దేవతలారా దిగిరండి
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవా లు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భక్తకన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. కైలాసగిరిపైనున్న భక్తకన్నప్ప ఆలయం నుంచి అర్చకులు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. భక్తుడైన భక్తకన్నప్పకు ఉత్సవాలలో ప్రథమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. ఈ దృష్ట్యా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజున భక్తకన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించారు.
దీంతో భక్తునికే తొలి పూజ గౌరవం దక్కింది. మధ్యాహ్నం తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞాన ప్రసూనాంబ, కన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా భక్తకన్నప్ప కొండ వద్దకు తీసుకొచ్చారు. ఆలయానికి చెందిన వృషభం, వివిధ కళాబృందాల సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. కొండపై ఉన్న భక్తకన్నప్ప ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారు చేసిన పవిత్ర దారాన్ని, వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. తర్వాత నైవేద్యం సమర్పించారు. దీంతో ధ్వజారోహణం పూర్తయింది. ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. ఈవో రామచంద్రారెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, హరిబాబు, సుదర్శన్‌నాయుడు, భద్రయ్య, నాగభూషణం, ఉభయకర్త కామవర్తి సాంబయ్య, సుభద్రమ్మ, మాజీ చైర్మన్ శాంతారామ్ జే పవార్ పాల్గొన్నారు.
నేడు స్వామివారి ధ్వజారోహణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణం చేస్తారు. ఉదయం, సాయంత్రం వెండి అంబారీలపై స్వామి, అమ్మవారు ఊరేగుతారు. పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయనను మేల్కొలపడానికి దేవతలు చేసే ఈ ఉత్సవాన్నే ధ్వజారోహణం అంటారు. దీనినే దేవరాత్రి అని పిలుస్తారు.