Power of Movement
-
యశ్వంత్ సిన్హాకు బెయిల్ మంజూరు
జార్ఖండ్ : బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాకు బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి యశ్వంత్ సిన్హా జైల్లోనే ఉన్నారు. న్యాయస్థానం సిన్హాతో పాటు మరికొంతమందికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ నిన్న యశ్వంత్ సిన్హాను కలిశారు. ఇరువురు నేతలూ దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. -
జార్ఖండ్ సీఎంగా యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి
* బీజేపీ అగ్ర నేత అద్వానీ ఉద్ఘాటన * యశ్వంత్ సిన్హాతో జైల్లో 2 గంటలకు పైగా భేటీ హజారీబాగ్: జార్ఖండ్ సీఎంగా బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది జార్ఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాయకత్వం వహించాలని సిన్హాను కోరారు. తక్షణమే బెయిల్‌పై బయటకు రావాలని కోరారు. విద్యుత్ ఉద్యమం నేపథ్యంలో ఆ శాఖ అధికారిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై ప్రస్తుతం హజారీబాగ్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్న యశ్వంత్ సిన్హాను అద్వానీ మంగళవారం కలిశారు. ఇరువురు నేతలూ దాదాపు 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్‌కు చెందిన యశ్వంత్ సిన్హా ఆరాష్ట్ర సీఎం అభ్యర్థిగా సరైన వ్యక్తని పేర్కొన్నారు. ‘బీజేపీ నేతల నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ఆయనకు బీజేపీ నేతల అభిప్రాయాలను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్క జార్ఖండ్ నేతల నుంచే కాదు. దేశ వ్యాప్తంగా పార్టీ నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఇక ఆయన జైలు నుంచి బయటకు వచ్చి జార్ఖండ్‌లో బీజేపీ పగ్గాలు చేపట్టాలి’ అని అద్వానీ అన్నారు. హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై అక్కడి కుగ్రామాల ప్రజలకు మద్దతుగా యశ్వంత్ సిన్హా చరిత్రాత్మక ఉద్యమం ప్రారంభించారని కొనియాడారు. ఆయనకు పార్టీ సహా అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.