యశ్వంత్ సిన్హాకు బెయిల్ మంజూరు
జార్ఖండ్ : బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాకు బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి యశ్వంత్ సిన్హా జైల్లోనే ఉన్నారు.
న్యాయస్థానం సిన్హాతో పాటు మరికొంతమందికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ అగ్రనేత ఎల్కె అద్వానీ నిన్న యశ్వంత్ సిన్హాను కలిశారు. ఇరువురు నేతలూ దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు.