
డిగ్రీ కళాశాలలపై తనిఖీలు చేయాలి
వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో గుర్తింపు లేకుండానే ప్రవేశాలు నిర్వహిస్తున్న డిగ్రీకళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వైవీయూలోని పరిపాలనా భవనంలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుడిపాటి సుబ్బరాజు మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమై నెలరోజులు పూర్తవుతున్నా నేటికీ చాలా కళాశాలలు గుర్తింపు తీసుకోకుండానే తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు సైతం తనిఖీలు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కళాశాలలు ప్రారంభం కాకముందే తనిఖీలు చేపట్టి అర్హత కలిగిన ళాశాలలకు గుర్తింపు నివ్వాల్సి ఉన్నా అధికారులు అదిశగా చర్యలు చేపట్టలేదన్నారు. ప్రైవేట్ కళాశాలలో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలహీనం చేస్తున్నారన్నారు.ప్రైవేట్ కళాశాలల్లో పక్కా భవనాలు లేకున్నా అధికారులు చూసీచూడనట్లు
వ్యవహరిస్తున్నారన్నారు. ల్యాబ్‌లు, గ్రంథాలయం, మరుగుదొడ్లులతో పాటు కనీస మౌలిక సదుపాయాలు లేని కళాశాలలు సైతం వేలాది రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి డిగ్రీ కళాశాలలపై తనిఖీలు చేపట్టి అర్హత ఉన్న వాటికి గుర్తింపునివ్వాలని లేనివాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ గంపా సుబ్బరాయుడు, రవికల్యాణ్, సాయి, వంశీ, ప్రసాద్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.