
తూర్పువైపు ఆక్రమించిన షెడ్లకు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న దృశ్యం
ఎంత జీవితం అనుభవించినా అందరూ చివరికి చేరే స్థలం శ్మశానం. ఇక్కడ ఆరడుగుల జాగాలోనే జీవితం భౌతికంగా కనుమరుగవుతుంది. ప్రతి ఊరి చివరలో శ్మశానానికి కొంత స్థలం కేటాయించుకుంటారు. తిరుపతి నగర రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడు పాలెంలో ఇలాగే కొంత స్థలం శ్మశానానికి మినహాయించారు. తిరుపతి పరిసరాల్లో స్థలం విలువ విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు ఈ స్థలాన్ని కాజేశారు. వారికి అధికార పార్టీ నేతల అండ ఉండడం తో రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులను వదిలేసి మరో శ్మశానానికి ఫైళ్లు కదుపుతున్నారు.
చిత్తూరు, తిరుపతి మంగళం : తెలుగు తెమ్ముళ్లు తెగబడ్డంతో శ్మశాన స్థలం కనుమరుగైపోయింది.. ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. శ్మశానం కాస్తా హాంఫట్ అయిపోయింది.. రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది.. కారణం.. అధికార పార్టీ నేతలు ఈ స్థలం ఆక్రమణకు మద్దతు పలుకుతుండటమే. తిరుపతి పరిధిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెంలోకి వస్తుంది. సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, 5 సెంట్లలో కమ్యూనిటీæ హాల్ ఉంది. కమ్యూనిటీ హాలు మినహా మిగిలిన శ్మశాన స్థలం విలువ ప్రైవేట్ ధర ప్రకారం రూ.5 కోట్ల పైమాటే. దీంతో శ్మశాన స్థలంపై అధికార పార్టీ నేతల అనుయాయుల కన్ను పడింది. నాలుగేళ్ల క్రితం పేదల ముసుగులో ఈ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. 28 కుటుంబాలు ఇళ్లను నిర్మించేసుకున్నాయి. ఇళ్లు నిర్మించుకుంటున్నా రెవెన్యూ శాఖ అడ్డుకున్న పాపాన పోలేదు. గుట్టుచప్పుడు కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఇళ్లకు విద్యుత్, వాటర్ కనెక్షన్లు తీసుకున్నారు.
జన్మభూమిలో స్థలం కోసం వినతి..
శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించిన అనంతరం నాయకులు కొత్త రాజకీయానికి తెరలేపారు. తమ ప్రాంతానికి శ్మశాన స్థలం కేటాయించాలని నేతల దర్శకత్వంలో జన్మభూమిలో వినతి పత్రాలు అందజేస్తున్నారు. తిరుపతి శాసన సభ్యురాలు సుగుణమ్మ రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతానని స్థానిక నాయకులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి అధునాతన హంగులతో నిర్మించిన గోవింద ధామం శ్మశాన వాటిక అక్కడికి కూతవేటు దూరంలో ఉంది. అయినా రెండో శ్మశాన వాటిక స్థలం కోసం రెవెన్యూ, అటవీశాఖ, నగరపాలక సంస్థ అధికారులు ఫైల్ సిద్ధం చేసేశారు. తమకేమీ తెలియనట్టు రెవెన్యూ శాఖ తెలివితేటలు ప్రదర్శిస్తోంది. గతేడాది నవంబరులో ఎమ్మెల్యే సుగుణమ్మ, జేసీ గిరీషా, సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్ తిమ్మినాయుడుపాళెం దళితవాడ వెనుక వైపు గల అటవీశాఖ భూమిని శ్మశానం కోసం పరిశీలించారు .
అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా భూమి ఇప్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పకపోవడంతో రెండో శ్మశాన వాటికకు స్థలం కేటాయింపునకు ఆమోదముద్ర పడే అవశాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ పనిపూర్తి చేయాలని ముమ్మురంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ఈ ఫైల్ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది. ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోవడమేమిటి.. గోవింద ధామం దగ్గరుండగా మరో శ్మశాన వాటికకు స్థలం కేటాయించే ప్రయత్నాలు జరగడమేమిటని ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment