శ్మశాన స్థలం ఆక్రమణపై ఉద్రిక్తత
-
మూడు గంటల పాటు రాస్తారోకో
ఇందుకూరుపేట : శ్మశాన స్థలాన్ని ఆక్రమించడంపై ఇందుకూరుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కొత్తూరు పంచాయతీ పారువేటదిబ్బ శ్మశాన స్థలం వివాదం కొంత కాలంగా కొనసాగుతుంది. ఆ స్థలంలో సోమవారం హద్దు రాళ్లను నాటారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. నాటిన హద్దురాళ్లను ధ్వంసం చేశారు. గ్రామస్తులు మట్లాడుతూ ఇందుకూరుపేట, కొత్తూరు పంచాయతీలోని గ్రామస్తులుకు దశాబ్దాల కాలం నుంచి శ్మశానంగా ఉన్న స్థలం ఇప్పుడు పట్టాభూమిగా చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం శ్మశాన స్థల ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా శ్మశాన స్థలం ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. న్యాయం చేసేంత వరకు కదిలేదు లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలం చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని సీఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. నెలల నుంచి సమస్య కొనసాగుతున్నా.. నాయకులు ఎవరూ తమకు మద్దుతుగా నిలవకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.