degree colleges
-
డిగ్రీ కాలేజీల ఎదురీత..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య విషయంలో విద్యార్థుల ఎంపికల్లో మార్పుల కారణంగా రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణ డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవటంతో చాలా కాలే జీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కావటంలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కాలేజీల్లోనే 40 శాతం సీట్లు నిండితే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. మిగతా జిల్లాల్లో అంతకంటే చాలా తక్కువగా ఉంటున్నాయి.వందకుపైగా కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో యాజమాన్యాలు కాలేజీల మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి. అడ్మిషన్లు తగ్గటం ఒక సమస్య అయితే.. రూ.5 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండటం కాలేజీలను మరింత కుంగదీస్తోంది. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణల వైపు అడుగులేయటం గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీలను మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. అఫిలియేషన్‌కూ వెనకడుగు రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 362 ఉండగా, మిగతా జిల్లాల్లో 692 ఉన్నాయి. గత ఏడాది 150 కాలేజీలు కొన్ని కోర్సుల్లో, సెక్షన్లలో అఫిలియేషన్ తీసుకునేందుకు వెనుకాడాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉందని నిర్వాహకు లు అంటున్నారు. అన్ని కాలేజీల్లో కలిపి 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇందులో ఏటా సగటున 2.20 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. దోస్త్ పరిధిలోని కాలేజీల్లో 3,85,573 సీట్లు ఉండగా, గతేడాది 2,12,188 సీట్లు భర్తీ అయ్యాయి.ఇంటర్ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులను ఆకర్షించటంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీని గ్రామీణ ప్రాంత కాలేజీలు తట్టుకోలేకపోతున్నాయి. తమ ఇళ్లకు సమీపంలోని కాలేజీల్లోనే చదవాలనుకునే విద్యార్థులు ఆర్ట్స్ గ్రూపులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో సైన్స్ గ్రూపుల్లో చేరికలు నామమాత్రంగా ఉంటున్నాయి. గత మూడేళ్లలో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో చేరికలు 42 శాతం తగ్గిపోయాయి. ముఖ్యంగా సైన్స్ గ్రూపుల్లో ఈ పరిస్థితి ఉంది. కొత్త కోర్సులతో చిక్కులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి కోర్సులు తీసుకొస్తున్నారు. కామర్స్‌లోనూ కంప్యూటర్ కోర్సుల కాంబినేషన్ వస్తోంది. రాజధానికి సమీపంలో ఉండటం వల్ల ఈ కోర్సుల బోధకులు దొరకుతున్నారు. విద్యార్థులు కూడా రాజధానిలో ఉంటే ఇతర కోర్సులు నేర్చుకోవచ్చని, పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయని ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు.గ్రామీణ కాలేజీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కంప్యూటర్ కోర్సులకు లెక్చరర్‌ను తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.50 వేల వేతనం ఇవ్వాలి. ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. ఇదంతా చేస్తే ఫీజులు పెంచాలి. ఫీజులు పెంచితే విద్యార్థులు చేరే పరిస్థితి లేదు. ఈ కారణంగా కొత్త కోర్సుల జోలికి వెళ్లడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సిలబస్ మార్చాలని నిర్ణయించింది. 20 శాతం కంప్యూటర్ అనుసంధానిత సిలబస్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతా కాలేజీల మనుగడకు ప్రమాదంగా మారే పరిస్థితి కని్పస్తోంది. -
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
బహుళజాతి కంపెనీల ‘డిగ్రీ’ రూట్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తిరిగి మంచి రోజులొస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు కూడా డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల తరహాలోనే ఇక్కడా నిపుణులైన వారికి మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) గత ఏడాది నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. గత ఏడాది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిలో కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న డిగ్రీ కోర్సులు చేసిన వారు 43శాతం ఉన్నట్టు గుర్తించారు. విప్రో, అమెజాన్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో గరిష్టంగా రూ.16 లక్షలు, కనిష్టంగా రూ.4 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు తేలింది. తెలంగాణలోనూ 45వేల మంది బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి ఈ ట్రెండ్ ఐదేళ్ల క్రితమే మొదలైందని.. గత ఏడాది నుంచి ఊపు వచ్చిదని నిపుణులు చెప్తున్నారు. డిగ్రీ స్వరూప స్వభావం మారుతోందని, అందుకే ఇప్పుడు వీటిని నాన్–ఇంజనీరింగ్ కోర్సులుగా పిలుస్తున్నారని ఉన్నత విద్య వర్గాలు అంటున్నాయి. టెక్నాలజీ ఆధారిత కోర్సులతో.. తెలంగాణవ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు డిగ్రీ సీట్లున్నాయి. ఏటా 2.25 లక్షల సీట్ల వరకూ భర్తీ అవుతున్నాయి. ఇందులో చాలా మంది కంప్యూటర్ సాంకేతికత కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ కోర్సుతోపాటు ఏదైనా డిమాండ్ ఉన్న కాంబినేషన్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు బహుళజాతి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీకాం కంప్యూటర్స్ చేసిన వారికి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అన్ని విభాగాల్లో యాంత్రీకరణ ప్రభావం కనిపిస్తోంది. అన్ని కంపెనీలు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలను అభివృద్ధి చేసుకున్నాయి. డేటా ఎనాలసిస్, మార్కెటింగ్ ట్రెండ్స్, ఆడిట్ కోసం సాంకేతిక నిపుణులు అవసరం. బీకాం చేసినవారికి ఆడిట్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటున్నాయి. పెద్ద ఆడిటర్ల కన్నా బీకాం పూర్తిచేసే ఆడిటర్లను అసిస్టెంట్లుగా కంపెనీలు నియమించుకుంటున్నాయి. మూడో వంతు మందికి.. తెలంగాణవ్యాప్తంగా గత ఏడాది 76వేల మంది కామర్స్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వచ్చారు. వారిలో 24వేల మంది వరకు అసిస్టెంట్ ఆడిటర్లు, అనలిస్టులుగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. గత సంవత్సరం బీఏ నేపథ్యంతోపాటు కంప్యూటర్స్ ఆప్షన్‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు 18 వేల మంది మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు పొందినట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యం ఉండటం, వారిని తక్కువ వేతనంతో తీసుకున్నా వీలైనంత త్వరగా శిక్షణ ఇచ్చి అనుకూలంగా మార్చుకోవచ్చని కంపెనీలు భావిస్తుండటమే దీనికి కారణం. విద్యార్థులు కూడా మొదట్లో తక్కువ వేతనాలకే చేరుతున్నా.. నైపుణ్యం పెరిగితే మంచి వేతనం వస్తుందని ఆశిస్తున్నారు. రాజధానికే పరిమితం... ఇప్పటికీ నాణ్యమైన డిగ్రీ విద్య కేవలం హైదరాబాద్, పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. మంచి వేతనంతో ఉద్యోగం పొందుతున్నవారిలో ఇక్కడి కాలేజీల్లో చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 83 కాలేజీల నుంచి డిగ్రీ విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీల్లో నాణ్యత పెరగడం లేదు. క్యాంపస్ సెలక్షన్‌కు వెళ్ల కంపెనీలు కూడా హైదరాబాద్ ప్రాంత డిగ్రీ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. డిగ్రీలో విద్యార్థుల్లో 43శాతం హైదరాబాద్, పరిసరాల్లోకి కాలేజీల్లోనే చేరుతున్నారు. ఇక్కడ డిగ్రీ చేస్తూనే పార్ట్‌టైం జాబ్ చేసుకోవచ్చనే ఆలోచన, చదువుకునే సమయంలో ఇతర కోర్సులు చేయడానికీ హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశమే దీనికి కారణం. విద్యార్థుల చేరిక ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉండే వివిధ కాంబినేషన్ల కోర్సులను హైదరాబాద్‌లోని డిగ్రీ కాలేజీలు ప్రవేశపెట్టగలుతున్నాయి. ఇలా డేటాసైన్స్, ఆనర్స్ వంటి కోర్సులు హైదరాబాద్ పరిధిలోనే విజయవంతంగా కొనసాగుతున్నట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు కూడా చెప్తున్నాయి. భవిష్యత్‌లో అన్ని జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. నైపుణ్యమే డిగ్రీ విద్యార్థులకు నజరానా డిగ్రీ విద్యార్థులను నియమించుకునేందుకు పెద్ద కంపెనీలు ఇష్టపడుతున్నాయి. వీరిలో ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానమైన నైపుణ్యం ఉంటుందని భావిస్తున్నాయి. వారిని తేలికగా తమ కంపెనీ అవసరాలకు తగినట్టుగా మలుచుకోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. డిగ్రీలో వస్తున్న కాంబినేషన్ కోర్సుల వల్ల నైపుణ్యం పెరిగింది. తక్కువ వేతనాలతో ఉద్యోగులను తీసుకునే కంపెనీలు కూడా డిగ్రీ విద్యార్థులను ఇష్టపడుతున్నాయి. వారు అంత తేలికగా కంపెనీ మారరనే భావన ఉంది. ఇవన్నీ డిగ్రీ విద్యార్థులకు కలసి వచ్చే అంశాలే. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి -
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్‌లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్‌సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన!
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. అందుకనుగుణంగా ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది (2023–24) నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసే వీలుంది. ఈ క్రమంలో ఈనెల 28న వంద కాలేజీల ప్రిన్సిపల్స్, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఏ కాలేజీలో ఏ కోర్సు సాధ్యమనేది చర్చించి, త్వరలో ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో ఇంజనీరింగ్‌తో సమానంగా డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, ఆనర్స్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రవేశపెట్టే నైపుణ్య కోర్సులు డిగ్రీ విద్య స్వరూప స్వభావాల్ని మారుస్తాయని, చదువుతూనే ఉపాధి పొందవచ్చని మండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలనూ తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారుచేస్తోందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. చదవండి: 3 నెలల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏమిటీ కోర్సులు? కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా పథకంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ కొన్నేళ్లుగా సరికొత్త కోర్సులపై అధ్యయనం చేసి.. 14 నైపుణ్య కోర్సులకు రూపకల్పన చేసింది. వీటిలో రిటైల్ మేనేజ్మెంట్, క్రియేటివ్ రైటింగ్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, గేమింగ్ అండ్ యానిమేషన్ వంటి కోర్సులున్నాయి. స్కిల్ కోర్సులను రెండు రకాలుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫస్టియర్ నుంచే స్కిల్ కోర్సులుండేలా ఒక పథకం, రెండో ఏడాది నుంచి వీటిని అమలు చేయడం మరో విధానంగా తీసుకురానున్నారు. చదివే సమయంలోనే స్టైపెండ్ డిగ్రీ చదివే సమయంలో స్కిల్ కోర్సులను ప్రాక్టికల్‌గా నేర్పుతారు. ఇందుకు కొన్ని సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంటుంది. ఆయా సంస్థల్లో వారానికి మూడు రోజులు విద్యార్థి ప్రాక్టికల్‌గా శిక్షణ పొందుతారు. ఈ సమయంలో రూ.10 వేల వరకూ నెలకు ఉపకార వేతనం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో తొలుత 103 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..! -
ఉపాధి, ఉద్యోగ కల్పనకు లైఫ్ స్కిల్స్ కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ కోర్సులకు విద్యాశాఖ శ్రీకారం చుడుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా ఈ స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ కోర్సులను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం.. కొత్తగా 17 రకాల స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ అంశాలను కాలేజీ విద్యా విభాగం గుర్తించింది. వీటి సిలబస్‌తో పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కాలేజీ విద్య కమిషనర్ పోలా భాస్కర్ సన్నాహాలు చేపట్టారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జవహర్ నాలెడ్జి సెంటర్ల (జేకేసీ) ద్వారా నిర్వహించిన పలు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో వేలాది మందికి అవకాశాలు దక్కాయి. లైఫ్ స్కిల్స్‌లో 4 కోర్సులు కాగా స్కిల్ డెవలప్మెంట్లో 13 కోర్సులు, లైఫ్ స్కిల్స్ విభాగంలో 4 కోర్సులను రూపొందించారు. లైఫ్ స్కిల్స్ కోర్సుల విభాగంలో.. హ్యూమన్ వ్యాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎనలిటికల్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. లైఫ్ స్కిల్స్ కోర్సులు అందరు విద్యార్థులకు ఒకే రకంగా ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్లో 13 కోర్సులు.. ఇందులో మూడు విభాగాలుగా కోర్సులను ప్రవేశపెడుతున్నారు. స్ట్రీమ్–ఏ ఆర్ట్స్ విభాగంలో టూరిజం గైడెన్స్, సర్వే అండ్ రిపోర్టింగ్, సోషల్ వర్క్ మెథడ్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉన్నాయి. అలాగే స్ట్రీమ్–బీ కామర్స్ విభాగంలో ఇన్సూరెన్స్ ప్రమోషన్, బిజినెస్ కమ్యూనికేషన్, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, రిటైలింగ్ కోర్సులు ఉన్నాయి. స్ట్రీమ్–సీ సైన్స్ విభాగంలో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, ప్లాంట్ నర్సరీ, సోలార్ ఎనర్జీ, డెయిరీ టెక్నిక్స్, పౌల్ట్రీ ఫార్మింగ్ ఉన్నాయి. వీటిలో సెమిస్టర్ల వారీగా ఆయా అంశాలను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా.. డిగ్రీ కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొనేలా ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలను చేపట్టింది. జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆక్వాకల్చర్ వంటివి వీటిలో ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 700 వీడియో పాఠాలను అప్లోడ్ చేయించింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పెంచేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ (ఈఎల్ఎల్)ను ప్రవేశపెట్టింది. 72 కాలేజీల్లో ఈఎల్ఎల్లు ఏర్పాటయ్యాయి. ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్వారా కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. 144 కాలేజీల్లో వర్చువల్ తరగతులు విద్యార్థులకు ఉన్నత పరిజ్ఞానంతో కూడిన అంశాల బోధనకు వీలుగా 144 కాలేజీల్లో వర్చువల్ తరగతులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అలాగే 132 కాలేజీల్లో జవహర్ నాలెడ్జి సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. 56 కాలేజీల్లో డిజిటల్ తరగతులను ప్రవేశపెట్టారు. జిల్లా రిసోర్స్ కేంద్రాల ద్వారా విద్యార్థులు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న బోధన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. ‘స్టూడెంట్ శాటిస్ఫ్యాక్షన్ సర్వే’ పేరుతో లెక్చరర్లు ఎలా చెబుతున్నారో విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ ఆడిట్‌ను నిర్వహిస్తూ కాలేజీల్లో సిబ్బంది సామర్థ్యాలను సైతం పెంచుతున్నారు. -
డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి డిగ్రీలో చేరేందుకు సంబంధించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ 15తో ముగిసింది. ఇప్పటివరకూ వివిధ కోర్సుల్లో దాదాపు 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందారు. అయితే ఇప్పటివరకూ బీఫార్మసీ, న్యాయవాద వృత్తి కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించిన విద్యార్థులు, అక్కడా సీటు రాకపోవడంతో డిగ్రీలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ, దోస్త్ అడ్మిషన్ల తేదీ ముగియడంతో విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి దోస్త్ ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ల తేదీని నిర్ణయించారు. దీంతో అనేకమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరబోతోంది. దీనివల్ల మరో 15 వేల వరకూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు లింబాద్రి తెలిపారు. -
డిగ్రీకి డేంజర్ బెల్స్!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసులతో పాటు గ్రూప్–1 వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం విద్యార్థులు ఒకప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల్లోనే ఎక్కువగా చేరేవారు. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఫిజిక్స్, జువాలజీ, కామర్స్ వంటి సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకుని అభ్యర్థులు ఉద్యోగాల వేటలో విజయం సాధించేవారు. ఇలాంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రానురాను ఆదరణ కరువవుతోంది. కంప్యూటర్ కోర్సులపై ఏర్పడిన క్రేజ్‌తో భవిష్యత్తులో వాటి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటోంది. వృత్తి విద్యా కోర్సులతో, ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులతోనే తక్షణ ఉపాధి సాధ్యమన్న విద్యార్థుల భావనే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు సాధారణ బీఏ, బీకాం,బీఎస్సీ కోర్సులు కన్పించకుండా పోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. గత కొన్నేళ్ళుగా డిగ్రీ కోర్సుల్లో తగ్గుతున్న ప్రవేశాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,080 డిగ్రీ కాలేజీలుంటే, వాటిల్లో వివిధ కోర్సులకు సంబంధించిన 4.68 లక్షల సీట్లున్నాయి. అయితే గత ఐదేళ్ళుగా 2 లక్షలకు పైగా సీట్లు భర్తీ కావడం లేదు. కాగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సైతం సంప్రదాయ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు గణనీయంగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి 1.75 లక్షల సీట్లే భర్తీ.. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన దోస్త్ కౌన్సెలింగ్ ద్వారా 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో రెండురోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి కూడా 2 లక్షల సీట్ల కంటే ఎక్కువ భర్తీ కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 53 కాలేజీల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏటా ఇంటర్ పాసయ్యే విద్యార్థులు 3.20 లక్షల మంది వరకు ఉంటున్నారు. 75 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కొందరు ఇతర కోర్సుల వైపు వెళ్తున్నారు. ఏతావాతా 2 లక్షల మంది డిగ్రీలో చేరే వాళ్ళుంటే, సీట్లు మాత్రం అంతకు రెట్టింపు ఉన్నాయి. అంటే సగం సీట్లు ఖాళీగానే ఉండిపోతున్నాయన్న మాట. ఇక భర్తీ అవుతున్న సీట్లలో అత్యధిక శాతం కంప్యూటర్ సంబంధిత కోర్సులవే కావడం గమనార్హం. ఈ పరిస్థితికి కారణమేంటి? దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల ట్రెండ్ మారింది. ఏ కోర్సులోనైనా కంప్యూటర్ అనుసంధాన సబ్జెక్టులు ఉంటేనే డిగ్రీకి విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ స్వరూపమే మారిపోతోంది. విద్యామండళ్లు విభిన్న రకాల కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. బీఏలో గతంలో ఐదారు రకాల కోర్సులు మాత్రమే ఉండగా ప్రస్తుతం 68 రకాల కోర్సులొచ్చాయి. అలాగే బీఎస్సీలో 73 రకాలు, బీకాంలో 13 రకాల కాంబినేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచులర్ ఆఫ్ ఒకేషన్ (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ టూరిజం పరిపాలన) వంటి కోర్సులు విస్తరించాయి. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా అప్లికేషన్ కోర్సులు తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ చాలావరకు హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమయ్యాయి. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉండే డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు కూడా కేవలం నగరంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దాదాపు 70 కాలేజీల్లో బీఏ కోర్సుల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరకపోవడాన్ని గమనిస్తే గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల పరిస్థితి అర్ధమవుతోంది. హేతుబద్ధీకరణ తప్పదు డిగ్రీ ట్రెండ్ మారుతోంది. ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఉపాధి కోసం వృత్తి విద్య కోర్సుల వైపు వెళ్తున్నారు. కోవిడ్ వల్ల ఇంటర్లో అందరినీ పాస్ చేయడం వల్ల గతేడాది 2.50 లక్షల ప్రవేశాలు దాటాయి. కానీ ఈ ఏడాది ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై కన్పిస్తోంది. 15% ప్రవేశాలు లేని కాలేజీల జాబితా తయారు చేస్తున్నాం. ఇప్పటికే జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలను మూత వేయాలని ఆదేశించాం. ఏదేమైనా డిగ్రీలో హేతుబద్ధీకరణ తప్పదు. డిమాండ్ లేని కోర్సులను తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సులనే నడపాలని చెబుతున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) సాంకేతిక కోర్సులకే డిమాండ్ డిగ్రీలో సాంకేతికత ఉన్న కంప్యూటర్ కోర్సులనే విద్యార్థులు అడుగుతున్నారు. ఈ కారణంగానే ఆ తరహా కాంబినేషన్ కోర్సుల్లో సీట్లు పెంచాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా డిగ్రీ కోర్సుల స్వరూపం మారుతోంది. ఈ మార్పును అందిపుచ్చుకోవడం ప్రస్తుతం కాలేజీలకు ఒక సవాలే. – ఎకల్దేవి పరమేశ్వర్ (పైవేటు డిగ్రీ కాలేజీల సంఘం) -
వచ్చేనెల నుంచి కొత్త బీసీ గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 11వ తేదీన 33 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా వచ్చేనెల 15వ తేదీన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీల నుంచే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీ కార్యదర్శితో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతనంగా ప్రారంభించనున్న గురుకుల విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్టున్నట్లు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం హాలియాలో, అలాగే దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రారంభించనున్న కొత్త గురుకులాలతో కలిపి బీసీ గురుకుల సొసైటీ పరిధిలో విద్యా సంస్థల సంఖ్య 310కి చేరిందని వివరించారు. ఆత్మగౌరవ భవనాలకు 8న అనుమతి పత్రాలు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ బాధ్యతలను ఏక సంఘంగా ఏర్పడిన కుల సంఘాలకు అప్పగిస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్మాణ అనుమతులు పొందాయన్నారు. ఇలా ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న అనుమతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనుండటంతో.. ప్రస్తుతం ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లకు అదనంగా మరో 50 స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కొత్తగా 33 గురుకులాలు.. 15 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థుల కోసం కొత్తగా గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త గురుకులాల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ తదితర అంశాలపై బుధవారం మంత్రి తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో 33 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కొత్తగా 4 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 115 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే ఉందని, మరో 15 డిగ్రీ కాలేజీలనుఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిని మంత్రి గంగుల ఆదేశించారు. ఈ డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిధ్యంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు కొత్త వాటిని ప్రవేశపె ట్టాలని, పారిశ్రామిక రంగం అవసరాల మేరకు వాటితో అనుసంధానం చేయా లని చెప్పారు. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ వంటి కోర్సులను కాలేజీల వారీగా ప్రవేశపెట్టాలని సూచించారు. వీటి ద్వారా విద్య పూర్తి చేసుకొనే తరుణంలో గురుకుల సొసైటీ ద్వారానే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించాలని, ఈ మేరకు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మరో 21 బీసీ స్టడీ సర్కిళ్లు:రాష్ట్రంలో మరో 21 బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఏకసంఘంగా ఏర్పడిన కులాలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కొత్తగా మరో ఆరు కులా లు ఏక సంఘంగా ఏర్పడ్డాయని వీటికి ఈ నెల 8న నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ఏకసంఘంగా ఏర్పడని వాటిని సైతం త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. -
మూడు వందల కాలేజీలకు ముప్పు
సాక్షి, హైదరాబాద్: మూడు వందల డిగ్రీ కాలేజీలకు ముప్పు పొంచి ఉంది. విద్యార్థుల్లేక చదువుసాగని వాటి చాప్టర్ ఇక ముగిసినట్టే. 50 మంది లోపు విద్యార్థులుండే కాలేజీల ఏరివేతకు, మూసివేతకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. అనుమతి లభించిన సీట్లలో కనీసం పావువంతు కూడా భర్తీకాని కాలేజీలను ముందుగా ఏరివేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత 50 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలపై దృష్టి పెట్టే వీలుంది. దీనికిగాను గత మూడేళ్లుగా కాలేజీల డేటాను పరిశీలిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు అనివార్యమని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టే దిశగానే ఈ కసరత్తు మొదలైందని అంటున్నారు. ఆ కాలేజీలు ఎందుకు? రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చదివే విద్యార్థుల కన్నా, సీట్లే ఎక్కువ. ఇటీవల ఉన్నత విద్యామండలి నిర్వహించిన దోస్త్ వివరాల ప్రకారం... ఈ ఏడాది 4,66,345 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే, ఆ కాలేజీల్లో చేరినవారి సంఖ్య 2,49,266 మాత్రమే. అంటే 2,17,079 సీట్లు మిగిలిపోయాయి. ప్రతిఏటా ఇదే పరిస్థితి. 2018–19లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 1,151 ఉంటే, ఈ ఏడాది ఇవి 1,080కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య 138 కాగా, మిగతావన్నీ ప్రైవేటు కాలేజీలే. చాలావాటిల్లో వసతులు అరకొరగా, విద్యార్థుల చేరిక నామమాత్రంగా ఉంటోంది. ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరని డిగ్రీ కాలేజీలు 50 వరకున్నాయి. 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 250 ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ కాలేజీలను ప్రోత్సహించడం దేనికి? అనే ప్రశ్న ఉన్నతాధికారుల నుంచి ఉత్పన్నమవుతోంది. నాణ్యత పెంచాలి డిగ్రీలో నాణ్యత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో కాలేజీలే కీలకపాత్ర పోషించాలి. విద్యార్థులు చేరని కాలేజీల విషయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష అవసరం. మార్పులు అత్యవసరం. – నవీన్ మిట్టల్ (కాలేజీ విద్య కమిషనర్) ఆ కాలేజీలపై దృష్టి పెట్టాం అరకొర ప్రమాణాలు, విద్యార్థుల ప్రవేశం లేని కాలేజీలపై దృష్టి పెట్టాం. అలాంటి కాలేజీల యాజమాన్యాలను ప్రతిసారి మందలిస్తూనే ఉన్నాం. ఈసారి కొంత కఠినంగానే ఉంటాం. విద్యార్థులే చేరనప్పుడు ఆ కాలేజీ దేనికనే ప్రశ్న సాధారణంగానే ఉంటుంది. –ప్రొ.ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
సీట్లు కొండంత.. భర్తీ సగమంత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఏటా 3.2 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే డిగ్రీ సీట్లు మాత్రం 4.5 లక్షలకు పైనే ఉన్నాయి. ఇంజనీరింగ్, ఇతర కోర్సులు పోనూ డిగ్రీలో చేరికలయ్యాక ప్రతి ఏటా దాదాపు 2 లక్షలకు పైనే సీట్లు మిగులుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇదే నడుస్తోంది. దీంతో ఉన్నత విద్యా మండలి పునః సమీక్షకు సిద్ధమైంది. డిమాండ్ ఉన్న కోర్సులు, విద్యార్థులు ఎక్కువగా చేరే కాలేజీలకే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. అలాగే నాణ్యత, అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులనూ ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు రాష్ట్రంలో 1,080 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీలే. ఈ ఏడాది ఈ కాలేజీల్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్లు ముగిసే సమయానికి 2,49,266 సీట్లే భర్తీ అయ్యాయి. దాదాపు 40 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా లేదు. 30 కాలేజీల్లో కొన్ని గ్రూపుల్లో విద్యార్థులు నామమాత్రం కన్నా తక్కువే చేరారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏటా ఇంటర్ పాసయ్యే వారి సంఖ్య 3.2 లక్షలకు మించట్లేదు. ఇందులో 70 వేల మంది ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్య కోర్సులను ఎంచుకుంటున్నారు. మిగతా వాళ్లు డిగ్రీలో చేరుతున్నారు. ఈ లెక్కన 2.5 లక్షల డిగ్రీ సీట్లున్నా సరిపోతుంది. కానీ ప్రైవేటు కాలేజీల ఒత్తిడి మేరకు ఇష్టానుసారం అనుమతి ఇస్తున్నారు. పాఠ్య ప్రణాళిక ప్రక్షాళన! విద్యార్థుల చేరికను పరిశీలిస్తే కొన్ని కోర్సులకే డిమాండ్ ఉంటోంది. బీకాంలో 40 శాతం మంది చేరితే ఫిజికల్ సైన్స్ 35 శాతం మంది చేరుతున్నారు. బీఏలో 20 శాతానికి మించట్లేదు. డిగ్రీ కోర్సులు చేసిన వారికి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది. దీన్ని దూరం చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు అందిపుచ్చుకుని బీఏ (హానర్స్), బీకాం కోర్సులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. తరగతి బోధన కన్నా ప్రాజెక్టు వర్క్ ఎక్కువ ఉండాలని భావిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాలున్న కాలేజీలను గుర్తించి వాటికే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే నాణ్యత లేని కాలేజీలు తగ్గుతాయని, సీట్ల మిగులు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. సీట్లు కాదు.. నాణ్యతే ముఖ్యం విద్యార్థుల సంఖ్యకు మించి డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నది నిజమే. అయితే నాణ్యత ప్రమాణాలతో కోర్సులు అందిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. మూస విద్యావిధానానికి బదులు సరికొత్త బోధన ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో గ్రాడ్యుయేషన్‌లో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు. మన దగ్గర బీఏ చేస్తే ఎంకాం చేయడానికి వీల్లేదు. డిగ్రీలో ప్రమాణాలు పెంచితే పోటీని తట్టుకునే కాలేజీల సంఖ్య తగ్గి పరిమిత సీట్లే ఉండే వీలుంది. – ప్రొఫెసర్ రవీందర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి) ఇక ఈసారి నో చాన్స్ చేరే వాళ్లే లేనప్పుడు డిగ్రీలో ఇన్ని కాలేజీలు, ఇన్ని సీట్లు అవసరమా? అని ప్రశ్న వినిపిస్తోంది. నిజమే.. దాదాపు 30, 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల కోర్సుల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. వాస్తవానికి వీటిని మూసేయాలి. కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు ఏటా నెట్టుకొస్తున్నాయి. ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. హేతుబద్ధీకరణపై దృష్టి పెడుతున్నాం. – ప్రొఫెసర్ లింబాద్రి, (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
డిగ్రీ కన్వీనర్ కోటా భర్తీ చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరపవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. వీటిలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేసుకోవచ్చని తెలిపింది. 30 శాతం యాజమాన్య సీట్లను భర్తీ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 55పై తీర్పును రిజర్వ్ చేసింది. జీవో 55ను సవాలు చేస్తూ మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
విద్యార్థులపై పైసా భారం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రయివేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేస్తోంది. ఏ ఒక్క విద్యార్థి మీద పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా వాటిని భరిస్తోంది. విద్యావ్యవస్థలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానం 1960లో ఆరంభమైంది. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ డిగ్రీ కాలేజీలకు, సీట్లకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీనికి అనుగుణంగా కాలేజీలు, సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం ప్రయివేటు డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలో కొంతమంది దాతలు, ప్రముఖులు మంచి ఉద్దేశంతో సమాజానికి సేవచేయాలని కాలేజీలు స్థాపించారు. భీమరంలోని డీఎన్ఆర్ కాలేజీ, ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీ, మదనపల్లెలోని బీటీకాలేజీ, అమలాపురంలోని ఎస్కేబీఆర్ కాలేజీ, విశాఖపట్నంలో డాక్టర్ ఎల్బీ కాలేజీ.. వంటివి ఇలా ఏర్పాటైనవే. వీటిలో విద్యార్థుల చేరికలు పెరుగుతున్న కొద్దీ అదనంగా అధ్యాపకుల అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరిగిన కొద్దీ వారికి వేతనాలు వంటివి అందించడం ఆయా సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు ఆర్థికసాయాన్ని అర్థించగా ప్రభుత్వం టీచర్ల వేతనాలకు ఇయర్లీ గ్రాంటును మంజూరు చేసింది. తరువాత దీన్ని 3 నెలలకు మార్చింది. 2010–12 నుంచి ఈ వేతనాల చెల్లింపును సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి చేర్చారు. రాష్ట్రంలో 1,444 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 1,153 ప్రయివేటు అన్ ఎయిడెడ్వి. 137 ఎయిడెడ్, 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు. కాలేజీల సంఖ్య పెరిగాక ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరికలు తగ్గిపోయాయి. 2020–21లో మొత్తం కాలేజీల్లోని సీట్లలో 57 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఫీజులు భరిస్తున్న ప్రభుత్వం మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల పునర్వ్యవస్థీకరణ జరిగి మార్కెట్, ఎంప్లాయిమెంటు ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభమయ్యాయి. దీంతో సంప్రదాయ కోర్సుల్లో చేరికలు పడిపోయాయి. ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో 90 శాతం కోర్సులు అన్ ఎయిడెడ్వి ఉన్నాయి. వీటికి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేసిన ఫీజులే వర్తిస్తాయి. ఈ కోర్సులకు అయ్యే ఫీజులను.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక పూర్తిగా రీయింబర్స్‌మెంటు చేయిస్తున్నారు. ప్రయివేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలవుతోంది. ఏ ఒక్క విద్యార్థి మీద కూడా నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఖరారైన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ ఏ కాలేజీలోనైనా నిర్ణీత ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో తగ్గిన చేరికలు ఎయిడెడ్ పాఠశాలల్లో కనీస వసతులు, సరైన బోధన లేకపోవడం, యాజమాన్యాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో చేరికలు మరింతగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇక్కడి సిబ్బంది వేతనాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఖర్చుచేస్తున్న ప్రజాధనం వృధాగా మారుతోంది. విద్యార్థులకు సరైన ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు. -
వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ తదితర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే అన్ని యాజమాన్యాల్లోని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలలో అక్టోబర్ 1వ తేదీనుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర (ఉన్నత విద్యాశాఖ) సోమవారం జీవో–242 విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా సరి, బేసి విధానంలో అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు. కోవిడ్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలతో తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నాన్ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్ ఇలా (బేసి సెమిస్టర్లు) ► కాలేజీల రీ ఓపెనింగ్: అక్టోబర్ 1, 2021 ► 1, 3, 5 సెమిస్టర్ల తరగతులు: అక్టోబర్ 1 నుంచి ► 1, 3, 5, సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు: డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు ► తరగతుల ముగింపు: జనవరి 22, 2022 ► సెమిస్టర్ పరీక్షల ప్రారంభం: జనవరి 24 నుంచి నాన్ ప్రొఫెషనల్ కోర్సులు (సరి సెమిస్టర్లు) ► 2, 4, 6 సెమిస్టర్ల తరగతుల ప్రారంభం: ఫిబ్రవరి 15, 2022 ► అంతర్గత పరీక్షలు: ఏప్రిల్ 4 నుంచి 9 వరకు ► తరగతుల ముగింపు: మే 28, 2022 ► 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు: జూన్ 1, 2022 నుంచి ► కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు: 2వ సెమిస్టర్ పరీక్షల అనంతరం 8 వారాలు ► సమ్మర్ ఇంటర్న్‌షిప్/జాబ్ ట్రైనింగ్/అప్రెంటిస్‌షిప్: 4వ సెమిస్టర్ తరువాత 8 వారాలు ► తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభం: ఆగస్టు 9, 2022 -
బోగస్ పేర్లతో ఫీజురీయింబర్స్‌మెంట్ స్వాహా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో పీజీ తరగతులను నిర్వహిస్తున్నవి కొన్ని కాగా... విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను యూనివర్సిటీలకు చెల్లించకుండా తమ ఖాతాల్లోనే దాచుకున్న కళాశాలలు మరికొన్ని. ఇక అసలు విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపిస్తూ బోగస్ పేర్లతో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కాజేస్తున్న కాలేజీలు మరికొన్ని ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా ప్రైవేట్ కాలేజీల్లో వసతులతో పాటు రికార్డులను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను మరో రెండు రోజుల్లో పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టేందుకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లో కాకుండా జవాబుదారీతనం, పారదర్శకత కోసం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పలు కాలేజీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా డిగ్రీ కాలేజీకి అనుమతి పొందిన కొన్నేళ్ల తర్వాత పీజీ కాలేజీకి అనుమతి తీసుకుంటున్నారు. ఒకటో, రెండో తరగతి గదులను పెంచి అదే క్యాంపస్‌లో పీజీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ల్యాబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. బోధనా సిబ్బందిని నియమించకుండా డిగ్రీ అధ్యాపకులతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేకంగా తరగతి గదులు, ల్యాబ్, స్టాఫ్ ఉన్నారని తప్పుడు పత్రాలు సృష్టించినట్టు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యల్లోనూ తేడాలు కొన్ని కాలేజీలు యూనివర్సిటీకి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సమర్పిస్తున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు తేడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బినామీ విద్యార్థుల ఫీజులను కాలేజీ యాజమాన్యాలు తమ జేబులో వేసుకుంటున్నట్లు వెల్లడవుతోంది. కొన్ని కాలేజీల్లో ఇలాంటి అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలకు ఫీజులు చెల్లించకుండా ఏళ్ల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నాయి. అయితే ఆ ఫీజులను మాత్రం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీ ఏకంగా రూ.10 కోట్ల మేర జేఎన్టీయూ (కాకినాడ)కు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. -
గుర్తింపు లేని డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల నిలిపివేత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేట్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల అడ్మిషన్లను 2021–22 విద్యాసంవత్సరానికి నిలిపివేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీల గుర్తింపు లేకపోవడం, మూడేళ్లుగా ఎలాంటి అడ్మిషన్లు కూడా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలేజీలకు నోటీసులు జారీచేశామని, నెలరోజుల్లో ఆయా యాజమాన్యాలు తమ వివరణలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని పేర్కొన్నారు. -
పైలట్ ప్రాజెక్టుగా డిగ్రీలో క్లస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల అనుసంధానం చేసే క్లస్టర్ విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్లస్టర్ విధానం డిగ్రీ విద్యకు బూస్టర్‌లా పనిచేసే అవకాశముంది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈ విధానం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఈ అంశంపై వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్సహా తొమ్మిది కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్ విధానం అమలు కోసం మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. కోఠి మహిళా కళాశాల, నిజాం, సిటీ, బేగంపేట మహిళా, రెడ్డి మహిళా, సెయింట్ ఆన్స్ మెహిదీపట్నం, సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట, భవన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సైనిక్‌పురి, లయోలా అకాడమీ అల్వాల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యాసంబంధిత అంశాలపై ఒక కమిటీ, మౌలిక వసతులు, వనరులపై మరో కమిటీ, మార్గదర్శకాల తయారీకి ఇంకో కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదికలు పరీక్షలు, క్రెడిట్లు, వాటి బదలాయింపు, కోర్సులు, వనరులు తదితర అంశాలను పరిశీలించి 10 రోజుల్లో నివేదికలను అందజేయాలని ఈ కమిటీలను పాపిరెడ్డి ఆదేశించారు. క్లస్టర్‌గా ఏర్పాటయ్యే కాలేజీలు పరస్పరం ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవాలి. క్లస్టర్‌లోని కాలేజీలే కాకుండా, సంబంధిత యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందంలో భాగస్వామ్యమవుతాయి. కాలేజీలు విద్యార్థుల సమయాన్ని బట్టి టైం టేబుల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. సెకండియర్‌లో రెగ్యులర్ డిగ్రీయే కాకుండా, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులు సైతం క్లస్టర్ ఫలాలను పొందవచ్చు. ప్రయోగశాలల పరస్పర వినియోగం ఒకే క్లస్టర్‌లోని ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి వస్తే.. ఇందుకయ్యే ఫీజులను ఉన్నత విద్యామండలి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్లస్టర్ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తారు. బోధనా సిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్నవారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకాంశం. లైబ్రరీలను, ప్రయోగశాలలను కూడా పరస్పరం వినియోగించుకునే అవకాశముంది. -
డిగ్రీ కాలేజీల ఫీజుల ఖరారుపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన జీవో 1ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేశారు. అంతకు ముందు కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసిందని, కాలేజీలను మూడు రకాలుగా వర్గీకరించారని, ఈ వర్గీకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. ఉన్నతవిద్యా కమిషన్ తరఫు న్యాయవాది సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపిస్తూ, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు పెంచామన్నారు. ఆయా కాలేజీలు వారి వారి నిర్వహణకు సంబంధించిన వివరాలను సమర్పించలేదని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
తగ్గిన చేరికలు..వెలవెలబోతున్న డిగ్రీ విభాగాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాల్సిన కాలేజీల యాజమాన్యాల నిర్లిప్తతతో చేరికల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బోధనా సిబ్బంది, సదుపాయాల కల్పన విషయంలో యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీని పూర్తిగా ఆన్లైన్లో ప్రభుత్వమే ‘ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ద్వారా పారదర్శకంగా నిర్వహించింది. విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో నచ్చిన సీటు పొందేలా అవకాశం కల్పించింది. ఈ అడ్మిషన్ల ప్రక్రియను మూడు విడతల్లో ఉన్నత విద్యామండలి నిర్వహించింది. 152 ప్రభుత్వ కాలేజీలు, 120 ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, 1,062 ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేశారు. ఈ కాలేజీల్లో 4,96,055 సీట్లు ఉండగా 2,61,383 సీట్లను ఆన్లైన్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు కేటాయించారు. పలు కాలేజీల్లో సీట్లు సగానికి పైగా ఖాళీగా మిగిలాయి. సరైన ప్రమాణాలను పాటించకపోవడం, సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు విముఖత చూపారు. పలు కోర్సుల్లో సీట్లు ఖాళీ... మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం చేరికలను పరిశీలిస్తే పలు కాలేజీల్లో కొన్ని కోర్సుల్లో ఒకరిద్దరు మాత్రమే చేరగా మరికొన్ని చోట్ల 10 నుంచి 20 మంది లోపే ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని 48 విభాగాల్లో, ఎయిడెడ్ కాలేజీల్లోని 194 విభాగాల్లో, ప్రయివేటు కాలేజీల్లోని 1,309 విభాగాల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీల్లో కోర్సుల కొనసాగింపు సమస్యగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తక్కువ చేరికలున్న కోర్సుల విద్యార్థులను ఇతర కాలేజీలలోని అదే కోర్సులకు లేదా అక్కడే ఇతర కోర్సులలోకి మార్పు చేసే ప్రక్రియ చేపట్టారు. దాదాపు 1,600 మంది విద్యార్థులను ఇలా తరలిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం తక్కువ చేరికలున్న కోర్సుల నుంచి మార్పులు చేసుకొనేందుకు ఇదివరకే అడ్మిషన్ల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అవకాశం కల్పించింది. చేరికలు తక్కువగా ఉన్న కాలేజీలపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ అడ్మిషన్ల కన్నా ముందుగానే నోటీసులు జారీచేసింది. 72 కాలేజీలు గత కొన్నేళ్లుగా యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండానే కొనసాగుతున్నాయి. 25 శాతం కన్నా తక్కువ చేరికలున్న 174 కాలేజీలు, ఒక్కరు కూడా లేకుండా కేవలం కాగితాలపై నడుస్తున్న కాలేజీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. లోపాలను సవరించుకోకుండా కొనసాగుతున్న కాలేజీలపై 2020–21 ఆన్లైన్ అడ్మిషన్లకు ముందుగానే ఉన్నత విద్యామండలి కొరడా ఝళిపించింది. 48 కాలేజీలు స్పందించకపోవడంతో అనుమతులను రద్దుచేసింది. మరో 61 కాలేజీల్లో కోర్సులను ఉపసంహరించింది. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో బడుగులకే సర్కార్ పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు న్యాయం చేకూరింది. ప్రముఖ కళాశాలల్లో కీలకమైన కోర్సుల్లో ఈ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. గతంలో ఆన్లైన్ విధానం లేనందున కళాశాలల్లోని వివిధ కోర్సుల సీట్లను ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్ల విధానాన్ని పాటించకుండా ఆ వర్గాలకు కేటాయించాల్సిన సీట్లను కూడా అధిక ఫీజులు తీసుకొని తమకు నచ్చిన వారికి కేటాయించేవి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో అన్ని కోర్సుల సీట్ల భర్తీకి ప్రభుత్వం ఆన్లైన్ విధానం తప్పనిసరి చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యామండలి ద్వారా ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానంలో ఆయా కోర్సుల సీట్లు భర్తీ చేయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వారి కోటా ప్రకారం సీట్లు భర్తీ చేసింది. అంతేకాకుండా మొత్తం సీట్లలో 33.5 శాతం మహిళలకు కేటాయించింది. ఇటీవల ముగిసిన డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలోని గణాంకాలే దీనికి నిదర్శనం. రిజర్వుడ్ వర్గాలకు 79.26 శాతం సీట్లు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, తదితర నాన్ ప్రొఫెషనల్ యూజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థల్లో 152 ప్రభుత్వ, 120 ఎయిడెడ్, 1,062 ప్రైవేటు, 2 యూనివర్సిటీ కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం 4,96,055 సీట్లు ఉండగా రెండు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో 2,60,103 సీట్లు భర్తీ చేశారు. ఈ సీట్లలో 2,06,173 (79.26 శాతం) సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు లభించాయి. బీసీలకు అత్యధికంగా 1,40,340 సీట్లు దక్కగా.. ఎస్సీలకు 52,668, ఎస్టీలకు 13,165 సీట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 2,117 సీట్లు దక్కాయి. బీఎస్సీకే ఎక్కువ ప్రాధాన్యం రెండు విడతల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు బీఎస్సీలో చేరేందుకు ఆసక్తిని చూపారు. భర్తీ అయిన 2,60,103 సీట్లలో 1,30,923 మంది బీఎస్సీ, 84,547 మంది బీకాం, 28,244 మంది బీఏ కోర్సులను ఎంచుకున్నారు. ఇక బీబీఏ, బీసీఏ, బీవీఓసీ, బీహెచ్ఎం, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి ఇతర కోర్సుల్లో 16,389 మంది చేరారు. మిగిలిన సీట్లు 2.35 లక్షలకు పైనే.. మొత్తం సీట్లలో రెండు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా 2,60,103 సీట్లు భర్తీ కాగా ఇంకా 2,35,952 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటిని స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా కళాశాలలు భర్తీ చేయనున్నాయి. వీటిని కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా వర్గాలకు కేటాయించనున్నారు. వీటిని కూడా కలిపితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరగనుంది. -
నవంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ తరగతులను నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ తరగతులను అదే రోజు నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అనుసరించేందుకు చర్యలు చేపట్టా లనుకుంటోంది. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఈ నెల 21న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ను కూడా వచ్చే నెల 10లోగా నిర్వహించి 15వ తేదీలోగా విద్యార్థులంతా కాలేజీల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అవి పూర్తయి, ఫలితాలు ప్రకటించగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి 19 రకాల పీజీ కోర్సులకూ ఈ నెల 21 నుంచి 24 నుంచి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అవి పూర్తవగానే పీజీ ప్రవేశాలను కూడా వచ్చే నెలలో చేపట్టి పూర్తి చేయనుంది. ఇప్పటికే సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వాటికి సంబంధించిన పరీక్షల నిర్వహణను నవంబర్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే వాటి ప్రవేశాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాలు మాత్రం పూర్తి కానున్నాయి. యూజీసీ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోనూ అకడమిక్ కేలండర్‌ను అమలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 3లోగా ఎంసెట్ ఫలితాలు! సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలు వచ్చే నెల 3వ తేదీలోగా విడుదల కానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభిం చింది. వీలైతే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసే అవకాశాలనూ కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ కుదరకపోతే వచ్చే నెల 1న లేదా 3న విడుదల చేయనుంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షల ఫలితాలను కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ప్రకటించేలా ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. -
ఏపీలో 13 మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు
-
ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్ కళాశాలగా తీర్చి దిద్డాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్(ఎస్ఎఆర్ఎఫ్)కు పైలెట్ ప్రాజెక్టుగా ఆ 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే ఎంపిక చేసింది.ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శ్రీకాకుళంలోని జీడీసీ (ఎం), విజయనగరం జిల్లా సాలూరులోని జీడీసీ,విశాఖలో డాక్టర్ వీఎస్ కృష్ణా జీడీసీ, రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కాలేజీ (ఏ), పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎసీఐఎం, కృష్ణా జిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ, గుంటూరులో మహిళా డిగ్రీ కాలేజీ, ఒంగోలులో మహిళా డిగ్రీ కాలేజీ, నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీ, అనంతపురంలో పురుషుల డిగ్రీ కాలేజీ, చిత్తూరులో పీవీకేఎన్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కడపలోనిపురుషుల డిగ్రీ కాలేజీని ఎఆర్ఎఫ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. -
సేఫ్టీ 'షి'లబస్..
మహిళ భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో బృహత్తర కార్యచరణ సిద్ధం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఐదు డిగ్రీ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా విద్యార్థుల నేతృత్వంలో నడిచే పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవి మంచి ఫలితాలివ్వడంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించనున్నారు. దీనికోసం 33 జిల్లాల నుంచి 2,200 కాలేజీల ప్రిన్సిపాళ్లను నగరానికి విమెన్ సేఫ్టీ వింగ్ ఆహ్వానించింది. వీరందరితో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులు హాజరవనున్నారు. – సాక్షి, హైదరాబాద్ స్కూలు, జిల్లా, రాష్ట్రస్థాయి క్లబ్‌లు.. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఇదే అతిపెద్ద కార్యక్రమం కావడం గమనార్హం. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయాలని విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతిలక్రా నిర్ణయించారు. దీనికోసం స్కూలు, మండల, జిల్లా స్థాయిల్లో క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రవాణా, విద్యాశాఖ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు ఈ క్లబ్‌లకు మార్గదర్శకంగా ఉంటారు. దీనికోసం రవాణా, విద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖలతో పోలీసు శాఖ ముందుగానే సమన్వయం చేసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు నుంచి జూన్ వరకు ఏయే కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక సిలబస్ రూపొందించింది. ఏమేం చేస్తారు? - విద్యార్థులకు ఆత్మస్థైర్యం, సంకల్ప బలం పెంచే కార్యక్రమాల నిర్వహణ. ఆపదలో ఎలా వ్యవహరించాలి.. ఎవరిని సంప్రదించాలి.. అన్న విషయాల్లో శిక్షణ - సామాజిక, మహిళా, శిశు, రోడ్డు భద్రతల్లో వినూత్న ఆవిష్కరణలకు వ్యాసాలు, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు. వేధింపులు, సైబర్ నేరాలు, వర కట్నం, గృహ హింసలపై చైతన్యం చేయడం - పోలీస్స్టేషన్ల, భరోసా కేంద్రాల సందర్శన - చిన్నారుల్లో గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన. జిల్లా సేఫ్టీ క్లబ్ స్కూలు/కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ఇందులో జిల్లా విద్యాశాఖాధికారి, ఇద్దరు మహిళా ప్రముఖులు, అడిషనల్ ఎస్పీ ర్యాం కు ఆఫీసర్, ఐదు పాఠశాలల నుంచి ప్రతినిధులు, ఆర్టీఏ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జిల్లా క్రీడా/యువజన అధికారి, స్వయం సహాయక బృంద నాయకురాలు ఉంటారు. స్కూలు/ కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్ ఇందులో ముగ్గురు పేరెంట్స్, 10 మంది విద్యార్థులు, ఒక లా అండ్ ఆర్డర్ మహిళా పోలీస్, ఒక ట్రాఫిక్ పోలీస్, గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకురాలు సభ్యులుగా ఉంటారు. వీరంతా తొలుత విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి రక్షణ, రోడ్డు భద్రత, డయల్ 100, ట్రాఫిక్ రూల్స్, హాక్ ఐ, షీటీమ్‌ల పనితీరు, వారిని ఎలా సంప్రదించాలి తదితర వివరాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు కూడా వీరు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. రాష్ట్ర స్థాయి క్లబ్‌లు జిల్లా స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు రాష్ట్ర సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ/విద్యాశాఖ కమిషనర్ నామినేట్ చేసిన రీజనల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్య కమిషనర్ నామినేట్ చేసిన మహిళా ప్రతినిధి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ లేదా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకు అధికారి, రవాణా శాఖ, రాష్ట్రస్థాయి యువజన క్రీడా ప్రతినిధి, మెప్మా నుంచి ఓ అధికారి ఉంటారు. -
మేలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నెలలో దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్ జారీ కానుంది. శుక్రవారం జరిగిన దోస్త్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల కోఆర్డినేట ర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ప్రవేశాలతోపాటు విద్యార్థుల కు ఎదురయ్యే ఇబ్బందులపైనా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఎక్కువ దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించకుండా, డిగ్రీ ప్రవేశాలను మూడు దఫాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సవరించుకునేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రా ల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే సవరించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఫొటో మార్చుకోవాలన్నా, పేరులో తప్పులు దొర్లినా, పుట్టిన తేదీలో తప్పులు దొర్లినా, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సమాచారంలో తప్పులు దొర్లినా సవరించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రా ల్లో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఎడిట్ చేసుకునేలా ఆప్షన్ ఇస్తున్నారు. విద్యార్థి ద్వితీయ భాషను తాను చేరిన కాలేజీలోనే మార్చుకునేలా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థికి మూడు విధాలుగా అందించనున్నారు. విద్యార్థి ఇచ్చే మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ పంపించడంతోపాటు మెయిల్ ఐడీకి సమాచారం ఇవ్వాలని, ఇటు విద్యార్థికి వాట్సాప్‌లోనూ సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 60 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థి లాగిన్ అయిన ప్రతిసారీ వేర్వేరు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. గతంలో ఒకసారి ఇచ్చిన ఓటీపీనే పలుమార్లు వినియోగించిన నేపథ్యంలో కాలేజీలు విద్యార్థుల నుంచి ఆ ఓటీపీ తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
డిగ్రీలోనూ ‘మేనేజ్మెంట్’ బాదుడేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటా అమల్లోకి తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు వేగవంతం చేసింది. గత రెండేళ్లుగా యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాను అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే అంటే 500 ప్రైవేటు డిగ్రీ కాలేజీల పంట పండినట్లే. మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టినా, వివిధ కోర్సులకు యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజులనే మేనేజ్మెంట్ కోటాలోనూ వసూలు చేయాలని ఉన్నత విద్యా మండలి చెబుతున్నా యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులను దండుకునేందుకు మార్గం సుగమం కానుంది. ప్రత్యేక ఫీజు విధానం లేదు.. ప్రస్తుతం రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటాకు ప్రత్యేక ఫీజు విధానం అంటూ ఏమీ లేదు. కన్వీనర్ కోటాలో నిర్ణయించిన ఫీజునే మేనేజ్మెంట్ కోటాలోనూ అమలు చేయాలి. అయినా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లోనూ అదే విధానానికి ఉన్నత విద్యా మండలి తెరతీస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండున్న ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే డిగ్రీ కాలేజీలు 500 వరకు ఉంటే అందులో 40కి పైగా కాలేజీలు కోర్టును ఆశ్రయించి మరీ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. తాము కోర్సును నిర్వహించాలంటే తమకు నచ్చి న ఫీజును వసూలు చేస్తామని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుతో తాము కాలేజీలను నడపలే మని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ ప్రవేశాల నుంచి కోర్టు నుంచి మినహాయింపు తెచ్చుకొని తమ ఇష్టానుసారంగా ఫీజులను తీసుకుంటూ సీట్లను భర్తీ చేస్తున్నాయి. మరోవైపు మైనారిటీ కాలేజీలు సొంతంగానే ప్రవేశాలు చేపట్టుకుంటున్నాయి. అలాంటి కాలేజీలను సాధారణ విద్యార్థులకు అందుబాటులోకి తేవడంలో విఫలమైన ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటాను ప్రవేశపెట్టి సీట్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల తరహాలో 30 శాతం.. వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల తరహాలోనే డిగ్రీలోనూ మేనేజ్మెంట్ కోటా 30 శాతం అమలు చేసేందుకు విద్యా మండలి సిద్ధమైంది. ఈ అంశాన్ని తమ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది. పైగా ఇష్టం ఉన్న కాలేజీలు కోటాను అమలు చేసుకోవచ్చు. ఇష్టం లేని కాలేజీలు మొత్తం కన్వీనర్ కోటా కింద నిర్వహించే ఆన్లైన్ ప్రవేశాల్లో భర్తీ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీనివల్ల టాప్ కాలేజీలు, కొంత పేరున్న కాలేజీలు, 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యే కాలేజీలు 500కు పైగా మేనేజ్మెంట్ కోటాను అమలు చేస్తాయి. అంటే ఇపుడు కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేస్తూ, సొంతంగా ఫీజులను నిర్ణయించుకొని వసూలు చేస్తున్న 40 కాలేజీలకు తోడు మరో 450 పైగా కాలేజీలు తమ ఇష్టానుసారంగా 30 శాతం సీట్లను భర్తీ చేసుకునే వీలును ఉన్నత విద్యా మండలే కల్పిస్తోంది. మేనేజ్మెంట్ కోటాలో లక్షకు పైగా సీట్లు.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,170 డిగ్రీ కాలేజీలుండగా, వాటిల్లో 4,44,169 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రభుత్వ, ఎయిడెట్, అటానమస్, గురుకులాలు పోగా 845 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిల్లో 3,13,485 సీట్లున్నాయి. వాటన్నింటిలో ఇప్పటివరకు డిగ్రీ ఆన్లైస్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ద్వారానే ప్రవేశాలు జరుగుతున్నాయి. వాటికి తోడు మరో 42,460 సీట్లు కలిగిన 118 కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇందులో కోర్టును ఆశ్రయించినవి ఉన్నాయి. అవి కూడా కలుపుకొని (వాటిల్లో మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తే) మొత్తంగా 966 కాలేజీల్లో 3,55,945 సీట్లు అందుబాటులో ఉండనుండగా, అందులో మేనేజ్మెంట్ కోటా కింద 1,06,783 సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునే వీలు ఏర్పడనుంది. -
సర్కారు కాలేజీలు సూపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఉత్తీర్ణత శాతం విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తేలింది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ.. ఉన్నత విద్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కాలేజీల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో కమిటీ పేర్కొన్న ముఖ్యాంశాలివీ.. - ప్రభుత్వ రంగంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండగా ప్రైవేట్ సంస్థల్లో బాగా తక్కువగా ఉంది. - ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లిపోగా.. మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. - 71% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు (817) అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. - అలాగే.. 40 శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో (464) 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. - 58 శాతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో (185)నూ 50% కన్నా తక్కువగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని కమిటీ తేల్చింది. అలాగే, మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలుండగా అందులో 200 కాలేజీలను మూసేయవచ్చునని కమిటీ సూచించింది. ఉత్తీర్ణతలో ‘ప్రైవేట్’ అథమం రాష్ట్రంలో 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 30 శాతమే ఉందని, అంతేకాక.. ఈ కాలేజీల్లో 40% మంది తుది పరీక్షకు గైర్హాజరవుతున్నారని కమిటీ గుర్తించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని కాలేజీలను కూడా సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడింది. అలాగే, 25 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 40 ఎయిడెడ్ కాలేజీల్లో 25% కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉంటున్నాయని తెలిపింది. మరోవైపు.. గత సర్కారు 13 ప్రభుత్వ కాలేజీలను మంజూరుచేసి చేతులు దులుపుకుందని, వాటికి సిబ్బందిని మంజూరు చేయలేదని కమిటీ పేర్కొంది. -
సీట్లు ఖాళీ.. కోర్సులు మాయం
సాక్షి, మహబూబ్‌నగర్ : పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరంలో సీట్లు భారీ మొత్తంలో మిగిలియాయి. దీని కారణంగా కొన్ని ప్రైవేట్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించింది. మొత్తంగా కేవలం 38 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆన్లైన్ విధానంపై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు కూడా ఒకింత ప్రభావం చూపాయని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. సీట్లు పొందిన వారు వివిధ కళాశాలల్లో సంబంధిత కోర్సుల్లో 25 శాతం కంటే తక్కువ సీట్లు పొందిన వారిని, అక్కడ కోర్సు నిలిపివేసి దగ్గరలో ఉన్న మరో కళాశాలలో విలీనం చేసేందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 90 కళాశాలలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 90 డిగ్రీ కళాశాలలు ఉండగా ఇందులో 21 ప్రభుత్వ, 3 అటానమస్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 33,380 సీట్లకు విద్యార్థులు అడ్మిషన్ పొందాల్సి ఉండగా.. కేవలం 8,978 మంది మాత్రమే ప్రవేశం పొందారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 38 శాతమే భర్తీ అయ్యింది. అయితే చాలా వరకు ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నా.. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. కొంత మంది విద్యార్థులు సంప్రదాయ కోర్సుల వైపు మొగ్గు చూపకపోవడం, అనుకున్న చోట సీటు రాకపోవడం వంటి కారణాలున్నాయి. అయితే రెండో దశ కౌన్సెలింగ్‌లో అవే కళాశాలల్లో సీట్లు కావాలని విద్యార్థులు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో రూరల్ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో ఎక్కవ మొత్తంలో సీట్లు మిగిలిపోయాయి. ఇక మూడో దశలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఏ కళాశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎక్కడ సీట్లు భర్తీ అయ్యాయి అనే అంశాలు తెలియకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీట్లు రాని చాలామంది విద్యార్థులు టీటీసీ, ఇంజినీరింగ్‌తోపాటు ఐటీఐ, డిప్లొమా వంటి కోర్సులకు మళ్లారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు చాలా వరకు ఆదరణ తగ్గిందనే చెప్పవచ్చు. కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ కళాశాలలపై ప్రభావం విద్యార్థులకు సీట్ల కేటాయింపుల్లో మార్కులు, ఆర్థిక, సామాజిక అంశాల వారీగా సీట్లు కేటాయించే ప్రక్రియ మూడు దశల్లో కౌన్సెలింగ్‌లో జరిగింది. అయితే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ట్యూషన్ ఫీజు, ఫీజు రీయంబర్స్మెంట్ వంటివి అందించగా నేరుగా యాజమాన్యాలు వివిధ కోర్సుల ఆధారంగా రూ.14 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేసేలా వెసులుబాటు కల్పించింది. దీని కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్యా కళాశాలల వైపు మొగ్గుచూపారు. ఈ కారణంగా ఎక్కువ సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిపోయాయి. దీంతో 25 శాతం కంటే తక్కువ సీట్లు ఉన్న సీట్లను ఇతర కళాశాలల్లో విలీనం చేయడం వల్ల వాటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కోర్సులు విలీనం ఉమ్మడి పాలమూరులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఈ క్రమం లో వివిధ కళాశాలల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే కోర్సుల్లో 25 శాతం సీట్లు భర్తీ కానీ కళాశాలల్లో వి ద్యార్థులను ఇతర కళాశాలల్లోకి మార్చనున్నారు. ఒక కోర్సులో మొ త్తం 40 సీట్లు ఉంటాయి. వీటిలో కనీసం 10 మంది విద్యార్థులైనా అడ్మిషన్ లేకపోతే అక్కడ వారికి తరగతులు బోధించడం అనేది ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు తలమించిన భారం. ఈ కారణంగా అధికారులు విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన విద్యను అందించాలంటే కోర్సులను ఇతర కళాశాలల్లో విలీనం చేయనున్నారు. ఇక జీరో శాతం అడ్మిషన్లు ఉన్న కళాశాలలో పూర్తిగా కోర్సులను తొలగించనున్నారు. మరోసారి నిర్వహిస్తాం.. ఈ సంవత్సరం దోస్తు వెబ్సైట్ ద్వారా జరుగుతున్న డిగ్రీ అడ్మిషన్లు గతం కంటే చాలా తక్కువగా భర్తీ అయ్యాయి. ఇప్పటికే మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించాం. మరోమారు నిర్వహించే అవకాశం ఉంది. అయితే వివిధ కళాశాలల్లో కోర్సుల వారీగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు జరిగిన విద్యార్థులను ఇతర కళాశాలల్లోకి మార్పు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని గతంలో తక్కువ అడ్మిషన్లు అయిన కళాశాలలకు నిలిపివేశాం. – రాజారత్నం, వైస్ చాన్స్‌లర్, పాలమూరు యూనివర్సిటీ -
దోస్త్‌లో ఆ కాలేజీలను చేర్చొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియకు ఉద్దేశించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)లో తమను చేర్చకుండా ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ పలు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆ కాలేజీలను దోస్త్‌లో చేర్చవద్దని ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. అయితే ఈ కాలేజీల్లో జరిగే ప్రవేశాలు తాము ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డిగ్రీ ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తెలియచేయాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల గురించి తమకు తెలుసునన్న హామీని ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి తీసుకోవాలని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టేందుకు అధికారులు దోస్త్‌ను తీసుకొచ్చారని, ఇందులో తమ కాలేజీలను కూడా చేరుస్తున్నారని, ఇది గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధమంటూ ఎడూ ఎలిమెట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీతో మరో 10 విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కాలేజీలను దోస్త్‌లో చేరేలా ఉన్నత విద్యా శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అయినా కూడా ఇప్పుడు ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ కాలేజీలను దోస్త్‌లో చేర్చవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
9న డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వెల్లడించాక వారి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని వివరించారు. గత మూడేళ్లుగా ఆన్లైన్లో ప్రవేశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ ప్రవేశాల వల్ల హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో కూడా అన్ని జిల్లాలకు చెందిన గ్రామీణ విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం మొదట ఈ–సేవా కేంద్రాల ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అయితే గతేడాది నుంచి ఈ–సేవతోపాటు ఆధార్ ఆధారిత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈసారి ఆ రెండు సదుపాయాలతోపాటు అన్ని జిల్లాల్లోని 76 హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. స్పెషల్ హెల్ప్‌లైన్ కేంద్రాలు: విద్యార్థులు తమ మొబైల్ నంబరు మార్చుకోవడంతోపాటు ఇతర మార్పు లు చేసుకునేందుకు పది పాత జిల్లా కేంద్రాల్లో స్పెషల్ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీలో ప్రస్తుతం కొన్ని వర్సిటీల్లో వేర్వేరు గ్రేడ్ పాయింట్లు ఉన్నందున వాటిని మార్పు చేసి, అన్ని వర్సిటీల్లో ఒకే గ్రేడింగ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. అలాగే ఒకే రకమైన మూల్యాంకన విధానాలు, స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా ఒకే రకమైన కోర్, ఎల క్టివ్ పేపర్ల అమలు వంటి చర్యలు చేపడతామన్నారు. -
కాలేజీల షిఫ్టింగ్‌లపై సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీలను ఇష్టారాజ్యంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చేస్తున్న షిప్టింగ్‌ల వ్యవహారంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇష్టారాజ్యంగా కాలేజీలను మండల పరిధి, జిల్లా పరిధి కాకుండా ఇతర జిల్లాలకు మార్చుతు న్నట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహేతుక కారణం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతించవద్దని స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులతో సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో విభాగాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేయాలని సూచించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన దృష్ట్యా దానిపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే దీనిని ప్రవేశ పెట్టేందుకు అనుమతించాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్లు ఈ డిగ్రీని చదవడం, అందులో తొలి ఏడాది నుంచే విద్యా బోధనకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉండటం ద్వారా మెరుగైన విద్య లభిస్తుందన్న భావనను వ్యక్తం చేశారు. ప్రమాణాలు పెరుగుతాయని, ప్రమాణాలు పాటించని కాలేజీలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుపై సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంటర్ ఫలితాల వెల్లడిపైనా సమీక్షించినట్లు తెలిసింది. ప్రవేశాలు, ఫలితాల ఆలస్యంపైనా సీరియస్ అయినట్లు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు. -
787 కాలేజీలు మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు తగ్గుతున్నాయి. నాణ్యత ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతుండటంతో కాలేజీలు మూత పడుతున్నాయి. కొన్ని కాలేజీలు విద్యార్థుల్లేక యాజమాన్యాలే రద్దు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తేల్చిన లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అందించే కాలేజీలు 3,688 ఉంటే అవి 2018–19 విద్యా సంవత్సరం నాటికి 2,901కి తగ్గాయి. ఈ ఐదేళ్లలో 787 కాలేజీలు మూతపడ్డాయి. వచ్చే ఏడాది మరో 200 వరకు డిగ్రీ, ఇతర కాలేజీలు మూత పడే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరి గాయి. అయినా పెరిగిన సీట్లకు అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడం గమనార్హం. అత్యధికంగా డిగ్రీ కాలేజీలే మూత రాష్ట్రంలో అత్యధికంగా డిగ్రీ కాలేజీలు మూత పడుతున్నాయి. 2018–19 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో 1,151 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు చేపడితే అందులో 25 శాతంలోపే ప్రవేశాలు జరిగిన కాలేజీలు 786 ఉండటం గమనార్హం. 280 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అందులో అన్ని కాలేజీలు మూతపడకపోవచ్చు. ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉంటారు. మరోవైపు ప్రమాణాలు పెంచుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. అయినా ఒక్క డిగ్రీలోనే 150 కాలేజీలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. ఇతర కోర్సుల్లోనూ జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 200 కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గనుక వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపే ప్రవేశాలు జరిగిన కోర్సులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తే వందల సంఖ్యలో కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. ఆశించిన మేర లేని ప్రవేశాలు ఐదేళ్లలో ప్రవేశాలు అంత ఆశాజనకంగా లేవు. సీట్లు పెరిగిన స్థాయిలో ప్రవేశాలు పెరగలేదు. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో 3,77,344 మంది విద్యార్థులు చేరితే 2018–19 విద్యా సంవత్సరంలో 3,97,225 మంది విద్యార్థులు చేరారు. అన్ని కాలేజీల్లో 1,28,887 సీట్లు పెరిగినా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఐదేళ్ల కిందటితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య 19,881 మాత్రమే పెరిగింది. -
నాణ్యత ప్రమాణాలు లేకే డిగ్రీ కాలేజీల మూత!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం అవసరం లేకున్నా రాష్ట్రంలో అడ్డగోలుగా డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిందని, ఒక్క కాలేజీ అవసరం ఉన్న చోట ఐదు కాలేజీలను ఇచ్చిందని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం పేర్కొంది. తద్వారా విద్యార్థులను తెచ్చుకోవాలన్న పోటీలో కొన్ని యాజమాన్యాలు నాణ్యత ప్రమాణాలకు నీళ్లొదిలాయని, అలాంటివే ఇప్పుడు మూత పడ్డాయని తెలిపింది. గత ప్రభుత్వం తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. కేజీ టు పీజీ జేఏసీ పేరుతో కొంతమంది నాయకులు గత మూడేళ్లుగా రాజకీయ పదవులకోసం పైరవీ చేసుకొని భంగపడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతం నుంచే ఉన్న సమస్యలను ఇప్పుడే మొదలైన సమస్యల్లా చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఏకపక్షంగా రాజకీయ మద్దతుపై తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తామే విద్యా సంస్థల ప్రతినిధులుగా చెప్పుకోవడాన్ని ఖండించింది. 50 శాతం ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీలు వారివెంట లేవని, మెజారిటీ సభ్యులు కలిగిన గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కూడా వారితో లేదన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫలితాలు రాబట్టుకోవాలే తప్ప ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడాన్ని అనేక యాజమాన్యాలు అంగీకరించడం లేదని వివరించారు. వారు కేజీ టు పీజీ జేఏసీ పేరుతో నాయకులుగా వ్యవహరిస్తూ కాలేజీల సంఘాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం ఫీజు బకాయిలను చెల్లించిందని, అయినా ఇవ్వలేదంటూ విమర్శలు చేయడాన్ని యాజమాన్యాలు నమ్మవద్దన్నారు. సంఘం నేతలు నరేందర్‌రెడ్డి, సిద్ధేశ్వర్ మాట్లాడారు. -
డిగ్రీ కాలేజీలకు కొత్తగా అనుమతులా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రానురాను ఆదరణ తగ్గుతోంది. ఉపాధి, ఉద్యోగావకాశాలున్న కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉండడంతో విద్యార్థులు వాటివైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న కాలేజీల్లో కోర్సులు, సీట్లకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య ఉండడం లేదు. అయినా సరే కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేస్తుండడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజీల సంఖ్య ఎక్కువై ప్రమాణాలు లేకుండా బోధన సాగుతోందని, ఇంకా కాలేజీలను పెంచడం వల్ల ఫలితమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాలేజీల్లో కనీస సదుపాయాలు, సరైన బోధన ఉండటం లేదని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని సరిచేసి ఇప్పుడున్న కాలేజీల్లోనే బోధన ప్రమాణాలను నెలకొల్పాల్సిన మండలి దీనికి విరుద్ధంగా మరిన్ని ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యామండలి కమిటీయే తేల్చినా.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల స్థితిగతులపై ఉన్నత విద్యామండలి ఇంతకుముందు జేఎన్టీయూఏ మాజీ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కె.వి.రమణారావు, న్యాయ నిపుణులు సుధేష్ ఆనంద్, ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తితో కూడిన కమిటీతో పరిశీలన చేయించింది. ఈ కమిటీ 3 నెలల క్రితం మండలికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువగా డిగ్రీ కాలేజీలున్నాయని, వీటిలోనే తగినంత చేరికలు లేనప్పుడు కొత్త కాలేజీల అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. కుప్పలుతెప్పలుగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాణాలు అడుగంటిపోతున్నాయని తెలిపింది. డిగ్రీ కాలేజీల ఏర్పాటు పేరిట అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ఫీజులు, స్కాలర్షిప్లు, ఇతర మొత్తాలను వసూలు చేసుకోవడానికి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాను నియమించిన కమిటీయే ప్రస్తుతమున్న డిగ్రీ కాలేజీలు ఎలా ఉన్నాయో నివేదిక ఇచ్చినా ఉన్నత విద్యామండలి ఆ నివేదికను పక్కన పెట్టేసింది. కమిటీ పరిశీలనలో తేలిన అంశాలివే.. కమిటీ పరిశీలనలో తేలిన అంశాలు ఏమిటంటే.. రాష్ట్రంలో ఏటా 5.49 లక్షల మంది పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో 3.64 లక్షల మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతుండగా 2.91 లక్షల మంది ఉత్తీర్ణులవుతున్నారు. అయితే ఇంటర్లో ఉత్తీర్ణులయ్యే వారి కంటే ఎక్కువగా డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఉన్నాయి. మొత్తం 1422 కాలేజీల్లో 146 ప్రభుత్వ, 124 ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 1152 కాలేజీలు ప్రైవేటువే. ఒక్క ప్రైవేటు కాలేజీల్లోనే 3.29 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ వీటిలో చేరుతున్నవారి సంఖ్య కేవలం 1.29 లక్షలు మాత్రమే. అంటే.. ప్రైవేటు కాలేజీల సీట్లలో సగం కూడా భర్తీ కావడం లేదు. 70 శాతానికి పైగా కాలేజీలకు సొంత భవనాలు, ఇతర సదుపాయాలు, అర్హులైన బోధన సిబ్బంది లేరు. ఈ కాలేజీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య ఏటా కేవలం 40 వేల వరకు మాత్రమే ఉంటోంది. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు ఎలా ఉంటున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఉన్నత విద్యామండలి కొత్త కాలేజీల ఏర్పాటు ఏయే మండలాల్లో అవసరమో తెలుసుకోవడానికి 2015–16, 2017–18లలో సర్వేలు చేయించింది. ఈ రెండు సర్వేల్లో కూడా కొత్తగా డిగ్రీ కాలేజీలు కావాలని ఎవరి నుంచి వినతులు రాలేదు. పైగా ఆయా మండలాల్లో అప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్లే భర్తీ కావడం లేదని తేలింది. వీటన్నిటితో నిపుణుల కమిటీ నివేదిక రూపొందించి ఉన్నత విద్యామండలికి ఇచ్చింది. కొత్తగా డిగ్రీ కాలేజీలకు అనుమతులు అవసరం లేదని, ఇప్పుడున్న కాలేజీల్లో బోధనా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే ఈ కమిటీ నివేదికను పక్కన పెట్టిన ఉన్నత విద్యామండలి కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఫలించని ‘దోస్త్’ ప్రయత్నాలు!
శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): డిగ్రీలో ‘దోస్త్’ అధికారులు అందించిన ప్రత్యేక దశ ప్రవేశాల ప్రయత్నం ఫలించలేదు. శాతవాహన యూనివర్సిటీలో సీట్ల భర్తీ వేల సంఖ్యలో పెరుగుతుందని ఆశించినా వారి ఆలోచనలు తారుమారై 330 సీట్లకే పరిమితమైంది. ఇందులోనూ కేవలం 253 సీట్లు మాత్రమే అభ్యర్థులతో నిర్ధారించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీ సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఐదు దశల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఎంసెట్‌తో సహా వివిధ కోర్సుల కౌన్సెలిం గ్లో పూర్తై.. అందులో సీట్లు రానివారు ప్రత్యేక దశ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరుతారని భావించినా.. సీట్ల సంఖ్యలో మాత్రం వృద్ధి కనిపించలేదు. కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశం ఇచ్చినా సీట్ల సంఖ్య పెరగలేదు. ఎస్‌యూ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కలుపుకుని 113 కళాశాలల్లో 45,471 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వివిధ కోర్సుల్లో కలుపుకుని సోమవారం సాయంత్రం వరకు 21,886 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు 1041 కళాశాలల్లో కలుపుకుని ప్రత్యేకదశలో కేవలం 2,578 సీట్ల భర్తీ అయ్యాయి. ఇందులో ఎస్‌యూది 10 శాతమే. ప్రైవేటు కళాశాలలు కొత్తవారితోపాటు వివిధ కళాశాలల్లో చేరినవారికి ఎన్ని ఆఫర్లు ప్రకటించినా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్ల మార్పు జరగకపోవడంతో యాజమాన్యాల్లో నిరాశ నెలకొంది. సగం కూడా నిండలేదు దోస్త్ అధికారులు ప్రత్యేక దశతో పాటు ఐదు దశలు ప్రవేశాలకు అనుమతించినా ఆశించిన స్థాయిలో సీట్ల భర్తీ పెరగలేదు. శాతవాహన యూనివర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి. గతంలో పలుమార్లు సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే.. భర్తీ కంటే ఖాళీగా మిగిలిన సీట్లే ఎక్కువగా ఉన్నాయి. వర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్ కళాశాలల్లో కలుపుకుని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం వంటి కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశ 13,177 సీట్లు కేటాయించారు. రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో నిరాశ పరిచింది. మూడోదశ కేటాయింపు పూర్తయిన తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించగా.. 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగు దశలో 20,350 సీట్లవరకు భర్తీ అయ్యింది. ప్రత్యేక దశ ద్వారా కేవలం 300 సీట్లు కేటాయించగా.. 253 సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదుగంటల వరకు 21,886 సీట్లు కన్ఫర్మ్ చేసుకోగా.. చివరగా ఈ విద్యాసంవత్సరం యూనివర్సిటీలో 23,585 సీట్లు మిగిలాయి. కళాశాలలకు నిరాశే సీట్ల నింపుకోవడానికి అవస్థలు పడిన పలు ప్రైవేట్ కళాశాలలు.. ప్రత్యేక దశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడ్డాయి. కొత్తవారిని, వివిధ కళాశాలల్లో సీటు పొందినవారిపై ఆఫర్ల వర్షం కురిపించి ఆకర్షించాలని చేసిన ప్రయత్నాలు పారలేదు. కొందరు విద్యార్థులు మారుదామని ప్రయత్నించినా.. గతంలో సీటు వచ్చిన కళాశాలలు మాయమాటలు, వివిధ ఆఫర్లు ప్రకటించి ఆయా సీట్లు చేజారిపోకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. పీఆర్వోలు, లెక్చరర్లు, మధ్యవర్తుల ద్వారా ప్రవేశాలు పెంచుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఒకటి, రెండు దశల్లోనే అనుకున్న రీతిలో సీట్లను సంపాదించగలిగాయి. ఆ తర్వాత జరిగిన మూడుదశల్లో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఏదేమైనా మున్ముందు డిగ్రీ కోర్సులు చేయడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య ఏటేటా పడిపోతోందని విద్యారంగనిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకనుగుణంగా ఎప్పుటికప్పుడు కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ డిగ్రీకి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లే దిక్కు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో సర్కారు కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ అధ్యాపకులతోనే బోధన సాగుతోంది. ఇంకా ఖాళీల కొరత ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు లేకపోవడంతో జూనియర్ లెక్చరర్ల నియామకాలు జరగడం లేదు. గత నాలుగైదు ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలు కూడా లేవు. ప్రతియేడు అవసరమున్నచోట గెస్ట్ లెక్చరర్లను నియమించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ వల్ల కళాశాలల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినప్పటికీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు జిల్లాకు రాలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జూనియర్ కళాశాలల్లో..ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. 13 కళాశాలల్లో కలిపి మంజూరు పోస్టులు 175 కాగా, వీటిలో 13 మంది రెగ్యులర్, 132 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 30 మంది వరకు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. లైబ్రేరియన్లు, పీడీల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. డిగ్రీ కళాశాలల్లో.. జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కూడా ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్లు లేరు. ఇన్చార్జి ప్రిన్సిపాల్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పాలన గాడిన పడడం లేదు. కళాశాలల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో 17 పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. పది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ఒకరు గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నారు. మరో ముగ్గురు ఆన్‌డ్యూటీపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ పురుషుల డిగ్రీ కళాశాలలో 34 పోస్టులకు గాను 22 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ముగ్గురు గెస్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో పది పోస్టులకు గాను ముగ్గురు విధులు నిర్వర్తిస్తుండగా, ఇందులో నుంచి ఒకరు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలకు ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఒక లెక్చరర్ సెలవులో ఉండగా, ఒక లెక్చరర్ మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఈ కళాశాలకు ఇన్చార్జీ ప్రిన్సిపాల్‌గా ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఎనిమిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు బోధిస్తున్నారు. ఈ కళాశాలలో హిందీ పోస్టు మంజూరు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్‌తోనే ప్రతియేడు బోధిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. సంఖ్య పెరిగినా.. సౌకర్యాలు కరువు సర్కారు కళాశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు, బోధన సిబ్బందిని ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తోంది. జిల్లాలో డిగ్రీ కళాశాల ఫలితాల పరంగా చూస్తే కనీసం 20శాతం కూడా విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంలేదు. సరైన విద్యాబోధన లేకపోవడమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలకు నిధుల లేమి తీవ్రంగా వేధిస్తోంది. వేతనాలు సరిపడా నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది. డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో న్యాక్ గుర్తింపు గ్రేడ్ తక్కువగా వస్తుంది. లెక్చరర్లు పూర్తిస్థాయిలో ఉంటేనే వారు కీలకంగా వ్యవహరిస్తారు. న్యాక్ ఏ–గ్రేడ్ గుర్తింపు ఉంటే నిధులు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు. -
ఈసారైనా పెరిగేనా..!
శాతవాహనయూనివర్సిటీ : అర్హులైన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో సీటు వచ్చేవిధంగా దోస్త్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో పలుమార్లు ప్రవేశాలకు అవకాశమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో భారీగా మిగులుతున్న సీట్లును భర్తీచేయాలనే ఉద్దేశంతో ఐదోసారి దోస్త్ ద్వారా కొత్తవారికి, గతంలో నమోదు చేసుకున్న వారికి కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశమిస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ పరిధిలో 45,471 సీట్లుండగా నాలుగు దశల్లో 20,350 సీట్లు భర్తీ అయ్యాయి. 25,121 మిగులు సీట్లతో డిగ్రీప్రవేశాలు నేలచూపు చూస్తున్నాయి. ఐదోదశలో ప్రవేశాలకు అవకాశమివ్వడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు శాతవాహనలో కూడా ప్రవేశాలు పెరిగే అవకాశముండొచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు. 16 తేదీతో నమోదు, వెబ్ ఆప్షన్లు పూర్తవనుండడంతో ప్రవేట్ కళాశాలలు దీనినే చివరి అవకాశంగా భావించి పోటీపడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు కళాశాలలో సదుపాయాలు పరిశీలించి మారడానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే దాదాపు మూడు వేల సీట్ల వరకు మార్పులు చేర్పులు జరుగుతాయనేది అంచనా. పెరగనున్న సీట్ల భర్తీ ... దోస్త్ అధికారులు డిగ్రీసీట్ల భర్తీని పెంచడానికి గతంలో ఎన్నడూ కనివిని ఎరగని అవకాశాలు అందిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 16వరకు డిగ్రీ ప్రవేశాలకు నమోదు, వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. దీంతో ఆయా కోర్సుల్లో సీటు రాని వారు ఇటువైపుగా వచ్చే అవకాశముంది. ఇదీ పరిస్థితి.. వర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు తిరోగమనంలోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు భర్తీ కన్నా ఖాళీగా మిగులుతున్న సీట్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశలో 13,177, రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో ‘దోస్త్’ అందరినీ నిరాశ పరిచింది. మూడో దశ కేటాయింపు తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించబడి 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగోదశలో 20,350 సీట్ల భర్తీ జరిగింది. ఇప్పుడు ఐదోదశకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 2వేల పైగానే సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కళాశాలల మధ్య పోటీ.. ‘దోస్త్’ అధికారులు ఐదోసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వడంతో ప్రయివేటు కళాశాలల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పలు కళాశాలల మధ్య ఆనారోగ్యకరమైన పోటీ నెలకొని ఒకరికి మించి ఒకరు ఆఫర్లు ప్రకటించి విద్యార్థులను ఆకర్షించారు. ఎన్ని తిప్పలు పడ్డా ఆనుకున్నస్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. మూడు, నాలుగు దశల సీట్ల కేటాయింపు పూర్తయినా కరీంనగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లోనే చెప్పకోదగ్గస్థాయిలో ప్రవేశాలు జరిగాయి. మిగిలినివి కొన్ని పర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం మూసివేసే దశకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రకటించిన 5వ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరుచుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రవేట్ కళాశాలలు తప్పుడు మార్గంలో ప్రలోభాలు ప్రకటించి డిగ్రీ ప్రవేశాలను చేపడుతున్నాయని సమాచారం. -
డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,100కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో దీని అమలుకు చర్యలు చేపట్టనుంది. టీఎస్టీఎస్(తెలంగాణ స్టేట్‌టెక్నాలజీ సర్వీస్) నుంచి బయోమెట్రిక్ మిషన్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కో మిషన్‌కు నెలకు రూ.1,000 చొప్పున వెచ్చించి వీటిని ఏర్పాటు చేయనుంది. ప్రతిభావంతులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు కళాశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సివిల్స్‌లో శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ప్రత్యేక పరీక్ష ద్వారా 50 లేదా 100 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణనిచ్చేలా చర్యలు చేపడుతోంది. నేరుగా పోస్టుల భర్తీకి చర్యలు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు కళాశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, మిగిలిన పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకోసం నియమ నిబంధనల్లో సవరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. -
కోర్సుల వారీగానే మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వరుసగా మూడేళ్లపాటు 25 శాతం ప్రవేశాలు లేని కాలేజీలపై చర్యల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఉన్నత విద్యా మండలి తర్జనభర్జన పడుతోంది. 25% ప్రవేశాలను కోర్సుల వారీగానే చూడాలా? కాలేజీల వారీగా చూడాలా? అన్న విషయంలో కొంత ఆలోచనల్లో పడింది. అయితే కాలేజీల వారీగా చూస్తే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనకు వచ్చింది. దీంతో వరుసగా మూడేళ్లలో 25% లోపే ప్రవేశాలు ఉన్న కోర్సుల్లోనే ఈసారి ప్రవేశాలకు అనుమతించవద్దన్న అభిప్రాయానికి వచ్చింది. అదే విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇచ్చిన ఉన్నత విద్యామండలి గతంలో ప్రవేశాలు లేవని, ఇప్పుడు కోర్సులకు ఎలా అనుమతి నిరాకరిస్తారన్న విషయంలో కొంత గందరగోళం నెలకొంది. గతంలో 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రవేశాలు జరగవని ఎలా ముందుగానే ఊహించి నిర్ణయం తీసుకుంటారన్న వాదనను యాజమాన్యాలు తెరపైకి తెచ్చాయి. దీంతో వర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనల్లో పడ్డాయి. ప్రవేశాలు పూర్తయ్యాక వాటిల్లో చేరిన విద్యార్థుల తరలింపు అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపు ప్రవేశాలు ఉన్న కోర్సులకు వర్సిటీల స్థాయిలోనే అనుబంధ గుర్తింపును నిరాకరించాలన్న ఆలోచనలకు వచ్చాయి. ఈనెల 19న జరిగే వైస్ చాన్స్లర్ల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. నెలాఖరులోగా అనుబంధ గుర్తింపు ప్రస్తుతం రాష్ట్రంలో 51 కాలేజీల్లో వరుసగా మూడేళ్లలో ఒక్క విద్యార్థి చేరకపోగా, మరో 200 కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్నాయి. వాటన్నింటిపై త్వరలోనే విధానపర నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈలోగా ఆ ప్రక్రియ పూర్తయితేనే మే 8వ తేదీన డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయవచ్చని యోచిస్తోంది. -
66 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 66 వేల సీట్లకు కోత పడే అవకాశముంది. గడిచిన రెండేళ్లలో వరుసగా 25 శాతం సీట్లు కూడా భర్తీ కానీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని, వాటిల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపాలని యూనివర్సిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25 శాతం లోపు సీట్లు భర్తీ కానీ కాలేజీల లెక్కలు తేల్చాయి. ఇందులో 51 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, దాదాపు 250 కాలేజీల్లో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయని లెక్కలు వేశారు. ఒక్కరు కూడా చేరని కాలేజీల్లో మొత్తం 10,150 సీట్లు ఉండగా, 25 శాతంలోపు విద్యార్థులు చేరిన కాలేజీల్లో 56,285 సీట్లు ఉన్నట్లు తేలింది. అందులో 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని వర్సిటీలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 25 వేల సీట్లలో 4 వేలే భర్తీ.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో భర్తీ కానీ సీట్లు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 25,055 ఉంటే 4,047 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 25 శాతంలోపే భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 10,610 ఉంటే వాటిల్లో 1,731 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో ఈసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వొద్దని యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. -
ఓటరు నమోదుకు విద్యార్థులకు అవకాశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అవకాశం కల్పించింది. ఓటరు నమోదు కోసం శుక్రవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న 18 ఏళ్లు నిండిన విద్యార్థులంతా ఓటు హక్కు పొందేం దుకు ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామీణ నియోజకవర్గాలైన ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్ పరిధిలో ఉన్న కళాశాలల్లోనే ‘ప్రత్యేక ఓటరు నమోదు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. అర్హత గల విద్యార్థులందరినీ ఓటరుగా నమోదు చేసే బాధ్యతలను ఈఆర్ఓలకు అప్పగించారు. ఇందుకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని నమోదు కేంద్రాల్లో అవసరమైన ఫారంలు అందుబాటులో ఉంటాయి. నివాస చిరునామా ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోని విద్యార్థులు తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఇప్పటికే ఓటు హక్కు పొందిన విద్యార్థులు చేర్పులు మార్పులు సైతం చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు యంత్రాంగం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈనెల 4వ తేదీన గ్రామీణ నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలా మందిని ఓటరుగా నమోదు చేశారు. అలాగే ఈనెల 11వ తేదీన కూడా ఈ కేంద్రాలను కొనసాగించనున్నారు. అయితే విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిరాసక్తత కనబర్చుతున్నట్లు యంత్రాంగం దృష్టికి రావడంతో దాన్ని అధిగమించడంలో భాగంగా శుక్రవారం అన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోనూ ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. -
డిగ్రీ కాలేజీల్లో కామన్ కేలండర్
వీసీల భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో కామన్ అకడమిక్ కేలండర్‌ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కోలా విద్యా కార్యక్రమాలు కొనసాగుతుండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నా యి. కామన్ కేలండర్ అమలుకు ఉన్నత విద్యామండలి సోమవారం అన్ని వర్సిటీ వీసీలతో చర్చించి, వార్షిక కేలండర్‌ను రూపొందించిం ది. దాన్ని వెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించింది. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో మొదటి దశ సీట్ల కేటాయింపు, కాలేజీల్లో విద్యార్థుల చేరికలు పూర్తవడంతో సోమవారం నుంచే డిగ్రీ కాలేజీల్లో మొదటి సెమిస్టర్ ప్రారంభించా లని తెలిపింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు వెంకటాచలం, పలువర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. ఇదీ అకడమిక్ కేలండర్... ► జూలై 3వ తేదీ నుంచి అన్ని డిగ్రీ కాలేజీల్లో మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం. ► సెప్టెంబర్ 18, 19 తేదీల్లో మొదటి ఇంటర్నల్ పరీక్షలు ► సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా సెలవులు. ► నవంబర్ 8, 9 తేదీల్లో సెకండ్ ఇంటర్నల్ పరీక్షలు. ► నవంబర్ 10 నుంచి 30 వరకు మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు. ► డిసెంబరు 2 నుంచి సెకండ్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం. ► 2018 ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఇంటర్నల్ పరీక్షలు ► ఏప్రిల్ 9 నుంచి 30 వరకు సెకండ్ సెమిస్టర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు. ► మే 1 నుంచి వేసవి సెలవులు. ► జూన్ 11 నుంచి 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం. -
14 కాలేజీల్లో సొంతంగా ప్రవేశాలు!
- ఆన్లైన్ ప్రవేశాల పరిధిలో లేని ప్రముఖ డిగ్రీ కాలేజీలు - వాటిలో చేరిన విద్యార్థుల ఫీజులపై గందరగోళం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీలు సొంత ప్రవేశాలు చేపట్టాయి. యూనివర్సిటీ నిర్ధారించిన ఫీజు తమకు సరిపోదంటూ 14 కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి సొంత ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతి తెచ్చుకున్నాయి. రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వార్షిక ఫీజు ఉన్న ఆ కాలేజీలు ఇప్పటికే ప్రవేశాలను పూర్తి చేయగా మరో 28 కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇటు యాజమాన్యాలు, అటు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ.. దరఖాస్తులను స్వీకరించాలని పేర్కొన్న కోర్టు.. ప్రవేశాలను మాత్రం తుది తీర్పు ఇచ్చే వరకు ఖరారు చేయవద్దని సూచించింది. 30 వేల వరకు సీట్లు కలిగిన ఆ కాలేజీల్లో ప్రవేశాలకు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, అదే కాలేజీల్లో చేరేందుకు విద్యాశాఖ చేపట్టిన ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15న ప్రకటించిన మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఆయా కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 7,500 మంది విద్యార్థులకు ఆన్లైన్ ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. అయితే కోర్టు తీర్పు రావాల్సి ఉన్నందున వాటిని ప్రకటించలేదు. ఒకవేళ కోర్టు తీర్పు కాలేజీలకు అనుకూలంగా వస్తే వాటి యాజమాన్యాలే ఆ 30 వేల సీట్లను భర్తీ చేసుకుంటాయి. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఆన్లైన్ ప్రవేశాల ద్వారా వాటిలో సీట్లను ప్రవేశాల కమిటీ కేటాయిస్తుంది. వారి ఫీజు సంగతేంటి? ఇప్పటికే ప్రవేశాలు చేపట్టిన 14 కాలేజీల్లో చేరిన దాదాపు 15 వేల మంది విద్యార్థులకు, కోర్టు తీర్పు రావాల్సిన 28 కాలేజీల్లో చేరే 30 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అంశం ఏంటన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే ఆన్లైన్ ప్రవేశాలను కాదని ఆయా కాలేజీల్లో చేరినందున ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం కుదరదని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. సొంతంగా ప్రవేశాలు చేపట్టిన 14 కాలేజీలు, కోర్టు కేసులో ఉన్న 28 కాలేజీల జాబితాను డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల (దోస్త్) వెబ్సైట్లో ఉన్నత విద్యా మండలి అందుబాటులో ఉంచింది. అవి కాకుండా 1,089 కాలేజీల్లో 1,40,033 మంది విద్యార్థులకు ఆన్లైన్ ప్రవేశాల కమిటీ ఇటీవల సీట్లను కేటాయించింది. -
పైవేటు డిగ్రీకళాశాలల బంద్..
డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు గురువారం బంద్ పాటించాయి. మలక్‌పేట్, చంపాపేట్, దిల్సుఖ్నగర్, సైదాబాద్‌లో పరిధిలో అన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.ఈ సందర్భంగా కళాశాలల సిబ్బంది, విద్యార్థులు చంపాపేట చౌరస్తా నుంచి ఐఎస్ సదన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ రాక అసంపూర్తిగా జరుగుతుండటంతో కళాశాలలు నిర్వహించడం భారంగా మారాయని కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ ర్యాలీలో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు డిగ్రీ కళాశాలల బంద్
ఏలూరు సిటీ : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిందని, దీనిలో భాగంగా జిల్లాలో బంద్‌ను జయప్రదం చేయాలని నగర సంఘటనా కార్యదర్శి ఎ.శ్రీకాంత్ తెలిపారు. స్థానిక పవర్‌పేటలోని సేవాభారతి కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం జరిగింది. బంద్‌కు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. జీవో 35ను రద్దు చేయాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నాయకులు సందీప్, అనుదీప్, పవన్ పాల్గొన్నారు. -
30న డిగ్రీ కళాశాలల బంద్
నెల్లూరు (టౌన్): డిగ్రీ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న బంద్ తలపెట్టినట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ తెలిపారు. శనివారం స్థానిక రామలింగాపురంలోని ఏబీవీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీకి తగినన్ని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీఎస్‌యూకు యూజీసీ 12బీ గుర్తింపు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. స్కాలర్ షిప్ పేరుతో చేసే అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని డిమాండ్‌తో బంద్ చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు కౌశిక్, నరేష్, భరత్‌బాబు, రాజేష్, బాలచంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ కళాశాలలపై తనిఖీలు చేయాలి
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో గుర్తింపు లేకుండానే ప్రవేశాలు నిర్వహిస్తున్న డిగ్రీకళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వైవీయూలోని పరిపాలనా భవనంలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుడిపాటి సుబ్బరాజు మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమై నెలరోజులు పూర్తవుతున్నా నేటికీ చాలా కళాశాలలు గుర్తింపు తీసుకోకుండానే తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు సైతం తనిఖీలు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కళాశాలలు ప్రారంభం కాకముందే తనిఖీలు చేపట్టి అర్హత కలిగిన ళాశాలలకు గుర్తింపు నివ్వాల్సి ఉన్నా అధికారులు అదిశగా చర్యలు చేపట్టలేదన్నారు. ప్రైవేట్ కళాశాలలో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలహీనం చేస్తున్నారన్నారు.ప్రైవేట్ కళాశాలల్లో పక్కా భవనాలు లేకున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ల్యాబ్‌లు, గ్రంథాలయం, మరుగుదొడ్లులతో పాటు కనీస మౌలిక సదుపాయాలు లేని కళాశాలలు సైతం వేలాది రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి డిగ్రీ కళాశాలలపై తనిఖీలు చేపట్టి అర్హత ఉన్న వాటికి గుర్తింపునివ్వాలని లేనివాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ గంపా సుబ్బరాయుడు, రవికల్యాణ్, సాయి, వంశీ, ప్రసాద్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన ఫీజులు
డిగ్రీ ఫీజుల నిర్ణయంలో యూనివర్సిటీల ఇష్టారాజ్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఒక్కో రకంగా ఫీజు విధానం పట్ల విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కోర్సుకు ఉస్మానియాలో ఒక రకమైన ఫీజు, కాకతీయలో మరో రకమైన ఫీజు విధానం ఉంది. వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు శాస్త్రీయంగా లేవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఒకే రకమైన ఫీజుల విధానం అమల్లోకి తేవాలని యాజ మాన్యాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన ఓయూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ బుధవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్‌కు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. బీఎస్సీ ఎంపీసీఎస్‌కు రూ. 20వేలు, ఎంపీసీకి రూ.15 వేలు, ఎంఎస్‌సీఎస్‌కు రూ.20 వేలు, బీజెడ్‌సీకి రూ.20 వేలు... బీకాంలో కంప్యూటర్స్‌కు 20 వేలు, జనరల్‌కు రూ. 15 వేలుగా నిర్ణయించాలని కోరాయి. -
డిగ్రీ విద్యార్థులపై ‘అదనపు’ మోత!
- రూ.10 వేల చొప్పున వసూలు చేసుకునేందుకు ఓయూ అనుమతి - హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 428 డిగ్రీ కాలేజీల్లో పెంపు - ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాని ‘అదనపు’ ఫీజు - దాదాపు లక్షన్నర మంది విద్యార్థులపై భారం సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ‘అదనపు’ ఫీజు మోత మోగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు వసూలు చేసుకునేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ‘ఆర్డినెన్స్-37’ను జారీ చేసింది. దీంతో ఓయూ పరిధిలోని దాదాపు 428 డిగ్రీ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా రూ.10 వేల చొప్పున వసూలు చేయనున్నాయి. ఈ ‘అదనపు ఫీజు’ రీయింబర్స్మెంట్ పథకం పరిధిలోకి రాదు. విద్యార్థులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రవేశాలతో.. ఆన్లైన్ ప్రవేశాలను తాము అమలు చేయబోమని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుకు తాము ఒప్పుకోబోమని ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రముఖ, అటానమస్ డిగ్రీ కాలేజీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని కాలేజీల్లో ఫీజుల విషయంలో యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీలతో ఉన్నత విద్యా శాఖ చర్చించింది. కాలేజీలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు అదనంగా (అదర్ ఫీ పేరుతో) వసూలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులకు అదనంగా ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని సూచించింది. ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి వస్తాయని... ‘అదర్ ఫీ’ పేరుతో వసూలు చేసే ఈ మొత్తం రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. దీనికి అంగీకరించే కాలేజీలు ‘అదర్ ఫీజు’ను వసూలు చేసుకోవచ్చని, ఒప్పుకోని కాలేజీలు వసూలు చేయడానికి వీల్లేదని ఉస్మానియా వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. భారీగా పెరుగుతున్న ఫీజులు ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 వరకు ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా.. వాటిల్లో దాదాపు 4 లక్షల మంది వరకు చదువుతున్నారు. అందులో ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే 428 కాలేజీలున్నాయి. వీటిలో హైదరాబాద్ మినహా రంగారెడ్డి, మెదక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 కాలేజీల్లో ల క్షన్నర మంది వరకు విద్యార్థులు చదవుతున్నారు. ఈ కాలేజీల్లో ప్రస్తుతం కోర్సును బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వార్షిక ఫీజు అమల్లో ఉంది. ప్రస్తుతం అమల్లోకి వచ్చే ‘అదర్ ఫీజు’ కారణంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేలు అదనపు భారం పడనుంది. -
ఎస్టీ విద్యార్థినులకు కొత్తగా 4 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఎస్టీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ర్టంలో గిరిజన విద్యార్థినుల కోసం కొత్తగా నాలుగు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ రూపొందించిన ప్రతిపాదనలకు ఎస్టీ గురుకుల సంస్థల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదముద్ర వేసింది. వీటిని ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించింది. ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, పలువురు ఎమ్మెల్యేల వినతుల మేరకు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఈ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లాలో 7.65 లక్షల ఎస్టీల జనాభాకుగాను బాలికల కోసం 4 జూనియర్ కాలేజీలుండగా, మహిళల అక్షరాస్యత 43 శాతంగా ఉంది. వరంగల్ జిల్లాలో 5.3 లక్షల గిరిజనులుండగా, 4 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 39 శాతంగా ఉంది. ఆదిలాబాద్‌లో 3 జూనియర్ కాలేజీలుండగా, అక్కడ దాదాపు 5 లక్షల గిరిజనులు నివసిస్తున్నారు. మహిళల అక్షరాస్యత 41 శాతంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.6 లక్షల మంది గిరిజనులుండగా, 2 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 30 శాతంగా ఉంది. జూనియర్ కాలేజీలుగా 4 గురుకుల పాఠశాలలు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, కల్వకుర్తి, వరంగల్ జిల్లా కొత్తగూడ, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలోని బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎస్టీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనుంది. వీటిల్లో జూనియర్ కాలేజీ సెక్షన్లను ప్రారంభించాల్సిందిగా మంత్రి అజ్మీరా చందూలాల్ చేసిన విజ్ఞప్తి మేరకు 2015-16లో జూనియర్ కాలేజీ తరగతులను ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీల ప్రారంభానికి అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎస్టీ శాఖ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు విజ్ఞప్తి చేయనున్నాయి. 160 మందికి సివిల్స్ లాంగ్‌టర్మ్ కోచింగ్ ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్‌కు లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏడాది 160 మంది విద్యార్థులకు సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ ఈ శిక్షణను కొనసాగిస్తారు. -
ప్రమాణాలపై తనిఖీలు!
డిగ్రీ కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీపై సర్కారు దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై సర్కా రు దృష్టి సారించింది. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీల్లో విద్యా బోధన ఎలా ఉంది? కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నారా? లేదా? వారి అర్హతలు ఏంటి? ల్యాబ్, లైబ్రరీలు ఉన్నాయా? లేదా? ఎలాంటి సదుపాయాలు ఉన్నాయన్న సమగ్ర వివరాలను సేకరించే పని లో పడింది. ఈ నెలాఖరు లోగా రాష్ట్రంలోని 1,150 వరకు ఉన్న డిగ్రీ కాలేజీలు సమగ్ర సమాచారాన్ని ఉన్నత విద్యా మండలికి అందే లా వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం వచ్చే జనవరి/ఫిబ్రవరి నెలల్లో ఉండనున్న నేపథ్యంలో కాలేజీల వారీగా పరిస్థితులను తెలుసుకునే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటు నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కాలేజీల వారీ సమాచారం అంద గానే నవంబర్/డిసెంబర్ నెలల్లో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని భావిస్తోంది. గతంలో ఏర్పాటు చేసినవి 850వరకు ఉండగా, రాష్ట్ర విభజనకు ముందు 300 వరకు ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చేశారు. అవసరం లేని ప్రాంతాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు అప్పటి ఏపీ ఉన్నత విద్యా మండలి ఓకే చెప్పింది. నిబంధనలు పా టించారా? లేదా? అన్నది కూడా చూడకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. కొత్త వాటిల్లోనే కాకుండా గతంలో ఏర్పాటు చేసిన 850 కాలేజీల్లోనూ అదే దుస్థితి నెలకొన్నట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాలపై గందరగోళం నెలకొనడంతో కాలేజీల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాలేజీల వ్యవహారాన్ని తేల్చాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి మొదటి నుంచి భావిస్తోంది. కాలేజీల భవనాలు, స్థలాల డాక్యుమెంట్ల విషయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ సహకారం తీసుకుని.. ఎన్ని కాలేజీలు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టాయి.. కాలేజీల్లో సౌకర్యాల వంటి అంశాలపై దృష్టి పెట్టి తనిఖీలు చేయాలని భావిస్తోంది. -
నేడు విద్యా సంస్థల బంద్
పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించడం, ప్రభుత్వ ఇం టర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ప్రైవేటు కాలేజీడ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ల సాధనకు బంద్ చేపట్టనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య తెలిపారు. -
డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?
* పట్టించుకోని ప్రధాన యూనివర్సిటీలు * ఇప్పటికే ప్రారంభమైన తరగతులు * ఇంకా ముద్రణకు నోచుకోని పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టినా ప్రధాన యూనివర్సిటీలు మాత్రం వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 వరకు డిగ్రీ కాలేజీలు ఉంటే ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. సిలబస్ మార్పు అమలుపై ఆ రెండు యూనివర్సిటీల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాటి పరిధిలోని సిలబస్ మారుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ డిగ్రీ కాలేజీలు ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు స్పందించకపోవడంతో మార్పు చేసిన సిలబస్‌కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించలేకపోతోంది. ఆ యూనివర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో మార్పు చేసిన సిలబస్ అమలుకు తీర్మానం పంపితేనే కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకుంటాయని తెలుగు అకాడమీ పేర్కొంటోంది. ఇప్పటివరకు 300కు పైగా కాలేజీలు ఉన్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే సిలబస్ మార్పుల అమలుకు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. అంతేకాదు ఈ మార్పులు ప్రథమ సంవత్సరలోనే చేసినందున ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలను చేర్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. పోటీ పరీక్షలకు ఇవే ప్రామాణికం రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సిలబన్ను మార్పు చేసింది. ఏపీకి సంబంధించిన అంశాలను తొలగించి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను రూపొందించింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూపు-1లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరునే పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులకు యూనివర్సిటీలు అన్నీ ఆమోదం తెలపకపోవడంతో గందరగోళం ఏర్పడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ అందక ఆందోళన చెందుతున్నారు. -
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
-
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలవుతున్న పరీక్షల విధానానికి బదులుగా సెమిస్టర్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఉన్నత విద్యను పటిష్టపర్చడంలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అన్ని యూనివర్సిటీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, యూనివర్సిటీల వీసీలతో రాష్ట్ర గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. యూజీ కోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంస్కరణలకు సంబంధించి సిలబస్‌లో మార్పులు, పాఠ్యాంశాల రూపకల్పన వంటి అంశాల్లో ఉన్నత విద్యామండలి, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నిటిలోనూ ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి ♦ అన్ని కాలేజీలు సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలి. ♦ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పాట్రన్‌ను అనుసరించాలి. ♦ అన్ని కాలేజీలకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి. ♦ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేందుకు మొదటి సెమిస్టర్‌లోనే కార్యాచ రణ ప్రణాళికను తప్పనిసరిగా అమలుపరచాలి. ♦ సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను మెరుగుపర్చడంతో పాటు బోర్డ్ ఆఫ్ స్టడీస్‌నుంచి అనుమతులు పొందాలి. -
సీఎం పర్యటన నిరాశ మిగిల్చింది
బుచ్చెయ్యపేట: అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఒక్క పథకానికీ నిధులు ప్రకటించక పోవడం నిరాశ మిగిల్చిందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం బుచ్చెయ్యపేటలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం విశాఖ వస్తున్నందున వరాల జల్లు కురిపిస్తారని ఆశించానన్నారు. నిధులు మంజూరుచేయాలని స్వయాన సీఎంకి విన్నవించినా ఒక్క దానికీ ఆమోదం తెలపకపోవడం కార్యకర్తలకు కూడా విస్మయం కలిగించిందన్నారు. వడ్డాది, కొత్తకోట, రోలుగుంటలలో డిగ్రీ కళాశాలలు మంజూరు చెయ్యాలని కోరినట్లు చెప్పారు. బుచ్చెయ్యపేట, చోడవరం మండలాలకు కోనాం రిజర్వాయర్ నీరు తరలించే ఏర్పాట్లు చేయాలని, 30 పడకల ఆస్పత్రులు మంజూరు చేయాలని, మినీ రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ, మహిళ, రైతుల్ని ఆదుకోవాలని వినతులు అందించినట్లు తెలిపారు. ఒక్కదానిపైనా ప్రకటన లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కలిసి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ దాడి సూరినాగేశ్వరరావు, విశాఖ డెయిరీ డెరైక్టర్ గేదెల సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వియ్యపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.