Yaswant sinha
-
పొలిటికల్ రీఎంట్రీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. దీంతో విపక్షాల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పొలిటికల్ రీఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజాసేవలో ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపైనా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు సిన్హా. ‘నేను స్వతంత్రంగానే ఉంటాను. ఏ ఇతర పార్టీలో చేరను. నాతో ఎవరూ మాట్లాడలేదు. నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే.. వ్యక్తిగత కారణాలతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేతతో మాట్లాడాను. ప్రజా సేవలో ఏ పాత్ర పోషించాలనేది తేల్చాల్సి ఉంది. ఇప్పుడు నాకు 84 ఏళ్లు. దాని వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఎన్నిరోజులు ప్రజా జీవితంలో కొనసాగుతోనో చూడాలి.’ అని పేర్కొన్నారు యశ్వంత్ సిన్హా. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం 2021, మార్చిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటే చేసే క్రమంలో టీఎంసీకి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు -
రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు పంచారు: యశ్వంత్ సిన్హా
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే చేయడం లేదు.. ప్రభుత్వ సంస్థలపై కూడా చేస్తున్నాను. వాళ్లు(అవతలి పక్షాలను ఉద్దేశించి..) చాలా శక్తివంతంగా మారారు. తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తూ పార్టీలను చీల్చారు. ఒకానొక దశలో డబ్బుతో ప్రలోభ పెట్టారు కూడా. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దేశ ప్రజాస్వామ్యానికి మార్గాన్ని నిర్దేశిస్తాయి, అది నిలుస్తుందా లేదంటే ముగుస్తుందా అనేది చూడాలి. ఓటర్లందరూ తమ ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రహస్య బ్యాలెట్ ఓటింగ్. వారు తమ విచక్షణను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నన్ను ఎన్నుకుంటారని ఆశిస్తున్నా అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. I am not just fighting a political fight but a fight against govt agencies too. They have become too powerful. They are breaking up parties, forcing people to vote for them. There is also a game of money involved: Opposition Presidential candidate Yashwant Sinha pic.twitter.com/l5BydMLWAD — ANI (@ANI) July 18, 2022 -
ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు. తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్ కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు. యాదృచికంగా సిన్హా జూన్21న తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది. దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం. (చదవండి: యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్) -
హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఈ మేరకు జలవిహార్‌లో మంత్రి తలసాని మాట్లాడుతూ.. 'యశ్వంత్‌సిన్హా పర్యటనలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, గ్రేటర్ ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా యశ్వంత్ సిన్హాని రిసీవ్ చేసుకుంటారు. బేగంపేట నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీగా వస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌లో పాల్గొనే వారందరూ ఇక్కడ పాల్గొంటారు. ఓ వైపు బీజేపీ మీటింగ్ జరుగుతుంది. మరోవైపు యశ్వంత్ సిన్హా సమావేశం జరుగుతంది. ఈ ఎనిమిదేళ్లో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో పప్పులు ఉడకవు. రేపు హైదరాబాద్‌కి వచ్చే నేతలు నగర అందాలని చూస్తారు. ఈ మూడు రోజులు అనేక మంది టూరిస్టులుగా వచ్చి చూసి వెళ్లిపోతారు. దేశంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా మూడేళ్లయింది. సికింద్రాబాద్‌లో ఏ పని చేశారో చెప్పాలి. బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయడదు' అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. చదవండి: (కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్) -
చెన్నైలో స్టాలిన్‌ను కలిసిన యశ్వంత్ సిన్హా
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురువారం చెన్నైకి వచ్చారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా వారిని కోరారు. ఇదిలా ఉండగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూలై 2న చెన్నై, పుదుచ్చేరిలో పర్యటించి మిత్రపక్షాలను కలుసుకుని మద్దతు కోరనున్నారు. చదవండి: (మహారాష్ట్ర: షిండే రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం) -
రాజకీయ భేటీ కాదు!.. ఎన్సీపీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాల మధ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో రాష్ట్రీయ మంచ్ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయమంచ్ వ్యవస్థాపకుడు యశ్వంత్ సిన్హా అధ్యక్షత వహించారు. ఇది రాజకీయ భేటీ కాదని, భావసారూప్యం కలిగిన పార్టీలు, మేధావుల భేటీగా ఎన్సీపీ పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారి పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సమాజంలోని కీలక వ్యక్తులు రాష్ట్రీయ మంచ్ వేదికపై ప్రత్యక్షంగా ఒకేచోట సమావేశమయ్యారు. ఈ భేటీలో శరద్ పవార్ (ఎన్సీపీ), యశ్వంత్ సిన్హా (తృణమూల్ కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఘన్‌శ్యామ్ తివారీ (సమాజ్‌వాదీ పార్టీ), జయంత్ చౌధరి (రాష్ట్రీయ లోక్‌దళ్), సుశీల్ గుప్తా (ఆప్), బినోయ్ విశ్వం (సీపీఐ), నీలోత్పల్ బసు( సీపీఎం), సంజయ్ ఝా (కాంగ్రెస్ మాజీ నేత), సుప్రియా సులే (ఎన్సీపీ) వంటి నాయకులతో పాటు జావేద్ అక్తర్, మాజీ బ్యూరోకాట్ కేసీ సింగ్, రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా వంటి మేధావులతో కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్రోల్ – డీజిల్ ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కోవిడ్ మేనేజ్మెంట్, వ్యవస్థలపై దాడి, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను చర్చకొచ్చాయని భేటీలో పాల్గొన్న వారు తెలిపారు. ఈ భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఈ సమావేశం రెండున్నర గంటల పాటు జరిగిందని, అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా... కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను ఎన్సీపీ నాయకుడు మజీద్ మెమన్ తిరస్కరించారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ మంచ్ చీఫ్ యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేశారని, పవార్ కాదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కపిల్‌సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మనీష్ తివారీలకు కూడా ఆహ్వానించామని, ఇతర కారణాల వల్ల వారు హాజరుకాలేదని తెలిపారు. సీపీఎం నేత నీలోత్పల్ బసు కూడా ఇది భావసారూప్యత కలిగిన వ్యక్తుల మధ్య సమావేశమేనని, దీన్ని రాజకీయ భేటీగా చూడకూడదని అన్నారు. -
బీజేపీ నన్నో సవతి కొడుకులా చూస్తోంది
పట్నా : వెటరన్ నటుడు, ‘షాట్ గన్’ శతృఘ్న సిన్హా సొంత పార్టీ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిలాంటి పార్టీ ఇప్పుడు తనపై సవతి ప్రేమను చూపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనన్న కథనాలు వెలువడుతున్నాయి. వీటిపై శుక్రవారం ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ని సంప్రదించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ పార్టీ నాకు అమ్మలాంటిది. కానీ, సొంత పార్టీ నేతలే నాపై సవతి ప్రేమను చూపిస్తూ నన్ను దూరం పెడుతున్నారు. మాట్లాడటం తప్పించి పార్టీ కోసం ఏ పని చేయలేకపోతున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే నన్ను అణిచివేస్తున్నారేమో అనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పార్టీపై ఇంతకన్నా ఎక్కువే విమర్శలే చేశాను. అయినా టికెట్ దక్కింది కదా!. ఇప్పుడు కూడా అంతే’’ అంటూ ఆయన బదులిచ్చారు. ఇక బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రైతులు, నిరుద్యోగుల హక్కుల సాధనకై ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను స్థాపించిన విషయం తెలిసిందే. అందులో తాను కూడా చేరటంపై ఈ బీజేపీ ఎంపీ స్పందించారు. 'రాష్ట్ర మంచ్' రాజకీయ పార్టీ కాదని.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించటం.. సమస్యలపై పోరాటం కోసమే ఏర్పాటు చేసిందని చెప్పారు. తానూ, యశ్వంత్ సిన్హా ఇద్దరమూ బీజేపీలోనే ఉన్నామని శతృఘ్న సిన్హా స్పష్టతనిచ్చారు. అయితే వీరిద్దరి వ్యవహారం రాను రాను మరీ శ్రుతిమించుతోందని.. వేటు వేయాల్సిందేనంటూ పలు రాష్ట్రాల విభాగాలు అధిష్ఠానానికి ఇప్పటికే లేఖలు రాశాయి. -
యశ్వంత్, శత్రుఘ్నల ‘రాష్ట్ర మంచ్’.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్ల స్థాయికి తెచ్చిందని బీజేపీ అసమ్మతి ఎంపీ యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలను బీజేపీ చూపుతోందన్నారు. బీజేపీకి చెందిన మరో ఎంపీ శత్రుఘ్న సిన్హా సహా పలువురు నేతలతో కలసి ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను యశ్వంత్ సిన్హా మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర మంచ్ అనేది పార్టీయేతర రాజకీయ కార్యాచరణ బృందమనీ, ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదనీ, కేవలం దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని యశ్వంత్‌సిన్హా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేపడతామన్నారు. కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, ఆప్ ఎంపీలు వరసగా రేణుకా చౌదరి, దినేశ్ త్రివేది, మజీద్ మెమన్, సంజయ్ సింగ్లతోపాటు గుజరాత్ మాజీ సీఎం సురేశ్ మెహతా తదితరులు కూడా రాష్ట్ర మంచ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఆయన ఎందుకలా మాట్లాడారంటే...
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారాయి. సొంత చేసిన కామెంట్లను ఎక్కుపెట్టి బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ఆయన వ్యక్తిగతంగా మనోవేదనతోనే అలా మాట్లాడి ఉంటారని బీజేపీ చెబుతోంది. బీజేపీ జాతీయ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ స్పందిస్తూ... పదేళ్ల యూపీఏ ప్రభుత్వం అవినీతిమయమన్నది అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ, చిదంబరంతోపాటు పని లేని మరికొందరు అదే పనిగా ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు. బహుశా వ్యక్తిగతంగా వైఫల్యం చెందిన ఆ బాధతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారేమో అని యశ్వంత్ సిన్హాను ఉద్దేశించి పరోక్షంగా గోపాలకృష్ణ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అంశాలతోపాటు జీడీపీపై కూడా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చాలా స్పష్టమైన ప్రకటనలు చేశారు. నష్టాలు ఏవీ ఉండబోవని భరోసా ఇస్తూనే ప్రజల అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. అలాంటప్పుడు ఆయన (యశ్వంత్) అలా మాట్లాడటం సరికాదని అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో మోదీ ప్రభుత్వం నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ మునిగిపోయిందంటూ కథనం రాసిన బీజేపీ సీనియర్ నేత తర్వాత ‘ఇండియా @ 70.. మోదీ @3.5 అనే పుసక్తావిష్కరణలో సొంత పార్టీపై చేసిన విమర్శలను సమర్థించుకున్నారు కూడా. కేంద్ర మాజీ మంత్రిగా తానేం రాజభోగాలు అనుభవించటం లేదంటూనే మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. జైట్లీ స్ట్రాంగ్ రియాక్షన్... తనపై వ్యక్తిగతంగా యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగానే స్పందించారు. ముందు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన ఆయన.. తర్వాత యశ్వంత్ ను వదల్లేదు. యూపీఏ హయాంలోని పాలసీలన్నీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినవే. ప్రస్తుతం ఎన్టీయే హయాంలో వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం అని జైట్లీ చెప్పారు. ఇక యశ్వంత్‌ను ఉద్దేశించి ఆయన ఆవిషర్కించిన పుస్తకానికి ‘ఇండియా @ 70.. మోదీ @3.5 నిరుద్యోగి @80’ అని పెట్టాల్సిందంటూ జైట్లీ వ్యంగ్య కామెంట్ చేశారు. మూడేళ్ల మోదీ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయన్న జైట్లీ.. గతంలో ఆర్థిక మంత్రిగా సిన్హా నిర్వర్తించిన బాధ్యతల కంటే తాను మెరుగ్గా పని చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు యశ్వంత్ తనయుడు జయంత్ సిన్హా తండ్రి వ్యాఖ్యలను ఖండించటం తెలిసిందే. -
యశ్వంత్‌ను వెనుకేసుకొచ్చిన శత్రుఘ్న్ సిన్హా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై విమర్శలు గుప్పించిన తమ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సమర్ధించారు. సిన్హా అసలైన రాజనీతిజ్ఖుడని వాస్తవ పరిస్థితినే ఆయన ప్రతిబింబించారని వ్యాఖ్యానించారు. పలు అంశాలపై పార్టీ వైఖరితో విభేదించిన బిహార్ ఎంపీ శత్రుఘ్న సిన్హా యశ్వంత్‌ను విమర్శించిన నేతలనూ టార్గెట్ చేశారు. పార్టీ, దేశ ప్రయోజనాల కోసం యశ్వంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు. యశ్వంత్ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చేయడం చౌకబారు, దిగజారుడు చర్యలేనని వరుస ట్వీట్లలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యమని, జాతి ప్రయోజనాలే ముందువరుసలో ఉంటాయని ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యశ్వంత్ సిన్హా రాసిన ప్రతి ఒక్కటీ పార్టీ, దేశ ప్రయోజనాల కోణంలోనే ఉన్నదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నానని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యశ్వంత్ పేరొందారని, దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. -
యశ్వంత్ సిన్హాకు బెయిల్ మంజూరు
జార్ఖండ్ : బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాకు బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి యశ్వంత్ సిన్హా జైల్లోనే ఉన్నారు. న్యాయస్థానం సిన్హాతో పాటు మరికొంతమందికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ నిన్న యశ్వంత్ సిన్హాను కలిశారు. ఇరువురు నేతలూ దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. -
జార్ఖండ్ సీఎంగా యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి
* బీజేపీ అగ్ర నేత అద్వానీ ఉద్ఘాటన * యశ్వంత్ సిన్హాతో జైల్లో 2 గంటలకు పైగా భేటీ హజారీబాగ్: జార్ఖండ్ సీఎంగా బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది జార్ఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాయకత్వం వహించాలని సిన్హాను కోరారు. తక్షణమే బెయిల్‌పై బయటకు రావాలని కోరారు. విద్యుత్ ఉద్యమం నేపథ్యంలో ఆ శాఖ అధికారిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై ప్రస్తుతం హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్న యశ్వంత్ సిన్హాను అద్వానీ మంగళవారం కలిశారు. ఇరువురు నేతలూ దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్‌కు చెందిన యశ్వంత్ సిన్హా ఆరాష్ట్ర సీఎం అభ్యర్థిగా సరైన వ్యక్తని పేర్కొన్నారు. ‘బీజేపీ నేతల నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ఆయనకు బీజేపీ నేతల అభిప్రాయాలను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్క జార్ఖండ్ నేతల నుంచే కాదు. దేశ వ్యాప్తంగా పార్టీ నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఇక ఆయన జైలు నుంచి బయటకు వచ్చి జార్ఖండ్‌లో బీజేపీ పగ్గాలు చేపట్టాలి’ అని అద్వానీ అన్నారు. హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై అక్కడి కుగ్రామాల ప్రజలకు మద్దతుగా యశ్వంత్ సిన్హా చరిత్రాత్మక ఉద్యమం ప్రారంభించారని కొనియాడారు. ఆయనకు పార్టీ సహా అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. -
యశ్వంత్ సిన్హా తలకు గాయాలు
పాట్నా: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని హజారీ బాగ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యశ్వంత్ సిన్హా తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఆయన జైల్లో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న సమయంలో కుర్చీ విరగిపోవడంతో ఆయన కింద పడిపోయారు. జైలు సిబ్బంది వెంటనే ఆయనకు చికిత్స చేయించారు. హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో స్థానిక కోర్టు యశ్వంత్ సిన్హాను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. బెయిల్ తీసుకోవడానికి నిరాకరించడంతో సిన్హాతో పాటు మరో 54 మందికి రిమాండ్ విధించారు. విద్యుత్ కొరతకు నిరసనగా సిన్హా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జైలుకు
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. బెయిల్ కోరడానికి నిరాకరించడంతో సిన్హాతోపాటు మరో 54 మందికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆర్బీ పాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కొరతకు నిరసనగా సిన్హా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.