burial ground
-
అయ్యో తాతా: రోడ్డుపైనే మృతదేహం... చివరికి
దొడ్డబళ్లాపురం: దళితుడి అంత్యక్రియలకు ఆటంకం కలగడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా హనుమాపురదొడ్డి గ్రామానికి చెందిన నాథయ్య(75)అనే దళితుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామ శివారులోని శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో దళితుడి శవం ఉన్న వాహనాన్ని రోడ్డుపైనే నిలిపి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా, దళితుల కోసం శ్మశానం భూమి కేటాయించాలని డిమాండు చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి శవ సంస్కారానికి వేరే చోట అవకాశం కల్పించారు. శ్మశానానికి 60 ఏళ్ల క్రితం గ్రామ పెద్ద స్థలం దానం చేశారని, ఆ భూమి తమకు కావాలని వారసులు న్యాయ పోరాటం ప్రారంభించడం వల్ల శ్మశానంలో శవ సంస్కారానికి వారు అనుమతించడంలేదని అధికారులు పేర్కొన్నారు. చదవండి: ఇక్కడ పాతిపెట్టొద్దు.. అయ్యో బిడ్డా.. -
పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్ 3 వరకు అమలులో ఉంటాయన్నారు. ఎస్ఎన్టీ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్, పంజగుట్ట చౌరస్తాల వైపు ఏ భారీ వాహనాలను అనుమతించరు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెం.45 జంక్షన్, రోడ్ నెం.36 వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్–మైత్రీవనం మీదుగా లేదా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–రోడ్ నెం.45–బీవీబీ జంక్షన్– రోడ్ నెం.12 మీదుగా ప్రయాణించాలని ఆయన సూచించారు. -
శ్మశానం లేదు.. ఉన్నా వదలరూ.!
శాశ్వత నిద్రకు ఆరడుగుల నేల కరువయ్యింది. బతికినంత కాలం కష్టాలను వెల్లదీసిన బతుకులకు చివరికి శ్మశానంలో కూడా ఉండటానికి జాగా లేదు. ఉన్న శ్మశానాలను కూడా అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. దహన సంస్కారాలకు చోటు లేకపోవడంతో ఏ వాగులోనో వంకలోనో చేయాల్సిన దుస్థితి మండలంలో ఏర్పడింది. సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): మండలంలోని పలు గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్మశాన స్థలాలు కరువడంతో మృతి చెందిన తరువాత ఆరుడగుల నేల దొరకని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం శ్మశానాల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థలం లేక ఆయా గ్రామాల ప్రజలు వాగులు, వంకలు, రోడ్లు పక్కనే అంత్యక్రియలు చేస్తున్నారు. వాగులోనే దహన సంస్కారాలు.. చెంచుపాలెం గ్రామంలో సుమారుగా 140 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామం ఏర్పడింది మొదలు శ్మశానం లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎవరైన చనిపోతే శ్మశాన స్థలం లేక గ్రామానికి సమీపంలో ఉన్న వాగులోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. గ్రామానికి శ్మశాన స్థలం లేక కొన్నేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే చేసేదేమి లేకా వారి సొంత పొలాల్లో మరణించిన వారిని పూడ్చుతున్నారు. ఎవరు మరణించినా వాగులోనే ఖననం చేస్తుండడంతో వర్షం వచ్చి వాగులో నీళ్లు నిలబడినప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కసారి చేసేదేమిలేకా వాగులో నీళ్లలోనే మృతదేహాలను దహనం, ఖననం చేస్తున్నారు. అలాగే జెడ్ మేకపాడు, ముత్తరాసుపాలెం, బోగనంపాడు, చౌటపాలెం, కోటపాడు వంటి గ్రామాల్లో కొన్ని కులాల వారికి సరైన శ్మశాన స్థలాలు లేక అవస్థలు పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన పట్టించుకోలేదు. అయితే ఇటీవల కూడా ఆయా గ్రామాల ప్రజలు శ్మశాన స్థలం కేటాయించాలని స్థానిక అధికారులకు అర్జీలు సమర్పించారు. ఉన్న శ్మశాన స్థలాలు ఆక్రమణ.. ఇదిలా ఉంటే కొన్ని గ్రామాలకు శ్మశాన స్థలాలు లేక ప్రజలు వాగులు, వంకల్లో అంత్మక్రియలు చేపడుతూ నానా తంటాలు పడుతుంటే, మర్రి కొన్ని గ్రామాల్లో ఉన్న శ్మశాన స్థలాలను అక్రమార్కులు ఆక్రమించి సొంతం చేసుకుంటున్నారు. పెదవెంకన్నపాలెం గ్రామంలో ఎస్సీల కేటాయించిన శ్మశాన స్థలానికి స్థానికులు కొందరు దాదాపుగా ఎకరా వరకు ఆక్రమించి జామాయిల్ పంటలు సాగుచేశారు. సమాధులు ఉన్నప్పటికి కూడా వాటి వరకు వదిలేసి జామాయిల్ పంటను సాగు చేశారు. అలాగే కల్లూరివారిపాలెంలో కూడా ఎస్సీలకు కేటాయించిన శ్మశాన స్థలానికి అక్రమార్కులు ఆక్రమించి చదును చేశారు. అయితే ఈ ఆక్రమణలపై ఎస్సీ కాలనీ ప్రజలు నిలదియ్యడంతో కొంత స్థలాన్ని వదిలేశారు. పొన్నలూరులో కూడా ఎస్సీలకు కేటాయించి శ్మశాన స్థలాన్ని చుట్టు పక్కల పొలాలు ఉన్నవారు కొంత మేర దున్నుకుని సొంతం చేసుకున్నారు. ఇలా చాలా గ్రామాల్లో ఉన్న శ్మశానాలను అక్రమార్కులు ఆక్రమించుకోని స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తంగా కొన్ని గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేక ప్రజలు ఇబ్బందులపడుతుంటే, మరికొన్ని గ్రామాల్లో ఉన్న స్థలాలను అక్రమార్కులు ఆక్రమించి చదును చేస్తున్నారు. శ్మశాన స్థలం కేటాయించాలి మా గ్రామంలో 140 కుటుంబాల జీవిస్తున్నాయి. అయితే శ్మశాన స్థలం లేక కొన్నేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శ్మశాన స్థలం లేక గ్రామానికి పక్కనే ఉన్న వాగులో అంత్యక్రియలు చేస్తున్నాము. దీనిపై అధికారులు స్పందించి శ్మశాన స్థలాన్ని ఏర్పాటు చేయాలి. - మూలే సుబ్బయ్య, చెంచుపాలెం ఆక్రమణకు పూనుకుంటున్నారు గ్రామంలోని ఎస్సీలకు సంబంధించిన శ్మశాన స్థలం ఆక్రమణకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే కాలనీ ప్రజలు అడ్డుతగలడం వలన కొంత మేర వదిలిపెట్టారు. అధికారులు స్పందించి శ్మశాన స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించకుడా హద్దులు ఏర్పాటు చేయాలి. అలాగే చుట్టూ ప్రహరీ నిర్మించి, శ్మశాన వాటికను నిర్మించాలి. - కప్పల దానియేలు, కల్లూరివారిపాలెం -
సొమ్ము ప్రజలది.. సోకు టీడీపీ నేతలది
సాక్షి, అనకర్లపూడి (ప్రకాశం): మండలంలోని అనకర్లపూడిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలకు టీడీపీ నాయకులు తమ పేర్లను దర్జాగా వేసుకున్నారు. గ్రామ టీడీపీ నాయకుడు చెప్పినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం తలూపారు. రూ.లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశానాలకు, భవనాలకు సొంత పేర్లు పెట్టుకోవడం సరికాదని అధికారులు చెప్పకపోగా ప్రోత్సహించారు. వివరాల్లోకి వెళితే.. అనకర్లపూడిలో రూ.10 లక్షల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీరాజ్‌శాఖ అధికారులు శివాలయం ఎదురుగా హిందూ శ్మశాన వాటికను రెండేళ్ల క్రితం నిర్మించారు. అదే విధంగా మరో రూ.5 లక్షలకు పైగా నిధులతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. రెండు నిర్మాణాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చేయించాడు. సదరు టీడీపి నాయకుడు స్వామిభక్తి చాటుకోవటానికి ఎమ్మెల్యే వద్ద తన పేరు ఘనంగా ఉండటానికి ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యే స్వామి పేరుతో పాటు తన పేరును కూడా రాయించుకున్నాడు. అదే విధంగా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనానికి సైతం ఎమ్మెల్యే స్వామి పేరుతో పాటు తన పేరు వేయించుకున్నాడు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలపై టీడీపీ నాయకులు పేర్లు వేయించుకోవడంపై గ్రామస్తులు పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశాన స్థలం ప్రహరీపై టీడీపీ నాయకుల పేర్లు తీసేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. -
ఇదేనా సంస్కారం?
వజ్రపుకొత్తూరు:మానవీయ విలువలకు పాతరేసిన సంఘటన ఇది. జానెడు భూమి కరువై మృతదేహానికి రహదారిపైనే దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. బుధవారం వజ్రపుకొత్తూరు మండలం కొండవూరు గ్రామానికి చెందిన రజకులకు ఈ దుస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన గుర్జు లక్ష్మణరావు (58) బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో మృతదేహానికి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది. శ్మశాన వాటిక ఆక్రమణలకు గురి కావడంతో రజకులంతా ఆగ్రహించి చేసేది లేక గ్రామంలోని రహదారిపైనే శవాన్ని ఉంచి అంత్యక్రియలు కానిచ్చారు. మండలంలో ఈ సంఘటన సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండవూరులో సర్వే నెంబరు 413/4లో 4 సెంట్ల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. పూర్వం నుంచి ఆ భూమిని రజకులు రుద్ర భూమిగా వినియోగించుకుంటున్నారు. శ్మశాన వాటికకు తూర్పు పడమరల్లో ఉన్న రైతులు కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించారు. దాదాపు మూడున్నర సెంట్లు కబ్జాకు గురికావడంతో రజకులంతా గత ఐదేళ్లుగా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో వినతి పత్రం కూడా అందించారు. కానీ రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో రజకుల్లోఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం గ్రామంలో వారి కులానికి చెందిన లక్ష్మణరావు మృతి చెందడంతో రహదారిపైనే అంత్యక్రియలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెవిన్యూ అధికారులు దిగివచ్చారు. స్పందించిన ఆర్డీఓ భాస్కరరెడ్డి ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంలో టెక్కలి ఆర్డీఓ భాస్కరరెడ్డి స్పందించారు. వజ్రపుకొత్తూరు తహసీల్దార్ జి.కల్పవల్లికి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సర్వే చేపట్టి ఆక్రమణలు తొలగించి రజకుల దహన సంస్కారాలకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వజ్రపుకొత్తూరు సర్వేయర్ కొండప్ప తిరుపతిరావు, వీఆర్ఓ తారకేశ్వరరావు, ఎస్ఐ పి.నరసింహమూర్తి తన సిబ్బందితో శ్మశాన వాటిక వద్దకు చేరుకొని రజకులతో మాట్లాడారు. సర్వే చేపట్టి ఆక్రమణల్లో ఉన్న మూడున్నర సెంట్లకు విముక్తి కలిగించారు. ఇది ప్రభుత్వ భూమని, ఎవరైనా ఆక్రమణలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ ఆక్రమణదారులను హెచ్చరించారు. దీంతో రజకుల దహన సంస్కారాలకు అడ్డంకులు తొలిగాయి. -
శ్మశాన వాటికలకు కొత్తరూపు
బజార్హత్నూర్(బోథ్): ఒకప్పుడు చెట్లు, పుట్టల మధ్య దర్శనమిచ్చే శ్మశాన వాటికలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఉపాధిహామీ పథకం పుణ్యమా అని వీటి రూపురేఖలు మారుతున్నాయి. గతంలో కాటికి కాలు చాచిన వారు సైతం తన అంత్యక్రియలు జరిగే చోటును తలచుకుని తల్లడిల్లిపోయేవారు. జీవితంలో మంచి ఇంట్లో కాలం వెళ్లదీయకున్నా మరణించిన తర్వాత అయినా మూడడుగుల స్థలం దొరుకుతుందా? అని మదనపడే వారు. ఇప్పుడా సమస్యకు తావులేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికలను స్వర్గధామాలుగా తీర్చిద్చిద్దేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా 2017లో ఒక్కో శ్మశానవాటిక అభివృద్ధి కోసం రూ.10లక్షలు వెచ్చించాలని ప్రతిపాదించింది. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటే ఏళ్ల నాటి సమస్య తీరనుంది. ఆదిలాబాద్ జిల్లాలో 2019 సంవత్సరానికి ఉపాధిహామీ పథకం ద్వారా 154 శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.15.53 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిలో 87 శ్మశాన వాటికల నిర్మాణ పనులు జరుగుతుండగా, మిగతా 67 గ్రామపంచాయతీలకు కేటాయించాల్సి ఉంది. దయనీయంగా గ్రామీణ శ్మశాన వాటికల పరిస్థితి జిల్లాలోని జైనథ్, బేల, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నూర్, తాంసి, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని 95 శాతం గ్రామాల్లో శ్మశాన వాటికల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని శ్మశాన వాటికలు ఆనవాళ్లు కోల్పోయాయి. మరికొన్ని గ్రామాల్లో కబ్జాకు గురవుతున్నాయి. గ్రామాల్లో ఒకరు చనిపోయారంటే ఆ వ్యక్తి అంత్యక్రియలు ఇంకొకరి చావుకు వచ్చేలా ఉన్నాయి. శ్మశాన వాటికలు ముళ్లపొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అంత్యక్రియలు జరిపే వీలులేకుండా పోయింది. శ్మశాన వాటికలకు అంతిమయాత్ర తీసుకెళ్లేందుకు కనీసం దారి సౌకర్యం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక చెరువుగట్లు, రహదారుల పక్కన, ఒర్రెల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. బజార్హత్నూర్ మండలం గిర్నూర్, గుడిహత్నూర్ మండలంలో మన్నూర్, బోథ్ మండలంలో కౌట గ్రామాల్లో ఇప్పటికీ రోడ్డు పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి ఈజీఎస్ నిధులు ఆయా గ్రామాల్లో శ్మశాన వాటికలకు 5 గుంటల స్థలం చూపిస్తే ఉపాధిహామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10.35 లక్షలు ఖర్చు చేసే వీలు కల్పించింది. అయితే వీటిని అభివృద్ధి చేయాలన్న సంకల్పం స్థానిక సం స్థల ప్రతినిధులకు ఉండాలి. అందుకు రెవె న్యూ అధికారులు సహకరించాలి. శ్మశాన వాటికల భూ విస్తీర్ణం గుర్తించి హద్దులు వేస్తే అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించవచ్చు. శ్మశాన వాటికల్లో దహనం చేసేందుకు రెండు ప్లాట్‌ఫాంలు, పిచ్చిమొక్కల తొలగింపు, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మూత్రశాలలు, మరుగుదొడ్లు, లెవలింగ్, స్టోర్‌రూంతో పాటునీటి వసతి కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించుకోవచ్చు. శ్మశాన వాటికల్లో హరితహారం పథకంలో మొక్కలు పెంచుకోవచ్చు. దీనంతటికీ స్థానిక సర్పంచ్, గ్రామస్తులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటికలకు కొత్తరూపు రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేస్తున్నాం మా గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం లేక అర్అండ్బీ రోడ్డు పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం శ్మశాన వాటికకు స్థలం కేటాయించి దహనానికి ప్లాట్‌ఫాం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించాలి.– గవ్వల సాయిచైతన్య,గిర్నూర్ నిధులు కేటాయిస్తే నిర్మిస్తాం దేగామలో 3వేల జనాభాకు ఒకే ఒక శ్మశాన వాటిక ఉంది. కాని అభివృద్ధికి నిధులు లేక పిచ్చిమొక్కలతో నిండి ఉంది. ఇక్కడ దహనానికి ప్లాట్‌ఫాం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంక్ లేదు. శ్మశాన వాటికలో అడుగువేద్దామంటే ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చేసేదేమి లేక అంత్యక్రియల కోసం కడెం నది ఒడ్డున రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తున్నాం. ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తే శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. – దుర్వ లక్ష్మణ్, సర్పంచ్ దేగామ -
కాదేది ఆక్రమణకు అనర్హం ..
సాక్షి, బల్లికురవ: శ్మశాన వాటికల అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు అవుతున్నా పాలకులు, అధికారులు శ్రద్ధ వహించటంలేదు. మంజూరైన నిధులు సైతం రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలు, చిల్లచెట్లతో మూసుకుపోయి రహదారి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, మా ఊరు గ్రామసభల్లో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు,మండల స్థాయి అధికారులకు ఆయా గ్రామాల్లోని ప్రజలు లిఖితపూర్వకంగా అర్జీలు పెట్టుకున్నా అతీగతిలేదు. కూకట్లపల్లిలో... కూకట్లపల్లి ఎస్సీ శ్మశాన వాటికకు ఎకరా 28 సెంట్ల భూమి ఉంది. ఆక్రమణలతో ఈ భూమి కుచించుకుపోయింది. చిల్లచెట్లు పెరిగి కాలనీ నుంచి శ్మశానానికి వెళ్లేదారి అధ్వాన స్థితికి చేరింది. మనిషి చనిపోతే బతికున్నవారికి నరకయాతన తప్పటంలేదు. ఇటీవల కాలనీలో సురభి అంజయ్య చనిపోతే బంధువులు, కాలనీవాసుల పడిన వెతలు వర్ణనాతీతం. ఈ ఏడాది జనవరి 4 న జరిగిన జన్మభూమి, మాఊరు గ్రామసభకు ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. కాలనీవాసులు సురభి మహేష్, వేల్పుల అబ్రహం, ముట్లూరి ఎల్లయ్య, గొల్లపూడి అంజయ్యలు శ్మశానానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని విన్నవించారు. గ్రామ పంచాయతీ నిధుల్లో రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ హామీ అడుగు మందుకుపడలేదు. ఎదురు చూసిచూసి ఫలితం లేకపోవడంతో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నేతలకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రజలు అంటున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా అవస్థలే : బల్లికురవలోని హిందూ, క్రిష్టియన్ శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయి. మల్లాయపాలెం, ఉప్పమాగులూరు, కొమ్మినేనివారిపాలెం, వీకొప్పెరపాడు, చెన్నుపల్లి, రామాంజనేయపురం, వైదన, గొర్రెపాడు, కొణిదెన, గంగపాలెం, వేమవరం గ్రామాల్లోని స్మశాన వాటికలు ఆక్రమణలతో పాటు శ్మశానానికి వెళ్లే రహదారి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంది. -
ఇచ్చోటనే..తమ్ముళ్లు రెచ్చిపోయే..
ఎంత జీవితం అనుభవించినా అందరూ చివరికి చేరే స్థలం శ్మశానం. ఇక్కడ ఆరడుగుల జాగాలోనే జీవితం భౌతికంగా కనుమరుగవుతుంది. ప్రతి ఊరి చివరలో శ్మశానానికి కొంత స్థలం కేటాయించుకుంటారు. తిరుపతి నగర రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడు పాలెంలో ఇలాగే కొంత స్థలం శ్మశానానికి మినహాయించారు. తిరుపతి పరిసరాల్లో స్థలం విలువ విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు ఈ స్థలాన్ని కాజేశారు. వారికి అధికార పార్టీ నేతల అండ ఉండడం తో రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులను వదిలేసి మరో శ్మశానానికి ఫైళ్లు కదుపుతున్నారు. చిత్తూరు, తిరుపతి మంగళం : తెలుగు తెమ్ముళ్లు తెగబడ్డంతో శ్మశాన స్థలం కనుమరుగైపోయింది.. ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. శ్మశానం కాస్తా హాంఫట్ అయిపోయింది.. రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది.. కారణం.. అధికార పార్టీ నేతలు ఈ స్థలం ఆక్రమణకు మద్దతు పలుకుతుండటమే. తిరుపతి పరిధిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెంలోకి వస్తుంది. సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, 5 సెంట్లలో కమ్యూనిటీæ హాల్ ఉంది. కమ్యూనిటీ హాలు మినహా మిగిలిన శ్మశాన స్థలం విలువ ప్రైవేట్ ధర ప్రకారం రూ.5 కోట్ల పైమాటే. దీంతో శ్మశాన స్థలంపై అధికార పార్టీ నేతల అనుయాయుల కన్ను పడింది. నాలుగేళ్ల క్రితం పేదల ముసుగులో ఈ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. 28 కుటుంబాలు ఇళ్లను నిర్మించేసుకున్నాయి. ఇళ్లు నిర్మించుకుంటున్నా రెవెన్యూ శాఖ అడ్డుకున్న పాపాన పోలేదు. గుట్టుచప్పుడు కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఇళ్లకు విద్యుత్, వాటర్ కనెక్షన్లు తీసుకున్నారు. జన్మభూమిలో స్థలం కోసం వినతి.. శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించిన అనంతరం నాయకులు కొత్త రాజకీయానికి తెరలేపారు. తమ ప్రాంతానికి శ్మశాన స్థలం కేటాయించాలని నేతల దర్శకత్వంలో జన్మభూమిలో వినతి పత్రాలు అందజేస్తున్నారు. తిరుపతి శాసన సభ్యురాలు సుగుణమ్మ రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతానని స్థానిక నాయకులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి అధునాతన హంగులతో నిర్మించిన గోవింద ధామం శ్మశాన వాటిక అక్కడికి కూతవేటు దూరంలో ఉంది. అయినా రెండో శ్మశాన వాటిక స్థలం కోసం రెవెన్యూ, అటవీశాఖ, నగరపాలక సంస్థ అధికారులు ఫైల్ సిద్ధం చేసేశారు. తమకేమీ తెలియనట్టు రెవెన్యూ శాఖ తెలివితేటలు ప్రదర్శిస్తోంది. గతేడాది నవంబరులో ఎమ్మెల్యే సుగుణమ్మ, జేసీ గిరీషా, సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్ తిమ్మినాయుడుపాళెం దళితవాడ వెనుక వైపు గల అటవీశాఖ భూమిని శ్మశానం కోసం పరిశీలించారు . అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా భూమి ఇప్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పకపోవడంతో రెండో శ్మశాన వాటికకు స్థలం కేటాయింపునకు ఆమోదముద్ర పడే అవశాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ పనిపూర్తి చేయాలని ముమ్మురంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ఈ ఫైల్ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది. ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోవడమేమిటి.. గోవింద ధామం దగ్గరుండగా మరో శ్మశాన వాటికకు స్థలం కేటాయించే ప్రయత్నాలు జరగడమేమిటని ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు. -
ఒక శవం చెప్పిన దారి సమస్య
చిత్తూరు: శ్మశాన వాటికకు వెళ్లే దారికి అడ్డంగా జేసీబీతో గాడి తవ్వి ఆ భూమి తనదంటూ అంటూ ఓ రైతు చావు కష్టాలు తెచ్చిపెట్టాడు. ఫలితంగా అంత్యక్రియలకు బయల్దేరిన శవాన్ని పాడెతో సహా అక్కడ కిందకు దించాల్సి వచ్చింది! ఓ వైపు ఖనన సమయం దాటుతోంది. దారి వదిలేది లేదంటూ భీష్మించుకున్న రైతు. శవంతో ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో చివరకు రెవెన్యూ అధికారులు కదిలారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. శ్రీరంగరాజపురం: మండలంలోని వేణుగోపాలపురం జనార్ధన్‌రెడ్డి (23) అనారోగ్యంతో చనిపోయాడు. గురువారం అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలిస్తుండగా మార్గమధ్యంలో దారి సమస్య తలెత్తింది. శ్మశానానికి ఆనుకుని భూమి ఉన్న ఓ రైతు తన పొలం మీదుగా ఉన్న శ్మశాన కాలిబాట స్థలంలో జేసీబీతో గాడి తవ్వేశాడు. స్థలం తనదని, శవాన్ని ఇటు వైపు తీసుకెళ్లరాదంటూ ఆక్షేపించాడు. అసలే దుఃఖంలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులకు మండుకొచ్చింది. రైతు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఉదంతాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేశారు. శ్మశాన దారి సమస్యను పరిష్కరించని పక్షంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన రెవెన్యూ సిబ్బంది ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. శ్మశానానికి వెళ్లే దారిని పరిశీలించారు. గ్రామస్తులు, సంబంధిత రైతుతో ఏఆర్ఐ ఏకాంబరం, వీఆర్ఓ మోహన చర్చించారు. ప్రస్తుతం ఉన్న దారి మీదుగానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లేలా ఒప్పించారు. దారికి అవరోధంగా ఉన్న గాడిని పూడ్చివేశారు. 2 గంటల పాటు చెట్ల కింద పడిగాపులు కాసిన మృతదేహం మళ్లీ నలుగురి భుజాలకెక్కింది.ఆపై, పలకల చప్పుడు మళ్లీ మార్మోగింది. శ్మశానానికేసి సాగింది! -
స్మశానానికి దారిలేక గ్రామస్తుల అవస్థలు
-
విశాఖ ప్రజలకు వింత కష్టాలు
-
చచ్చినా.. చావేనా..!
దౌల్తాబాద్ : మనిషి చచ్చినా.. కష్టాలే ఎదురవుతున్నాయి. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఆరడుగుల స్థలం దొరకని పరిస్థితి గ్రామాల్లో దాపురించింది. ఖననం చేసేందుకు కాసింత జాగ లభించక, శ్మశానవాటికలకు స్థలం లేకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పొలం గట్లపైన, లేదంటే సమాధుల పైనే మృతదేహాలను పూడ్చిపెడుతున్నారు. ఆఖరి మజిలీకి ఆరడుగుల స్థలం లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనిషి బతికున్నప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులు.. చనిపోయిన తర్వాత ఖననం చేసేందుకైనా ఆరడుగుల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు నిత్యం అనేక సమస్యలతో సతమతమయ్యే మనిషికి చనిపోయాక కూడా ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా పరిధిలోని ఆయా మండలాలు, గ్రామాల్లో శ్మశానవాటికల కోసం స్థలాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామాల్లోని ఆయా సామాజిక వర్గాలకు శ్మశానవాటికల కోసం ప్రత్యేక స్థలాలు అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో ఇటీవల ధారూరు మండల పరిధిలో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. విషయం ఆర్డీఓ వరకు కూడా వెళ్లింది. దౌల్తాబాద్ మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో మినహా అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. సమాధుల మీదే ఖననం దౌల్తాబాద్, నీటూరు, నందారం, యాంకి, ఇండాపూర్, తిమ్మారెడ్డిపల్లి, గోకఫసల్వాద్, పోల్కంపల్లి, సురాయిపల్లి తదితర గ్రామాల్లో శ్మశాన వాటికల స్థలాలు లేక సమాధుల మీద మృతదేహాలను పూడ్చివేసి తిరిగి సమాధులు నిర్మిస్తున్నారు. శవాలను ఖననం చేయడానికి గుంత తవ్వితే అందులో గతంలో ఖననం చేసినవారి అస్తికలు బయటపడుతున్నాయి. మరో మార్గం లేక అస్తికలను తొలగించి తిరిగి ఆ స్థలంలోనే మృతదేహాలను ఖననం చేస్తున్నారు. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఉపాధి హామీ పథకంలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించి నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖననం రోజు కష్టాలే.. ఓ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఆ కుటుంబసభ్యుల కష్టాలు వర్ణనాతీతం. ఖననం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల దౌల్తా బాద్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖననం చేసేందుకు స్థలం లేకపోవడంతో కుటుంబీకులు ఇబ్బందులు పడుతుంటే గ్రామస్తులు చందాలు వేసుకుని శ్మశానవాటిక స్థలం యజమానికి డబ్బులిచ్చి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉన్నా అవి వివాదంలో ఉన్నాయి. సదరు స్థలాలు తమ పట్టాభూముల్లో ఉన్నాయని కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. శ్మశానల్లో ఖననం చేయనివ్వడం లేదు. ఈనేపథ్యంలో గొ డవలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పం దించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రెండూళ్ల మధ్య ‘శ్మశాన’ సమస్య
కామారెడ్డి రూరల్: రెండు గ్రామాల మధ్య శ్మశానవాటిక సమస్యగా మారింది. తమ గ్రామ పరిధిలో ఉన్న శ్మశాన వాటికలో వేరే గ్రామానికి చెందినవారి అం త్యక్రియలు నిర్వహించడానికి వీలు లేదంటూ ఓ గ్రామప్రజలు అడ్డుకోవడంతో మరో గ్రామ ప్రజలు మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచి, ఆందోళనకు దిగారు. వివరా లు.. కామారెడ్డి జిల్లా అడ్లూర్ పంచాయతీ పరిధిలోని ఇల్చిపూర్ శివారులో శ్మశాన వాటిక ఉంది. అడ్లూర్ వాసులు ఎవరైనా మరణిస్తే ఇదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వైకుంఠధామం విషయంలో రెండు గ్రామాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అడ్లూర్‌వాసులు తమ గ్రామ పరిధిలోని స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించుకోవాలని ఇల్చిపూర్ వాసులు పేర్కొంటున్నారు. శుక్రవారం అడ్లూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు మరణించింది. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇల్చిపూర్‌వాసులు అడ్డుకున్నారు. అడ్లూర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో మృతదేహాన్ని ఇంటివద్దనే ఉంచి, అడ్లూర్‌వాసులు గ్రామంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో సర్వేయర్ సర్వే నిర్వహించి సర్వే నెం 191/1లో శ్మశాన వాటికకు çస్థలాన్ని కేటాయించారన్నారు. ఈ స్థలంలో గతంలో పలువురి దహన సంస్కారాలు నిర్వహించామన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మరణిస్తే.. ఆమె అంత్యక్రియలను నిర్వహించకుండా ఇల్చిపూర్‌వాసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని డీసీఎం వ్యాన్‌లో నిరసనకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అనంతరం అడ్లూర్ ప్రజలు కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్ ఆర్డీవో కార్యాలయంలో ఉన్నారని తెలియడంతో అక్కడికి వెళ్లి ధర్నా చేశారు. ఆర్డీవో శ్రీను గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఇస్తే శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. వృద్ధురాలి అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆందోళనలో సర్పంచ్ రాములు, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ హాఫీజ్, వీడీసీ అధ్యక్షుడు నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
రాయచోటిలో క్షుద్రపూజల కలకలం
రాయచోటిటౌన్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి అందరూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ప్రస్తుత కాలం లోనూ ఇంకా క్షుద్ర పూజల పేరుతో జనం మోసపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో ఆదివారం క్షుద్రపూజలు చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి పూలతోట దళితవాడ (పీటీఎంపల్లె) సమీపంలోని శ్మశాన వాటికలో గత కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు జరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అక్కడి వారికి క్షుద్ర పూజల నిర్వహణపై అనుమానాలు పెరిగాయి. వీరిని ఎలాగైనా పట్టుకోవాలనుకొన్నారు. ఆదివారం అర్ధరాత్రి శ్మశాన వాటికలో పూజలు నిర్వహిస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే గ్రామస్తులంతా ఒక్క సారిగా వారి వద్దకు వెళ్లారు. వీరి రాకను గమనించిన ఓ పూజారి ఆయన బృందం పారిపోయారు. అయితే ఈ పూజలు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరొకరు పట్టుబడ్డారు. కాగా, ఈ ప్రాంతంలోని హీరావలి అనే వ్యక్తి కుమార్తె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు పీడ సోకిందని క్షుద్ర పూజలు చేసి తాయత్తు కడితే పీడ విరుగుడు అవుతుందని నమ్మించడంతో ఆయన ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. అప్పటికే అక్కడ కోడిగుడ్లు, పసుపు, కుంకమ, రక్తం వంటి పదార్థాలతో పాటు వికృతమైన ముగ్గులు కనిపించాయి. దీంతో భయభాంత్రులైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఎక్కడైనా గుప్త నిధుల కోసం ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారమోననే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదు!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన భూముల్ని శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని శ్మశానంగా వాడుకోవడంపై సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ ఖబరస్తాన్ ఇంత్జామియా అసోసియేషన్ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో పాటు ఈ స్థలంపై మరెవరికీ చట్టపరమైన హక్కు లేనందున శ్మశానంగా వాడుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా వాడుకునే హక్కు ఎవరికీ లేదనీ, కోర్టు ఆదేశాలను అన్ని పక్షాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. -
శవాలపై పేలాలు!
నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో దళితుల శ్మశాన వాటిక ఆక్రమణల చెరలో ఉంది. ఎస్సీలు కర్మకాండలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం కేటాయించిన కుంట చిన్నచిన్నగా ఆక్రమణకు గురవుతోంది. కుంట కనుమరుగవుతున్న నేపథ్యంలో దళితులు ఏకమయ్యారు. అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల ఆక్రమణలో ఉన్న కుంటను రక్షించుకునేందుకు మూడేళ్ల నుంచి దళితులు పోరాడుతున్నా ప్రయోజనం లేకపోతోంది. ఇదీ..కథ ఉప్పుగుండూరు ఎస్సీలకు సర్వే నంబర్ 66లో 9.60 ఎకరాల శ్మశాన స్థ«లంతో పాటు 76 సర్వే నంబర్లో కర్మకాండలు నిర్వహించుకునేందుకు 6 ఎకరాల 70 సెంట్లు ఉంది. దానిలో కొంత భాగంలో చెరువు తవ్వించి దానిలో బావి నిర్మించారు. కాల క్రమంలో గ్రామంలోని అగ్రవర్ణాలు శ్మశాన స్థలాన్ని ఆక్రమించి పొలాలుగా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా చెరువు మీద ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో దళితులంతా కలిసి అప్పటి కలెక్టర్‌తో పాటు ఇప్పటి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై 2015 నవంబర్‌లో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆర్డీవో శ్రీనివాసరావు.. ఎస్సీల శ్మశానంతో పాటు మాల కుంటను ఎవరూ ఆక్రమించేందుకు వీల్లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు దగ్గరుండి ఆక్రమణలు తొలగించారు. అంత వరకూ ఓకే.. అప్పుడు కొంతకాలం ఆక్రమణదారులు స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పెచ్చురిల్లుతున్నారు. అ«ధికార పార్టీకి చెందిన నేత అండదండలతో కుంటపై ఆక్రమణలు పెరుగుతున్నాయి. మాలకుంటపై చిన్నగా> ఒక్కో ఇల్లు నిర్మిస్తున్నారు. పక్కనే మరో ఇద్దరు రేకులు వేసి ఆక్రమణలకు సిద్ధమయ్యారు. ఆక్రమణల ద్వారా ఇప్పటికే నిర్మించిన ఇళ్లలోని మరుగుదొడ్ల ద్వారా వచ్చే నీటిని మాల కుంటలోకి వదులుతున్నారు. ఈ క్రమంలో కుంట మొత్తం దుర్వాసన వస్తోంది. ఫలితంగా మాలకుంట నిరుపయోగమవుతోంది. ఎస్సీల అవసరాలకు కేటాయించిన కుంట నేడు పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో పాటు కలుషితమవుతోంది. ఏళ్లుగా పోరాడుతున్నాం: కుంట ఆక్రమణకు సంబంధించి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అయినా అధికార పార్టీ నాయకుల అండదండలతో కుంటపై మళ్లీ నిర్మాణాలు చేస్తున్నారు. గతంలోనే ఆర్డీవో పరిశీలించి ఆక్రమణలు తొలగించడంతో పాటు మరుగుదొడ్ల పైప్‌లైన్ తీసేయాలని ఆదేశాలు జారీ చేసినా ఆ వైపుగా చర్యలు శూన్యం. ఆక్రమణలు ఆపకుంటే భవిష్యత్‌లో దళితులు ఉద్యమించాల్సి ఉంటుంది. – కొలకలూరి విజయకుమార్, దళితుడు ఆక్రమణదారులపై చర్యలు: ఉప్పుగుండూరు మాలకుంటను ఆక్రమించుకుంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఎవరైనా ఆక్రమణలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి సమస్యను పరిష్కరిస్తాం. – సుజాత, తహసీల్దార్, నాగులుప్పలపాడు -
మానవత్వం మంట కలిసింది
-
అంతిమయాత్రకూ అన్నీ కష్టాలే!
అన్నానగర్: సెంజి సమీపంలో కురింజిప్ప గ్రామంలో శ్మశానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మృతి చెందిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు పంట పొలాల మధ్య వెళ్లాల్సి వస్తోంది. సెంజి సమీపంలో కురింజిప్ప గ్రామంలో సుమారు 1,500 మందికి పైగా ప్రజలు నివశిస్తున్నారు. ఈ ప్రాంత వాసులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కొంతమేర కల్పించారు. అయితే శ్మశానానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్థితిలో మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో బంధువులు అతని మృతదేహాన్ని పంట పొలాల మధ్యన తీసుకెళ్లి ఖననం చేశారు. దీనిపై అధికారులు స్పందించి శ్మశానానికి వెళ్లేందుకు దారి చూపాలని స్థానికులు కోరుతున్నారు. -
తేనెటీగల దాడి: శవాన్ని వదిలి పరుగో పరుగు!
సాక్షి, బెంగళూరు : ఓ వ్యక్తి చనిపోగా ఆయన అంత్యక్రియలు చేయడానికి వెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో శవ యాత్రలో పాల్గొన్నవారు మృతదేహాన్ని అక్కడే వదిలి పరుగులంఘించుకున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలూకా హొసహళ్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధలింగప్ప అనే వృద్ధుడు కాలం చేయగా సోమవారం ఆయన శవాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ శివారులోని శ్మశానానికి అంత్యక్రియల కోసం బయలుదేరారు. శ్మశానంలో గంధపు చెక్కలు, అగరొత్తులు అంటించడంతో ఆ పొగ ఘాటుకు అక్కడి చెట్లపై ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా అక్కడున్న వారిపై దాడి చేశాయి. దీంతో కంగారుపడ్డ వారు శవాన్నిఅక్కడే వదిలి తలో దిక్కుకు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో 30 మందికిపైగా గాయపడగా వారిని ఆస్పత్రులకు తరలించారు. కాగా, కొంతమంది బంధువులు టార్పాల్, గోనె సంచుల సాయంతో ఎలాగోలా అంత్యక్రియలు పూర్తిచేశారు. -
250 కోట్లతో శ్మశానవాటికల అభివృద్ధి
• గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు • డీఆర్డీవోలతో సమీక్షలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలను సమగ్రంగా అభివృద్ధి పర చాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ మేరకు వెసులుబాటు ఉండడంతో గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందాయి. తొలి దశలో 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని, సుమారు 2,500 గ్రామాల్లో ఒక్కో శ్మశాన వాటికకు రూ.10 లక్షలు చొప్పున ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులను వెచ్చించాలని నిర్ణ యించింది. ఇందుకు రూ.250 కోట్లు ఖర్చవు తుందని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచే శ్మశానవాటికల అభి వృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఉన్న తాధికారులు యోచిస్తున్నారు. ఒక్కో శ్మశాన వాటికలో మృతదేహాల దహనానికి రెండు ప్లాట్‌ఫారాలు, షెడ్డు, చుట్టూ కందకంతో పాటు రక్షణగా ఫెన్సిం గ్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, సోలార్ లై టింగ్, గ్రీనరీ తదితర పనులను చేపట్టనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద స్థలం చదును, అభివృద్ధి వంటి కార్యక్రమాలకు అదనంగా నిధులను వెచ్చించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని గురువారం డీఆర్డీవోలతో జరిగిన సమీక్షలో గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. మిషన్ కాకతీయ చెరువుల్లోనూ పూడికతీత... మిషన్ కాకతీయ మొదటి దశ కింద బాగు చేసిన చెరువుల్లో పూడికతీత పనులను కూడా ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయిం చింది. ప్రభుత్వం ఫేజ్–4, 5 మిషన్ కాకతీయ కింద చేపట్టబోయే చెరువుల పునరుద్ధరణ కార్యక్ర మాన్ని కూడా ఉపాధి హామీ నిధులతో పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సిమెంట్ రోడ్లకు సంబం ధించి అన్ని జిల్లాల నుంచి త్వరితగతిన ప్రతిపాదనలను పంపాలని అధికారులను నీతూ కుమారి ప్రసాద్ ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కింద గ్రామాలలో వేస్తున్న పైప్లైన్లకు ఇబ్బందులు తలెత్తకుండా సిమెంట్ రహదారుల నిర్మా ణాన్ని చేపట్టాలని సూచించారు. వచ్చే జూన్‌లో ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రతి గ్రామం లోనూ నర్సరీ ఉండేలా చూడాలని, నెలఖారు కల్లా నర్సరీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనా రాయణరెడ్డి, ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ బి.సైదులు, ముఖ్య విజిలెన్స్ అధికారి ఎస్.జె.ఆషా తదితరులు పాల్గొన్నారు. -
శ్మశాన స్థలం ఆక్రమణపై ఉద్రిక్తత
మూడు గంటల పాటు రాస్తారోకో ఇందుకూరుపేట : శ్మశాన స్థలాన్ని ఆక్రమించడంపై ఇందుకూరుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కొత్తూరు పంచాయతీ పారువేటదిబ్బ శ్మశాన స్థలం వివాదం కొంత కాలంగా కొనసాగుతుంది. ఆ స్థలంలో సోమవారం హద్దు రాళ్లను నాటారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. నాటిన హద్దురాళ్లను ధ్వంసం చేశారు. గ్రామస్తులు మట్లాడుతూ ఇందుకూరుపేట, కొత్తూరు పంచాయతీలోని గ్రామస్తులుకు దశాబ్దాల కాలం నుంచి శ్మశానంగా ఉన్న స్థలం ఇప్పుడు పట్టాభూమిగా చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం శ్మశాన స్థల ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా శ్మశాన స్థలం ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. న్యాయం చేసేంత వరకు కదిలేదు లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలం చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని సీఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. నెలల నుంచి సమస్య కొనసాగుతున్నా.. నాయకులు ఎవరూ తమకు మద్దుతుగా నిలవకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బతికుండగానే శ్మశానంలో వదిలేశారు
-
కౌలుకు శ్మశానం!
శ్మశాన భూముల సర్వే రిపోర్టులు బుట్టదాఖలు గతంలో రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే కలెక్టరు బదిలీతో ఆగిన చర్యలు విశాఖపట్నం: ఎక్కడయినా రైతుల భూము లు కౌలుకు ఇస్తుంటారు. ఇందులో విడ్డూరమేం లేదు. మరి శ్మశానాన్ని ఎక్కడయినా కౌలుకు ఇవ్వడం తెలుసా... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ... ఔను నిజమే మరి. ఇది గోపాలపట్నం శివారు వెంకటాపురంలో జరుగుతున్న వింత. ‘శ్మశానాలు కబ్జా చేసి కౌలుకిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా... మీరుండి దేనికి... సర్వే చేసి చర్యలు తీసుకోండని రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ శేషాద్రి ఆదేశించినా రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ దిశగా స్పందించలేదు. కలెక్టర్ ఆదేశించాక ఏదో హడావుడిగా ఆ ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయారు. ఇపుడా ఫైలు బుట్టదాఖలు చేసేశారు అధికారులు. ఆ సర్వే ఏమయిందో... భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్రశ్నార్థకంగా ఉంది. వెంకటాపురం సర్వే నంబరు 109, 110లో దాదాపు 7.35 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలం ఉంది. వెంకటాపురం, పద్మనాభనగర్, ఎస్సీ బీసీ కాలనీ, కంపరపాలెం, నందమూరినగర్ ప్రాంతాలకు ఇదే శ్మశానం. ఇక్కడ జీవీఎంసీ అభివృద్ధి పనులు చేపట్టకపోవడంఆక్రమణదారులకు ఇష్టారాజ్యమయింది. కౌలుకు శ్మశానం : శ్మశాన స్థలాన్ని కొందరు అంచెలంచెలుగా ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. అరటితోటలు, మిర్చితోటలు, వరి, నువ్వులు పండిస్తున్నారు. ఇలా ఇక్కడ దుక్కు దున్నేసి ఇపుడు శ్మశానానికి పావు ఎకరమే మిగిల్చారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ భూఆక్రమణకు పాల్పడినవారు ఇంకో ఘనకార్యం చేశారు. వీరు మరికొందరికి ఇక్కడి భూములు కౌలుకిచ్చి సొమ్ము చేసుకుంటుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కోట్ల విలువయిన భూమి అన్యాక్రాంతమవడంపై ఇంతవరకూ పనిచేసిని జిల్లా కలెక్టర్లందరికీ స్ధానికులు ఫిర్యాదులు చేస్తుండడడం, కిందిస్ధాయి అధికారులకు మొక్కుబడిగా ఆదేశాలిచ్చి ఆ ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం సాధారణమయిపోయింది. ఫలించని ఆదేశాలు : ఇక్కడి ఆక్రమణలపై గతంలో కలెక్టర్లుగా పనిచేసిన ప్రవీణ్‌ప్రకాష్, శేషాద్రి స్పందించారు. భూములు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ నిర్మించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కదిలినట్లు నటించారు. అప్పట్లో ఇక్కడ రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే చేపట్టారు. సర్వే రికార్డుల ఆధారంగా భూముల్ని పరిశీలించారు. అయినా చర్యలు జరిగితే ఒట్టు. దీంతో ఆక్రమణదారులు మరింత ముందుకొచ్చేశారు. ఉన్న భూమిని కుదించేశారు. ఇలా ఫిర్యాదు చేసీ చేసీ స్థానికులు విసిగిపోయారు. అధికారులపై నమ్మకం కోల్పోయారు. -
శ్మశానంలో శివుడి కోసం తపస్సు
శివుడి కోసం తపస్సు తొమ్మిది రోజులుగా శ్మశానంలో దీక్ష అరంతాంగి సమీపంలో సంచలనం టీనగర్: శివుడి ప్రత్యక్షం కోసం అరంతాంగి సమీపంలో ఓ వృద్ధుడు అర్ధనగ్నంగా తపస్సు చేయడం సంచలనం కలిగించింది. పుదుక్కోట్టై జల్లా అరంతాంగి సమీపంలోని వడుకాడు గ్రామంలో మేలపట్టు పంచాయతీ అధ్యక్షుడు కన్నన్ అరటి తోపు ఉంది. దీనికి సమీపంలోని శ్మశానంలో ఓ వృద్ధుడు అర్ధనగ్నంగా 10 అడుగుల లోతు గుంతలో తొమ్మిది రోజులుగా తపస్సు చేస్తున్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా గుంతలో ఓ వృద్ధుడు తూర్పు దిక్కుగా అర్ధనగ్నంగా కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఈ గుంత పైభాగంలో కొబ్బరి ఆకులతో గుడారం నిర్మించబడింది. అరంతాంగి ఇన్స్పెక్టర్ బాలమురుగన్, హెడ్ కానిస్టేబుల్ శరవణన్ అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో తపస్సు చేస్తున్న వ్యక్తి అరంతాంగి చిన్న అన్నానగర్‌కు చెందిన ముత్తుకృష్ణన్(60)అని, గత ఆడి అమావాస్య నుంచి గుంతలో అర్ధనగ్నంగా తపస్సు చేస్తున్నట్లు తెలిసింది. అమావాస్య నుంచి తపస్సు చేసి 12వ రోజున శివుడిని నేరుగా దర్శించేందుకు తపస్సు చేస్తున్నట్లు సమాచారం. తొమ్మిది రోజులుగా ఉదయం, సాయంత్రం ఉడికించిన గుగ్గిళ్లు మాత్రం అతను ఆరగిస్తున్నట్లు తెలిసింది. 12 రోజుల్లో శివుడు ప్రత్యక్షం కాకుంటే దీక్షను 42 రోజులకు కొనసాగించనున్నట్లు తెలిసింది. పోలీసులు అతడికి తపోభంగం కలిగించకుండా వెనక్కి వచ్చేశారు. -
‘చచ్చి’ బతికాడు!
మునగపాక: అంతా అతను చనిపోయాడనుకున్నారు.. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విశాఖ జిల్లా మునగపాక మండలం గవర్ల అనకాపల్లిలో కాండ్రేగుల సీతారామ్(60) గురువారం ఉదయం నిద్ర లేవలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించారు. ఆయన సీతారామ్ చనిపోయినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా భోరున విలపించారు. శ్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన సమయంలో సీతారామ్ గుండె కొట్టుకుంటున్నట్లు ఒక వ్యక్తి గమనించాడు. వెంటనే అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక్కసారిగా లేచి కూర్చుని మాట్లాడటంతో అంతా అవాక్కయ్యారు. -
శ్మశానంలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం పరారైన మహేష్ అనే ఆటోడ్రైవర్ శనివారం మారేడుపల్లి శ్మశానవాటికలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివిధ నేరాల కింద విచారణ నిమిత్తం గోపాలపురం పోలీసులు మహేష్‌ను నిన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల వేధింపులు భరించలేకే అతడు శ్మశానవాటికలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
శ్మశానం నుంచి శవాన్ని ఇంటికి తెచ్చేశాడు
పూడ్చిన శవాన్ని మళ్లీ ఇంటికి తెచ్చిన కుమారుడు కోలారు : తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన నాలుగైదు రోజులకు మళ్లీ తండ్రి శవాన్ని ఇంటికి తీసుకువచ్చిన సంఘటన మాలూరు తాలూకా మాస్తి ఫిర్కా గొల్లపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన చోటా సాబ్ కుమారుడు ఇలియాజ్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇదిలా ఉంటే గత బుధవారం చోటాసాబ్ మృతి చెందాడు. బంధువుల రోదిస్తుండగా తన తండ్రి మళ్లీ బతికి వస్తాడని ఎవరు ఏడవద్దని చెప్పాడు. ఆవేదనతో ఇలియాజ్ ఇలా మాట్లాడుతున్నాడని బంధువులు భావించారు. అయితే మంగళవారం రాత్రి భోజనం చేసిన ఇలియాజ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానంకు వెళ్లి తండ్రి మృతదేహాన్ని తీసుకుని...భూజాన వేసుకుని ఇంటికి తీసుకువచ్చి అప్పులు ఎలా తీర్చాలి నాన్నా అంటూ రోదించడం మొదలు పెట్టాడు. స్థానికులు ఈ సంఘటన చూసి అవాక్కయ్యారు. ఇలియాజ్‌కు తిరిగి సర్దిచెప్పి అర్ధరాత్రి మృతదేహాన్ని శ్మశానం తీసుకెళ్లి ఖననం చేశారు. ఇలియాజ్ గత కొద్ది కాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం. -
ప్రపంచ శ్మశాన వాటికగా ఫేస్బుక్!
లండన్: ఫేస్బుక్.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదోమో! రానున్న రోజుల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటికగా మారనుంది. ఆశ్చర్యంగా ఉన్నా భవిష్యత్తులో జరగబోయేదిదే.. ప్రస్తుతం ఫేస్బుక్ ఖాతాదారుల్లో అత్యధికులు 2098 నాటికల్లా మరణిస్తారు. వాళ్లు మరణించినప్పటికీ చనిపోయిన వారి ఫేస్బుక్ ఖాతాలు మాత్రం అలాగే కొనసాగుతాయంటా. ఒకవేళ వారి ఖాతాలు తొలగించాల్సి వస్తే వినియోగదారుల పాస్వర్డ్ తెలిసిన సన్నిహితులు అకౌంటును క్లోజ్ చేయొచ్చని అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పీహెచ్డీ అభ్యర్థి హచెమ్ సాదిక్కి తెలిపారు. 2010లో 3,85,968 మంది, 2012లో 5,80,000 మంది ఫేస్బుక్ వినియోగదారులు మరణించారని కాగా ఈ ఏడాది 9,70,000 మంది మరణిస్తారని డిజిటల్ బియాండ్ అనే ఆన్లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ అంచనా. -
ఆరు నెలల తర్వాత పోస్ట్‌మార్టం
కొండమోడు గ్రామానికి చెందిన కరీం మృతి పై అనుమానాలు భ ర్తను హత్య చేశారని భార్య పోలీసులకు ఫిర్యాదు మృతదేహం వెలికితీత పిడుగురాళ్ళ రూరల్ చనిపోయిన వ్యక్తి శవాన్ని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెలికితీసి శుక్రవారం పోస్ట్‌మార్టం చేసిన ఘటన రాజుపాలెం వుండలం కొండమోడు గ్రావుంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్ 3న కొండమోడు గ్రామానికి చెందిన కరీం పిడుగురాళ్ల వెళుతున్నానని చెప్పి మరుసటి రోజు శవమై కన్పించాడు. బంధువులు ముస్లింల శ్మశానవాటికలో ఖననం చేశారు. తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తూ కరీం భార్య షహీనా పోలీసులు చుట్టూ తిరుగుతోంది. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు రెండు రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, రాజుపాలెం తహశీల్దార్ సీహెచ్ విజయు జ్యోతికువూరి, గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కృష్ణవుూర్తి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పంచనావూ నిర్వహించి పోస్టువూర్టం చేశారు. ప్రజా సంఘాల నేతల ఆగ్రహం పోర్ట్‌మార్టం చేసే విధానంపై ప్రజా సంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సంఘం వేదిక రాష్ట్ర సెక్రటరీ, డిఫెన్స్ లాయుర్ పాపారావు, ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రభుదాసు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టువూర్టం నిర్వహించేందుకు వుుగ్గురు పైన డాక్టర్లు ఉండాలన్నారు. ఒక్క వైద్యుడితో ఎలా నిర్వహిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు డాక్టర్లను పిలిపించారు. మధ్యాహ్నం వరకూ కనిపించని మృతదేహం జాడ మధ్యాహ్నం 2 గంటల వరకు కరీం వుృతదేహం జాడ కనిపించలేదు. ఇటీవల శ్మశానవాటికకు మెరక తోలించడంతో సమస్య ఎదురైంది. పొక్లెయిన్‌తో తవ్వించి జాడ కనుగొన్నారు. కరీం భార్య షహీనా నుంచి అధికారులు స్టేట్మెంటు నమోదు చేశారు. తన భర్తను ఎవరో హత్య చేశారని ఆమె తెలిపింది. కొండమోడులోని ఓ పెస్టిసైడ్ కంపెనీలో 10 సంవత్సరాలుగా గువుస్తాగా పని చేస్తున్నాడని, గతేడాది జనవరి 15న యుజవూనితో గొడవ పడి వచ్చాడని తెలిపింది. తర్వాత షాపు యజమాని సెప్టెంబర్ 2న ఇంటి వద్దకు వచ్చి వేరే కంపెనీలో పని చేయువద్దని, చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారని షహీనా ఫిర్యాదు చేసింది. వుూడవ తేదీ రాత్రి 9.30 గంటల సవుయుంలో ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన భర్త మర్నాడు పిడుగురాళ్లలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద చనిపోరుు ఉన్నాడని తహశీల్దార్‌కు తెలిపింది. అనంతరం రెండవ వైద్యాధికారి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సంఘటనా స్థలానికి హాజురు కావటంతో సాయుంత్రం 6 గంటల సవుయుంలో గొరుు్యలో నుంచి కరీం మృతదేహాన్ని తీసి మరలా పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలను పోలీసు అధికారులకు అందజేస్తావున్నారు. సీఐ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. ప్రజా సంఘాల నాయుకులు వూట్లాడుతూ కరీం మృతి వెనుక రాజకీయు కోణాలు ఉన్నాయుని, సిట్టింగ్ జడ్జితో పోస్టువూర్టం నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రవుంలో రాజుపాలెం, పిడుగురాళ్ళ, వూచవరం ఎస్ఐలు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు. -
శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను?
ఐదువేల గజాల స్థలాన్ని కాజేయాలని పన్నాగం.. మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైమాటే.. కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమైన వైనం.. విచారణ కమిటీ వేసిన సబ్ కలెక్టర్.. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ వికారాబాద్: ‘కంచే చేను మేసింది’ అనే చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమయ్యారు. చట్టబద్ధంగా తప్పించుకునేందుకు అన్ని జాగ్రతలు తీసుకుని, వాటిని ఆక్రమించుకోవడానికి తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులు ఆక్రమించుకున్న తరువాత వాటిని చట్టప్రకారం పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ తప్పించుకుంటున్నారు. ఈ సలహాలు సైతం వారికి మున్సిపల్ యంత్రాంగమే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. మున్సిపల్ స్థలాలు పాత శిశుమందిర్ దగ్గర ఉన్న స్థలం, పోలీస్‌స్టేషన్ దగ్గర ప్రభుత్వ టాయిలెట్స్ స్థలం.. ఇలా అనేక ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసుకుని, వాటిని న్యాయస్థానాల ద్వారా భూ బకాసురులు దక్కించుకొని ఇళ్లు నిర్మించుకుని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకం కింద వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇటీవల అక్రమార్కులు కొందరు బినామీ పేర్లతో దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. అక్రమ కబ్జాలపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు స్పందించకపోవడంతో కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాధుల స్థలంపై భూ బకాసురుల దృష్టి.. రామయ్యగూడ, అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న ఎంఐజీ, ఎల్ఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225, 226లో ఐదు వేల గజాలకుపైగా స్థలం ఉంది. దీనిపై భూ బకాసురుల కన్ను పడింది. ప్రభుత్వం ఎంఐజీ, ఎల్‌ఐజీలో ఉంటున్న ప్రజలకోసం శ్మశానవాటిక స్థలాన్ని హోజింగ్బోర్డు కేటాయించింది. ఇప్పటికే చాలామంది సమాధులను ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలం మాత్రం హాట్‌కేక్‌లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి. ఈ స్థలం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ సుమారు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతుందంటున్నారు. దీంతో భూ బకాసురుల కన్ను దీనిపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ స్వంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువుగా మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలాన్ని కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చడానికి ప్రణాళికను రూపొందించారు. సబ్ కలెక్టర్ స్పందించి గ్రేవ్‌యార్డుకు కేటాయించిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూస్తే బాగుంటుందని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు. -
శవం ఖనానికి స్థలంలేక..
నల్లగొండ : శవాన్ని ఖననం చేయడానికి స్థలం లేకపోవడంతో ఏకంగా పంచాయతీ కార్యాలయం ఎదుటే శవంతో ధర్నాకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా హుజూరునగర్ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. పంచాయతీ పరిధిలోని వడ్డెర కులస్థులకు శవాలను ఖననం చేయడానికి స్థలం లేదు. దీంతో గురువారం మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహంతో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు బైఠాయించారు. దీంతో పంచాయతీ చైర్మన్ స్పందించి వడ్డెర సంఘం నాయకులతో చర్యలు జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన హుజూరునగర్కు టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
యువతి అస్థికలను ఎత్తుకెళ్లిన ప్రేమికుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి కుటుంబసభ్యులు హైదరాబాద్: ప్రేమించిన యువతి దక్కలేదు... ఆమె అస్థికలనైనా దక్కించుకోవాలని తలచిన ఓ యువకుడు సినీ ఫక్కీలో రాత్రిపూట శ్మశానానికి వెళ్లి దహన సంస్కారాలు చేసిన చోట ఉన్న అస్థికలను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాగ్‌అంబర్‌పేట డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన ఇ.శ్రీనివాస్ కూతురు మహేశ్వరి(22) బీటెక్ చదివింది. గత నెల 22న కడుపునొప్పి భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నిం చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 2న ఆమె మృతి చెందింది. అయితే మహేశ్వరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ నెల 2న రెడ్‌బిల్డింగ్ వద్ద గల మెయిన్ చెరువు శ్మశాన వాటికలో మహేశ్వరి శవానికి దహన సంస్కారాలు జరిపిం చారు. ఇదిలా ఉండగా ఇదే భరత్‌నగర్ బస్తీకి చెందిన డప్పు కృష్ణ కుమారుడు సాయిరామకృష్ణ తాను మహేశ్వరిని ప్రేమించానని, తన ప్రేయసి చనిపోయిందని, తాను కూడా చనిపోతానని ఆ రోజున పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధపడ్డాడు. అతనికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. కాగా సోమవారం ఉదయం శ్మశానంలో మహేశ్వరి అస్థికలను ఏరడానికి తాత ఆగమయ్య, మరో వ్యక్తి శ్రీహరి వెళ్లగా అక్కడ అస్థికలు కనిపించలేదు. దీంతో కాటికాపరులు బిక్షపతి, యాదయ్యలను అస్థ్థికల విషయమై వారు ప్రశ్నించగా, ఆదివారం రాత్రి 11-12 గంటల మధ్య డప్పు కృష్ణ, సాయిరామకృష్ణలతో పాటు మరో ఇద్దరు శ్మశాన వాటికకు వచ్చి తమను బెదిరించి అస్థికలు తీసుకుని వెళ్లారని చెప్పారు. సాయిరామకృష్ణ తాగిన మత్తులో చనిపోయింది తన భార్య అని, అవి తన భార్య అస్థికలు... తనకే దక్కాలని పెద్దగా గొడవ చేశారని కాటికాపరులు ఆగమయ్యకు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కాటి కాపరి నుంచి వివరాలను సేకరించారు. ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ, ఎస్సై అమ్జద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్మశానం కోసం ఆందోళన
బెల్లంకొండ : పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంత పునారావాస కేంద్రాల్లో శ్మశానానికి స్థలం కేటాయించకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ముంపు ప్రాంత పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం శ్మశానానికి స్థలం కేటాయించకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు శవంతో సహా మండల తహశీల్దార్ కార్యలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. వెంటనే స్మశానానికి స్థలం కేటాంయించకపోతే ఇక్కడ నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని వారికి సర్దిచెప్పి పంపిన తహశీల్దార్ వెంటనే ముంపు ప్రాంత పునరావాస కేంద్రాల్లో పర్యటించారు. -
అక్కడ చచ్చినా చావే..!
శ్మశాన రహదారి లేక దళితుల ఇక్కట్లు ఉత్తరపాలెం(మోపిదేవి) : ఉత్తరపాలెం దళితవాడలో మృతిచెందిన మాతంగి సూరమ్మ (82) మృతదేహాన్ని దహనం చేసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతురాలిని శ్మశాన వాటికకు తరలించేందుకు చెరువు గట్టును దాటాల్సి రావడంతో సర్కస్ ఫీట్లు చేయూల్సి వచ్చింది. శ్మశాన వాటిక రహదారిలో మూడు చోట్ల గండ్లు పడిపోవడంతో 20 సంవత్సరాలుగా ఆ బాటలో వెళ్లలేకపోతున్నామని గ్రామపెద్దలు మాతంగి రత్నబాబు, బడుగు కుటంబరావు, పల్లె వెంకటేశ్వరావు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో గ్రామసభ, గ్రీవెన్సెల్, రచ్చబండ, జన్మభూమి-మాఊరు గ్రామసభల్లో వినతి పత్రాలు అందజేశామని, అరుునా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్మశానంలో శిశువుని వదిలి వెళ్లిన ఆగంతకులు
-
శ్మశానంలో శిశువుని వదిలి వెళ్లిన ఆగంతకులు
మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువులో దారుణం చోటు చేసుకుంది. కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువును శనివారం తెల్లవారుజామున ఆగంతకులు వదిలి వెళ్లారు. శ్మశానంలో శిశువు ఏడుపు వినిపించడంలో స్థానికలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారు శిశువును చేరదిసి... 108కి సమాచారం అందించారు. 108 వాహనంలో ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
ఛీ.. ఈ పాడులోకంలో మేం బతకలేం..!
