వాషింగ్టన్ : దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కార్ సవ్యంగా నిర్వహించడం లేదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ప్రభుత్వానికి తాను ఏం చేయాలనేది తెలుసునని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో మాట్లాడే వారిని ఎవరూ అడ్డుకోలేరని, అయితే ఆర్థిక వ్యవస్థను ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రభుత్వానికి తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఏయే రంగాలకు ఉత్తేజం కల్పించే చర్యలు అవసరమో తాము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవేమనని అంగీకరించారు. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందనేది గుర్తించే క్రమంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ల హయాంలోనే వీటికి బీజం పడిందన్నది వెల్లడైందని చెప్పారు.
మన్మోహన్ సింగ్‌పై తనకు గౌరవం ఉందని, ఎవరినీ నిందించాలని తాము కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అత్యంత పారదర్శకంగా ఎదుగుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎకానమీపై తమ భరోసాను కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా వినాలని ఆమె చురకలు అంటించారు. కాగా భారత బ్యాంకుల దీనస్థితికి మన్మోహన్ సింగ్, రఘురామ్ రాజన్‌ల హయాంలో చేపట్టిన విధానాలే కారణమని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ సింగ్ స్పందించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం పక్కనపెట్టి ప్రత్యర్ధులపై నిందలు మోపడంలో నిమగ్నమైందని డాక్టర్ సింగ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment