ముంబై : కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌లను తిరిగి విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు మరింత సమయం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసింది. కోవిడ్-19కు మెరుగైన చికిత్స అందుబాటులోకి రాగానే ఉద్దీపన చర్యలను ఉపసంహరించడం కీలకమని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులతో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు జులై, ఆగస్ట్‌లో తిరిగి కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో నెమ్మదించాయని పేర్కొంది.
దీంతో ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో త్రైమాసికంలోనూ కొనసాగనుందని తెలిపింది. వినిమయ రంగానికి తీవ్ర విఘాతం నెలకొందని, కరోనా మహమ్మారికి ముందున్న స్ధాయికి చేరేందుకు కొంత సమయం పడుతుందని ఆర్‌బీఐ నివేదిక వ్యాఖ్యానించింది. మహమ్మారితో పోరాడేందుకు ప్రభుత్వ వ్యయం వెచ్చిస్తున్నారని, డిమాండ్ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర పుంజుకోలేదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధన వ్యయం వెచ్చించే పరిస్థితి లేదని తెలిపింది. పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది. చదవండి : ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం!
Comments
Please login to add a commentAdd a comment