కోల్‌కతా: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. దీంతో విపక్షాల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పొలిటికల్ రీఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజాసేవలో ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపైనా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు సిన్హా.
‘నేను స్వతంత్రంగానే ఉంటాను. ఏ ఇతర పార్టీలో చేరను. నాతో ఎవరూ మాట్లాడలేదు. నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే.. వ్యక్తిగత కారణాలతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేతతో మాట్లాడాను. ప్రజా సేవలో ఏ పాత్ర పోషించాలనేది తేల్చాల్సి ఉంది. ఇప్పుడు నాకు 84 ఏళ్లు. దాని వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఎన్నిరోజులు ప్రజా జీవితంలో కొనసాగుతోనో చూడాలి.’ అని పేర్కొన్నారు యశ్వంత్ సిన్హా.
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం 2021, మార్చిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటే చేసే క్రమంలో టీఎంసీకి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment