కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి
ఆలస్యంగా పూజా కైంకర్యాలు..సమయం కుదింపు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు, సేవలు ఆగమోక్తంగా నిర్ణీత సమయాల్లో నిర్వహించడంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భక్తుల రద్దీ పేరుతో వ్యక్తిగత రికార్డుల కోసం మూలవిరాట్టు పూజా కైంకర్యాల్లో కోత పెడుతున్నారు. దీన్ని ఆగమపండితులు పీఠాధిపతులు నిరసిస్తున్నా పట్టించుకోవడం లేదు.
కైంకర్యాల సమయం కనీసం ఆరు గంటలు
గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు పూజా కైంకర్యాలన్నీ వైఖానస ఆగమ నిబంధనల మేరకు వేకువజాము మొదలుపెడతారు. తిరిగి అర్ధరాత్రి వరకు ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి కైంకర్యాలు ప్రతిరోజూ రెండుసార్లు, తోమాల ఒకసారి, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు, తగినంత విరామ సమయం కేటాయించాలి. 24 గంటల్లో గర్భాలయ మూలమూర్తికి గరిష్టంగా 10 గంటలు, కనిష్టంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజా కైంకర్యాలు, విరామ సమయం కేటాయించాలి.
అయితే, భక్తుల రద్దీ కారణంగా వారందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పూజా నివేదనలతోపాటు విరామ సమయాన్నీ తగ్గిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించామనే తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆగ మ నిబంధనల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శ లున్నాయి. గత శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిర్వహించాల్సిన ఏకాంత సేవ ఆదివారం వేకువజామున 1.45 గంటలకు ప్రారంభించడం, ఆ వెనువెంటనే విరామం లేకుండా సుప్రభాతం మరుసటి రోజు పూజలు ప్రారంభించడం గమనార్హం.