కట్టపై ఉన్న ఆక్రమణలు
నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో దళితుల శ్మశాన వాటిక ఆక్రమణల చెరలో ఉంది. ఎస్సీలు కర్మకాండలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం కేటాయించిన కుంట చిన్నచిన్నగా ఆక్రమణకు గురవుతోంది. కుంట కనుమరుగవుతున్న నేపథ్యంలో దళితులు ఏకమయ్యారు. అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల ఆక్రమణలో ఉన్న కుంటను రక్షించుకునేందుకు మూడేళ్ల నుంచి దళితులు పోరాడుతున్నా ప్రయోజనం లేకపోతోంది.
ఇదీ..కథ
ఉప్పుగుండూరు ఎస్సీలకు సర్వే నంబర్ 66లో 9.60 ఎకరాల శ్మశాన స్థ«లంతో పాటు 76 సర్వే నంబర్‌లో కర్మకాండలు నిర్వహించుకునేందుకు 6 ఎకరాల 70 సెంట్లు ఉంది. దానిలో కొంత భాగంలో చెరువు తవ్వించి దానిలో బావి నిర్మించారు. కాల క్రమంలో గ్రామంలోని అగ్రవర్ణాలు శ్మశాన స్థలాన్ని ఆక్రమించి పొలాలుగా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా చెరువు మీద ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో దళితులంతా కలిసి అప్పటి కలెక్టర్‌తో పాటు ఇప్పటి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై 2015 నవంబర్‌లో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆర్డీవో శ్రీనివాసరావు.. ఎస్సీల శ్మశానంతో పాటు మాల కుంటను ఎవరూ ఆక్రమించేందుకు వీల్లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు దగ్గరుండి ఆక్రమణలు తొలగించారు.
అంత వరకూ ఓకే..
అప్పుడు కొంతకాలం ఆక్రమణదారులు స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పెచ్చురిల్లుతున్నారు. అ«ధికార పార్టీకి చెందిన నేత అండదండలతో కుంటపై ఆక్రమణలు పెరుగుతున్నాయి. మాలకుంటపై చిన్నగా> ఒక్కో ఇల్లు నిర్మిస్తున్నారు. పక్కనే మరో ఇద్దరు రేకులు వేసి ఆక్రమణలకు సిద్ధమయ్యారు. ఆక్రమణల ద్వారా ఇప్పటికే నిర్మించిన ఇళ్లలోని మరుగుదొడ్ల ద్వారా వచ్చే నీటిని మాల కుంటలోకి వదులుతున్నారు. ఈ క్రమంలో కుంట మొత్తం దుర్వాసన వస్తోంది. ఫలితంగా మాలకుంట నిరుపయోగమవుతోంది. ఎస్సీల అవసరాలకు కేటాయించిన కుంట నేడు పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో పాటు కలుషితమవుతోంది.
ఏళ్లుగా పోరాడుతున్నాం: కుంట ఆక్రమణకు సంబంధించి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అయినా అధికార పార్టీ నాయకుల అండదండలతో కుంటపై మళ్లీ నిర్మాణాలు చేస్తున్నారు. గతంలోనే ఆర్డీవో పరిశీలించి ఆక్రమణలు తొలగించడంతో పాటు మరుగుదొడ్ల పైప్‌లైన్ తీసేయాలని ఆదేశాలు జారీ చేసినా ఆ వైపుగా చర్యలు శూన్యం. ఆక్రమణలు ఆపకుంటే భవిష్యత్‌లో దళితులు ఉద్యమించాల్సి ఉంటుంది.
– కొలకలూరి విజయకుమార్, దళితుడు
ఆక్రమణదారులపై చర్యలు: ఉప్పుగుండూరు మాలకుంటను ఆక్రమించుకుంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఎవరైనా ఆక్రమణలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి సమస్యను పరిష్కరిస్తాం. – సుజాత, తహసీల్దార్, నాగులుప్పలపాడు
Comments
Please login to add a commentAdd a comment