శతృఘ్న సిన్హా (పాత చిత్రం)
పట్నా : వెటరన్ నటుడు, ‘షాట్ గన్’ శతృఘ్న సిన్హా సొంత పార్టీ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిలాంటి పార్టీ ఇప్పుడు తనపై సవతి ప్రేమను చూపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనన్న కథనాలు వెలువడుతున్నాయి.
వీటిపై శుక్రవారం ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ని సంప్రదించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ పార్టీ నాకు అమ్మలాంటిది. కానీ, సొంత పార్టీ నేతలే నాపై సవతి ప్రేమను చూపిస్తూ నన్ను దూరం పెడుతున్నారు. మాట్లాడటం తప్పించి పార్టీ కోసం ఏ పని చేయలేకపోతున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే నన్ను అణిచివేస్తున్నారేమో అనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పార్టీపై ఇంతకన్నా ఎక్కువే విమర్శలే చేశాను. అయినా టికెట్ దక్కింది కదా!. ఇప్పుడు కూడా అంతే’’ అంటూ ఆయన బదులిచ్చారు.
ఇక బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రైతులు, నిరుద్యోగుల హక్కుల సాధనకై ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను స్థాపించిన విషయం తెలిసిందే. అందులో తాను కూడా చేరటంపై ఈ బీజేపీ ఎంపీ స్పందించారు. 'రాష్ట్ర మంచ్' రాజకీయ పార్టీ కాదని.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించటం.. సమస్యలపై పోరాటం కోసమే ఏర్పాటు చేసిందని చెప్పారు. తానూ, యశ్వంత్ సిన్హా ఇద్దరమూ బీజేపీలోనే ఉన్నామని శతృఘ్న సిన్హా స్పష్టతనిచ్చారు. అయితే వీరిద్దరి వ్యవహారం రాను రాను మరీ శ్రుతిమించుతోందని.. వేటు వేయాల్సిందేనంటూ పలు రాష్ట్రాల విభాగాలు అధిష్ఠానానికి ఇప్పటికే లేఖలు రాశాయి.
Comments
Please login to add a commentAdd a comment