సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై విమర్శలు గుప్పించిన తమ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సమర్ధించారు. సిన్హా అసలైన రాజనీతిజ్ఖుడని వాస్తవ పరిస్థితినే ఆయన ప్రతిబింబించారని వ్యాఖ్యానించారు. పలు అంశాలపై పార్టీ వైఖరితో విభేదించిన బిహార్ ఎంపీ శత్రుఘ్న సిన్హా యశ్వంత్‌ను విమర్శించిన నేతలనూ టార్గెట్ చేశారు. పార్టీ, దేశ ప్రయోజనాల కోసం యశ్వంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు.
యశ్వంత్ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చేయడం చౌకబారు, దిగజారుడు చర్యలేనని వరుస ట్వీట్లలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యమని, జాతి ప్రయోజనాలే ముందువరుసలో ఉంటాయని ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యశ్వంత్ సిన్హా రాసిన ప్రతి ఒక్కటీ పార్టీ, దేశ ప్రయోజనాల కోణంలోనే ఉన్నదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నానని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యశ్వంత్ పేరొందారని, దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు.