సారంగాపూర్, న్యూస్‌లైన్ : వృద్ధురాలైన భార్య మరణించిందని తెలిసి వస్తున్న భర్త ఆటోలో హఠాన్మరణం చెందాడు. భార్యాభర్తల మృతి పండుగ పూట గ్రామంలో విషాదం మిగిల్చగా.. ఖననం సమయంలో శ్మశాన వాటిక స్థలం కోసం ఇరువర్గాల మధ్య విద్వేషం రగిలింది. పంతాలు.. పట్టింపుల మధ్య మానవత్వం మంటగలిసింది. శవాల సాక్షిగా శ్మశాన వాటిక స్థలం కోసం జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. మంగళవారం మండలంలోని వైకుంఠాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
వైకుంఠాపూర్ గ్రామంలో రెండు వర్గాల వారికి గతంలో రెండు శ్మశాన వాటికలు ఉండేవి. ఒక వర్గానికి గ్రామ సమీపంలోని చెరువు కట్ట కింద, మరో వర్గానికి గ్రామంలోకి వచ్చే దారిలో కల్వర్టు పక్కన కేటాయించారు. కల్వర్టు పక్క ఉన్న శ్మశాన వాటికలో భూగర్భజలాల పెరుగుదల కారణంగా మృతదేహాలు ఖననం చేయడానికి గోతులు తవ్విన ప్రతిసారి నీళ్లు ఉబికి వచ్చి ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో చెరువు కట్ట కింద ఉన్న మరో వర్గానికి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుంటున్నారని ఇటీవల సర్వే చేయించారు. అక్కడ భూమి ఎక్కువగా ఉందని సర్వేలో నిర్దారణ జరిగింది. దీంతో మరో వర్గానికి చెందిన పెద్దలంతా కలిసి తమకు కూడా అదే శ్మశాన వాటికలో మృతదేహాలు ఖననం చేయడానికి స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్ది రోజులుగా వివాదం సాగుతూనే ఉంది.
భార్యాభర్తల మృతితో రాజుకున్న వివాదం
గ్రామానికి చెందిన ఈసరి లింగవ్వ(85) మంగళవారం సహజంగానే మృతిచెందింది. ఆమె భర్త రాజన్న(90) కూతురును చూడడానికి పక్కనే ఉన్న అంబకంటి గ్రామానికి వెళ్లాడు. లింగవ్వ మృతి విషయం తెలుసుకున్న తండ్రీకూతురు వెంటనే తమ బంధువులతో కలిసి ఆటోలో వైకుంఠాపూర్‌కు బయల్దేరారు. దారిలో ఆటోలోనే రాజన్న మరణించాడు. దీంతో వారిద్దరిని ఎక్కడ ఖననం చేయాలనే అంశంతో వివాదం మొదలైంది. అప్పటికే శ్మశాన వాటిక స్థలం విషయంలో రగులుతున్న వివాదం ఒక్కసారిగా ఉధృతమైంది. ఈ దంపతుల సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికలో కాకుండా చెరువు కట్ట కింద ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేస్తామని పేర్కొనడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, తహశీల్దార్ గంగాధర్, సారంగాపూర్, నిర్మల్ రూరల్, నర్సాపూర్(జి) ఎస్సైలు మల్లేశ్, నర్సింహరెడ్డి, అనిల్‌లు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను పిలిపించి ఒప్పించే క్రమంలో వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలోనే స్వల్ప ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో చెరువు కట్టకింద శ్మశాన వాటికలో వృద్ధ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువర్గాలకు ఇబ్బందులు లేకుండా తహశీల్దార్‌తో కలిసి ఐదు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, అవసరమైతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అయిర నారాయణరెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పారు. దీంతో ఇరువర్గాల ప్రజలు శాంతించారు.
శవాల సాక్షిగా శ్మశానవాటిక స్థలం కోసం ఘర్షణ
Published Thu, Jan 16 2014 4:22 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
Advertisement
Advertisement