Vykuntapuram
-
వైకుంఠపురం బ్యారేజీ పనుల్లో అడ్డగోలుగా అంచనాల సవరణ
-
మరో వంచనకు ‘డిజైన్’!
సాక్షి, అమరావతి: వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనుల్లో మరోసారి వంచనకు రంగం సిద్ధమైంది! ఈ పనులకు ఇప్పటికే రెండుసార్లు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసినా ఓ కాంట్రాక్టర్ ఎత్తుగడలతో రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనాలు భారీగా పెంచి మూడోసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పోలవరం పనులను నామినేషన్‌పై అప్పగించిన కాంట్రాక్టర్‌కే దీన్ని కూడా కట్టబెట్టేలా ప్రణాళిక రచిస్తున్నారు. సర్కారు పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్)ను రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నారు. అక్రమాలను గతంలోనే బహిర్గతం చేసిన ‘సాక్షి’ రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో జూలై 9న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే పనుల అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ముఖ్యనేతపై కాంట్రాక్టర్ ఒత్తిడి తేవటంతో టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకానికి రూ.1,213 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి సెప్టెంబరు 5న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంచనాల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘వైకుంఠపురంలో రూ.400 కోట్లు గోవిందా’ శీర్షికన సెప్టెంబరు 7న, ‘వైకుంఠపురం అంచనాల్లో వంచన’ శీర్షికన సెప్టెంబరు 18న ప్రచురించిన కథనాల ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. ఈ కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు అంచనా వ్యయం ఖరారుపై విచారణ జరిపారు. మట్టి పేరుతో మోసం! బ్యారేజీ నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే మట్టి దొరుకుతున్నా 32 కి.మీ. దూరం నుంచి తరలించాలంటూ రవాణా ఖర్చుల రూపంలోనే రూ.47.19 కోట్లను ఉత్తినే కాంట్రాక్టర్‌కు ఇచ్చేయడానికి ఎత్తుగడ వేసినట్లు విచారణలో వెల్లడైంది. గైడర్ వాల్స్ అవసరం లేకున్నా చేపట్టాలని చూపడం ద్వారా రూ.150 కోట్లు అంచనా వ్యయం పెంచినట్లు గుర్తించారు. స్పిల్‌వే కుడి వైపున 600 మీటర్ల పొడవున మట్టికట్ట నిర్మిస్తే సరిపోతుందని, దీన్ని 1,732 మీటర్లకు పెంచడం ద్వారా అంచనా వ్యయం రూ.200 కోట్ల మేర పెరిగిందని తేలింది. ఈ నేపథ్యంలో అంచనాలను రూ.397.19 కోట్ల మేర తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పూర్తి స్థాయిలో విచారించి అక్రమాలను నిగ్గు తేల్చకుండా కేవలం రూ.150 కోట్ల మేర మాత్రం కోత వేసి రూ.1,063 కోట్లను ఐబీఎంగా ఖరారు చేసి టెక్నికల్ బిడ్ తెరిచిన రోజు ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భావించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 6వతేదీన టెక్నికల్ బిడ్ తెరవగా అంచనా వ్యయం తగ్గించారని పసిగట్టిన ముఖ్యనేత కోటరీలోని ప్రధాన కాంట్రాక్టర్ ఎవరూ షెడ్యూలు దాఖలు చేయకుండా చక్రం తిప్పారు. దీంతో మళ్లీ టెండర్‌ను రద్దు చేశారు. కోటరీ కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూడా.. బ్యారేజీ పనులకు మళ్లీ టెండర్ పిలవడానికి కసరత్తు చేస్తున్న అధికారులతో ఇటీవల సమావేశమైన ముఖ్యనేత అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తెచ్చారు. పోలవరంలో నామినేషన్‌పై భారీ ఎత్తున పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూడా దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. దీంతో ఇక చేసేది లేక అంచనా వ్యయం పెంచడానికి అధికారులు సాకులు వెతుకుతున్నారు. డిజైన్‌లో భారీ మార్పులంటున్న అధికారులు వ్యాప్కోస్ రూపొందించిన బ్యారేజీ డిజైన్ సక్రమంగా లేదని చెబుతున్న అధికారులు అందులో భారీ మార్పులు చేసినట్లు పేర్కొంటున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ వైకుంఠపురం బ్యారేజీ పనుల ఐబీఎంను రూ.1,376 కోట్లకు పెంచి ముఖ్యనేత సూచించిన నిబంధనలతో మూడోసారి టెండర్ నోటిఫికేషన్ సన్నాహాలు చేస్తున్నారు. అంటే బ్యారేజీ పనుల అంచనా వ్యయం దాదాపు రూ.575 కోట్లు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ పనులను కోటరీ కాంట్రాక్టర్‌కే అప్పగించి భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారు. -
‘వైకుంఠపురం’లో రూ.400 కోట్లు గోవిందా!
సాక్షి, అమరావతి: ఈ రెండు టెండర్ నోటిఫికేషన్లను పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ నిబంధనలను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. వైకుంఠపురం బ్యారేజీ టెండర్లలో చోటుచేసుకున్న గోల్మాల్ ఇదీ. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో ముఖ్యనేత యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారనడానికి ఇదో నిదర్శనం. పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ విధానంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కే వైకుంఠపురం బ్యారేజీ పనులను సైతం అప్పగించాలని ముఖ్యనేత ముందే నిర్ణయించారు. కానీ, జూలై 9న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో జారీ చేసిన టెండర్లలో అస్మదీయ కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం ఉండదని అనుమానం వచ్చి, వాటిని రద్దు చేసేలా చక్రం తిప్పారు. తాజాగా ఈ నెల 5న వైకుంఠపురం బ్యారేజీ పనులతోపాటు బ్యారేజీ నుంచి రాజధానికి నీటిని సరఫరా చేసే పథకం పనులకు ఒకే ప్యాకేజీ కింద ఈపీసీ(ఇంజనీరింగ్–ప్రొక్యూర్మెంట్–కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. జూలై 9న జారీ చేసిన టెండర్లో అంచనా వ్యయం రూ.801.88 కోట్లు. ఈపీసీ విధానంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లో ఐబీఎం అధికారికంగా ఇప్పటివరకూ నిర్ణయించలేదు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు రూ.1,239.21 కోట్లు. ఇందులో నీటి పథకం వ్యయం రూ.145 కోట్లకు మించదు. అంటే వైకుంఠపురం బ్యారేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.292.33 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి జూలై 9న జారీ చేసిన టెండర్ల సమయంలోనే అంచనా వ్యయం రూ.154 కోట్ల మేర పెంచేశారు. మొత్తం మీద బ్యారేజీ పనుల వ్యయాన్ని రూ.446.33 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యనేత జేబుల్లోకి రూ.400 కోట్లు వైకుంఠపురం బ్యారేజీ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. బిడ్లు దాఖలు చేయడానికి తుది గడువు సెప్టెంబర్ 19. ఈ నెల 11న ప్రీబిడ్ సమావేశాన్ని విజయవాడలో కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ నిర్వహించనున్నారు. 21న టెక్నికల్ బిడ్.. 25న ప్రైస్ బిడ్ తెరిచి ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి రూ.400 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో ముఖ్యనేతకు ముట్టనున్నాయి. జూలై 9న లంప్సమ్(ఎల్ఎస్) ఓపెన్ విధానంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ పని పేరు: రాజధానిలో ప్రాంతంలో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం నీటి నిల్వ సామర్థ్యం: 10 టీఎంసీలు అంచనా వ్యయం: 801.88 కోట్లు బిడ్ దాఖలు చేయాలంటే.. ♦ జాయింట్ వెంచర్లు(ఇద్దరు లేదా ముగ్గురు కాంట్రాక్టర్లు కలిసి) అనర్హులు. ♦ బిడ్ దాఖలు చేయాలంటే 2008–09 నుంచి 2017–18 వరకు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.200.47 కోట్ల విలువైన బ్యారేజీ పనులను పూర్తి చేసి ఉండాలి. ♦ బ్యారేజీ పనుల్లో 14.60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.12 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలి. 2,710 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను ఉపయోగించి గేట్లను ఒకే ఏడాదిలో తయారు చేసి ఉండాలి. ♦ కాంట్రాక్టర్ వద్ద రూ.120 కోట్ల మేర నగదు నిల్వ ఉండాలి. సెప్టెంబర్ 5న ఈపీసీ విధానంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ పని పేరు: వైకుంఠపురం బ్యారేజీ, రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని సరఫరా చేసే పథకం నీటి నిల్వ సామర్థ్యం: 10 టీఎంసీలు అంచనా వ్యయం: రూ.1,239.21 కోటు!్ల బిడ్ దాఖలు చేయాలంటే... ♦ జాయింట్ వెంచర్లు అర్హులే. ఇందులో కాంట్రాక్టర్లు ముగ్గురికి మించకూడదు. ♦ గత పదేళ్లలో ఏదైనా ఒక ఏడాదిలో రూ.303 కోట్ల విలువైన బ్యారేజీ, నీటి పథకాల పనులు చేసిన అనుభవం ఉండాలి. ఒక ఏడాదిలో 13.96 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,58,850 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, 4,260 మెట్రిక్ టన్నుల స్టీలును వినియోగించి గేట్లు తయారు చేసి, అమర్చిన అనుభవం ఉండాలి. ♦ ఐదు క్యూమెక్కుల సామర్థ్యంతో 2 పంపులు, 2 మెగావాట్ల సామర్థ్యంతో రెండు మోటార్లు, 1.8 మీటర్ల వ్యాసార్ధం.. 2 కిలోమీటర్ల పొడవున ప్రెజర్మైన్ పనులు చేసి ఉండాలి. -
శవాల సాక్షిగా శ్మశానవాటిక స్థలం కోసం ఘర్షణ
సారంగాపూర్, న్యూస్‌లైన్ : వృద్ధురాలైన భార్య మరణించిందని తెలిసి వస్తున్న భర్త ఆటోలో హఠాన్మరణం చెందాడు. భార్యాభర్తల మృతి పండుగ పూట గ్రామంలో విషాదం మిగిల్చగా.. ఖననం సమయంలో శ్మశాన వాటిక స్థలం కోసం ఇరువర్గాల మధ్య విద్వేషం రగిలింది. పంతాలు.. పట్టింపుల మధ్య మానవత్వం మంటగలిసింది. శవాల సాక్షిగా శ్మశాన వాటిక స్థలం కోసం జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. మంగళవారం మండలంలోని వైకుంఠాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైకుంఠాపూర్ గ్రామంలో రెండు వర్గాల వారికి గతంలో రెండు శ్మశాన వాటికలు ఉండేవి. ఒక వర్గానికి గ్రామ సమీపంలోని చెరువు కట్ట కింద, మరో వర్గానికి గ్రామంలోకి వచ్చే దారిలో కల్వర్టు పక్కన కేటాయించారు. కల్వర్టు పక్క ఉన్న శ్మశాన వాటికలో భూగర్భజలాల పెరుగుదల కారణంగా మృతదేహాలు ఖననం చేయడానికి గోతులు తవ్విన ప్రతిసారి నీళ్లు ఉబికి వచ్చి ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో చెరువు కట్ట కింద ఉన్న మరో వర్గానికి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుంటున్నారని ఇటీవల సర్వే చేయించారు. అక్కడ భూమి ఎక్కువగా ఉందని సర్వేలో నిర్దారణ జరిగింది. దీంతో మరో వర్గానికి చెందిన పెద్దలంతా కలిసి తమకు కూడా అదే శ్మశాన వాటికలో మృతదేహాలు ఖననం చేయడానికి స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్ది రోజులుగా వివాదం సాగుతూనే ఉంది. భార్యాభర్తల మృతితో రాజుకున్న వివాదం గ్రామానికి చెందిన ఈసరి లింగవ్వ(85) మంగళవారం సహజంగానే మృతిచెందింది. ఆమె భర్త రాజన్న(90) కూతురును చూడడానికి పక్కనే ఉన్న అంబకంటి గ్రామానికి వెళ్లాడు. లింగవ్వ మృతి విషయం తెలుసుకున్న తండ్రీకూతురు వెంటనే తమ బంధువులతో కలిసి ఆటోలో వైకుంఠాపూర్‌కు బయల్దేరారు. దారిలో ఆటోలోనే రాజన్న మరణించాడు. దీంతో వారిద్దరిని ఎక్కడ ఖననం చేయాలనే అంశంతో వివాదం మొదలైంది. అప్పటికే శ్మశాన వాటిక స్థలం విషయంలో రగులుతున్న వివాదం ఒక్కసారిగా ఉధృతమైంది. ఈ దంపతుల సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికలో కాకుండా చెరువు కట్ట కింద ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేస్తామని పేర్కొనడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, తహశీల్దార్ గంగాధర్, సారంగాపూర్, నిర్మల్ రూరల్, నర్సాపూర్(జి) ఎస్సైలు మల్లేశ్, నర్సింహరెడ్డి, అనిల్‌లు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను పిలిపించి ఒప్పించే క్రమంలో వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలోనే స్వల్ప ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో చెరువు కట్టకింద శ్మశాన వాటికలో వృద్ధ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువర్గాలకు ఇబ్బందులు లేకుండా తహశీల్దార్‌తో కలిసి ఐదు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, అవసరమైతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అయిర నారాయణరెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పారు. దీంతో ఇరువర్గాల ప్రజలు శాంతించారు.