ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్ మార్కెట్‌ను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. దీంతో మార్కెట్‌లో మూడురోజుల వరుస అమ్మకాలకు బుధవారం బ్రేక్ పడింది. ఒక్క రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 424 పాయింట్లు పెరిగి 48,678 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 14,618 వద్ద నిలిచింది.
కరోనా వ్యాప్తి వేళ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్‌బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా వైద్య రంగ బలోపేతానికి రూ.50 వేల కోట్ల ఫండ్‌ను ప్రకటించారు. భారీ ఎత్తున నిధుల కేటాయింపు ప్రకటనతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 489 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ., చిత్రంగా విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు ఇరువురూ అమ్మకాలు జరిపారు. ఎఫ్‌ఐఐలు రూ.1,111 కోట్ల కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.241 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
‘‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత ఏర్పడకుండా మే 20 నుంచి రూ.35వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు ప్రక్రియను చేపడతామని ఆర్‌బీఐ ప్రకటన ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ఇచ్చింది. దేశీయ ఇండెక్స్‌కు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్‌సీఐ) రీ–బ్యాలెన్సింగ్(సవరణ)తో కొన్ని ఎంపిక చేసుకున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఏప్రిల్ సేవల రంగ గణాంకాలు నెల ప్రాతిపదికన నిరుత్సాహపరిచినప్పటికీ.., క్వార్టర్ టు క్వార్టర్ ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది.’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు.
బ్యాంకింగ్ షేర్లకు ఆర్‌బీఐ బూస్టింగ్...
కరోనా రెండో దశను సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు బ్యాంకింగ్ రంగానికి అవసరమైన తోడ్పాటును అందిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటనతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభపడ్డాయి. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మొండిబకాయిల అంశంలో వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకులకు అనుమతులిస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు. ఆర్థికపరమైన ఈ విధాన చర్యలతో బ్యాంకింగ్ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగానికి చెందిన కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండున్నర శాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు 2–1% ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ, ప్రైవేట్ రంగ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment