గత కొన్ని రోజులుగా వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. విచక్షణ రహితంగా పిల్లలను కరిచి, గాయపరచడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్నాయి. తాజాగా వీధికుక్కల దాడికి మరో బాలుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అయితే రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం.
వివరాలు.. వసంత్ కుంజ్ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు.
రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్‌పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు.
అయితే ఈ విషాదం జరిగిన రెండు రోజుల్లోనే మరో ఘోరం చోటుచేసుకుంది. ఆనంద్ తమ్ముడు ఆదిత్య, అతని బంధువులు కొందరు ఆదివారం వారి ఇంటి నుంచి కొంచెం బయటకు వెళ్లారు. ఆదిత్య దగ్గరి నుంచి కొంచెం దూరంగా వెళ్లిన బంధువు చందన్ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆదిత్యను వీధికుక్కలు కరవడం చూశాడు.
భయంతో చందన్ గట్టిగా అరవడంతో.. అక్కడే ఉన్న ఆనంద్ మరణంపై దర్యాప్తు చేస్తున్నఓ పోలీసు అధికారి చందన్ అరుపులు విని ఆదిత్యను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment