రోడ్డున పడ్డ వందమందికి పైగా అభాగ్యులు
Published Wed, Oct 2 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
న్యూఢిల్లీ: ఆమెకు 32 ఏళ్లు.. మతిస్థిమితం లేదు.. బాహ్య ప్రపంచంతో ఎటువంటి నిమిత్తం లేకుండా వ్యవహరిస్తుంది.. ఆమె బాగోగులు ఎవరో ఒకరు చూడాల్సిందే.. అటువంటి ఆమెను మంగళవారం ఉదయం ఎవరు మాట్లాడించినా ‘మా ఇల్లు పోయింది..’ అనే మాట తప్ప ఇంకేం మాట్లాడటంలేదు. ఆమే కాదు వందకు పైగా ఉన్న వివిధ రుగ్మతలతో బాధపడుతున్న ఆ అభాగ్యులకు ఐదేళ్ల నుంచి నీడనిచ్చిన స్థలం, భవనాలను వారు విడిచి పెట్టాల్సి వచ్చింది. దాంతో వారిని తెల్లారేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పక్కన టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్లతో వేసిన గుడారాల్లోకి మార్చారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఒక ఎకరం స్థలంలో కొందరు వ్యక్తులు ఆశ్రమం ఏర్పాటుచేశారు.
అందులో వయోవృద్ధులు, అనాథ బాలలు, మహిళలు, ఎయిడ్స్ బాధితులు, అత్యాచార బాధితులు తదితరులు వందమందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్ పేరిట కొందరు ఔత్సాహికులు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘దీని కోసం ఐదేళ్లకు ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద ఎకరం స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. సదరు లీజు సోమవారంతో ముగిసింది. దాంతో అతడు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అప్పటికప్పుడు వందమందికి పైగా అభాగ్యులను ఎక్కడికి తరలించాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపక్కన గుడారాలను ఏర్పాటుచేసి వారికి ఆశ్రయం కల్పించాం..’ అని ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన రవి కర్లా తెలిపారు. ‘వసంత్‌కుంజ్‌లోని నెల్సన్ మండేలా రోడ్డుకు అభిముఖంగా ప్రస్తుతం ఆశ్రమం ఉన్న స్థలానికి సమీపంలో అంతే విస్తీర్ణం ఉన్న స్థలం లీజుకు లభించలేదు.
లీజు ముగుస్తుందన్న సమయంలో నేను ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను, లెఫ్టినెంట్ గవర్నర్ తేజీంద్ర ఖన్నాను, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసి విన్నవించుకున్నాను. వారందరూ నా కృషిని అభినందించారు. మా ఆశ్రమానికి ఒక ఎకరం స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి, గవర్నర్ కొన్ని నెలల క్రితమే హామీ ఇచ్చారు. కాని ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ కోసం స్థలాన్ని విరాళంగా ఇవ్వమని తానేమీ ప్రభుత్వాన్ని కోరడంలేదని, ఈ అభాగ్యులకు నీడనివ్వడానికి ఎక్కడైనా స్థలం చూపిస్తే అద్దె చెల్లించడానికి తాము సిద్ధమని’ కర్లా స్పష్టం చేశారు. ‘వీరి గురించే మాకు చాలా బెంగగా ఉంది.
నడిరోడ్డున పడ్డాం.. ప్రస్తుతం నగరంలో డెంగీ ప్రబలి ఉన్న నేపథ్యంలో వీరిలో ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి?’అని గత రెండేళ్లుగా ఈ సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తున్న సుల్తాన్ సింగ్ ప్రశ్నించారు. ‘నేను ఇక్కడ పిల్లలకు చదువు చెబుతుంటాను.. నిన్న సాయంత్రం వారికి చదువు చెప్పాను.. ఉదయానికి వారు రోడ్డు మీద ఉన్నారన్న వార్త తెలిసి నిర్ఘాంతపోయాను.. వస్తూ వస్తూ వారి కోసం కొన్ని ఆహార పదార్థాలను తీసుకువచ్చాను..’ అని ఢిల్లీ ఐఐటీలో లైబ్రేరియన్‌గా పనిచేసి రిటైరైన తరునా సాహా అన్నారు. ఆమె నాలుగేళ్లుగా ఈ సంస్థలో వలంటీర్‌గా సేవలందిస్తున్నారు.
Advertisement