
అంజలీదేవికి కన్నీటి వీడ్కోలు
తమిళసినిమా, న్యూస్‌లైన్: ప్రఖ్యాత నటి అంజలీదేవికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం కన్నుమూసిన అంజలీదేవి అంత్యక్రియలు గురువారం చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సాయంత్రం 4.30 గంటలకు జరిగాయి. ఉదయం ఇక్కడి అడయార్‌లోని అంజలీదేవి స్వగృహంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయూనికి నివాళులర్పించారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య, తమిళనాడు మంత్రులు వళర్మతి, మాధవరం మూర్తి తదితరులు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ నటీమణులు వైజయంతి మాలా బాలి, సచ్చు, కాంచన, రాజశ్రీ, శరత్‌బాబు, గాయని పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత మురారి, సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు, రచయితలు వెన్నెలకంటి, భువనచంద్ర, డాక్టర్ సి.ఎం.కె. రెడ్డి తదితర ప్రముఖులు అంజలీదేవికి నివాళులర్పించారు.