బరియల్ హీరో.. ఓ కాటికాపరి గిన్నిస్ కిక్ | Burial hero wins guinness over Taekwondo kicks | Sakshi
Sakshi News home page

బరియల్ హీరో.. ఓ కాటికాపరి గిన్నిస్ కిక్

Published Tue, Aug 12 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

బరియల్ హీరో.. ఓ కాటికాపరి గిన్నిస్ కిక్

బరియల్ హీరో.. ఓ కాటికాపరి గిన్నిస్ కిక్

మార్షల్ ఆర్ట్స్.. ఈ పదం వింటే చాలు యువకుల పిడికిళ్లు బిగుసుకుపోతాయి.. వెన్ను నిటారుగా నిలుస్తుంది.. కాళ్లు అవకాశం కోసం గాల్లో తేలుతుంటాయి. చురకత్తుల్లాంటి చూపులు.. చాకుల్లాంటి చేతులు.. మార్షల్ ఆర్ట్స్‌కి అదనపు ఆకర్షణ. ఈ కళలో ఆరితేరాలంటే శారీరకంగా చిరుతలా చురుగ్గా ఉండాలి.. మానసికంగా వె య్యి ఏనుగుల బలం ఉండాలి. అన్నింటికి మించి నేను ఏదైనా చేయగలనన్న కసి ఉండాలి. ఆ బలమే ఓ కాటికాపరిని.. తైక్వాండోలో కింగ్‌ని చేసింది. పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మన్నె శ్రీరంగ కిక్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. ఆ విజయం వెనుకున్న విషయాలు ఆయన మాటల్లో వింటేనే మనసుకెక్కుతాయి.
 
 తైక్వాండో కిక్స్‌లో ఐర్లాండ్ రికార్డు.. 30 నిమిషాల్లో యాైభె వేల కిక్స్ కొట్టడం. దాన్ని ఢీ కొట్టడానికి కొన్నేళ్లుగా సాధన చేశాను. ఇరవై ఏళ్ల నా కల నేటికి నెరవేరింది. కేవలం 15 నిమిషాల్లో 50,614 కిక్స్ కొట్టాను. ఆ పోటీలకు మన దేశం నుంచి 50 మంది మార్షల్ ఆర్ట్స్ ప్రొఫెషనల్స్ వచ్చారు. అందరూ ఉన్నవారే.. చదువుకున్నవారే. నా దగ్గర ఆ రెండూ లేవు. కేవలం గెలవాలన్న కసి తప్ప. నా ఒంట్లో బలానికంటే ఎక్కువ కసే ఉంది. అందుకే ఆ రికార్డును బద్దలు కొట్టాను. ఈనెల రెండో తేదీన డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సత్కారాన్ని పొందాను. తెల్లవారి వార్తాపత్రికల్లో  వచ్చిన నా ఫొటోలు చూసి ఇరుగుపొరుగు మా అమ్మను మెచ్చుకున్నారు. నాకైతే నేను పని చేసే శ్మశానవాటికలో తెలిసినవారు, తెలియనివారు సన్మానం చేసినంత పని చేశారు.
 
 తొమ్మిదో వాడిని..
 పుట్టుక నుంచి నా జీవితం శ్మశానంలోనే గడిచింది. నాన్న ఎక్తయ్య కాటి కాపరి. అమ్మ బాలమణి నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేది. ఐదుగురు మగ పిల్లలు, నలుగురు అమ్మాయిలు. నేను తొమ్మిదో సంతానాన్ని. నాన్న, అన్నలు, నేను అందరం సైదాబాద్ శ్మశానవాటికలో పనిచేసుకుంటూ బతికేవాళ్లం. ఇంట్లో చిన్నవాడ్ని కావడంతో నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోగలిగాను. పాఠశాల విద్యతోనే చదువు సరి పెట్టాను. చిన్ననాటి నుంచి కరాటే అంటే ప్రాణం. రూపాయి రూపాయి పోగేసి కర్మాన్‌ఘాట్ దగ్గరున్న మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్‌లో చేరాను. కాటికాపరిగా పనిచేస్తూనే కరాటే ప్రాక్టీస్ చేశాను.
 
 శ్మశానవాటికలోనే...
 ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు శ్మశానవాటికలో మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన రకరకాల వ్యాయామాలు ప్రాక్టీస్ చేసేవాడిని. 1991లో మొదలైన నా సాధనకు ఫలితం 1997లో దక్కింది. ఆ ఏడాది మద్రాసులో జరిగిన కరాటే పోటీలో విజయం వరించింది. ఇక అప్పటి నుంచి తైక్వాండోలోని రకరకాల కిక్‌లపై ప్రత్యేక సాధన మొదలుపెట్టాను. శిక్షణ.. అంటే మామూలుగా కోచింగ్ సెంటర్లలోనే ఉంటుంది. కానీ మాస్టార్లు చెప్పిన విద్యను ఒడిసిపట్టి.. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్లే ఈ స్థానాన్ని పొందగలిగాను. ప్రశాంతమైన స్థలం దొరకక నా తోటి వారెందరో ప్రాక్టీస్‌కు రోజుల తరబడి దూరమవుతుంటారు. నాకు మాత్రం ఆ చింత లేదు. రోజు ఉదయాన్నే శ్మశానవాటికలోని చెట్ల కిందకు వెళ్లి సాధన చేసే వాడిని. ప్రాక్టీస్‌తో పాటు మేం ఎందులోనూ తక్కువ కాదని పదిమందికీ చాటి చెప్పాలనే తపన దానికి తోడైంది.
 
 కొలువు కోసం కలలు
 ‘ఓ కాటికాపరి తనకు సంబంధం లేని విద్యలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడం బహుశా ఇదే తొలిసారేమో..’అంటూ ఓ పెద్దాయన నా భుజం తట్టి ఓ మాట చెప్పాడు. ‘కన్నీరుకు మాత్రమే నెలవైన ఈ శ్మశానవాటికలో ఆనందబాష్పాలు తెప్పించే ఈ విజయం ప్రతి ఒక్క పేదవాడికి పాఠం కావాలి’ అని అన్నాడు. మా అమ్మ మాత్రం.. చిన్నప్పటి నుంచి ఒకటే మాట పలుకుతుంది.‘ఒక్క బిడ్డకైనా సర్కారు కొలువొస్తే బాగుండు. వీడు కాటికాపరిగానే ఉంటాడో ఏందో..’ అంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరా ఇదే మాట. అమ్మా...గిన్నిస్ బుక్‌ల ఎక్కిననే అంటే...‘అంత గొప్పదారా అది. అయితే కొలువు ఇప్పిస్తదా’ అంటది. నా ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సహకరిస్తే మా అమ్మ కల నెరవేరుతుంది. మా జీవితాలు బాగుపడత యి.
 - భువనేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement