మరో వంచనకు ‘డిజైన్‌’! | Another fraud in the name of Vykuntapuram barrage | Sakshi
Sakshi News home page

మరో వంచనకు ‘డిజైన్‌’!

Published Sun, Oct 21 2018 4:26 AM | Last Updated on Sun, Oct 21 2018 11:37 AM

Another fraud in the name of Vykuntapuram barrage - Sakshi

సాక్షి, అమరావతి: వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనుల్లో మరోసారి వంచనకు రంగం సిద్ధమైంది! ఈ పనులకు ఇప్పటికే రెండుసార్లు టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేసినా ఓ కాంట్రాక్టర్‌ ఎత్తుగడలతో రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనాలు భారీగా పెంచి మూడోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. పోలవరం పనులను నామినేషన్‌పై అప్పగించిన కాంట్రాక్టర్‌కే దీన్ని కూడా కట్టబెట్టేలా ప్రణాళిక రచిస్తున్నారు.
సర్కారు పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఐబీఎం(ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌)ను రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి కసరత్తు చేస్తున్నారు. 

అక్రమాలను గతంలోనే బహిర్గతం చేసిన ‘సాక్షి’
రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో జూలై 9న ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. అయితే పనుల అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ముఖ్యనేతపై కాంట్రాక్టర్‌ ఒత్తిడి తేవటంతో టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేశారు. బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకానికి రూ.1,213 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి సెప్టెంబరు 5న టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అంచనాల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘వైకుంఠపురంలో రూ.400 కోట్లు గోవిందా’ శీర్షికన సెప్టెంబరు 7న, ‘వైకుంఠపురం అంచనాల్లో వంచన’ శీర్షికన సెప్టెంబరు 18న ప్రచురించిన కథనాల ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. ఈ కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు అంచనా వ్యయం ఖరారుపై విచారణ జరిపారు. 

మట్టి పేరుతో మోసం!
బ్యారేజీ నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే మట్టి దొరుకుతున్నా 32 కి.మీ. దూరం నుంచి తరలించాలంటూ రవాణా ఖర్చుల రూపంలోనే రూ.47.19 కోట్లను ఉత్తినే కాంట్రాక్టర్‌కు ఇచ్చేయడానికి ఎత్తుగడ వేసినట్లు విచారణలో వెల్లడైంది. గైడర్‌ వాల్స్‌ అవసరం లేకున్నా చేపట్టాలని చూపడం ద్వారా రూ.150 కోట్లు అంచనా వ్యయం పెంచినట్లు గుర్తించారు. స్పిల్‌వే కుడి వైపున 600 మీటర్ల పొడవున మట్టికట్ట నిర్మిస్తే సరిపోతుందని, దీన్ని 1,732 మీటర్లకు పెంచడం ద్వారా అంచనా వ్యయం రూ.200 కోట్ల మేర పెరిగిందని తేలింది. ఈ నేపథ్యంలో అంచనాలను రూ.397.19 కోట్ల మేర తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పూర్తి స్థాయిలో విచారించి అక్రమాలను నిగ్గు తేల్చకుండా కేవలం రూ.150 కోట్ల మేర మాత్రం కోత వేసి రూ.1,063 కోట్లను ఐబీఎంగా ఖరారు చేసి టెక్నికల్‌ బిడ్‌ తెరిచిన రోజు ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని భావించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 6వతేదీన టెక్నికల్‌ బిడ్‌ తెరవగా అంచనా వ్యయం తగ్గించారని పసిగట్టిన ముఖ్యనేత కోటరీలోని ప్రధాన కాంట్రాక్టర్‌ ఎవరూ షెడ్యూలు దాఖలు చేయకుండా చక్రం తిప్పారు. దీంతో మళ్లీ టెండర్‌ను రద్దు చేశారు.

కోటరీ కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూడా..
బ్యారేజీ పనులకు మళ్లీ టెండర్‌ పిలవడానికి కసరత్తు చేస్తున్న అధికారులతో ఇటీవల సమావేశమైన ముఖ్యనేత అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తెచ్చారు. పోలవరంలో నామినేషన్‌పై భారీ ఎత్తున పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూడా దక్కే నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించారు. దీంతో ఇక చేసేది లేక అంచనా వ్యయం పెంచడానికి అధికారులు సాకులు వెతుకుతున్నారు. 

డిజైన్‌లో భారీ మార్పులంటున్న అధికారులు
వ్యాప్కోస్‌ రూపొందించిన బ్యారేజీ డిజైన్‌ సక్రమంగా లేదని చెబుతున్న అధికారులు అందులో భారీ మార్పులు చేసినట్లు పేర్కొంటున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ వైకుంఠపురం బ్యారేజీ పనుల ఐబీఎంను రూ.1,376 కోట్లకు పెంచి ముఖ్యనేత సూచించిన నిబంధనలతో మూడోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ సన్నాహాలు చేస్తున్నారు. అంటే బ్యారేజీ పనుల అంచనా వ్యయం దాదాపు రూ.575 కోట్లు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ పనులను కోటరీ కాంట్రాక్టర్‌కే అప్పగించి భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement