worshiping
-
రాయచోటిలో క్షుద్రపూజల కలకలం
రాయచోటిటౌన్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి అందరూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ప్రస్తుత కాలం లోనూ ఇంకా క్షుద్ర పూజల పేరుతో జనం మోసపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో ఆదివారం క్షుద్రపూజలు చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి పూలతోట దళితవాడ (పీటీఎంపల్లె) సమీపంలోని శ్మశాన వాటికలో గత కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు జరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అక్కడి వారికి క్షుద్ర పూజల నిర్వహణపై అనుమానాలు పెరిగాయి. వీరిని ఎలాగైనా పట్టుకోవాలనుకొన్నారు. ఆదివారం అర్ధరాత్రి శ్మశాన వాటికలో పూజలు నిర్వహిస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే గ్రామస్తులంతా ఒక్క సారిగా వారి వద్దకు వెళ్లారు. వీరి రాకను గమనించిన ఓ పూజారి ఆయన బృందం పారిపోయారు. అయితే ఈ పూజలు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరొకరు పట్టుబడ్డారు. కాగా, ఈ ప్రాంతంలోని హీరావలి అనే వ్యక్తి కుమార్తె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు పీడ సోకిందని క్షుద్ర పూజలు చేసి తాయత్తు కడితే పీడ విరుగుడు అవుతుందని నమ్మించడంతో ఆయన ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. అప్పటికే అక్కడ కోడిగుడ్లు, పసుపు, కుంకమ, రక్తం వంటి పదార్థాలతో పాటు వికృతమైన ముగ్గులు కనిపించాయి. దీంతో భయభాంత్రులైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఎక్కడైనా గుప్త నిధుల కోసం ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారమోననే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
క్షుద్ర పూజల పేరుతో ఘరానా మోసం
బద్వేలు అర్బన్: క్షుద్రపూజల పేరుతో మాయమాటలు చెప్పి మహిళ వద్ద నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి 88 గ్రాముల బంగారు నగలతో ఉడాయించిన సంఘటన మంగళవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని రూపరాంపేటలో నివసించే కుందేటి శ్రీనివాసులు, మల్లీశ్వరీల ఇంటికి మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, మీ ఇంటికి అరిష్టం పట్టిందని,అందుకే ఇంటి యజమాని అనారోగ్యంతో ఉంటున్నాడని, శాంతి పూజలు చేయాలని నమ్మబలికించాడు. అయితే ఎప్పటి నుంచో శ్రీనివాసులు అనారోగ్యంతోనే ఉండటంతో నిజమేనని నమ్మి అతనితో పూజలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో కొద్ది సేపు పూజలు నిర్వహించి ఇంట్లో ఉన్న బంగారు నగలను కూడా పూజలో ఉంచి శుద్ధి చేయాలని చెప్పడంతో ఆమె తన వద్ద ఉన్న 88 గ్రాముల నల్లపూసలదండ, సరుడు, 3 ఉంగరాలు, చైను అతని చేతికి ఇవ్వగా వాటిని మూట కట్టి బియ్యంలో ఉంచాడు. తిరిగి సాయంత్రం తెరిచి చూడాలని, అంత వరుకు పూజ గదిలో ఉంచాలని చెప్పి పూజకు గాను రూ.2వేలు తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరు పూజ గదిలోని మూటను విప్పి చూడగా అందులో నగలు లేవు. తాము మోసపోయినట్లు గుర్తించిన వారు అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్ఐ చలపతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
నీకు రెస్టెప్పుడు గోవిందా..!
ఆలస్యంగా పూజా కైంకర్యాలు..సమయం కుదింపు సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు, సేవలు ఆగమోక్తంగా నిర్ణీత సమయాల్లో నిర్వహించడంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భక్తుల రద్దీ పేరుతో వ్యక్తిగత రికార్డుల కోసం మూలవిరాట్టు పూజా కైంకర్యాల్లో కోత పెడుతున్నారు. దీన్ని ఆగమపండితులు పీఠాధిపతులు నిరసిస్తున్నా పట్టించుకోవడం లేదు. కైంకర్యాల సమయం కనీసం ఆరు గంటలు గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు పూజా కైంకర్యాలన్నీ వైఖానస ఆగమ నిబంధనల మేరకు వేకువజాము మొదలుపెడతారు. తిరిగి అర్ధరాత్రి వరకు ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి కైంకర్యాలు ప్రతిరోజూ రెండుసార్లు, తోమాల ఒకసారి, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు, తగినంత విరామ సమయం కేటాయించాలి. 24 గంటల్లో గర్భాలయ మూలమూర్తికి గరిష్టంగా 10 గంటలు, కనిష్టంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజా కైంకర్యాలు, విరామ సమయం కేటాయించాలి. అయితే, భక్తుల రద్దీ కారణంగా వారందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పూజా నివేదనలతోపాటు విరామ సమయాన్నీ తగ్గిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించామనే తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆగ మ నిబంధనల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శ లున్నాయి. గత శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిర్వహించాల్సిన ఏకాంత సేవ ఆదివారం వేకువజామున 1.45 గంటలకు ప్రారంభించడం, ఆ వెనువెంటనే విరామం లేకుండా సుప్రభాతం మరుసటి రోజు పూజలు ప్రారంభించడం గమనార్హం. -
నాగదేవతా.. పాహిమాం..!
పిఠాపురం:కార్తిక శుద్ధ చవితి నాడు నాగులచవితి పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం హిందూవుల ఆనవాయితీ. ఈ రోజున పాము పుట్టల వద్ద పూజలు చేసి, పాలు పోసి నాగదేవత కరుణ కోసం వేడుకుంటారు. ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ సకుటుంబంగా పాల్గొంటారు. పొలాల్లోని పాము పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేస్తారు. సోమవారం నాగులచవితి పర్వదినం కావడంతో పుట్టల్లో పాలు పోసేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. ఇదీ సంప్రదాయం చవితి రోజున ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి పొలాల్లోని పాముల పుట్టల వద్దకు వెళతారు. ముగ్గులు పెట్టి ఆవుపాలు, కోడిగుడ్లు, బుర్రగుంజు, చిమ్మిలి, చలివిడి, వరినూక పుట్టలో వేసి నాగదేవతకు పూజలు చేస్తారు. చిన్నాపెద్దా కొత్త దుస్తులు ధరించి బాణసంచా కాలుస్తారు. సంతానలబ్ధి, క్షేమం, వివాహప్రాప్తి కోరుతూ మొక్కుకుంటారు. పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కుటుంబ సమేతంగా మధ్యాహ్నం వరకు పుట్టల వద్ద గడిపే రైతులు పంటలు బాగుండాలని, పొలాల్లో తిరిగేటప్పుడు తమకు హాని తలపెట్టవద్దని నాగేంద్రుడిని వేడుకుంటారు. ఇదే మాసంలో 15 రోజుల తర్వాత వచ్చే కార్తిక బహుళ చవితి రోజు కూడా కొందరు ఇదే సంప్రదాయం పాటిస్తారని, దీనిని పౌర్ణమి చవితిగా పిలుస్తారని పురోహితులు తెలిపారు. శివుడికి ప్రీతికరమైన మాసం కార్తికంలో శివుడి కంఠాభరణం సర్పాన్ని పూజించడం శుభదాయకమని పేర్కొన్నారు. నాగులచవితి రోజు చేసే పూజలు రాహు, కుజ దోషాలను తొలగిస్తాయని అంటారు. చెవిటి వారు పుట్టమట్టిని చెవికి ధరిస్తే వినికిడి లోపం పోతుందని నమ్ముతారు. -
హిందూ ధర్మాన్ని మహిళలే కాపాడుతున్నారు
అపనమ్మకాలతో ధర్మాన్ని మరస్తున్నారు మధ్వ విజయాన్ని అందరూ కంఠస్థం చేయాలి సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య సాక్షి, బళ్లారి : హింధూ ధర్మాన్ని మహిళలే కాపాడుతున్నారని, ప్రతిరోజు మహిళలు పూజలు, వ్రతాలు చేయడం వల్ల మహిళలు మన ధర్మాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని సుప్రీం కోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్.వెంకటాచలయ్య అన్నారు. ఆయన మధ్వ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నగరంలోని శ్రీ వ్యాస-దాస మంటంలో ఏర్పాటు చేసిన 1008 సువిదేంద్ర తీర్థ మహాస్వామీజీ 13వ చాతుర్మాస వ్రత దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.వెంకటాచలయ్య మాట్లాడుతూ అన్ని కులాల వారు అప నమ్మకాలతో తమ ధర్మాలపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత వైపు, ధర్మాలను రక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ప్రతి రోజు పూజలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్న విషయం మహిళల ద్వారా తెలుస్తుందన్నారు. అలాంటి మహిళలకు మనందరం సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతిరోజు ధ్యానం, దైవ పూజల వల్ల ప్రతి మనిషి మానసికంగా, ప్రశాంతంగా ఉంటాయన్నారు. మధ్వ విజయాన్ని ప్రతి ఒక్కరూ కంఠస్థం చేస్తే ఆయా కుటుంబాల్లో శాంతి సుఖాలు వెల్లివిరుస్తాయన్నారు. అంతకు ముందు జయతీర్థాచార్, నిప్పాణి గురు రాజాచార్, సత్యనారాయణాచార్ తదితరులు మాట్లాడుతూ బళ్లారి నగరం గురూజీ రాకతో పావనం అయిందన్నారు. అంతేకాకుండా నగరంలో చాతుర్మాస పూజలు ప్రారంభించడంతో బళ్లారిలో వర్షాలు కురుస్తాయన్నారు. చాతుర్మాస పూజలను బ్రాహ్మణులు ఒక్కరే ఆచరించాలని నియమాలు లేవని, అందరూ పాల్గొని సుఖశాంతులు పొందవచ్చన్నారు. ఈ మాసంలో దైవ పూజ చేస్తే ఎంతో మంచిదన్నారు. అనంతరం 1008 సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ మాట్లాడుతూ శ్రీ మధ్వాగత ప్రవచనాన్ని వినడంతోపాటు అందులోని సారాంశాన్ని జీవితంలో పాటిస్తే కష్టాలు తీరిపోతాయని గుర్తు చేశారు. ఏ కుటుంబంలోనైనా శాంతి సౌఖ్యాలు లేకుంటే భాగవత సారాంశాన్ని గురువులు ద్వారా వింటే కష్టాలు తీరుతాయన్నారు. చాతుర్మాస దీక్షలను ఆచరిస్తే ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు. ఈ వ్రత దీక్షల సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
నేడు పోలీస్‌స్టేషన్‌కు ‘గంగాభవానీ’
38 సంవత్సరాలుగాతొలి పూజలందుకుంటున్న అమ్మవారు జాతరోత్సవాలు ప్రారంభం కోడూరు, న్యూస్‌లైన్ : అమ్మవారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుందని ఆశ్చర్యపోతున్నారా.. అసలు అమ్మవారికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ కథ ఒకసారి చదవాల్సిందే.. కోడూరులో 500 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీగంగాభవానీ అమ్మవారికి అప్పట్లో ఆలయాన్ని గ్రామస్తులు కట్టించి పూజలు నిర్వహించేవారు. 39 సంవత్సరాల క్రితం కోడూరు ఎస్ఐగా పనిచేసిన ఏవీఎస్ రెడ్డి చోరవ తీసుకుని, ఆలయ కమిటీతో కలసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి అమ్మవారి జాతరోత్సవాల ప్రారంభం నాడు పుట్టింటివారైన కంచర్లపల్లి వంశీయులు నూతన వస్త్రాలు సమర్పించిన తరువాత తొలి పూజలు నిర్వహించేందుకు అమ్మవారిని పోలీస్‌స్టేషన్‌కు ప్రత్యేక వాహనంపై తీసుకెళ్తారు. స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌గా ఇక్కడ ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నా... అమ్మవారిని తమ సిబ్బంది డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి, ప్రత్యేక పూజలు అందిస్తారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి కంచర్లపల్లి వంశీయులు పసుపు కుంకుమలు సమర్పించిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి 39వ జాతరోత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ధర్మకర్త కోట యుగంధరరావు తెలిపారు. పోలీసుస్టేషన్లో పూజలు పూర్తయినతరువాత అమ్మవారిని కోడూరు శివారు గ్రామాలైన స్వతంత్రపురం, దింటిమెరక, మెరకగౌడపాలెం, కృష్ణాపురం, నరసింహపురం, ఇస్మాయిల్‌బేగ్‌పేట, యర్రారెడ్డిపాలెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 31వ తేదీన పశువుల జాతర, ఏప్రిల్ 1వ తేదీన ఆలయ ప్రధాన గుడి సంబరం నిర్వహించనున్నట్లు యుగంధరరావు తెలిపారు. రెండవ తేదీ ఉదయం చినఅమ్మవారిని ఆలయ ప్రవేశం చేయించడంతో జాతరోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. జాతరోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రంగులతో నయనమనోహరంగా తీర్చిద్దితున్నారు. -
దేవతలారా దిగిరండి
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవా లు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భక్తకన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. కైలాసగిరిపైనున్న భక్తకన్నప్ప ఆలయం నుంచి అర్చకులు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. భక్తుడైన భక్తకన్నప్పకు ఉత్సవాలలో ప్రథమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. ఈ దృష్ట్యా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజున భక్తకన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించారు. దీంతో భక్తునికే తొలి పూజ గౌరవం దక్కింది. మధ్యాహ్నం తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞాన ప్రసూనాంబ, కన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా భక్తకన్నప్ప కొండ వద్దకు తీసుకొచ్చారు. ఆలయానికి చెందిన వృషభం, వివిధ కళాబృందాల సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. కొండపై ఉన్న భక్తకన్నప్ప ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారు చేసిన పవిత్ర దారాన్ని, వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. తర్వాత నైవేద్యం సమర్పించారు. దీంతో ధ్వజారోహణం పూర్తయింది. ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. ఈవో రామచంద్రారెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, హరిబాబు, సుదర్శన్‌నాయుడు, భద్రయ్య, నాగభూషణం, ఉభయకర్త కామవర్తి సాంబయ్య, సుభద్రమ్మ, మాజీ చైర్మన్ శాంతారామ్ జే పవార్ పాల్గొన్నారు. నేడు స్వామివారి ధ్వజారోహణం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణం చేస్తారు. ఉదయం, సాయంత్రం వెండి అంబారీలపై స్వామి, అమ్మవారు ఊరేగుతారు. పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయనను మేల్కొలపడానికి దేవతలు చేసే ఈ ఉత్సవాన్నే ధ్వజారోహణం అంటారు. దీనినే దేవరాత్రి అని పిలుస్తారు.