people trouble
-
చచ్చినా.. చావేనా..!
దౌల్తాబాద్ : మనిషి చచ్చినా.. కష్టాలే ఎదురవుతున్నాయి. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఆరడుగుల స్థలం దొరకని పరిస్థితి గ్రామాల్లో దాపురించింది. ఖననం చేసేందుకు కాసింత జాగ లభించక, శ్మశానవాటికలకు స్థలం లేకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పొలం గట్లపైన, లేదంటే సమాధుల పైనే మృతదేహాలను పూడ్చిపెడుతున్నారు. ఆఖరి మజిలీకి ఆరడుగుల స్థలం లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనిషి బతికున్నప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులు.. చనిపోయిన తర్వాత ఖననం చేసేందుకైనా ఆరడుగుల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు నిత్యం అనేక సమస్యలతో సతమతమయ్యే మనిషికి చనిపోయాక కూడా ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా పరిధిలోని ఆయా మండలాలు, గ్రామాల్లో శ్మశానవాటికల కోసం స్థలాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామాల్లోని ఆయా సామాజిక వర్గాలకు శ్మశానవాటికల కోసం ప్రత్యేక స్థలాలు అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో ఇటీవల ధారూరు మండల పరిధిలో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. విషయం ఆర్డీఓ వరకు కూడా వెళ్లింది. దౌల్తాబాద్ మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో మినహా అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. సమాధుల మీదే ఖననం దౌల్తాబాద్, నీటూరు, నందారం, యాంకి, ఇండాపూర్, తిమ్మారెడ్డిపల్లి, గోకఫసల్వాద్, పోల్కంపల్లి, సురాయిపల్లి తదితర గ్రామాల్లో శ్మశాన వాటికల స్థలాలు లేక సమాధుల మీద మృతదేహాలను పూడ్చివేసి తిరిగి సమాధులు నిర్మిస్తున్నారు. శవాలను ఖననం చేయడానికి గుంత తవ్వితే అందులో గతంలో ఖననం చేసినవారి అస్తికలు బయటపడుతున్నాయి. మరో మార్గం లేక అస్తికలను తొలగించి తిరిగి ఆ స్థలంలోనే మృతదేహాలను ఖననం చేస్తున్నారు. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఉపాధి హామీ పథకంలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించి నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖననం రోజు కష్టాలే.. ఓ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఆ కుటుంబసభ్యుల కష్టాలు వర్ణనాతీతం. ఖననం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల దౌల్తా బాద్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖననం చేసేందుకు స్థలం లేకపోవడంతో కుటుంబీకులు ఇబ్బందులు పడుతుంటే గ్రామస్తులు చందాలు వేసుకుని శ్మశానవాటిక స్థలం యజమానికి డబ్బులిచ్చి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉన్నా అవి వివాదంలో ఉన్నాయి. సదరు స్థలాలు తమ పట్టాభూముల్లో ఉన్నాయని కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. శ్మశానల్లో ఖననం చేయనివ్వడం లేదు. ఈనేపథ్యంలో గొ డవలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పం దించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
నిర్లక్ష్యపు చీకటి–వెలుగులు
కంచరపాలెం : జీవీఎంసీ అధికారుల పనితీరు ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. విద్యుత్ దీపాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం తలెత్తుతుండడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దానికి జీవీఎంసీ 36, 43 వార్డుల్లో అంతంతమాత్రంగానే ఉన్న వీధి దీపాల నిర్వహణే నిదర్శనం. కంచరపాలెం జోన్ పరిధిలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతుల పేరిట కరెంట్ కోతలు విధిస్తూ అవస్థల పాలుచేస్తున్నారు. విద్యుత్ దీపాల నిర్వహణలో అధికారులు వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. 36, 43 వార్డుల్లో.. జీవీఎంసీ 36, 43 వార్డుల్లో వీధి లైట్ల నిర్వహణపై జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 36వ వార్డులోని రెడ్డి కంచరపాలెం, శ్రీనగర్, గౌరీనగర్, దేవేంద్రనగర్ ప్రాంతాల్లో పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రెండు వారాలుగా వీధి దీపాలు వెలుగుతుంటే.. అదే వార్డులో గొల్లకంచరపాలెం, తోటవీధి, దుర్గానగర్.. 43వ వార్డులోని మల్లసూరివీధి, గవర కంచరపాలెం, దయానంద్‌నగర్ ప్రాంతాల్లో నెల రోజులుగా చీకట్లు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు రాత్రుళ్లు వీధి లైట్లు వెలుగక స్థానికులు, వాహనచోదకులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నా.. సం బంధిత అధి కారులు వాటిపై దృష్టి సారించడం లేదు. ఈ స మస్యలపై వారికి ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేద నే ఆరోపణ లున్నాయి. జోన్–4 జోన ల్ కార్యాలయంలో నిర్వహిస్తు న్న ప్రజా వాణి కార్యక్రమానికి ఆయా వార్డుల్లోని సమస్యలపై అందిస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధి కారులు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజలు వాపోతున్నారు. మితిమీరుతున్న ఆకతాయిల ఆగడాలు.. ఆయా వీధుల్లో ఆకతాయిల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. మద్యం తాగి విద్యుత్తు దీపాలపై పడుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటున్న కనెక్షన్లను కలిపి పట్టపగలే విద్యుత్తు దీపాలను వెలిగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రిళ్లు మద్యం సీసాలతో విద్యుత్తు దీపాలను పగులగొడుతున్నా రు. దీనిపై పలుమార్లు అ« దికారులకు ఫిర్యాదు చేసి న ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆయా వార్డుల్లో నెలకొన్న వీధి లైట్ల సమస్యలను పరిష్కరించి, ఆకా తాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రిళ్లు ప్రయాణించలేం తోటవీధి నుంచి దుర్గానగర్ రహదారుల్లో ఆరు గంటలు దాటితే ఆందోళనగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఆయా వీధుల్లో నెల రోజులుగా దీపాలు వెలగక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – తంగేటి అప్పలరాజు, దుర్గానగర్ ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం నెల రోజులగా వీధి లైట్లు వెలగక నానా ఇబ్బంది పడుతున్నాం. మరికొన్ని కాలనీల్లో పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సమస్యపై జోనల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. జీవీఎంసీ విద్యుత్ దీపాల అధి కారులు స్పందించడం లేదు. – కాయిత రత్నాకర్, కంచరపాలెం, 36వ వార్డు -
శ్రీకాకుళంలో ఆపరేషన్ గజ..
సాక్షి, శ్రీకాకుళం : అడవి నుంచి వచ్చిన ఏనుగులు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాలుగు ఏనుగులతో కూడిన గుంపు కొత్తూరు మండలం కుద్దిగాం, పొన్నుటూరు గ్రామాల మధ్య మొక్కజొన్న తోటల్లో సంచరిస్తుంది. ఏనుగుల గుంపు ఒకవేళ గ్రామాలవైపు వస్తే తమ పరిస్థితి ఏమిటని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిరమండలం బొంతసవర గ్రామ కొండపై ఎనిమిది ఏనుగులు తిరుగుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అడవి ఏనుగులను తరలించేందుకు జయంత్, వినాయక్ అనే ఏనుగులను అధికారులు రంగంలోకి దింపారు. వాటి సాయంతో అడవి ఏనుగులను తరలించడానికి ‘ఆపరేషన్ గజ’ చేపట్టారు. త్వరలోనే ఏనుగులను తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. -
వాహనంపై పడిన భారీ మంచుకొండ
సాక్షి, కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ మంచుకొండచరియలు విరిగిపడటంతో ఎనిమిదిమంది గల్లంతయ్యారు. కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో పడిన వారంతా కుప్వారా నుంచి కర్ణా ప్రాంతానికి వెళుతున్నారు. వారు తమ వాహనంలో వెళుతుండగా సరిగ్గా సాధనటాప్ అనే ప్రాంతంలోని తంగ్దార్ వద్ద సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఓ భారీ మంచుకొండ విరిగి వారి వాహనంపై పడింది. దాంతో దాదాపు ఎనిమిదిమంది మంచుదిబ్బల కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ, పర్వత ప్రాంతాల్లో భద్రతను చూసేవారు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు రహదారుల విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా ఈ ప్రమాదంలో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. -
పోకలగూడెం.. పాలన మృగ్యం
- సర్పంచ్ అనర్హత వేటుపై వీడని సందిగ్ధం - హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు - కలెక్టర్ దగ్గర ఫైల్.. నెలల తరబడి నిలిచిన పరిపాలన చండ్రుగొండ : మండలంలోని పోకలగూడెం పంచాయతీలో పాలన ప్రతిష్టంభించింది. పంచాయతీలో పాలన నిలిచిపోవడంతో సుమారు 6,000 మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ రాములపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. నియమ నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో రెండోస్థానంలో ఉన్న అభ్యర్థికి పాలన పగ్గాలు అప్పజెప్పాలని ఆర్డీవో కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ ఫైల్ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంది. ఐదునెలలుగా అక్కడే మగ్గుతు న్నా దీనిపై ఇప్పటి వరకు ఓ స్పష్టత రాలేదు. పాత కలెక్టర్ కూడా బదిలీ అయ్యూరు. ఆయనస్థానంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ లో కేష్కుమార్అరుునా దీనికి పరిష్కారమార్గం చూపుతారోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2013 జులైలో పంచాయతీకి ఎన్నికలు జరిగా రుు. ఈ ఎన్నికల్లో గుగులోత్ రాములు విజయం సాధించారు. 1995 తరువాత రాములు కు ముగ్గురు సంతానం ఉన్నారని ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పంచాయతీరాజ్ ఎన్నికల నియమావళి ప్రకారం రాములు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని 2015 మే6 న కొత్తగూడెం ఆర్డీఓ, డివిజన్ ఎన్నికల అధికారి అమయ్‌కుమార్ తీర్పు చెప్పారు. సదరు తీర్పుపై రాము లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనూ రాములకు చుక్కెదురైంది. ఆర్డీఓ కోర్టు తీర్పును హైకోర్టులోని రెండు బెంచ్‌లు ఏకీభవించాయి. బంతి జిల్లా అధికారుల కోర్టులో పడింది. కానీ నెలలు గడుస్తున్నా జిల్లా అధికారులు ఈ అం శంపై చర్యలు తీసుకోకపోవడంతో పంచాయతీ పాలన అస్తవ్యస్తంగా మారింది. అభివృద్ధి పనులు నిలి చిపోయూరుు. మంచినీ రు,వీధి దీపాలు, పారి శుధ్యం అధ్వాన్నంగా మారింది. కలెక్టర్‌గారూ స్పందించరూ.. పోకలగూడెం పంచాయతీ విషయంలో అధికారపార్టీ ఒత్తిడితోనే ఇన్నాళ్లుగా కోర్టు తీర్పు అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. గత క లెక్టర్ టేబుల్‌పై నాలుగునెలల పాటు మగ్గిన ఫైల్‌పై నూతన కలెక్టర్ లోకేష్కుమారైనా స్పం దించాలని స్థానికులు కోరుతున్నారు. -
'వరుస ఎన్నికలతో అందరికీ ఇబ్బందే'
వరుస ఎన్నికలతో అంతా ఇబ్బందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మున్సిపల్, జిల్లా పరిషత్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వరుసగా నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడేంతవరకైనా మున్సిపల్, జిల్లా పరిషత్ ఫలితాలను నిలిపేయాలని ఆయన కేంద్రం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫలితాలను వాయిదా వేసేందుకు మార్గం చూడాలన్నారు. అయితే ఉన్నఫళంగా స్థానిక ఎన్నికలు రావడం పార్టీలకు ఇబ్బందే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తెలిపారు. టిక్కెట్ ఆశించే అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కు మరింత ఇబ్బంది తప్పదని ఆయన పేర్కొన్నారు.