న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోగల ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పోలీసులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం వసంత్ కుంజ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి లోపలికి ప్రవేశించారు. శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలోకి చేరిన బాధితులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది. రోజులు గడుస్తున్నా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఈ పేలుడు శబ్ధం దాదాపు 30 అడుగుల దూరం వరకు వినిపించగా, 250 అడుగుల మేర పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుపై ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్‌ఐఏ, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment