నాగదేవతా.. పాహిమాం..!
పిఠాపురం:కార్తిక శుద్ధ చవితి నాడు నాగులచవితి పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం హిందూవుల ఆనవాయితీ. ఈ రోజున పాము పుట్టల వద్ద పూజలు చేసి, పాలు పోసి నాగదేవత కరుణ కోసం వేడుకుంటారు. ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ సకుటుంబంగా పాల్గొంటారు. పొలాల్లోని పాము పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేస్తారు. సోమవారం నాగులచవితి పర్వదినం కావడంతో పుట్టల్లో పాలు పోసేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ సంప్రదాయం
చవితి రోజున ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి పొలాల్లోని పాముల పుట్టల వద్దకు వెళతారు. ముగ్గులు పెట్టి ఆవుపాలు, కోడిగుడ్లు, బుర్రగుంజు, చిమ్మిలి, చలివిడి, వరినూక పుట్టలో వేసి నాగదేవతకు పూజలు చేస్తారు. చిన్నాపెద్దా కొత్త దుస్తులు ధరించి బాణసంచా కాలుస్తారు. సంతానలబ్ధి, క్షేమం, వివాహప్రాప్తి కోరుతూ మొక్కుకుంటారు. పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కుటుంబ సమేతంగా మధ్యాహ్నం వరకు పుట్టల వద్ద గడిపే రైతులు పంటలు బాగుండాలని, పొలాల్లో తిరిగేటప్పుడు తమకు హాని తలపెట్టవద్దని నాగేంద్రుడిని వేడుకుంటారు. ఇదే మాసంలో 15 రోజుల తర్వాత వచ్చే కార్తిక బహుళ చవితి రోజు కూడా కొందరు ఇదే సంప్రదాయం పాటిస్తారని, దీనిని పౌర్ణమి చవితిగా పిలుస్తారని పురోహితులు తెలిపారు. శివుడికి ప్రీతికరమైన మాసం కార్తికంలో శివుడి కంఠాభరణం సర్పాన్ని పూజించడం శుభదాయకమని పేర్కొన్నారు. నాగులచవితి రోజు చేసే పూజలు రాహు, కుజ దోషాలను తొలగిస్తాయని అంటారు. చెవిటి వారు పుట్టమట్టిని చెవికి ధరిస్తే వినికిడి లోపం పోతుందని నమ్ముతారు.