
సాక్షి,న్యూఢిల్లీః ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితిపై మోదీ సర్కార్‌కు షాక్‌లు ఇచ్చిన బీజేపీ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా మళ్లీ పంచ్‌లు పేల్చారు.ఆర్థిక వృద్ధి రేటు పతనంపై గత యూపీఏ ప్రభుత్వాన్ని మనం నిందిచలేమని, పరిస్థితి చక్కదిద్దేందుకు మనకు తగినంత సమయం, అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఎంతో కాలంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోఉందని తాజా గణాంకాలపై తానేమీ మాట్లాడబోనని అన్నారు. గత ఆరు త్రైమాసికాల నుంచీ ఆర్థిక వ్యవస్థ పతనం కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత దుస్థితికి నోట్ల రద్దే కారణమని అన్నారు.
ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు సహా అన్ని రంగాలపై నోట్ల రద్దు ప్రభావం అంచనా వేయాల్సి ఉందని, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయం వెలువడాల్సి ఉందన్నారు. సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోలేదని తప్పుపట్టారు.ఇక జీఎస్‌టీ గురించి తన వ్యాసంలో యశ్వంత్ ప్రస్తావిస్తూ నూతన పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టిన తీరు, అమలు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.