మహబూబ్‌నగర్: పసిబిడ్డలు దేవుడితో సమానమంటారు. మాకు అభుంశుభం తెలియదు, పాపం పుణ్యం అంతకంటే తెలియదు. ఆకలేసినా.. నోరుతెరిచి అడగలేని తమపై ఎందుకీ వివక్ష అంటూ ఆ పసిహృదయాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఈ పాడులోకంలో తాము బతకలేమని భోరున విలపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గిమండల కేంద్రం చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు పసికందులు ముళ్లపొదల్లో కనిపించారు. వాళ్లను నవమోసాలు మోసిన తల్లులు తనకు బరువునుకున్నారో.. లేక పోషించే శక్తి లేక వదిలేశారో గానీ, చివరికి ఆ పసిపిందెలు వీధికుక్కలపాలయ్యే పరిస్థితి తెచ్చింది. కపటం తెలియని ఆ పసిమెగ్గలు అమ్మ ఒడికి దూరమై ఎంత తల్లడిల్లి పోయివుంటాయి. చివరికి ఆ పసికందులను గమనించి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. విజయవాడలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కపటం తెలియని ఓ చిన్నారిని కర్కశంగా శ్మశానంలో వదిలి వెళ్లారు. అక్కడి ముళ్లపొదల దగ్గర ఉన్న ఆ పసికందును ఎవరో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ప్రాణాలు కోల్పోయి చివరకు మల్లీ ఆ శ్మశానానికే చేరింది. అప్పుడే నూరేళ్లు నిండిపోయిన పండుటాకునా నేను..! కాదే.. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన తనను కాటిపాలు చేస్తారా.. ఎందుకిలా అంటూ ఆ మూగమనస్సు ఎంతో ఆవేధనకు గురైందో ఆ భగంతుడికే తెలుసు. -
మాండలిన్ శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు
చెన్నై బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పార్థివదేహాన్ని కడసారి దర్శించుకున్న పలువురు ప్రముఖులు చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ పార్థివదేహానికి చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కాలేయ సంబంధ అనారోగ్యంతో 45 ఏళ్ల పిన్నవయసులోనే కన్నుమూయడం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూడడానికి పలువురు సినీకళాకారులు, సంగీత కళాకారులు, ఇతర ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు. పిన్నవయసులోనే కానరాని లోకాలకు తరలిపోయిన ఆయన్ను తలుచుకుని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. ‘నిజానికి ఉప్పలపు శ్రీనివాస్ అంటే చాలామందికి తెలియదు. మాండలిన్ శ్రీనివాస్ అంటే ప్రపంచమే గౌరవిస్తుంది. అంతటి ఘనకీర్తి, కిరీటాలు పొందిన శ్రీనివాస్ పిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. మాండలిన్ శ్రీనివాస్ మరణం దేశంలోని సంగీత కళాకారులందరి మనసులను కలచివేసింది’ అంటూ ఆయన్ను స్మరించుకున్నారు. శ్రీనివాస్‌కు నివాళులర్పించిన వారిలో డీఎంకే కోశాధికారి స్టాలిన్, మాజీ మేయర్ సుబ్రమణియన్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్‌దేవా, గాయకులు శంకర్ మహదేవన్, హరిహరన్, డ్రమ్స్ శివమణి, నటి శోభన తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి సంతాపం మాండలిన్ శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ వర్గాలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్రీనివాస్ సోదరుడు రాజేష్ పేరిట రాసిన లేఖలో ‘‘మీ సోదరుడు శ్రీనివాస్ మృతి వార్త విని చాలా బాధపడ్డాను’’ అని పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో తన కచేరీలద్వారా దేశంతోపాటు విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారని, ఆయన మృతితో ఓ గొప్ప మాండలిన్ విద్వాంసుడిని కోల్పోయిందని రాష్ట్రపతి అన్నారు. శ్రీనివాస్ కుటుంబీకులకు సానుభూతి తెలియజేశారు. -
బాపూ అంత్యక్రియలు పూర్తి
చెన్నై : ప్రఖ్యాత చిత్రకారుడు,సినిమా దర్శకుడు బాపూ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో బాపూ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు బాపూ నివాసం నుంచి బీసెంట్ నగర్ శ్మశాన వాటిక వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బోనీకపూర్, అనీల్ కపూర్, సినీరంగ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
బరియల్ హీరో.. ఓ కాటికాపరి గిన్నిస్ కిక్
మార్షల్ ఆర్ట్స్.. ఈ పదం వింటే చాలు యువకుల పిడికిళ్లు బిగుసుకుపోతాయి.. వెన్ను నిటారుగా నిలుస్తుంది.. కాళ్లు అవకాశం కోసం గాల్లో తేలుతుంటాయి. చురకత్తుల్లాంటి చూపులు.. చాకుల్లాంటి చేతులు.. మార్షల్ ఆర్ట్స్‌కి అదనపు ఆకర్షణ. ఈ కళలో ఆరితేరాలంటే శారీరకంగా చిరుతలా చురుగ్గా ఉండాలి.. మానసికంగా వె య్యి ఏనుగుల బలం ఉండాలి. అన్నింటికి మించి నేను ఏదైనా చేయగలనన్న కసి ఉండాలి. ఆ బలమే ఓ కాటికాపరిని.. తైక్వాండోలో కింగ్‌ని చేసింది. పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మన్నె శ్రీరంగ కిక్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. ఆ విజయం వెనుకున్న విషయాలు ఆయన మాటల్లో వింటేనే మనసుకెక్కుతాయి. తైక్వాండో కిక్స్‌లో ఐర్లాండ్ రికార్డు.. 30 నిమిషాల్లో యాైభె వేల కిక్స్ కొట్టడం. దాన్ని ఢీ కొట్టడానికి కొన్నేళ్లుగా సాధన చేశాను. ఇరవై ఏళ్ల నా కల నేటికి నెరవేరింది. కేవలం 15 నిమిషాల్లో 50,614 కిక్స్ కొట్టాను. ఆ పోటీలకు మన దేశం నుంచి 50 మంది మార్షల్ ఆర్ట్స్ ప్రొఫెషనల్స్ వచ్చారు. అందరూ ఉన్నవారే.. చదువుకున్నవారే. నా దగ్గర ఆ రెండూ లేవు. కేవలం గెలవాలన్న కసి తప్ప. నా ఒంట్లో బలానికంటే ఎక్కువ కసే ఉంది. అందుకే ఆ రికార్డును బద్దలు కొట్టాను. ఈనెల రెండో తేదీన డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సత్కారాన్ని పొందాను. తెల్లవారి వార్తాపత్రికల్లో వచ్చిన నా ఫొటోలు చూసి ఇరుగుపొరుగు మా అమ్మను మెచ్చుకున్నారు. నాకైతే నేను పని చేసే శ్మశానవాటికలో తెలిసినవారు, తెలియనివారు సన్మానం చేసినంత పని చేశారు. తొమ్మిదో వాడిని.. పుట్టుక నుంచి నా జీవితం శ్మశానంలోనే గడిచింది. నాన్న ఎక్తయ్య కాటి కాపరి. అమ్మ బాలమణి నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేది. ఐదుగురు మగ పిల్లలు, నలుగురు అమ్మాయిలు. నేను తొమ్మిదో సంతానాన్ని. నాన్న, అన్నలు, నేను అందరం సైదాబాద్ శ్మశానవాటికలో పనిచేసుకుంటూ బతికేవాళ్లం. ఇంట్లో చిన్నవాడ్ని కావడంతో నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోగలిగాను. పాఠశాల విద్యతోనే చదువు సరి పెట్టాను. చిన్ననాటి నుంచి కరాటే అంటే ప్రాణం. రూపాయి రూపాయి పోగేసి కర్మాన్‌ఘాట్ దగ్గరున్న మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్లో చేరాను. కాటికాపరిగా పనిచేస్తూనే కరాటే ప్రాక్టీస్ చేశాను. శ్మశానవాటికలోనే... ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు శ్మశానవాటికలో మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన రకరకాల వ్యాయామాలు ప్రాక్టీస్ చేసేవాడిని. 1991లో మొదలైన నా సాధనకు ఫలితం 1997లో దక్కింది. ఆ ఏడాది మద్రాసులో జరిగిన కరాటే పోటీలో విజయం వరించింది. ఇక అప్పటి నుంచి తైక్వాండోలోని రకరకాల కిక్‌లపై ప్రత్యేక సాధన మొదలుపెట్టాను. శిక్షణ.. అంటే మామూలుగా కోచింగ్ సెంటర్లలోనే ఉంటుంది. కానీ మాస్టార్లు చెప్పిన విద్యను ఒడిసిపట్టి.. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్లే ఈ స్థానాన్ని పొందగలిగాను. ప్రశాంతమైన స్థలం దొరకక నా తోటి వారెందరో ప్రాక్టీస్‌కు రోజుల తరబడి దూరమవుతుంటారు. నాకు మాత్రం ఆ చింత లేదు. రోజు ఉదయాన్నే శ్మశానవాటికలోని చెట్ల కిందకు వెళ్లి సాధన చేసే వాడిని. ప్రాక్టీస్‌తో పాటు మేం ఎందులోనూ తక్కువ కాదని పదిమందికీ చాటి చెప్పాలనే తపన దానికి తోడైంది. కొలువు కోసం కలలు ‘ఓ కాటికాపరి తనకు సంబంధం లేని విద్యలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడం బహుశా ఇదే తొలిసారేమో..’అంటూ ఓ పెద్దాయన నా భుజం తట్టి ఓ మాట చెప్పాడు. ‘కన్నీరుకు మాత్రమే నెలవైన ఈ శ్మశానవాటికలో ఆనందబాష్పాలు తెప్పించే ఈ విజయం ప్రతి ఒక్క పేదవాడికి పాఠం కావాలి’ అని అన్నాడు. మా అమ్మ మాత్రం.. చిన్నప్పటి నుంచి ఒకటే మాట పలుకుతుంది.‘ఒక్క బిడ్డకైనా సర్కారు కొలువొస్తే బాగుండు. వీడు కాటికాపరిగానే ఉంటాడో ఏందో..’ అంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరా ఇదే మాట. అమ్మా...గిన్నిస్ బుక్‌ల ఎక్కిననే అంటే...‘అంత గొప్పదారా అది. అయితే కొలువు ఇప్పిస్తదా’ అంటది. నా ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సహకరిస్తే మా అమ్మ కల నెరవేరుతుంది. మా జీవితాలు బాగుపడత యి. - భువనేశ్వరి -
సమాధి అయిన జీవితం!
ఫొటో స్టోరీ మనిషి చనిపోతే సమాధి చేస్తారు. కానీ ఇక్కడ సమాధి అయ్యింది ఒక మనిషే కాదు... ఆ మనిషిని నమ్ముకున్న మరో మనిషి జీవితం కూడా! అక్టోబర్ 16, 2013. బ్రిటన్‌లోని ఆర్లింగ్టన్లో ఉన్న శ్మశాన వాటికలో విషాదం పరచుకుంది. అప్పటి వరకూ అక్కడ నిలబడివున్న పాదాలు మెలమెల్లగా అడుగులు వేస్తూ వెళ్లిపోవడంతో ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. అంతవరకూ మిన్నంటిన రోదనలు మాయమవ్వడంతో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బిగ్గరగా ఓ కేక.... ‘టిమ్... ఎక్కడికి వెళ్లిపోయావ్’ అంటూ! అది ఓ యువతి గుండె లోతుల్లోంచి గొంతును చీల్చుకుంటూ వచ్చింది. పది సెకన్ల పాటు ప్రతిధ్వనించింది! అప్పుడే చేసిన ఓ సమాధికి ఆనుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఓ యువతి. దుఃఖం వెల్లువలా ఎగసిపడుతోంది. కళ్ల నుండి వేదన కాలువలై పారుతోంది. అక్కడికి కాస్త దూరంలో నిలబడి చూస్తోన్న ఫొటోగ్రాఫర్ మాన్యుయెల్ సెనెలా మనసు కదిలిపోయింది. వెంటనే కెమెరాను తీశాడు. ఆమె ఆవేదనకు ఇలా చిత్రరూపమిచ్చాడు. ఆ యువతి పేరు తానియా. ఆర్మీ ఆఫీసర్ అయిన ఆమె భర్త యుద్ధంలో కన్ను మూశాడు... సరిగ్గా వారి పెళ్లి రోజుకు ముందురోజు! అప్పటికామె నాలుగు నెలల గర్భవతి. కడుపులో పిండాన్ని తడుముకుంటూ, సమాధి అయిన తన జీవితాన్ని తలచుకుంటూ తానియా పడిన బాధకు చెరగని సాక్ష్యం... ఈ చిత్రం! -
అది మాకు మిగులనీయి దేవుడా!
పద్యానవనం రాళ్లను సహితం కరిగించే కఠోరమైన కన్నీటి సత్యమే అయినా... ఎందుకో జీవికి విడదీయలేని మోహం. ఏ శ్మశానవాటికలో చూసినా ఏడుపులు, పెడబొబ్బలు సర్వసాధారణం. చావు చావే! చచ్చినవారు తిరిగి రారనీ తెలుసు, వారి కోసం మనసు వికలం చేసుకొని విలపించడం వృధా అనీ తెలుసు. అయినా అత్యధికులు హృదయ విదారకంగా విలపిస్తూనే ఉంటారు. మనసు దృఢం చేసుకోరు, చేసుకోలేరు, అదీ అనుబంధం. ఇంతటి అనుబంధం సొంతమైన మనిషి... మరి మానవత్వపు విలువల్ని పెంపొందించాల్సిన చోట సాటి మనిషిపై కోప తాపాలు, కక్ష కార్పణ్యాలు, ఈర్షాద్వేషాలు ఎందుకో అర్థం కాదు. మూన్నాళ్ల ముచ్చట వంటి ఈ బుద్బుదప్రాయమైన జీవితంలో ఉన్ననాలుగు నాళ్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే జీవనశైలిని మనిషెందుకు అలవర్చుకోడో ఎంత యోచించినా అర్థం కాదు. తానూ అంధుడై నాల్గింట మూడొంతులు జీవితం దుర్భరంగా పూర్తి చేసిన ఓ ‘పెద్దమనిషి’, పాషాణహృదయుడై అంధులైన పసిపిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదేటప్పుడు కనీస ఇంగితం పనిచేయదా! వందలు, వేల మంది ఆశల్ని-ఊసుల్ని మోస్తూ ఆకాశమార్గాన పయనిస్తున్న 295 మందిని క్షణాల్లో నేలకూల్చి పొట్టనపెట్టుకునే దుష్కర మూకకు తెలియదా? తమచర్య ఘాతుకమనీ. చావు ఎవరికైనా ఒకటే అని! పద్యాన్ని పంచకళ్యాణిలా పరుగులెత్తించే ఒడుపు నేర్చిన గుఱ్ఱం జాషువా ‘శ్మశాన వాటిక’ లోని ఈ పద్యం దాదాపు ఏ ‘హరిశ్చంద్ర’ నాటకంలోనైనా పాడి తీరాల్సిందే! ఇది శ్మశాన వైరాగ్యం కాదు, ఈ కన్నీటి సత్యమే ప్రగతితత్వానికి, ప్రణయతత్వానికి కనువిప్పు కలిగించే ‘ప్రణవతత్వం’ అంటాడు ఓ విమర్శకుడు. నిజమే! ఉదయ సాయం సంధ్యల మధ్య ఊగిసలాడుతున్నాం, భవబంధాల మధ్య ఇరుక్కొని మనని మనం నరుక్కుంటున్నాం. కచ్చితమైన జీవన సత్యాల్ని, నిశ్చితమైన వాస్తవాల్ని, అనివార్యమైన సృష్టి పరిణామాల్ని... వేటినీ లెక్కచేయటం లేదు. ‘భజగోవిందం భజగోవిందం, గోవిందం భజ మూఢమతే...’ అంటూ, ఆదిశంకరాచార్యుడు నాలుగయిదు పంక్తుల్లో అద్భుతమైన జీవన సారాన్ని దట్టించారు. ‘...సత్సంగత్వే నిస్సంగత్వః, నిస్సంగత్వే నిర్మోహత్వః, నిర్మోహత్వే నిశ్చలతత్వః, నిశ్చలతత్వే జీవన్ముక్తః’ అంటాడు. జననమరణాల ఈ చక్రీయ ప్రక్రియ నుంచి బయటపడాలనుకునే మనిషి అంతిమంగా కోరుకునే జీవన్ముక్తి ఎంత సులభంగా లభిస్తుందో వివరించాడిక్కడ. మంచి వాళ్ల సాంగత్యంలో ఉంటే దేన్నీ గాఢంగా అంటిపెట్టుకోకుండా ఎక్కడికక్కడ విడిపడిపోతామట(డిటాచ్మెంట్). అలా ఎప్పటికప్పుడు బంధ విముక్తమవటం మోహం లేని స్థితిని కల్పిస్తుంది. మనిషికి ఉండకూడని అరిషడ్వర్గాలైన కామ, క్రోద, మోహ, లోభ, మధ, మాత్సర్యాలలో ఇదొకటి. ఆ నిర్మోహత్వం వల్ల ఏకాగ్రత సాధ్యమౌతుంది. అలాంటి ఏకాగ్రత వల్లే జీవితానికి ముక్తి సాధ్యమౌతుందనీ చెబుతాడు. ఇంతటి జీవన సారం ఈ చిన్న చిన్న విషయాల్లో దాక్కొని ఉంటే, మనిషెందుకు రోజు రోజు మరుగుజ్జవుతున్నాడో బోధపడదు. అనుభూతుల్లో అనుమానం, ఆలోచనల్లో సంకుచితత్వం, ఆచరణల్లో స్వార్థం... అంతిమంగా ఏం ఆశిస్తున్నారు, ఏం సాధిస్తున్నారు ఒక్కసారన్నా బేరీజు వేసుకోరా? అనిపిస్తుంది. ఆధునికత, అభివృద్ధి, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఙానం... ఇలా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదక్కపోయినా, దేవుడా మరింత దిగజారకపోతే చాలు అనిపిస్తుందొకోసారి. మిగతా జీవులకన్నా భిన్నమైన వాడిగా మనిషికి గుర్తింపునిచ్చిన మానవత్వం సదా సజీవంగా ఉంటే తప్ప మనిషి జీవితానికి అర్థం లేదు. బాలగంగాధర్ తిలక్ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి... ‘‘దేవుడా! కత్తివాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు! మానవ చరిత్ర పుటల్లో నెత్తురొలికి మాసిపోయిన అక్షరాల్ని వివరించు రహస్య సృష్టి సానువుల నుంచి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు! మమ్ముల్ని కనికరించు! చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం మంచిగంధం లాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం’’ ఆ అలంకారం సదా మనతోనే ఉండేలా మనల్ని ఆశీర్వదించమని సర్వేశ్వరున్ని కోరుకోవడమే! - దిలీప్ రెడ్డి -
అంజలీదేవికి కన్నీటి వీడ్కోలు
తమిళసినిమా, న్యూస్‌లైన్: ప్రఖ్యాత నటి అంజలీదేవికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం కన్నుమూసిన అంజలీదేవి అంత్యక్రియలు గురువారం చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సాయంత్రం 4.30 గంటలకు జరిగాయి. ఉదయం ఇక్కడి అడయార్‌లోని అంజలీదేవి స్వగృహంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయూనికి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, తమిళనాడు మంత్రులు వళర్మతి, మాధవరం మూర్తి తదితరులు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ నటీమణులు వైజయంతి మాలా బాలి, సచ్చు, కాంచన, రాజశ్రీ, శరత్‌బాబు, గాయని పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత మురారి, సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు, రచయితలు వెన్నెలకంటి, భువనచంద్ర, డాక్టర్ సి.ఎం.కె. రెడ్డి తదితర ప్రముఖులు అంజలీదేవికి నివాళులర్పించారు. -
శవాల సాక్షిగా శ్మశానవాటిక స్థలం కోసం ఘర్షణ
సారంగాపూర్, న్యూస్‌లైన్ : వృద్ధురాలైన భార్య మరణించిందని తెలిసి వస్తున్న భర్త ఆటోలో హఠాన్మరణం చెందాడు. భార్యాభర్తల మృతి పండుగ పూట గ్రామంలో విషాదం మిగిల్చగా.. ఖననం సమయంలో శ్మశాన వాటిక స్థలం కోసం ఇరువర్గాల మధ్య విద్వేషం రగిలింది. పంతాలు.. పట్టింపుల మధ్య మానవత్వం మంటగలిసింది. శవాల సాక్షిగా శ్మశాన వాటిక స్థలం కోసం జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. మంగళవారం మండలంలోని వైకుంఠాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైకుంఠాపూర్ గ్రామంలో రెండు వర్గాల వారికి గతంలో రెండు శ్మశాన వాటికలు ఉండేవి. ఒక వర్గానికి గ్రామ సమీపంలోని చెరువు కట్ట కింద, మరో వర్గానికి గ్రామంలోకి వచ్చే దారిలో కల్వర్టు పక్కన కేటాయించారు. కల్వర్టు పక్క ఉన్న శ్మశాన వాటికలో భూగర్భజలాల పెరుగుదల కారణంగా మృతదేహాలు ఖననం చేయడానికి గోతులు తవ్విన ప్రతిసారి నీళ్లు ఉబికి వచ్చి ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో చెరువు కట్ట కింద ఉన్న మరో వర్గానికి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుంటున్నారని ఇటీవల సర్వే చేయించారు. అక్కడ భూమి ఎక్కువగా ఉందని సర్వేలో నిర్దారణ జరిగింది. దీంతో మరో వర్గానికి చెందిన పెద్దలంతా కలిసి తమకు కూడా అదే శ్మశాన వాటికలో మృతదేహాలు ఖననం చేయడానికి స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్ది రోజులుగా వివాదం సాగుతూనే ఉంది. భార్యాభర్తల మృతితో రాజుకున్న వివాదం గ్రామానికి చెందిన ఈసరి లింగవ్వ(85) మంగళవారం సహజంగానే మృతిచెందింది. ఆమె భర్త రాజన్న(90) కూతురును చూడడానికి పక్కనే ఉన్న అంబకంటి గ్రామానికి వెళ్లాడు. లింగవ్వ మృతి విషయం తెలుసుకున్న తండ్రీకూతురు వెంటనే తమ బంధువులతో కలిసి ఆటోలో వైకుంఠాపూర్‌కు బయల్దేరారు. దారిలో ఆటోలోనే రాజన్న మరణించాడు. దీంతో వారిద్దరిని ఎక్కడ ఖననం చేయాలనే అంశంతో వివాదం మొదలైంది. అప్పటికే శ్మశాన వాటిక స్థలం విషయంలో రగులుతున్న వివాదం ఒక్కసారిగా ఉధృతమైంది. ఈ దంపతుల సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికలో కాకుండా చెరువు కట్ట కింద ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేస్తామని పేర్కొనడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, తహశీల్దార్ గంగాధర్, సారంగాపూర్, నిర్మల్ రూరల్, నర్సాపూర్(జి) ఎస్సైలు మల్లేశ్, నర్సింహరెడ్డి, అనిల్‌లు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను పిలిపించి ఒప్పించే క్రమంలో వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలోనే స్వల్ప ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో చెరువు కట్టకింద శ్మశాన వాటికలో వృద్ధ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువర్గాలకు ఇబ్బందులు లేకుండా తహశీల్దార్‌తో కలిసి ఐదు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, అవసరమైతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అయిర నారాయణరెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పారు. దీంతో ఇరువర్గాల ప్రజలు శాంతించారు.