అది మాకు మిగులనీయి దేవుడా!
పద్యానవనం
రాళ్లను సహితం కరిగించే కఠోరమైన కన్నీటి సత్యమే అయినా... ఎందుకో జీవికి విడదీయలేని మోహం. ఏ శ్మశానవాటికలో చూసినా ఏడుపులు, పెడబొబ్బలు సర్వసాధారణం. చావు చావే! చచ్చినవారు తిరిగి రారనీ తెలుసు, వారి కోసం మనసు వికలం చేసుకొని విలపించడం వృధా అనీ తెలుసు.
అయినా అత్యధికులు హృదయ విదారకంగా విలపిస్తూనే ఉంటారు. మనసు దృఢం చేసుకోరు, చేసుకోలేరు, అదీ అనుబంధం. ఇంతటి అనుబంధం సొంతమైన మనిషి... మరి మానవత్వపు విలువల్ని పెంపొందించాల్సిన చోట సాటి మనిషిపై కోప తాపాలు, కక్ష కార్పణ్యాలు, ఈర్షాద్వేషాలు ఎందుకో అర్థం కాదు.
మూన్నాళ్ల ముచ్చట వంటి ఈ బుద్బుదప్రాయమైన జీవితంలో ఉన్ననాలుగు నాళ్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే జీవనశైలిని మనిషెందుకు అలవర్చుకోడో ఎంత యోచించినా అర్థం కాదు. తానూ అంధుడై నాల్గింట మూడొంతులు జీవితం దుర్భరంగా పూర్తి చేసిన ఓ ‘పెద్దమనిషి’, పాషాణహృదయుడై అంధులైన పసిపిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదేటప్పుడు కనీస ఇంగితం పనిచేయదా! వందలు, వేల మంది ఆశల్ని-ఊసుల్ని మోస్తూ ఆకాశమార్గాన పయనిస్తున్న 295 మందిని క్షణాల్లో నేలకూల్చి పొట్టనపెట్టుకునే దుష్కర మూకకు తెలియదా? తమచర్య ఘాతుకమనీ. చావు ఎవరికైనా ఒకటే అని!
పద్యాన్ని పంచకళ్యాణిలా పరుగులెత్తించే ఒడుపు నేర్చిన గుఱ్ఱం జాషువా ‘శ్మశాన వాటిక’ లోని ఈ పద్యం దాదాపు ఏ ‘హరిశ్చంద్ర’ నాటకంలోనైనా పాడి తీరాల్సిందే! ఇది శ్మశాన వైరాగ్యం కాదు, ఈ కన్నీటి సత్యమే ప్రగతితత్వానికి, ప్రణయతత్వానికి కనువిప్పు కలిగించే ‘ప్రణవతత్వం’ అంటాడు ఓ విమర్శకుడు.
నిజమే! ఉదయ సాయం సంధ్యల మధ్య ఊగిసలాడుతున్నాం, భవబంధాల మధ్య ఇరుక్కొని మనని మనం నరుక్కుంటున్నాం. కచ్చితమైన జీవన సత్యాల్ని, నిశ్చితమైన వాస్తవాల్ని, అనివార్యమైన సృష్టి పరిణామాల్ని... వేటినీ లెక్కచేయటం లేదు. ‘భజగోవిందం భజగోవిందం, గోవిందం భజ మూఢమతే...’ అంటూ, ఆదిశంకరాచార్యుడు నాలుగయిదు పంక్తుల్లో అద్భుతమైన జీవన సారాన్ని దట్టించారు. ‘...సత్సంగత్వే నిస్సంగత్వః, నిస్సంగత్వే నిర్మోహత్వః, నిర్మోహత్వే నిశ్చలతత్వః, నిశ్చలతత్వే జీవన్ముక్తః’ అంటాడు.
జననమరణాల ఈ చక్రీయ ప్రక్రియ నుంచి బయటపడాలనుకునే మనిషి అంతిమంగా కోరుకునే జీవన్ముక్తి ఎంత సులభంగా లభిస్తుందో వివరించాడిక్కడ. మంచి వాళ్ల సాంగత్యంలో ఉంటే దేన్నీ గాఢంగా అంటిపెట్టుకోకుండా ఎక్కడికక్కడ విడిపడిపోతామట(డిటాచ్‌మెంట్). అలా ఎప్పటికప్పుడు బంధ విముక్తమవటం మోహం లేని స్థితిని కల్పిస్తుంది. మనిషికి ఉండకూడని అరిషడ్వర్గాలైన కామ, క్రోద, మోహ, లోభ, మధ, మాత్సర్యాలలో ఇదొకటి. ఆ నిర్మోహత్వం వల్ల ఏకాగ్రత సాధ్యమౌతుంది. అలాంటి ఏకాగ్రత వల్లే జీవితానికి ముక్తి సాధ్యమౌతుందనీ చెబుతాడు.
ఇంతటి జీవన సారం ఈ చిన్న చిన్న విషయాల్లో దాక్కొని ఉంటే, మనిషెందుకు రోజు రోజు మరుగుజ్జవుతున్నాడో బోధపడదు. అనుభూతుల్లో అనుమానం, ఆలోచనల్లో సంకుచితత్వం, ఆచరణల్లో స్వార్థం... అంతిమంగా ఏం ఆశిస్తున్నారు, ఏం సాధిస్తున్నారు ఒక్కసారన్నా బేరీజు వేసుకోరా? అనిపిస్తుంది. ఆధునికత, అభివృద్ధి, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఙానం... ఇలా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదక్కపోయినా, దేవుడా మరింత దిగజారకపోతే చాలు అనిపిస్తుందొకోసారి. మిగతా జీవులకన్నా భిన్నమైన వాడిగా మనిషికి గుర్తింపునిచ్చిన మానవత్వం సదా సజీవంగా ఉంటే తప్ప మనిషి జీవితానికి అర్థం లేదు. బాలగంగాధర్ తిలక్ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి...
‘‘దేవుడా!
కత్తివాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు!
మానవ చరిత్ర పుటల్లో నెత్తురొలికి మాసిపోయిన అక్షరాల్ని వివరించు
రహస్య సృష్టి సానువుల నుంచి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు!
మమ్ముల్ని కనికరించు!
చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం
మంచిగంధం లాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం’’
ఆ అలంకారం సదా మనతోనే ఉండేలా మనల్ని ఆశీర్వదించమని సర్వేశ్వరున్ని కోరుకోవడమే!
- దిలీప్ రెడ్డి