Vasant Kunj
-
రాజధానిలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోగల ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పోలీసులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం వసంత్ కుంజ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి లోపలికి ప్రవేశించారు. శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలోకి చేరిన బాధితులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది. రోజులు గడుస్తున్నా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఈ పేలుడు శబ్ధం దాదాపు 30 అడుగుల దూరం వరకు వినిపించగా, 250 అడుగుల మేర పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుపై ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: మద్యంపై పోరులో మహిళల విజయం..! -
ఎంత విషాదం.. వీధి కుక్కల దాడి.. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి
గత కొన్ని రోజులుగా వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. విచక్షణ రహితంగా పిల్లలను కరిచి, గాయపరచడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్నాయి. తాజాగా వీధికుక్కల దాడికి మరో బాలుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అయితే రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం. వివరాలు.. వసంత్ కుంజ్ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు. రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్‌పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు. అయితే ఈ విషాదం జరిగిన రెండు రోజుల్లోనే మరో ఘోరం చోటుచేసుకుంది. ఆనంద్ తమ్ముడు ఆదిత్య, అతని బంధువులు కొందరు ఆదివారం వారి ఇంటి నుంచి కొంచెం బయటకు వెళ్లారు. ఆదిత్య దగ్గరి నుంచి కొంచెం దూరంగా వెళ్లిన బంధువు చందన్ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆదిత్యను వీధికుక్కలు కరవడం చూశాడు. భయంతో చందన్ గట్టిగా అరవడంతో.. అక్కడే ఉన్న ఆనంద్ మరణంపై దర్యాప్తు చేస్తున్నఓ పోలీసు అధికారి చందన్ అరుపులు విని ఆదిత్యను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు
ఢిల్లీలోని వసంతకుంజ్ లో ఓ కారు పెట్రోల్ బంక్ లో పెట్రోలు నింపుకుని వెళ్తున్న ఓ కారు పొరబాటుగా పెట్రోల్ పోసే పైప్ ను కూడా లాగేయడంతో మొత్తం పెట్రోల్ పోసే మెషీన్ కూడా ఊడి వచ్చేసింది. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన శనివారం జరిగింది. దీంతో పెట్రోల్ మొత్తం బంక్ అంతా పాకి ఉన్నట్టుండి భగ్గుమంది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి గాయపడ్డాడు. మిగిలిన వారు మాత్రం ఎలాంటి ప్రమాదమూ లేకుండా బయటపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో మంటలు విస్తరించలేదు. ఒక వేళ పెట్రోలు నిలువ ఉంచే ట్యాంకు వరకూ మంటలు వ్యాపించి ఉంటే ఎన్నో ప్రాణాలు ఆవిరైపోయి ఉండేవి. నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి తాలూకు చిత్రాలు, కారు నంబరు బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని సిబ్బంది చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఆ కారు యజమాని కోసం వెతుకుతున్నారు. -
రోడ్డున పడ్డ వందమందికి పైగా అభాగ్యులు
న్యూఢిల్లీ: ఆమెకు 32 ఏళ్లు.. మతిస్థిమితం లేదు.. బాహ్య ప్రపంచంతో ఎటువంటి నిమిత్తం లేకుండా వ్యవహరిస్తుంది.. ఆమె బాగోగులు ఎవరో ఒకరు చూడాల్సిందే.. అటువంటి ఆమెను మంగళవారం ఉదయం ఎవరు మాట్లాడించినా ‘మా ఇల్లు పోయింది..’ అనే మాట తప్ప ఇంకేం మాట్లాడటంలేదు. ఆమే కాదు వందకు పైగా ఉన్న వివిధ రుగ్మతలతో బాధపడుతున్న ఆ అభాగ్యులకు ఐదేళ్ల నుంచి నీడనిచ్చిన స్థలం, భవనాలను వారు విడిచి పెట్టాల్సి వచ్చింది. దాంతో వారిని తెల్లారేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పక్కన టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్లతో వేసిన గుడారాల్లోకి మార్చారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఒక ఎకరం స్థలంలో కొందరు వ్యక్తులు ఆశ్రమం ఏర్పాటుచేశారు. అందులో వయోవృద్ధులు, అనాథ బాలలు, మహిళలు, ఎయిడ్స్ బాధితులు, అత్యాచార బాధితులు తదితరులు వందమందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్ పేరిట కొందరు ఔత్సాహికులు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘దీని కోసం ఐదేళ్లకు ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద ఎకరం స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. సదరు లీజు సోమవారంతో ముగిసింది. దాంతో అతడు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అప్పటికప్పుడు వందమందికి పైగా అభాగ్యులను ఎక్కడికి తరలించాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపక్కన గుడారాలను ఏర్పాటుచేసి వారికి ఆశ్రయం కల్పించాం..’ అని ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన రవి కర్లా తెలిపారు. ‘వసంత్‌కుంజ్‌లోని నెల్సన్ మండేలా రోడ్డుకు అభిముఖంగా ప్రస్తుతం ఆశ్రమం ఉన్న స్థలానికి సమీపంలో అంతే విస్తీర్ణం ఉన్న స్థలం లీజుకు లభించలేదు. లీజు ముగుస్తుందన్న సమయంలో నేను ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను, లెఫ్టినెంట్ గవర్నర్ తేజీంద్ర ఖన్నాను, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసి విన్నవించుకున్నాను. వారందరూ నా కృషిని అభినందించారు. మా ఆశ్రమానికి ఒక ఎకరం స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి, గవర్నర్ కొన్ని నెలల క్రితమే హామీ ఇచ్చారు. కాని ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ కోసం స్థలాన్ని విరాళంగా ఇవ్వమని తానేమీ ప్రభుత్వాన్ని కోరడంలేదని, ఈ అభాగ్యులకు నీడనివ్వడానికి ఎక్కడైనా స్థలం చూపిస్తే అద్దె చెల్లించడానికి తాము సిద్ధమని’ కర్లా స్పష్టం చేశారు. ‘వీరి గురించే మాకు చాలా బెంగగా ఉంది. నడిరోడ్డున పడ్డాం.. ప్రస్తుతం నగరంలో డెంగీ ప్రబలి ఉన్న నేపథ్యంలో వీరిలో ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి?’అని గత రెండేళ్లుగా ఈ సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తున్న సుల్తాన్ సింగ్ ప్రశ్నించారు. ‘నేను ఇక్కడ పిల్లలకు చదువు చెబుతుంటాను.. నిన్న సాయంత్రం వారికి చదువు చెప్పాను.. ఉదయానికి వారు రోడ్డు మీద ఉన్నారన్న వార్త తెలిసి నిర్ఘాంతపోయాను.. వస్తూ వస్తూ వారి కోసం కొన్ని ఆహార పదార్థాలను తీసుకువచ్చాను..’ అని ఢిల్లీ ఐఐటీలో లైబ్రేరియన్‌గా పనిచేసి రిటైరైన తరునా సాహా అన్నారు. ఆమె నాలుగేళ్లుగా ఈ సంస్థలో వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. -
ఎమిటీ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఎమిటీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నోయిడా పోలీసులు శనివారం తెలిపారు. వసంత్‌కుంజ్ ప్రాంతంలోని ఘిటోర్నీ గ్రామంలోని తన ఇంట్లోనే అరుణ్‌కుమార్ లోహియా ఉదయం ఆరింటికి ఉరి వేసుకున్నాడని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించ ాల్సిందిగా ఘటనాస్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.