దౌల్తాబాద్‌లో పొలం గట్టుమీద ఖననం చేసిన దృశ్యం
దౌల్తాబాద్ : మనిషి చచ్చినా.. కష్టాలే ఎదురవుతున్నాయి. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఆరడుగుల స్థలం దొరకని పరిస్థితి గ్రామాల్లో దాపురించింది. ఖననం చేసేందుకు కాసింత జాగ లభించక, శ్మశానవాటికలకు స్థలం లేకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పొలం గట్లపైన, లేదంటే సమాధుల పైనే మృతదేహాలను పూడ్చిపెడుతున్నారు. ఆఖరి మజిలీకి ఆరడుగుల స్థలం లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మనిషి బతికున్నప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులు.. చనిపోయిన తర్వాత ఖననం చేసేందుకైనా ఆరడుగుల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు నిత్యం అనేక సమస్యలతో సతమతమయ్యే మనిషికి చనిపోయాక కూడా ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా పరిధిలోని ఆయా మండలాలు, గ్రామాల్లో శ్మశానవాటికల కోసం స్థలాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామాల్లోని ఆయా సామాజిక వర్గాలకు శ్మశానవాటికల కోసం ప్రత్యేక స్థలాలు అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో ఇటీవల ధారూరు మండల పరిధిలో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. విషయం ఆర్డీఓ వరకు కూడా వెళ్లింది. దౌల్తాబాద్ మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో మినహా అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు.
సమాధుల మీదే ఖననం
దౌల్తాబాద్, నీటూరు, నందారం, యాంకి, ఇండాపూర్, తిమ్మారెడ్డిపల్లి, గోకఫసల్‌వాద్, పోల్కంపల్లి, సురాయిపల్లి తదితర గ్రామాల్లో శ్మశాన వాటికల స్థలాలు లేక సమాధుల మీద మృతదేహాలను పూడ్చివేసి తిరిగి సమాధులు నిర్మిస్తున్నారు. శవాలను ఖననం చేయడానికి గుంత తవ్వితే అందులో గతంలో ఖననం చేసినవారి అస్తికలు బయటపడుతున్నాయి. మరో మార్గం లేక అస్తికలను తొలగించి తిరిగి ఆ స్థలంలోనే మృతదేహాలను ఖననం చేస్తున్నారు.
శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఉపాధి హామీ పథకంలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించి నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖననం రోజు కష్టాలే..
ఓ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఆ కుటుంబసభ్యుల కష్టాలు వర్ణనాతీతం. ఖననం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల దౌల్తా బాద్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖననం చేసేందుకు స్థలం లేకపోవడంతో కుటుంబీకులు ఇబ్బందులు పడుతుంటే గ్రామస్తులు చందాలు వేసుకుని శ్మశానవాటిక స్థలం యజమానికి డబ్బులిచ్చి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉన్నా అవి వివాదంలో ఉన్నాయి. సదరు స్థలాలు తమ పట్టాభూముల్లో ఉన్నాయని కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. శ్మశానల్లో ఖననం చేయనివ్వడం లేదు. ఈనేపథ్యంలో గొ డవలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పం దించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment