
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్టస్ధాయిలో 5 శాతానికి పతనమైన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ మోదీ సర్కార్‌ను తప్పుపట్టడం గమనార్హం. వృద్ధి రేటు ఈ స్ధాయిలో కొనసాగడం దేశానికి మంచిది కాదని, ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మాని వ్యక్తుల తప్పిదాలతో కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు కదలాలని వీడియో ప్రకటనలో మన్మోహన్ హితవు పలికారు. గత త్రైమాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం మనం సుదీర్ఘ మందగమనంలోకి వెళ్లే స్థితిలో ఉన్నామనేందుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 1991లో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సందర్భంలో మన్మోహన్ సింగ్ పీవీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment