.. -
వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)భారత వృద్ది అంచనాలను మరోసారి భారీగా కుదించింది. అతి తక్కువ వృద్ధిని అంచనా వేసింది. అలాగే భారతదేశ ఆర్థిక మందగమన పరిస్థితి గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేసిందని సోమవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ది రేటును 4.8 శాతానికి సవరించింది. అంతేకాదు ఇది ప్రతికూల ఆశ్చర్యంగా పక్రటించింది. గత ఏడాది ఇదేకాలంలో ఐఎంఎఫ్ అంచనా 7.5 శాతం. అక్టోబర్‌లో 6.1 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలలో 0.1 శాతం తగ్గించిన ఐఎంఎఫ్ భారతదేశ ఆర్థిక మందగమనానిదే "సింహభాగం" అని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక అశాంతిని తీవ్రతరం చేయడం, అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడం, అలాగే ఇతర దేశాల మధ్య ఆర్థిక ఘర్షణలులాంటివి ప్రముఖంగా ఉన్నాయని తెలిపింది. దేశీయంగా బ్యాంకుయేతర ఆర్థిక రంగంలో ఒత్తిడి ,రుణ వృద్ధి క్షీణత, దేశీయ వినిమయ డిమాండ్ ఊహించిన దానికంటే చాలా మందగించిందని వ్యాఖ్యానించింది. ఇదే వృద్ధి రేటును తగ్గించడానికి కారణమని తెలిపింది. మరోవైపు జపాన్ వృద్దిరేటును అంచనాలను బాగా పెంచింది ఐఎంఎఫ్. ప్రధానంగా జపాన్ ప్రధాని షింజో అబే గత నెలలో ప్రకటించిన స్టిములస్ ప్యాకేజీ కారణంగా వృద్ధి పురోగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2020 నాటికి 0.7శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. గత అక్టోబరు లో ఇది 0.5 శాతంగా మాత్రమే వుంటుందని అంచనావేసింది. అలాగే అమెరికా-చైనా ట్రేడ్‌డీల్ కారణంగా చైనా వృద్ది రేటుకు పైకి సవరించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఒక శాతం పెరిగి 5.8 శాతంగా ఉండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ వుంటుందని తెలిపింది. 6.5 శాతం వృద్ధి రేటుతో చైనా (5.8 శాతం)ను అధిగమించి 2021 లో భారత్ మొదటి స్థానంలో నిలబడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దృక్పథాన్ని స్వల్పంగా క్రిందికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్దిపై కొత్త అంచనాలు 2019 లో 2.9 శాతం, 2020 లో 3.3 శాతం, 2021 లో 3.4 శాతం వృద్ధినగా వుంచింది.. భారతదేశ ఆర్థిక వృద్ధి క్షీణత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందని అభిప్రాయపడింది. అయితే దేశ వృద్ది 2020లో 5.8 శాతంగాను, 2021లో 6.5 శాతానికి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభోత్సవానికి ముందు, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ వృద్ధి మళ్లీ మందగించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ మళ్లీ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అయితే అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద పరిణామాలతో అక్టోబర్ నుంచి కొన్ని నష్టాలు పాక్షికంగా తగ్గాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తుండగా, ఐరాస 5.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్అండ్టీ అధినేత ఏఎం నాయక్ మొదలైన వారు దీనికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019–20 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కార్పొరేట్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సవాళ్లతో సమరం..: డిమాండ్ మందగమనం, తయారీ రంగం బలహీనత తదితర అంశాల కారణంగా జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించి.. ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గతేడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధన నిధులివ్వడం, పలు బ్యాంకులను విలీనం చేయడంతో పాటు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22%కి తగ్గించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే, ఇవేవీ కూడా బలహీనపడిన వినియోగ డిమాండ్‌ను నేరుగా పెంచేందుకు దోహపడేవి కావనే విమర్శలు ఉన్నాయి. దీంతో వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన 60 మంది పైగా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ కసరత్తులో భాగంగా పరిశ్రమవర్గాలతో సమావేశమవుతున్నారు. దీంతో రాబోయే బడ్జెట్లో మరిన్ని సంస్కరణలపై అంచనాలు నెలకొన్నాయి. కార్పొరేట్లపై కక్ష సాధింపు అనుకోవద్దు.. అవినీతి కట్టడి చర్యలపై మోదీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి అవరోధాలు లేని పారదర్శక పరిస్థితుల్లో కార్పొరేట్లు నిర్భయంగా సంపద సృష్టి జరపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. చట్టాల సాలెగూళ్ల నుంచి పరిశ్రమను బైటపడేసేందుకు గడిచిన అయిదేళ్లుగా తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. కాగా, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును, సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. -
సినిమా సూపర్ హిట్ కలెక్షన్లు ఫట్
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు కూడా పెరగాలి కదా? అనేది సామాన్యుడి సందేహం. వీటి మధ్య సంబంధం ఉందనుకుంటే ఉంది!. లేదనుకుంటే లేదు!!. 2019లో మన ఆర్థిక వ్యవస్థ తీరు చూసినా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ మందగమనంతో నత్తనడకన నడుస్తోంది. విక్రయాలు తగ్గిపోయాయని ఆటోమొబైల్, వినియోగ వస్తువుల కంపెనీలు మొత్తుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అటు సంస్కరణల ఊతంతో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్ భారీగా ఎగబాకినా.. ఇటు పారిశ్రామిక దిగ్గజాలు మాత్రం వ్యాపార వర్గాల నోరు నొక్కేస్తోందంటూ ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. మందగమనం సమస్యకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2019 సింహావలోకనంతో పాటు కొత్త సంవత్సరంపై నెలకొన్న అంచనాల సమాహారమిది... స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ల పరుగు ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం రయ్‌మని ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10.2 లక్షల కోట్లు ఎగిసింది. ఈ ఏడాది జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 5,000 పాయింట్లు పైగా పెరిగి తాజాగా 41,000 పైకి చేరింది. ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొన్ని షేర్లకే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 19 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ.లక్ష కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. టెల్కోలకు షాక్ ట్రీట్మెంట్.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధి స్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీల ప్రతిపాదనను ట్రాయ్ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇరు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిన జోష్.. 2019లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ భారీగా పెరిగాయి. 2019 నవంబర్ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని, ఎకానమీ పుంజుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు రావొచ్చని ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా వేస్తోంది. బీమా రంగం... ధీమాగా వృద్ధి బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15% వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థల ప్రయత్నాలు ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొ న్నాయి. ఎకానమీ అస్తవ్యస్తం.. అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్ ట్యాక్స్ కోత వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రియల్టీ అంతంతమాత్రం... రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్ 7 నగరాల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్ చ.అ. లీజింగ్ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్ తగ్గగా.. ఫుడ్ అండ్ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్ లీజింగ్ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. పసిడి.. జిగేల్ జిగేల్ పసిడి మెరుపులు ఈ ఏడాది మరింత కాంతివంతమయ్యాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్ల శ్రేణిని ఛేదించింది. 2013 తర్వాత మళ్లీ తొలిసారి ఈ ఏడాది ఆగస్టులో 1,500 డాలర్ల మార్కును అధిగమించింది. దేశీయంగా రేటు ఏకంగా 25 శాతం పెరిగింది. సంవత్సరం తొలినాళ్లలో రూ.31,500 స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8,000 పెరిగి ఒక దశలో రూ. 40,000 స్థాయిని కూడా తాకింది. సాధారణంగా.. అనిశ్చితి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. ఈ కారణాలే ఈ ఏడాది పసిడి పరుగుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ... వాణిజ్య అనిశ్చితి, అమెరికా – చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగిన టారిఫ్‌ల యుద్ధం వంటివన్నీ ఇన్వెస్టర్లను పసిడివైపు మొగ్గేలా చేశాయి. ప్రపంచ ఎకానమీపై కమ్ముకున్న నీలినీడలతో.. షేర్ల వంటి రిస్కీ సాధనాల కన్నా బంగారం, ఇతరత్రా సురక్షిత సాధనాలే ఆకర్షణీయంగా ఉంటాయని 2019 రెండో త్రైమాసిక నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. సాధారణ ఇన్వెస్టర్ల తరహాలోనే సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది కూడా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, కనిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, డాలరు బలహీనపడే అవకాశాల నేపథ్యంలో బంగారం పరుగు కొనసాగుతుందని భావిస్తున్నారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఔన్సు బంగారం ధర 1,620 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపేసిన స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు.. 2020లో అమ్మకాలకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పసిడి రేటు తగ్గే చాన్సు కూడా ఉందనేది నిపుణుల అంచనా. ఆటోమొబైల్ రివర్స్ గేర్‌లోనే... డిమాండ్ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా.. కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు.. ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. డీల్ స్ట్రీట్ .. కార్పొరేట్లు డీలా కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ జరిగాయి. 2019లో సగటు ఎంఅండ్ఏ డీల్ పరిమాణం 81 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్... ఫైనాన్స్ సవాళ్లమయం ఐఎల్అండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రభావాలతో 2019 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్ స్టీల్ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ బిమల్ జలాన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. -
ఐపీఓ నిధులు అంతంతే!
ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది. గత ఏడాది 24 కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ ఏడాది 16 కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. ఈ వివరాలను క్యాపిటల్ మార్కెట్ గణాంకాలను అందించే ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. మరిన్ని వివరాలు.... ► ఈ ఏడాది క్యూ2 జీడీపీ ఏడేళ్ల కనిష్ట స్థాయి, 4.5 శాతానికి పడిపోయింది. జీడీపీ మెరుగుపడుతున్న సూచనలు ఏమీ లేవు. రూ.51,000 కోట్ల సమీకరణ నిమిత్తం సెబీ ఆమోదం పొందిన 47 కంపెనీల ఐపీఓల గడువు తీరిపోవడం ఈ విషయాన్ని మరింత ప్రతిబింబిస్తోంది. ► ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ 60 శాతం తగ్గినా, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్), క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ)ల ద్వారా నిధుల సమీకరణ మాత్రం మెరుగ్గానే ఉంది. ఈ రెండు మార్గాల ద్వారా గత ఏడాది వివిధ కంపెనీలు రూ.63,651 కోట్లు సమీకరించాయి. ఇది ఈ ఏడాది రూ.81,174 కోట్లకు పెరిగింది. 2017తో పోల్చితే(రూ.1,60,032 కోట్లు) ఇది 49% తక్కువ. ► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ నిలిచింది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.2,850 కోట్లు. ► ఈ ఏడాది వచ్చిన మొత్తం 16 ఐపీఓల్లో ఏడు కంపెనీల ఐపీఓలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ఐపీఓలు 10 రెట్లకు పైగా సబ్‌స్క్రైబయ్యాయి. ► ఐఆర్సీటీసీ ఐపీఓ 109 రెట్లు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్‌బ్యాంక్ వంద రెట్లకు మించి సబ్‌స్క్రైబయ్యాయి. ► లిస్టింగ్ లాభాల్లో ఈ ఏడాది ఐపీఓలు అదరగొట్టాయి. ► ఐపీఓకు వచ్చిన కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే దిగువకు పడిపోవడం గత కొన్నేళ్లలో పరిపాటిగా ఉండేది. ఈ ఏడాది దీనికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో 3 కంపెనీల షేర్లు మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. మిగిలిన 13 కంపెనీల షేర్లు 21–170 శాతం రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► ఈ ఏడాది ఐపీఓ నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్లు బాగానే లాభపడ్డారు. 2018లో ఓఎఫ్ఎస్ ద్వారా రూ.10,672 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.25,811 కోట్లు వచ్చాయి. ► ఈ ఏడాది ప్రభుత్వ వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్)కు కలిసిరాలేదు. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1,05,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటిదాకా రూ.17,744 కోట్లు (17 శాతం మాత్రమే) సమీకరించింది. ► వచ్చే ఏడాది ఐపీఓలు ఆశావహంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ 21 కంపెనీలు ఐపీఓల కోసం సెబీ ఆమోదం పొందాయి. ఈ కంపెనీలు రూ.18,700 కోట్లు సమీకరించనున్నాయి. మరో 13 కంపెనీలు సెబీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి రూ.18,000 కోట్ల సమీకరించడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి. -
మందగమనమా? 5 ట్రిలియన్ డాలర్లా?
దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వుందనేది దాచేస్తే దాగని సత్యం. జీడీపీ వృద్దిరేటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అంచనా వేయలేనంతగా దిగజారి పోయింది. మరోవైపు తాజాగా అసోచామ్ వందేళ్ల ఉత్సవాల్లో 5 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ సాధన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ, ఈ లక్ష్యం ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుందని పలువురి అంచనా. దేశీయ ఆర్థిక వ్యవస్థ "తీవ్ర మందగమనాన్ని" ఎదుర్కొంటుందని, అతిపెద్ద సంక్షోభం ఎదుర్కోక తప్పదని రేటింగ్ సంస్థలతోపాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థికవ్యవస్థ ఐసీయూలో ఉందని, తక్షణమే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒక ముఖ్య శక్తిగా ఎదిగిన భారతదేశ ఆర్థికచిత్ర పటం క్రమేపీ మసకబారుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది తీవ్రమైన వృద్ధి తిరోగమనం అంతర్జాతీయ ద్రవ్య నిధిని కూడా ఆశ్చర్యపరిచింది. వినిమయ డిమాండ్ క్షీణత, ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడం, దీర్ఘకాలిక సంస్కరణలు లోపించడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రతికూలతలుగా అభివర్ణించింది. టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్లో ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ, గణనీయమైన తిరోగమన సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. (2019 లో భారతదేశానికి 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది) ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2019-20 వృద్ధి అంచనాను అంతకుముందు 6.1 శాతం నుండి ఐదు శాతానికి సవరించడం గమనార్హం. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వృద్ధి అంచనాను 4.9 శాతానికి తగ్గించింది. జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా కూడా ఇదే అంచనాలను వెల్లడించింది. ఐఎంఎఫ్ సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది మొత్తం వృద్ధి 5శాతం దిగువకు వెళితే, భవిష్యత్తు మరింత నిరాశాజనకమేనని ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించిన నేపథ్యంలో 2019 మొదటి త్రైమాసికంలోనే జీడీపీ 5 శాతంనమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం. ఈ నెగిటివ్ సంకేతాలు రెండవ త్రైమాసికంలో కొనసాగి జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. ఇది గత 25 త్రైమాసికాల కంటే అత్యంత నెమ్మదిగా ఉన్న త్రైమాసిక వృద్ధి. మూడవ త్రైమాసికంలో జీడీపీ దూసుకెళ్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ 4.3 శాతానికి పరిమితమవుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చూస్తే ఈ వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంది. ఉత్పాదక రేటు మందగించింది. ఉపాధి పరిస్థితులు వినియోగదారుల డిమాండ్ దారుణంగా క్షీణించింది. జనవరి-మార్చి 2019 త్రైమాసికంలో భారతదేశంలో పట్టణ నిరుద్యోగిత రేటు నాలుగు త్రైమాసికాలలో 9.3 శాతం కనిష్ట స్థాయికి పడిపోయిందని ఇటీవల జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సర్వేలో తేలింది. అక్టోబరులో ఫ్యాక్టరీ ఉత్పత్తి వరుసగా మూడవ త్రైమాసికంలో 3.8 శాతం వద్ద బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమనానికి కారణం ఏమిటి? ప్రస్తుత తిరోగమనానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక కారణాలు రెండూ ఉన్నాయి. అంతకుముందు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులున్నప్పటికీ ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ చేపట్టిన సంస్కరణలు, అమెరికా-చైనా మధ్య ఎడతెగని ట్రేడ్‌వార్ (అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు) కూడా ఆర్థికవ్యవస్థను దెబ్బ తీసాయి. ప్రధానంగా 2016లో మోదీ సర్కార్ చేపట్టిన అతిపెద్ద సంస్కరణ నోట్ల రద్దు మరింత ఆజ్యం పోసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తొందరపాటు చర్య ఆర్థిక వ్యవస్థ మందగమన వేగం పెంచింది. చలామణిలో ఉన్న అధిక విలువ కలిగిన నోట్ల (రూ. 500, రూ.1000) రద్దు నగదు సరఫరాను విచ్ఛిన్నం చేసింది. క్షీణించిన నగదు చలామణి ప్రజల వినిమయ శక్తిని దెబ్బ తీసింది. ఇక ఆ తరువాత ఒకే దేశం ఒకే పన్ను అంటూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తో మరిన్ని కష్టాలొచ్చాయి. అనేక చిన్న చితకా వ్యాపారాలు మూతపడ్డాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో దేశం పైకి ఎగబాకినప్పటికీ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం ఆశించినంతగా లేదు. దీనికి తోడు ప్రభుత్వం చేపట్టిన నష్ట నివారణ చర్యలేవీ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వలేదు. ఆర్థికవ్యవస్థను తిరిగి వృద్ధి మార్గంలోకి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా వినిమయ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి, భూమి, కార్మిక రంగాల్లో నూతన సంస్కరణలకోసం సమగ్రమైన రోడ్‌మ్యాప్ రూపకల్పనలో మోదీ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలతో పాటు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులంటున్నమాట. మూడవ త్రైమాసిక ఆర్థిక గణాంకాలు ఈ వారం రానున్నాయి. ఆటోరంగ సంక్షోభం, యువకులు, ఓలా, ఉబెర్ అటు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఆటో, రియల్టీ, టెలికాం, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆటో మొబైల్ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస త్రైమాసికాల్లో సంక్షోభంలోకి కూరుకుపోయింది. వాహనాలు అమ్మకాలు క్షీణించి, ఉత్పత్తిని నిలిపివేసాయి. మారుతి సుజుకి, అశోక్ లేలాంటి సంస్థలు ప్లాంట్లను కొంతకాలంగా మూసివేసిన పరిస్థితులు. అంతేకాదు వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీనికి తోడు ఆటో పరిశ్రమకు అనుబంధంగా ఉండే విడిభాగాల కంపెనీల సంక్షోభం కూడా తక్కువేమీ కాదు. లక్షలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకక తప్పని స్థితికి చేరాయి. ఆటో మందగమనానికి ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్ సర్వీసులు కారణమంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భాష్యం సోషల్ మీడియాలో దుమారం రేపింది. కొత్త కార్లపై యువత ఆసక్తి చూపడం లేదనీ, ఈఎంఐల భారం భరించడానికి ఇష్టపడడం లేదని ఇది కూడా కార్ల అమ్మకాల పతనానికి కారణమన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా జీఎస్టీ పన్ను భారం తగ్గించాలన్న ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ తోసిపుచ్చారు. ఆటో ఒడిదుడుకులకు కారణం పన్నులు భారం కానే కాదని తేల్చిపారేశారు.అయితే తాజాగాజీఎస్టీ తగ్గించే యోచనలో ఉన్నామన్న సంకేతాలిచ్చినప్పటికీ మొత్తానికి మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్న ఆటోమొబైల్ రంగాన్ని కేంద్రం ఎలా ఆదుకుంటుందో చూడాలి. మరోవైపు 2020 ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్నాయి. జెట్ ఎయిర్వేస్ మూత అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మూతకు 2019 ఏడాది మౌన సాక్ష్యంగా నిలిచింది. దేశీయ విమానయాన రంగంలో విశిష్ట సేవలందించిన జెట్ ఎయిర్వేస్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌మాసంలో ప్రకటించింది. మరోవైపు విమానయాన రంగానికే మణిమకుటం ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎయిరిండియా విక్రయం త్వరలో పూర్తికాకపోతే.. మూసివేయక తప్పదన్న సంకేతాలివ్వడం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకుల మెగా మెర్జర్ కుదేలువుతున్న ప్రభుత్వ బ్యాంకింక్ రంగానికి ఊతమిచ్చదిశగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా పంజాబ్ నేషనల్‌బ్యాంకు రెండవ బ్యాంకుగా అవతరించ నుంది. మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనుంది. తద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు, ప్రైవేటు బ్యాంకులు మొండి బాకీలు, అక్రమాలు, భారీ స్కాంలతో అతలాకుతలమవుతున్నాయి. టెల్కోల భవితవ్యం? దేశీయ టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థుల కోలుకోలేని దెబ్బతీసింది. దీనికితోడు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నష్టాలతో కుదేలైన టెలికాం కంపెనీలకు అశనిపాతంలా తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా టెలికాం సంస్థలు ప్రభుత్వానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం దీన్ని సమీక్షించక పోతే, తమ వ్యాపారాన్ని నిలిపివేయడం తప్ప మరోమార్గం లేదని స్వయంగా దిగ్గజ కంపెనీ వొడాఫోన్ ఐడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఇక అమ్మకాలు లేక దిగ్గజ రియల్టీ కంపెనీలకు చెందిన భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు ప్రపంచ ఆర్థిక అననుకూలతలు ఇటు దేశీయంగా వివిధ రంగాల్లో నమోదైన వరుస క్షీణత, మందగమనాన్ని అధిగమించి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలో రోజుకు రోజుకు ముదురుతున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను మరుగుపర్చాలనే ఉద్దేశంతోనే జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 రద్దు చేసిందనేది మరో వాదన. ఈ విమర్శలకు తోడు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఆర్థిక మందగమనం ఆందోళనలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్యలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
మందగమనం.. రికార్డుల మోత
ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఉపాధి అవకాశాలు అందనంత దూరం..ఎగుమతులు పతనం. క్షీణించిన దిగుమతులు, పెట్టుబడులు ఆశించినంత లేవు. పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ. అయినా సరికొత్త తీరాలకు స్టాక్‌మార్కెట్లు. ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నట్టు అదే 2019 ఏడాదిలో పెద్ద పజిల్. 2019 ఏడాదిలో దలాల్ స్ట్రీట్ సరికొత్త మెరుపులతో మురిపించింది. కీలక బీఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండూ సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. జాతీయ అంతర్జాతీయ పరిణామాలతో ఏడాది ఆరంభంలో స్తబ్దుగా ఉన్న సూచీలు మధ్యలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఆఖరి త్రైమాసికంలో బాగా పుంజుకున్నాయి. చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల వివాదం ఈ ఏడాది బాగా దెబ్బ కొట్టినప్పటికీ దేశీయంగా సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయిలను అధిగమించడం విశేషం. నవంబరులో సెన్సెక్స్ 41 వేల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. డిసెంబరు 20 నాటికి 15 శాతం వృద్ధితో సెన్సెక్స్ ఈ గరిష్టాన్ని కూడా దాటేసి 41800 ని తాకిగింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో ముందు 10 వేలు, 11 వేలు చివరికి 12 వేల స్థాయిని కూడా సునాయాసంగా అధిగమించింది. డిసెంబరు 20 నాటికి నిఫ్టీ12300 గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. ఇలా మొత్తంగా స్టాక్‌మార్కెట్ లో కీలక సూచీలు రెండూ సరికొత్త తీరాలకు చేరుకున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, టెలికాం, ఫైనాన్స్ రంగాలు భారీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, మెటల్, ఐటీ, రియల్టీ రంగాలు ఏడాది చివరలో పుంజుకున్నా, టెలికాం రంగం మాత్రం భారీ నష్టాలనే మూటగట్టుకుంది. ఈ సంవత్సరంలో సంపదను ఆర్జించిన వారికంటే, సంపదను పోగొట్టుకున్నవారే ఎక్కువగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. ఆటోరంగం : ఆర్థికరంగంలో కీలకమైన ఆటో పరిశ్రమ ఈ ఏడాది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. వాహనాల డిమాండ్ బాగా క్షీణించడంతో తీవ్ర నష్టాలను చవిచూసింది. వరుసగా తొమ్మిది త్రైమాసికాల్లో వాహనాలు అమ్మకాలు పడిపోయాయి. వరుసగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించినా పరిస్థితి మెరుగపడలేదు. దీంతో మారుతి, ఆశోక్ లేలాండ్ తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయడం, తాత్కాలిక ఉద్యోగాల కోత లాంటి పరిణామాలకు దారి తీసింది. దీంతో మారుతి సుజుకి, టాటామోటార్స్, అశోక్ లేలాండ్ షేర్లలో అమ్మకాలు దాదాపు ఏడాదంతా కొనసాగాయి. మరోవైపు పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన భారత్ స్టేజ్-6 ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయి. రియల్టీ : రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు పలు కీలక నిర్ణయాలను ఈ ఏడాది నవంబరులో మాసంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది. ఇందుకోసం రూ .25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించడం ఆయా రంగాలకు సానుకూలంగా మారింది. బ్యాంకింగ్ : ఇక బ్యాంకింగ్ రంగంలో గత ఏడాదిలాగానే 2019లో కూడా కుంభకోణాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలకు తోడు పీఎంసీ బ్యాంకులో చోటు చేసుకున్న వేలకోట్ల కుంభకోణం మరో అదిపెద్ద స్కాంగా నిలిచింది. ఈ బ్యాంకులో వివిధ అవసరా నిమిత్తం డబ్బును దాచుకున్న మధ్య తరగతి వినియోగదారుల గుండెలు గుభేలుమన్నాయి. దీనికి తోడు జాతీయ బ్యాంకుల మెగా బ్యాంకుల విలీనం మరో కీలక పరిణామం. బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ మొత్తం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 అతిపెద్ద బ్యాంకులు ఏర్పాటుకానున్నాయి. తద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ సందర్భంగా ప్రకటించారు. టెలికాం రంగం: టెలికాం రంగంలో శరవేగంగా దూసుకొచ్చిన రిలయన్స్‌కు చెందిన జియో ఈ ఏడాది కూడా తన హవాను కొనసాగించింది. అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించిన మెగా మెర్జర్ సంస్థ వొడాఫోన్ ఐడియా మాత్రం మరింత కుదేలైంది. మరో ప్రధాన సంస్థ భారతి ఎయిర్టెల్ వృద్ధి కూడా అంతంత మాత్రమే. దీనికి తోడు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వడ్డీ, జరిమానాతో సహా టెలికాం సంస్థలు ప్రభుత్వానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పాయి. ఈ వ్యవహారంలో బాగా ప్రభావితమైన సంస్థ వొడాఫోన్ ఐడియా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంతో కొంత ఉపశమనం అందించపోతే మూత పడడం ఖాయమన్న ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిణామాలతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. కాఫీడే సిద్ధార్థ ఆత్మహత్య కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య ఇటు మార్కెట్ వర్గాలను, అటు కార్పొరేట్ శక్తులను విస్మయ పర్చింది. సిద్ధార్థ అనూహ్య మరణంతో కాఫీ డే షర్లు భారీగా పతనమయ్యాయి. ఎందరి జీవితాల్లోనో కమ్మని కాఫీ కబుర్ల మధుర స్మృతులను మిగిల్చిన ఆయన జీవితం విషాదాంతం కావడం తీరని విషాదం. మరోవైపు ప్రైవేటు రంగబ్యాంకుగా తనకంటూ ప్రత్యేకస్థానాన్నిసంపాదించుకున్న యస్ బ్యాంకునకు ఈ ఏడాదిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. యాజమాన్యంలో వచ్చిన విభేదాలతో ఫౌండర్ రాణా కపూర్ బ్యాంకునుంచి తప్పుకోవడం, ఇతర వివాదాలతో యస్ బ్యాంకు షేరు అత్యంత కనిష్టానికి పతనమైంది. కాగా దేశ ఆర్థిక వ్యవస్థ మునిగిపోతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోవడం ఒక పజిల్ అనిమాజీ ముఖ్యఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దిగుమతులు క్షీణించాయి. ఎగుమతులు పడిపోయాయి. కన్సూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఇలా అన్నిటి వృద్ది మూలనపడింది. పన్ను ఆదాయాలు తగ్గిపోయాయి. పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు.చాలా కంపెనీలు వారి ఆదాయాలకంటే ఎక్కవ వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తున్నాయి. భారత ఆర్థికవ్యవస్థ ఐసీయూలో ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యల నేపథ్యంలో బడ్జెట్లో మరిన్ని సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని, రాబోయే సంవత్సరంలో మార్పు వుంటుందని నిపుణులు భావిస్తున్నారు. -
మందగమనాన్ని ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు .. ప్రస్తుత మందగమనం నుంచి బైటపడే సత్తా ఉందని, మళ్లీ అధిక వృద్ధి బాట పట్టగలదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడులకు సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కార్పొరేట్లకు పిలుపునిచ్చారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసేందుకు, కార్పొరేట్లకు తోడ్పాటునిచ్చేందుకు తీసుకున్న చర్యలను పునరుద్ఘాటించారు. సహేతుకమైన కారణాలతో నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న పక్షంలో కార్పొరేట్లపై ఎలాంటి చర్యలు ఉండబోవన్నారు. రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రూ. 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, గ్రామీణ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు మరో రూ. 25 లక్షల కోట్లు వ్యయం చేయనున్నట్లు చెప్పారు. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా మారడం లక్ష్యమన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక మందగమనంపై జరుగుతున్న చర్చల గురించి నాకు అంతా తెలుసు. అయితే, ప్రతికూల వ్యాఖ్యల గురించి నేనేమీ మాట్లాడబోను. కేవలం సానుకూలాంశాల గురించే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను‘ అని ప్రధాని చెప్పారు. 130 కోట్ల భారతీయులకు ఏజెంట్లం... వ్యాపారాల నిర్వహణ సులభతరంగా ఉన్న దేశాల జాబితాలో మూడేళ్ల వ్యవధిలోనే భారత్ 142వ స్థానం నుంచి ఏకంగా 63వ స్థానానికి చేరిందని మోదీ చెప్పారు. గడిచిన మూడేళ్లుగా నిరంతరం మెరుగుపడుతున్న టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉంటోందన్నారు. ‘ఇదేమీ.. ఆరోపణలు, ప్రజాగ్రహాలు ఎదుర్కొనకుండానే సాధ్యపడలేదు. మమ్మల్ని కార్పొరేట్ ఏజెంట్లంటూ ఆరోపించారు. కానీ మేం 130 కోట్ల మంది భారతీయులకు ఏజంట్లము‘ అని ప్రధాని పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని చాలా మటుకు నిబంధనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పించామని, మరిన్ని సవరణలు తేబోతున్నామని ఆయన వివరించారు. ఇక, విఫలమైన సంస్థలు బైటపడేందుకు దివాలా కోడ్ ద్వారా వెసులుబాటు లభిస్తోందని చెప్పారు. వ్యవస్థలో బలహీనతలను చాలా మటుకు అధిగమించామని తెలిపారు. ఇక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడం మొదలైనవి బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల వంతని ప్రధాని చెప్పారు. అయితే, ఈ క్రమంలో కార్మికుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ‘అధిక వృద్ధి సాధించే క్రమంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం గతంలోనూ జరిగింది. అయితే, భారత దేశానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బైటపడే సత్తా ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు. -
ఐదారేళ్ల క్రితమే ప్రమాదంలో పడింది
సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రారంభ సమావేశాల సందర్బంగా అసోచామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసిన మోదీ ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, అయితే తమ సర్కారు దానికి కాపాడుకుందని మోదీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వృద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వృద్ధికి అన్నిరకాలుగా కృషి చేశామని మోదీ వెల్లడించారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్ మ్యాప్ సిద్ధమైందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్ మెరుగుపడిందని మోదీ తెలిపారు. అలాగే ఆర్థికవ్యవస్థ వృద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆ పజిల్ విప్పితే.. తిరిగి వచ్చేస్తా
అహ్మదాబాద్: ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మరోసారి భారత ఆర్థికవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోతోంటే, మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం ఉత్సాహంగా పైపైకి దూసుకుపోవడం తనకు ఒక పజిల్‌గా వుందని వ్యాఖ్యానించారు. ఇదొక పజిల్‌గా తనకు గోచరిస్తోందని, దీన్ని తనకు అర్థం చేయిస్తే తాను తిరిగి దేశానికి వస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం వుందని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ), ఎన్ఎస్ఇ, ఎన్ఎస్ఇ ఐసీఎఫ్టి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఎన్ఎస్ఇ సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్స్ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుబ్రమణియన్ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్షీణిస్తుందో, స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోందో వివరించాలన్నారు. మొట్టమొదటి సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్సెస్ డొమైన్ ఈ చిక్కుముడిని విప్పగలిగితే.. తాను అమెరికానుంచి ఇండియాకు తిరిగి వచ్చేస్తానన్నారు. అలాగే ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కేవలం ఆర్ధికశాస్త్రం, ఫైనాన్స్, మార్కెటింగ్లాంటి వాటికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ పరిమితం కాకుండా ఎకనామిక్స్‌లోని కొన్ని పరిస్థితులకు మానవుల స్పందన ఎలా వుంటుందనే అసాధారణమైన విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం-ఎ డైరెక్టర్ ఎర్రోల్ డిసౌజా , మార్కెటింగ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్యాకల్టీ సభ్యుడు అరవింద్ సహాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మార్కెట్లు, ఆర్థిక సేవల్లోని వ్యాపార సమస్యలకు సంబంధించిన అనేక విషయాలలో అవగాహన చేపట్టడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని డిసౌజా తెలిపారు. విధాన రూపకర్తలు, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు, ఫండ్ నిర్వాహకులు, వ్యాపారులు, విశ్లేషకులు, సంపద సలహాదారులు, ఇతర నిర్వాహకులు ఈ విషయంలో తమకు సహాయపడాలన్నారు. ఎన్ఎస్ఈ సీఎండీ విక్రమ్ లిమాయే మాట్లాడుతూ జనాభా , పొదుపు , పెట్టుబడి అలవాట్లను రూపొందించడంలో సామాజిక ప్రవర్తనా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దుతో వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతిందనీ, దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్య అని విమర్శించిన అరవింద్ ‘ఆఫ్ కౌన్సెల్– ది ఛాలెంజెస్ ఆఫ్ మోదీ–జైట్లీ ఎకానమీ’ పేరిట ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. 2014 అక్టోబరులో కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. అయితే 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ గత ఏడాది అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 5.1 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్డేటెడ్ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. రెండవసారి కోత...: నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఐఎఫ్‌ఎస్‌సీల నియంత్రణకు ప్రత్యేక సంస్థ న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ)ల్లో ఆర్థిక లావాదేవీల నియంత్రణ కోసం ఏకీకృత సంస్థ ఏర్పాటుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్‌లోని గాంధీ నగర్లో ఏర్పాటైంది. దీన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)గా వ్యవహరిస్తున్నారు. ఈ నియం త్రణ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, అయితే.. సీవీసీ, కాగ్ పరిధిలో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్‌లో జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు సంకేతం కాబోవని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలు చూస్తుంటే ఇక మన ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాల పెంపు, వ్యక్తిగత పన్నుల్లో కోత వంటి ప్రభుత్వ చర్యలు ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తాయని ట్వీట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తిహార్ జైలులో ఉన్న చిదంబరం గత కొంత కాలంగా మోదీ సర్కార్ ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ 4.5 శాతానికి పరిమితం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాలం చెల్లిన పద్ధతిలో జీడీపీని మదింపు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు జీడీపీ ప్రామాణికం కాదని బీజేపీ ఎంపీ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దూబే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇలాంటి ఆర్థిక వేత్తల నుంచి నవభారతాన్ని భగవంతుడే కాపాడాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. -
వాల్‌మార్ట్‌తో కలిసి... హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ భాగస్వామ్యంతో వాల్మార్డ్ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాల్‌మార్ట్ తాలూకు బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18– 50 రోజుల ఫ్రీ క్రెడిట్ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్‌ప్రైస్‌లో రిజిస్టరైన సభ్యులు ఈ కార్డులకు అర్హులని తెలియజేశారు. రెండు రకాల క్రెడిట్ కార్డులు (బెస్ట్‌ప్రైస్ సేవ్స్మార్ట్, బెస్ట్‌ప్రైస్ సేవ్ మాక్స్) అందుబాటులో ఉంటాయని, బీ2బీ కస్టమర్లు తమ కొనుగోళ్లకు అనుగుణమైన కార్డును ఎంచుకోవచ్చునని చెప్పారాయన. ఈ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల లాంటి పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలుంటాయన్నారు. త్వరలో కర్నూలు, తిరుపతిల్లో బెస్ట్‌ప్రైస్ దుకాణాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా క్రిష్ అయ్యర్ చెప్పారు. ఎకానమీలో మందగమనం త్వరలో సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని బెస్ట్‌ప్రైస్ స్టోర్లలో ఈ కార్డులను అందుబాటులోకి తెస్తామన్నారు. సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బెస్ట్‌ప్రైస్‌లో కస్టమర్లు జరిపిన లావాదేవీలను మదింపు చేసి కార్డులు జారీ చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్స్ బిజినెస్ విభాగం కంట్రీ హెడ్ పరాగ్ రావ్ చెప్పారు. ఈ కార్డుల వార్షిక ఫీజు రూ. 500– 1000 మధ్యలో ఉంటుందన్నారు. ‘‘సేవ్స్మార్ట్ కార్డుతో దాదాపు ఏటా రూ.14,250 మేర, మాక్స్ కార్డుతో ఏటా దాదాపు రూ.40,247 మేర సభ్యులు ఆదా చేసుకోవచ్చు. ఎస్ఎంఈ విభాగం దేశీయ ఎకానమీకి వెన్నెముక. ఈ విభాగానికి చేయూతనిచ్చే దిశగా ఈ కార్డులను తీసుకొచ్చాం’’ అని వివరించారు. ఎకానమీలో మందగమనం పూర్తిగా పోతుందనే సంకేతాలున్నాయని, ఇకపై రికవరీ చూడవచ్చని అంచనా వేశారు. కార్యక్రమంలో డైనర్స్ క్లబ్ ప్రతినిధి యానీ జాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్ది ఊహించినదానికంటే కనిష్టానికి పడిపోయింది. ప్రభుత్వం తాజాగా శుక్రవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో క్యు2లో జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్టం. ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడడం, కన్జూమర్ డిమాండ్ మందగమనం, అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు..ఎకానమీపై ప్రభావం చూపినట్టు నిపుణులు భావిస్తున్నారు. జీడీపీ వృద్ధి మరోసారి 5 శాతం కంటే కిందికి పడిపోయింది. గతంలో 2013 జనవరి- మార్చిలో జీడీపీ 4.3 శాతంగా నమోదయింది. గత ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 7.5 శాతంగా ఉంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వృద్ధిలో మందగమనం ఉంది కానీ మాంద్య పరిస్థితులు లేవని,పురోగతికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీడీ ఆరున్నర సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 4.5 శాతం వృద్ధిని సాధించినట్లు నేషనల్ స్టాటిస్టికల్ విభాగం శుక్రవారం వెల్లడించింది. మరోవైపు దేశీయ ఎకానమీ గత ఆరేళ్లలో అత్యంత కనిష్ఠ వృద్ధిని సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదు చేయవచ్చని రాయిటర్స్ పోల్ ఇప్పటికే అంచనావేసిన సంగతి తెలిసిందే. ఇది 4.7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేయగా, మరింత కిందికి దిగజారడం గమనార్హం. -
భారత్‌లో మాంద్యం లేదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్–అక్టోబర్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్‌లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక మంత్రి సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది. ► యూపీఏ–2 ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్ లేదా మైనస్ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి. ► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే. ► జూలై 5 బడ్జెట్ తరువాత బ్యాంకింగ్‌కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు. ► దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి. ► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది. ► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ► 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది. -
ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్ఎస్డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్ఎస్డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. దేశ జీడీపీ వృద్ధి జూన్ త్రైమాసికంలో 5%కి క్షీణించడం, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘అధిక శాతం ఎన్బీఎఫ్సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని దాస్ తెలిపారు. సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్‌చంద్ర కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్ ఈజ్ కింగ్!
పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా బయటపడినట్లేనా? సాక్షి, బిజినెస్ విభాగం: 2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభు త్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు..?!! మళ్లీ క్యాష్ జమానా! నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది. మరోవైపు, చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదన్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్ఏఎస్ వెల్లడించింది. మరి బ్లాక్‌మనీ సంగతి? నలుపు... తెలుపైపోయిందా? నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆర్బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి. ► రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు ► బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు ► వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు ► తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు డిజిటల్ లావాదేవీల్లోనూ వృద్ధి.. నోట్ల రద్దు తరవాత డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ సేవల్లోకి వస్తోంది. ఆర్బీఐ, ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి. మందగమనానికి బీజం.. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి. ► నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది. ► 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ► నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుదేలవటం గతేడాది నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది. కష్టాలకు అదే మూలం.. డీమోనిటైజేషన్ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి.. నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది. – అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత -
ఆర్థిక వ్యవస్థ మందగమనం..అయినా ఆదాయం
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇది సానుకూలమని, దేవుడు మనతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆదాయ వనరుల ఆర్జన శాఖలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం వల్ల లైసెన్స్ ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా, మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లను రాబట్టుకోవడానికి ఒక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని, ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయతి్నంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై గనుల శాఖ ప్రయత్నించాలని చెప్పారు. రంగాల వారీగా ఆదాయం గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. -
ఎకానమీ ఎదిగేలా చేస్తాం..
వాషింగ్టన్ : దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కార్ సవ్యంగా నిర్వహించడం లేదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ప్రభుత్వానికి తాను ఏం చేయాలనేది తెలుసునని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో మాట్లాడే వారిని ఎవరూ అడ్డుకోలేరని, అయితే ఆర్థిక వ్యవస్థను ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రభుత్వానికి తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఏయే రంగాలకు ఉత్తేజం కల్పించే చర్యలు అవసరమో తాము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవేమనని అంగీకరించారు. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందనేది గుర్తించే క్రమంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ల హయాంలోనే వీటికి బీజం పడిందన్నది వెల్లడైందని చెప్పారు. మన్మోహన్ సింగ్‌పై తనకు గౌరవం ఉందని, ఎవరినీ నిందించాలని తాము కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అత్యంత పారదర్శకంగా ఎదుగుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎకానమీపై తమ భరోసాను కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా వినాలని ఆమె చురకలు అంటించారు. కాగా భారత బ్యాంకుల దీనస్థితికి మన్మోహన్ సింగ్, రఘురామ్ రాజన్ల హయాంలో చేపట్టిన విధానాలే కారణమని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ సింగ్ స్పందించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం పక్కనపెట్టి ప్రత్యర్ధులపై నిందలు మోపడంలో నిమగ్నమైందని డాక్టర్ సింగ్ వ్యాఖ్యానించారు. -
నిర్మలా సీతారామన్ భర్త సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి భరోసా ఇస్తోంటే..ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఇందుకు భిన్నంగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులపై మండిపడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మాంద్య పరిస్థితిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదన ఒప్పుకోవడానికి విముఖత చూపుతోందంటూ ‘ ది హిందూ’లో ప్రచురించిన ఒక కాలమ్‌లో ఆయన బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం.. ఒకదాని తరువాత ఒకటి పలు సెక్టార్లు తీవ్రమైన సవాళ్లును ఎదుర్కొంటుండగా, బీజేపీ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్న కారణాలను విశ్లేషించలేకపోతోందన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాత్మక దృష్టి ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయంలో పార్టీ థింక్ ట్యాంక్ కూడా విఫలమైందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించే ఒక చిన్న మార్గాన్ని కూడా ప్రభుత్వం చూపలేకపోతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక మందగమనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖంగా లేదన్నారు. ప్రభుత్వం తిరస్కరణ మోడ్‌లో ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు "నెహ్రూ సోషలిజాన్ని విమర్శించటానికి" బదులుగా, ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు మార్గం సుగమం చేసిన రావు-సింగ్ ఆర్థిక నమూనాను బీజేపీ అవలంబించాలని సూచించారు. ఆ ఇద్దరు ప్రధానులూ (పీవీ నరసింహారావు, మన్ మోహన్ సింగ్) పాటించిన విధానాలు ఆర్ధిక సరళీకరణకు దోహదం చేశాయనీ, ఈ విషయాన్ని గుర్తించి వాటిని పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు. సీతారామన్ స్పందన దీనిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించినప్పుడు 2014 నుండి 2019 వరకు ప్రాథమిక సంస్కరణలు అనేకం చేసామని జవాబిచ్చారు. జీఎస్టీ, ఆధార్, గ్యాస్ పంపిణీ లాంటి ఇతర ప్రజా ప్రయోజన పథకాలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమాలు ఎకానమీ వృద్దికి దోహదపడడం లేదా అని ఆమె ప్రశ్నించారు. దీంతోపాటు ఆర్ధిక వృద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. -
బీజేపీ స్వయంకృతం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మాని... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం బీజేపీ స్వయంకృతమని, అన్ని అంశాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే వృద్ధిరేటు మందగమనంలో సాగుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం.. ఆర్థిక మాంద్యం కొనసాగుతోందనేందుకు సూచన అని ఆయన చెప్పారు. ఇంతకంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక వేత్తలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. తయారీ రంగం వృద్ధి 0.6 శాతం మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో లోపాల ఫలితాల నుంచి దేశం బయటపడలేదు అనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, వాటి స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ నుంచి అందిన రూ.1.76 లక్షల కోట్లతో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నది నిజమైతే... ఆర్బీఐకు పరీక్షేనని అన్నారు. పన్ను ఆదాయంలో భారీ కోత పడగా.. చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వేధింపులకు గురవుతున్నారన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని, గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
మోదీపై సర్దార్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్టస్ధాయిలో 5 శాతానికి పతనమైన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ మోదీ సర్కార్‌ను తప్పుపట్టడం గమనార్హం. వృద్ధి రేటు ఈ స్ధాయిలో కొనసాగడం దేశానికి మంచిది కాదని, ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మాని వ్యక్తుల తప్పిదాలతో కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు కదలాలని వీడియో ప్రకటనలో మన్మోహన్ హితవు పలికారు. గత త్రైమాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం మనం సుదీర్ఘ మందగమనంలోకి వెళ్లే స్థితిలో ఉన్నామనేందుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 1991లో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సందర్భంలో మన్మోహన్ సింగ్ పీవీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
వృద్ధి బాటలో చిన్న మందగమనమే!
ముంబై: భారత్ ప్రస్తుత మందగమన పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందని పేర్కొంది. దీనిని సైక్లికల్ ఎఫెక్ట్ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది. 2018–19 (జూలై–జూన్) వార్షిక నివేదికను ఆర్బీఐ గురువారం ఆవిష్కరించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఏమిటి అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే సమస్యలు వ్యవస్థాపరమైనవి కావు. భూ, కార్మిక, వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్ రంగాల్లో మాత్రం సంస్కరణలు అవసరం. ► భారీ వృద్ధికి ముందు చిన్న కుదుపా లేక అప్ అండ్ డౌన్స్‌లో భాగమా? లేక వ్యవస్థాగత మందగమనమా? అన్నది ప్రస్తుతం ప్రశ్న. అయితే భారీ వృద్ధికి ముందు మందగమనం, సైక్లింగ్ ఎఫెక్ట్ అని మాత్రమే దీనిని చెప్పవచ్చు. తీవ్ర వ్యవస్థాగత అంశంగా దీనిని పేర్కొనలేము. ► వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019–20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది. ► బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలను పటిష్టం చేయాలి. మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది. కార్మిక చట్టాలు, పన్నులు, ఇతర న్యాయ సంస్కరణల అంశాల్లో వ్యవస్థాగత సంస్కరణల అమలు అవసరం. ► దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉన్నాయి. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలి. ► వ్యాపార పరిస్థితులు మెరుగుపరచాలి. ► రైతుల రుణ మాఫీ, ఏడవ వేతన కమిషన్ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు పథకాలు ఆర్థిక క్రమశిక్షణా పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆయా పరిస్థితులతో ఆర్థిక ఉద్దీపన అవకాశాలకూ విఘాతం. ► ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి వంటివి ప్రధానం. ► బ్యాంకింగ్‌లో వేగంగా విలీనాల ప్రక్రియ. ► ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వైఫల్యం నేపథ్యంలో– వాణిజ్య రంగానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) రుణం 20 శాతం పడిపోయింది. 2017–18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే, 2018–19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లు. ► అమెరికా–చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది అంతర్జాతీయ మందగమన పరిస్థితులకు దారితీసి, ఫైనాన్షియల్ మార్కెట్లపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ► బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గాయి. 2017–18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018–19లో 9.1 శాతానికి తగ్గాయి. మొండిబకాయిల సమస్య తగ్గడంలో దివాలా చట్టం కూడా కీలకం. ► బ్యాంక్ మోసాల విలువ 2018–19లో రూ.71,543 కోట్లకు చేరాయి. 2017–18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగింది. ఇక కేసులు, 15% పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరాయి. ► ప్రైవైటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలోనే విడుదల. ► యువతకు ఆర్బీఐ పట్ల అవగాహన పెంచేం దుకు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను విస్తృతంగా ఉపయోగించుకోవడం. రూ.1.96 లక్షల కోట్లకు ఆర్బీఐ అత్యవసర నిధి కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో ఆర్బీఐ వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది. ఆర్బీఐ 2018–19 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 2019 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఆర్బీఐ గురువారం ఆవిష్కరించింది. మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను సోమవారంనాడు ఆర్బీఐ బోర్డ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. బ్యాలెన్స్ షీట్లో ఆర్బీఐ క్యాపిటల్ రిజర్వ్స్ బఫర్స్ పరిమాణం 5.5 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. ఎటువంటి ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనగల అత్యున్నత స్థాయి కలిగిన సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్బీఐ ఒకటని 2018–19 వార్షిక నివేదిక పేర్కొంది. 2018 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వద్ద అత్యవసర నిధి పరిమాణం రూ. 2,32,108 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రానికి అందివచ్చిన 52,000 కోట్లు ఆర్బీఐకి సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరం లెక్కలో వేస్తే, ప్రభుత్వానికి వచ్చే సరికి ఈ నిధులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి అందినట్లు అవుతుంది. -
పావెల్ ‘ప్రకటన’ బలం
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో 10 రోజుల క్రితం న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్‌కు (31.1గ్రా) 1,440 డాలర్లను తాకిన పసిడి ధర, లాభాల స్వీకరణతో 1,388 డాలర్ల స్థాయిని తిరిగి తాకింది. అయినప్పటికీ 1,366 డాలర్ల పటిష్ట మద్దతు స్థాయిని కోల్పోకపోవడం గమనార్హం. 12వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో మళ్లీ 1,423 డాలర్లను చేరింది. చివరకు వారం వారీగా దాదాపు 20 డాలర్లు ఎగసి 1418 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) తగ్గింపుకు వీలుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ పావెల్ పంపిన సంకేతాలు పసిడిని మళ్లీ పటిష్ట స్థితికి చేర్చాయి. అయితే వారం వారీగా వెలువడిన ఉపాధి కల్పన గణాంకాలు, ద్రవ్యోల్బణం పెరగడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మళ్లీ కొంత ఊతాన్నిచ్చాయి. చివరకు పసిడి 1,418 డాలర్ల వద్ద ముగిసింది. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వాతావరణం తొలిగిపోతుందన్న విషయంలో స్పష్టత లేకపోవడం, దీనితో డాలర్ ఇండెక్స్ (వారం ముగింపునకు 96.42) భారీగా పెరిగే అవకాశాలు లేకపోవడం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు దీర్ఘకాలంలో బంగారానికి బలాన్ని ఇచ్చే అంశాలేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే పసిడి తిరిగి 1,360 డాలర్ల స్థాయి దిగువకు వస్తే, 1,300 డాలర్ల స్థాయిని కూడా చూసే అవకాశం ఉందనీ, ఇది కొనుగోళ్లకు మంచి అవకాశమనీ వారు పేర్కొంటున్నారు. భారత్‌లో పరుగునకు ‘రూపాయి’ అడ్డు.. నిజానికి అంతర్జాతీయంగా ధర పెరిగినప్పటికీ, భారత్‌లో ఆ మేర పెరుగుదల కనిపించడం లేదు. డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట (68.68) ధోరణి దీనికి కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో 10 గ్రాములకు 34,905 వద్ద ముగిసింది. అయితే ధర తీవ్రత వల్ల స్పాట్ మార్కెట్లో కస్టమర్లు కొనుగోళ్లకు ‘వేచిచూసే’ ధోరణిని అవలంబిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సమీపకాలంలో పసిడి ధరలు రూ.30 వేల కిందకు దిగిరాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు శుక్రవారం రూ.35,280 రూ.33,600 వద్ద ముగిశాయి. -
యూపీఏలో ‘ఫోన్కో లోన్’
న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లుగా రుణాలు మంజూరుచేసి గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. నిరర్థక ఆస్తుల పాపం మన్మోహన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నామ్‌దార్(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి)లు ఫోన్లు చేసిన వెంటనే, వారి సన్నిహిత వ్యాపారులకు భారీగా రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇలా ‘ఫోన్కొక లోన్’ చొప్పున యూపీఏ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని, దీంతో మొండిబకాయిలు పెరిగాయన్నారు. రుణ ఎగవేతదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని హామీనిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ల్యాండ్‌మైన్‌పై ఉంచిన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్æ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. సుమారు రూ.1.75 లక్షల కోట్ల నిర్థరక ఆస్తులుగా మిగిలిపోయిన రుణాల్లో ఏదీæ ఎన్డీయే హయాంలో మంజూరు కాలేదని తెలిపారు. బ్యాంకులను దోచుకున్నారు.. తిరిగిరాని మొండిబకాయిలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని, తామొచ్చి వాటిని గుర్తించి రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేశామన్నారు. నిరర్థక ఆస్తులను యూపీఏ రూ.2.5 లక్షల కోట్లుగా ప్రకటించి దేశాన్ని మోసం చేసిందని, వాటి విలువ రూ.9 లక్షల కోట్లని తెలిపారు. 2008–14 కాలంలో బ్యాంకు రుణాలు రూ.52 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఈ రుణాలు రూ.18 లక్షల కోట్లేనన్నారు. ‘నిబంధనలు పాటించకుండా రుణాలిచ్చారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పేరిట మరిన్ని రుణాలిచ్చారు. నామ్దార్ల నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌తో వారి సన్నిహిత వ్యాపారవేత్తలు భారీగా రుణాలు పొందారు. బ్యాంకుల ఉన్నతాధికారులను నియమించేది నామ్దార్లే కాబట్టి, వారి మాటకు తిరుగేలేద’ అని మోదీ అన్నారు. ఎమ్మెల్యే అయ్యాకే ఖాతా తెరిచా.. ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు క్రియాశీల బ్యాంకు ఖాతా లేదని మోదీ అన్నారు. చిన్నతనంలో బ్యాంకులో వేసేందుకు తగినంత నగదు లేకపోవడమే అందుకు కారణమన్నారు. పాఠశాల రోజుల్లో విద్యార్థులకు దేనా బ్యాంకు ఖాతా ఇచ్చిందని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో ఆ ఖాతాను ఖాళీగా ఉంచినట్లు గుర్తుచేసుకున్నారు. చివరకు 32 ఏళ్ల తరువాత బ్యాంకు అధికారులు తన వద్దకు వచ్చి ఖాతాను మూసేసేందుకు సంతకం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అయ్యాక జీతం తీసుకునేందుకు ఖాతాను తెరిచానన్నారు. ముంగిట్లోకి బ్యాంకింగ్ న్యూఢిల్లీ: సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ప్రారంభించినదే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ). ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు లేవు. రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు. ఐపీపీబీ విశేషాలు.. ► ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్స్ఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్‌పార్టీ ఫండ్ ట్రాన్స్ఫర్స్ తదితర సేవలు అందిస్తాయి. ► డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ► వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు. ► రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్జ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు. ► కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. ► ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. ► లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్మార్ట్ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు. ► ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది. ► ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు. ► 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది. -
యశ్వంత్ పంచ్: యూపీఏను ఎలా నిందిస్తారు
సాక్షి,న్యూఢిల్లీః ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితిపై మోదీ సర్కార్‌కు షాక్‌లు ఇచ్చిన బీజేపీ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా మళ్లీ పంచ్‌లు పేల్చారు.ఆర్థిక వృద్ధి రేటు పతనంపై గత యూపీఏ ప్రభుత్వాన్ని మనం నిందిచలేమని, పరిస్థితి చక్కదిద్దేందుకు మనకు తగినంత సమయం, అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఎంతో కాలంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోఉందని తాజా గణాంకాలపై తానేమీ మాట్లాడబోనని అన్నారు. గత ఆరు త్రైమాసికాల నుంచీ ఆర్థిక వ్యవస్థ పతనం కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత దుస్థితికి నోట్ల రద్దే కారణమని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు సహా అన్ని రంగాలపై నోట్ల రద్దు ప్రభావం అంచనా వేయాల్సి ఉందని, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయం వెలువడాల్సి ఉందన్నారు. సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోలేదని తప్పుపట్టారు.ఇక జీఎస్టీ గురించి తన వ్యాసంలో యశ్వంత్ ప్రస్తావిస్తూ నూతన పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టిన తీరు, అమలు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. -
యశ్వంత్‌ను వెనుకేసుకొచ్చిన శత్రుఘ్న్ సిన్హా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై విమర్శలు గుప్పించిన తమ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సమర్ధించారు. సిన్హా అసలైన రాజనీతిజ్ఖుడని వాస్తవ పరిస్థితినే ఆయన ప్రతిబింబించారని వ్యాఖ్యానించారు. పలు అంశాలపై పార్టీ వైఖరితో విభేదించిన బిహార్ ఎంపీ శత్రుఘ్న సిన్హా యశ్వంత్‌ను విమర్శించిన నేతలనూ టార్గెట్ చేశారు. పార్టీ, దేశ ప్రయోజనాల కోసం యశ్వంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు. యశ్వంత్ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చేయడం చౌకబారు, దిగజారుడు చర్యలేనని వరుస ట్వీట్లలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యమని, జాతి ప్రయోజనాలే ముందువరుసలో ఉంటాయని ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యశ్వంత్ సిన్హా రాసిన ప్రతి ఒక్కటీ పార్టీ, దేశ ప్రయోజనాల కోణంలోనే ఉన్నదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నానని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యశ్వంత్ పేరొందారని, దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. -
ఆర్థిక వ్యవస్థ మందగించొచ్చు: రాష్ట్రపతి
పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. నల్లధనాన్ని అరికట్టి, అవినీతిపై పోరాటం కోసం ఉద్దేశించిన పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అయితే.. ఈ నిర్ణయం వల్ల పేదలు ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకు మనమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు. దీర్ఘకాలంలో అంచనావేస్తున్న ఫలితాలు రావాలంటే తాత్కాలికంగా ఈ ఇబ్బందులు తప్పవని కూడా ఆయన తెలిపారు.