క్షుద్రపూజలు చేస్తూ పట్టుబడిన వ్యక్తులు, శ్మశానంలో వేసిన ముగ్గులు
రాయచోటిటౌన్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి అందరూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ప్రస్తుత కాలం లోనూ ఇంకా క్షుద్ర పూజల పేరుతో జనం మోసపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో ఆదివారం క్షుద్రపూజలు చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి పూలతోట దళితవాడ (పీటీఎంపల్లె) సమీపంలోని శ్మశాన వాటికలో గత కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు జరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అక్కడి వారికి క్షుద్ర పూజల నిర్వహణపై అనుమానాలు పెరిగాయి. వీరిని ఎలాగైనా పట్టుకోవాలనుకొన్నారు.
ఆదివారం అర్ధరాత్రి శ్మశాన వాటికలో పూజలు నిర్వహిస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే గ్రామస్తులంతా ఒక్క సారిగా వారి వద్దకు వెళ్లారు. వీరి రాకను గమనించిన ఓ పూజారి ఆయన బృందం పారిపోయారు. అయితే ఈ పూజలు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరొకరు పట్టుబడ్డారు. కాగా, ఈ ప్రాంతంలోని హీరావలి అనే వ్యక్తి కుమార్తె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు పీడ సోకిందని క్షుద్ర పూజలు చేసి తాయత్తు కడితే పీడ విరుగుడు అవుతుందని నమ్మించడంతో ఆయన ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. అప్పటికే అక్కడ కోడిగుడ్లు, పసుపు, కుంకమ, రక్తం వంటి పదార్థాలతో పాటు వికృతమైన ముగ్గులు కనిపించాయి. దీంతో భయభాంత్రులైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఎక్కడైనా గుప్త నిధుల కోసం ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారమోననే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment