యశ్వంత్ సిన్హా తలకు గాయాలు
పాట్నా: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గాయపడ్డారు. జార్ఖండ్లోని హజారీ బాగ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యశ్వంత్ సిన్హా తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఆయన జైల్లో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న సమయంలో కుర్చీ విరగిపోవడంతో ఆయన కింద పడిపోయారు. జైలు సిబ్బంది వెంటనే ఆయనకు చికిత్స చేయించారు.
హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో స్థానిక కోర్టు యశ్వంత్ సిన్హాను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. బెయిల్ తీసుకోవడానికి నిరాకరించడంతో సిన్హాతో పాటు మరో 54 మందికి రిమాండ్ విధించారు. విద్యుత్ కొరతకు నిరసనగా సిన్హా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.